"మైనా పిట్టా లేదు, తేనెతుట్టా లేదు. శుబ్బరంగా ట్రేడ్ లాంటి మంచిగేమ్ ఏదైనాకొనుక్కో!" అంది జానకి.
వెంటనేమూతి ముడుచుకుని తండ్రివైపు చూసింది సృజన భార్యకి కనబడకుండా "కొనిస్తాలే!" అన్నట్లు సంజ్ఞ చేసాడు రమణమూర్తి అయినా ఎందుకయినా మంచిదని తన బింకం తగ్గించకుండా, మొహం సీరియస్ గా పెట్టుకుని స్కూలుకి తయారయింది సృజన. కాన్వెంటులో తన క్లాస్ మేట్స్ కి పంచడానికి చాక్ లెట్ ల ప్యాకెట్ ని బ్యాగ్ లో పెట్టుకుంది.
"అక్కా! మీ ఫ్రెండు మీనాక్షి వచ్చింది" అన్నాడు సంజయ్ ఉన్నట్లుండి.
వెంటనే బయటకు తొంగిచూడబోతూ, ఏదో స్పురించినట్లు నాలిక కొరుక్కుని ఆగిపోయింది సృజన. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది.
"ఏప్రిల్ ఫూల్
గోటూ స్కూల్
సండే మండే మార్నింగ్ స్కూల్" అని చప్పట్లు కొడుతూ పాడుతున్నారు సంజయ్ స్పందనా.
"ఫోఫోండి! నేను మాత్రం మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చెయ్యలేకపోతానా? చూస్తూ ఉండండి!" అని రోషంగా చెప్పి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది సృజన.
స్కూలు బ్యాగులు వీపుకి తగిలించుకుని ఆమె వెనకే పరిగెత్తారు సంజయ్ స్పందనా.
మెయిన్ రోడ్డు ఎక్కాక వాళ్ళు విడిపోతారు. తమ స్కూల్ దారి పట్టింది సృజన. దగ్గరలోనే ఉన్న స్కూల్ వైపు నడవడంమొదలెట్టారు స్పందన. సంజయ్.
పిల్లలు వెళ్ళాక భార్య వైపు తిరిగాడు రమణమూర్తి.
"ఏమండీ శ్రీమతిగారూ! ఇవాళ మీరోపనిచెయ్యాలండీ!" అన్నాడు సరదాగా.
"నాకు తెలుసు! అదేదోచెయ్యగూడని పనేఅయి ఉంటుంది" అంది జానకి.
"అదేం కాదండీ! ఇవాళ మేం ఆఫీసుకి నామం పెడుతున్నామండీ! మీరు కూడా ఫ్రెంచ్ లీవ్ పెట్టేయండీ!"
"లీవా? ఎందుకూ?" అంది జానకి నుదురు చిట్లిస్తూ.
"ఆఫీసుకి ఫ్రెంచ్ లీవ్ పెట్టి ఇంట్లో మనిద్దరం ఫ్రెంచ్ లవ్...."
"నేననుకుంటూనే ఉన్నా! మీరిలాంటి ప్రపోజల్ ఏదో పెడతారని! బర్త్ డే గర్ల్ నేమో స్కూలుకి పంపి మనిద్దరం ఇంట్లో తలుపులు మూసుకు కూర్చుంటే చూసినవాళ్ళు నవ్విపోతారు"
"నవ్వితేనవ్వుతారు! ఏడిస్తే ఏడుస్తారుమనకెలా? అవునూనాకు తెలియకడుగుతా మనం బతికేది మనకోసమా? పదిమందికోసమా?"
"సార్! ఈ ఫిలాసఫీ అంతా మీరు నాకు చెప్పనక్కర్లేదూ, చెప్పినా నాకు ఎక్కదూ, ఇవాళ ఆఫీసులో సుబ్బలక్ష్మి లీవూ సబ్ స్టిట్యూట్ లేదూ అంచేత మీరు అడ్డులేస్తే కాస్త స్వీటు ఏదన్నా చేసి ఆఫీసుకి పరిగెత్తాలి నేనూ! జరగండి!"
"ఇదిగో అమ్మాయ్! నాకు చాలా ఇన్ ఫ్లుయెన్షియల్ ఫ్రెండ్సు ఉన్నారని నీకు తెలుసుగదా?"
"అయితే?"
"వాళ్ళ చేత మీ బాస్ కు ఫోన్ కొట్టించి ఒకరోజు క్యాజువల్ లీవ్ గ్రాంట్ చేయిస్తాలే! నిక్షేపంగా ఇంట్లో ఉండు!"
"ఇంకానయం!" అంది జానకినవ్వుతూ తర్వాత చెయ్యిజాపి మొగుడివైపు చూపిస్తూ ఆరోపణగా అంది" కూతురికి పదమూడేళ్ళు వచ్చాయ్! ఇవాళోరేపో పెద్దమనిషి అవుతుంది. ఇక ఇప్పట్నుంచి దానిపెళ్ళి సంగతి ఆలోచించడం మొదలెట్టింది. నలుగు డబ్బులు వెనక్కెయ్యండి. వీలున్నప్పుడల్లా దాని పేరుతో ఎంతోకొంత ఫిక్స్ డ్ డిపాజిట్ లో వేస్తుండండి. అంతేగానీ, పెళ్ళయిపదిహేనేళ్ళయినా ఇంకా పడుచుపిల్లాడిలానా పమిటకొంగు పట్టుకుని తిరుగుతానంటే కుదుర్తుందా ఏమిటి? ఆఫీసుకి టైమవుతోంది లెండి!"
"పోదూ ఈ మహా ప్రపంచం లో నీ కొక్కదానికే ఆఫీసు ఉన్నట్లు మాట్లాతాంవేం? నాకు లేదా ఏమిటి ఆఫీసు? నేనేం నిరుద్యోగిగాన్నా?"
"అందుకే మీరూ వెళ్ళండి నేనూ వెళతాను. సాయంత్రం గంట ముందుగా వచ్చేస్తానుగా? దిసీజ్ ఎ ప్రామిస్"
"ఒకరోజు సెలవు పెట్టమంటే ఒక గంట పర్మిషన్ పెడతానని గీచి గీచి బేరమాడేవాళ్ళంటే నాకు వళ్ళుమంట!"
"అందుకే చన్నీళ్ళు తోడిఉంచాను"
"నీళ్ళుతోడి ఉంచితే అయిపోయిందా ఏమిటి? నువ్వు తోడురావా బాత్ రూంలోకి?"
వ్వవ్వవ్వ
వాళ్ళు ఆ ఇంట్లో అలా సరససల్లాపాలలో మునిగి ఉన్న సమయంలో నేమరో ఇంట్లో ఒక దుష్ట శక్తిలాంటి మొరటుమనిషి ఒకడులేచి కూర్చుని బద్దకంగా ఆవలించి వాచ్ చూసుకున్నాడు.
అతను పెట్టిన దుర్ముహూర్తానికి ఇంకా ఆరున్నర గంటల వ్యవధి ఉంది.
అతడు లేచి తన ఇంటికి దగ్గరలోనే ఉన్న టీ షాపులో ఒకబన్ను తిని ఆటోస్టాండు వైపు సాగిపోయాడు.
వ్వవ్వవ్వ
ఆసాయంత్రం ఆఫీసునుంచి గంట ముందే ఇంటికి బయలుదేరాడు రమణమూర్తి. వస్తూదారిలో బేకరీ ముందు ఆగి అంతకుముందే ఆర్డరు ఇచ్చిన బర్త్ డే కేక్ ని కలెక్టు చేసుకున్నాడు. కేక్ మీద వెలిగించడానికి అగ్గిపుల్లలంత మాత్రమే పొడుగు ఉన్న రంగురంగుల కొవ్వొత్తుల ప్యాకెట్ కొన్నాడు. వాటిని స్కూటర్ లో పెట్టుకుని ఇంటిదారి పడుతుండగా అతనికి ఒక అమ్మాయి కనబడింది. చిన్నపిల్ల ముచ్చటగా ఉన్న మరూన్ కలర్ సైకిలు తొక్కుతూ వెళుతోంది తను.
ఆ అమ్మాయిని చూడగానే తన సృజన గుర్తొచ్చింది మూర్తికి. గిల్టీగా ఫీలయ్యాడు.
ఈ అమ్మాయికి సృజన ఈడేఉంటుంది. ఈ పాటికి సృజనకి కూడా సైకిలు తొక్కడం నేర్పించేసి ఉండవలసింది తను. ఇదిగో అదిగో అంటూనే ఏళ్ళు గడిచిపోయాయి. ఇంక ఏమాత్రం ఆలస్యం చెయ్యకూడదు.
తక్షణం ఒక నిర్ణయానికి వచ్చేసాడు అతను. ఇవాళనుంచే మొదలు పెట్టి సైక్లింగ్ నేర్పించాలి సృజనకి. తక్కిన పనులు ఎన్ని ఉన్నా ఇది మాత్రం మానకూడదు. సైక్లింగ్ రాకపోతే ఈ సిటీలో ముందు ముందు బతకడం కష్టం! అమ్మాయి కాలీజీలో చేరాక టి వి ఎస్ కొనియ్యాలన్నా లూనా కొనియ్యాలన్నా ఇప్పటినుంచే సైక్లింగ్ నేర్చుకుని ఉంటే మంచిది.
చలాగ్గా సైకిలుమీద వెళ్ళిపోతున్న ఆ చిన్నపిల్లవైపే చూస్తున్న రమణమూర్తి ఎదురుగా వస్తున్న ఆటోని గమనించలేదు.
ముందు చక్రం ఒక్కటీ దూరితే చాలు వెనక రెండు చక్రాలకీ దారి దానంతట అదే ఏర్పడుతుంది అన్నంత రాష్ గా దూసుకుని వస్తోంది ఆటో.
రమణమూర్తి ఆలోచనలోంచి ఇంకా పూర్తిగా బయటపడనేలేదు. కానీ అతని రిఫ్లెక్సెస్ తక్షణం యాక్టివేట్ అయ్యాయి. స్కూటర్ ని ఎడమవైపుకి మళ్ళించమని చేతులకి ఆజ్ఞ అందింది. సడెన్ బ్రేక్ వెయ్యమని పాదాలకు ఆదేశం అందింది.
స్కూటరు పక్కకు తిరిగి ఆగింది. ఆ స్కూటర్ గనక ఆ ఆటోని ఢీకొని అక్కడే ఆపగలిగి ఉంటే ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా అది లక్కీ యాక్సిడెంటే అయి వుండేది.
కోపంగా వెనక్కి తిరిగి ఆటో నెంబరు చూశాడు రమణమూర్తి.
ఆ అంకెలు తనని జీవితాంతం వెంటాడుతాయని అతనికి తెలియదు అప్పట్లో!