"మీరు రేపు ఆయనకి ఉత్తరం రాయండి నేను కులాసాగా చేరినట్లు. ఆయన పై వారం వస్తానన్నారు. దీపకి అవసరమయిన క్లాసు పుస్తకాలు కావాలంటే ఆ సంగతి రాయమన్నారు వస్తూ పుస్తకాలు తెస్తారట."
వెంకట్రావు "ఊ" కొట్టి ఊరుకున్నాడు.
"ఒకటో రెండో పుస్తకాలు శేషయ్య మాష్టరుగారి నడిగి తెచ్చుకుంది. అయినా అదిప్పుడు బడికెళ్ళటం లేదుగా, ఇంట్లోనే చదువుకుంటున్నది" గరిటెలో చారు కలుపుతూ అంది ఆదిలక్ష్మమ్మ.
"అదేమిటే దీపా! నువు స్కూలుకి వెళ్ళటంలేదూ?" లలిత విస్మయంతో అడిగింది.
తాపీగా అన్నం తింటున్న దీప తలతిప్పి లలితవైపు చూసి చిన్నగా నవ్వింది.
"స్కూలు కెళ్ళి చదువుకోనంత మాత్రాన చదువాగి పోదు. అక్కా! ఓ పూట భోజనం లేకపోతే మాత్రం చిన్న వాళ్ళదేకాదు. ఈ ఇంట్లో పెద్దవాళ్ళ ప్రాణంకూడా గిజ గిజ లాడుతుంది. తమాషా ఏమిటంటే పుస్తకాలడుక్కోడానికి సిగ్గుపడనక్కరలేదు. సంసారం గడవడానికి డబ్బుండి (స్తోమతుండి) అప్పులు చేస్తూ గడపటానికి సిగ్గుపడాలి. కాని... ప్చ్... ఆ సిగ్గుకూడా మనమంటే భయపడి పారిపోతున్నది." అని పెద్దగా నవ్వి చటుక్కున ఆపుచేసి వెంకట్రావు వైపు తిరిగి "సిగ్గు విడిచినందున" అని వెంటనే తల్లివేపు తిరిగి "చారు పొయ్యి అమ్మా" అంది దీప.
వెంకట్రావు మాట్లాడలేదు. గబ గబ మజ్జిగన్నం జుర్రుతున్నాడు.
"ఇదీ వరస" అంది ఆదిలక్ష్మమ్మ.
తండ్రి పేకాట వ్యసనం. ఊరినిండా అప్పులు, లలితకు తెలిసిన విషయమే. దీపకి చదువంటే ప్రాణం, దీప చదువు మూలకంగా నాలుగయిదు సార్లు ఇంట్లో రగడ జరగడం తెలుసు. ఇప్పుడు జరిగిందాన్ని బట్టి దీప స్కూలు కెళ్లటంలేదు. వాళ్ళనీ వీళ్ళనీ అడిగి పుస్తకాలు తెచ్చుకుని ప్రయివేటుగా చదువుతుందని లలిత గ్రహించింది.
"దీపా!" అంది లలిత.
అక్క చెప్పబోయే దేమిటో ముందే గ్రహించిన దీప "అమ్మా! మజ్జిగపొయ్యి" అంది.
ఆదిలక్ష్మమ్మ దీప కంచంలో మజ్జిగ పోసింది.
"దీపా!"
"ఏమిటక్కా! అన్నం తినక."
"తింటున్నది అన్నమే, రెండుసార్లు పిలిచినా పలకవేం?" అంది లలిత.
"పొరపాటున ఆడపిల్లయి పుట్టింది. అన్నీ మగరాయుడి లక్షణాలే. ఆ...నిర్లక్ష్యం ఆ కోపం..."
ఆదిలక్ష్మమ్మ మాట పూర్తి చేయక ముందే దీప అందుకుంది "బాధ్యతారహితంగా ప్రవర్తించటం ఇవన్నీ మగ లక్షణాలు కదమ్మా? నిజమే నువు చూసినంతవరకూ అంతే, కాని అమ్మా! లోకంలో అందరు మగవాళ్ళు అలా వుండరమ్మా కొందరే" అంది.
"దీపా!" ఈతఫా కాస్త కోపంతో పిలిచింది లలిత.
"నువు చెప్పబోయేది నాకు తెలుసక్కా! బావ చదివిస్తాడు. బావకి నీ... చదువంటే ప్రేమ. ఉత్తరం రాస్తే నా పుస్తకాలకి డబ్బు పంపిస్తాడు. ఎందుకు స్కూలు మానేశావు? ఈ సంగతి బావ వింటే బాధపడతాడు. ఇదేగా నువ్వు చెప్పాలనుకుంది."
"నేనం ప్రస్తుతం బాధపడటంలేదు. నువ్వు బావకి ఉత్తరం రాయకు. అప్పుడు నేనిజంగా బాధపడవలసి వస్తుంది. ఆ పని మాత్రం చెయ్యకు ఇక్కడింకా కొంప మునిగిపోలేదు. నా చదువుకి అవరోధం కలగలేదు" అంటూ కంచంలో చెయ్యి కడుక్కుని దీప లేచిపోయింది పీటమీదనుంచి.
"ఇదీ వరుస" అంది ఆదిలక్ష్మమ్మ.
"దీనిదో విచిత్రతత్త్వం" అంది లలిత తల్లితో.
వెంకట్రావు ఏమీ మాట్లాడలేదు. మరచెంబు తీసుకుని పీటమీద నుండి లేచాడు.
ఆదిలక్ష్మమ్మ కంచంలో అన్నం వడ్డించుకుని ఇంటి విషయాలు చెబుతుంటే "ఊ" కొడుతూ కూర్చుంది లలిత.
4
గీతా మకరందం తిరగేస్తున్న అన్నపూర్ణమ్మ అడుగుల చప్పుడు విని తలఎత్తి చూసింది.
దీపను చూస్తూనే అన్నపూర్ణమ్మ ముఖం ఆనందంతో వికసించింది.
గొప్పింటి ఆడబడుచు కావచ్చు. లేక వీధిముఖం చూసే అలవాటు గిట్టకనో అన్నపూర్ణమ్మ ఓనాడు కొత్త కోడలిగా ఈ ఇంట కాలుపెట్టినప్పటికీ ఇప్పటికీ కించిత్ మార్పులేదు.
కొత్తకోడలు పాత కోడలయింది. ఇంటి మొత్తానికి సామ్రాజ్ని అయింది. నిండుచూలాలై పండంటి వంశోద్ధారకుడిని కంది. నాలుగు పదులు నిండకుండానే పసుపు కుంకమలకి దూరం అయింది. పెద్దలు, భర్తలేని లంకంత కొంపలో కొడుకు కోసం ఒక్కతీ పదిమంది పెట్టయి సంసారాన్ని ఈదుకొస్తున్నది.