డైనమైట్ తనకి ఉన్న టెక్నిక్ తో పేల్చి బద్దలు చేయగలదు. కానీ శిల్పాలు చెక్కడం ఎప్పటికీ నేర్చుకోలేదు.
-సోఫోక్లెటో
* * * *
తను పొద్దుటి నుంచి భోజనం చెయ్యలేదని ఆ రాత్రి తొమ్మిదింటికి గుర్తొచ్చింది అమూల్యకి.
అప్రయత్నంగా చిరునవ్వు వచ్చింది ఆమె ఎర్రటి పెదిమల మీదకు. ఉద్యోగంలో చేరి వారం రోజులు తిరగకుండానే తన జీవితం ఇంత బిజీగా అయిపోతుందని ఊహించలేదు అమూల్య.
గ్లేజ్ డ్ టెయిల్స్ తో మెరిసిపోతున్న బాత్ రూంలోకి నడిచి, బట్టలు విప్పేసి షవర్ కింద నిలబడింది. షవర్ పన్నీటిజల్లులా నీటిని చిలకరిస్తూ ఉంటే నెమ్మదిగా సేదదీరుతోంది అలసిన ఒళ్ళు.
స్నానం పూర్తిచేసి పెద్ద టర్కిష్ టవల్ చుట్టుకుని అక్కడే ఉన్న వేయింగ్ స్కేల్ మీద నిలబడి వెయిట్ చూసుకుని తృప్తిగా నవ్వుకుంది అమూల్య. తను చాలా పొడుగు. ఆ పొడుగుకి తగిన వెయిట్ తనది. ఒక్క కిలో ఎక్కువా కాదు, ఒక్క కిలో తక్కువా కాదు. అతిశ్రద్దగా డైటింగూ, ఎక్సర్ సైజూ చేస్తూ ఫిగర్ ని కాపాడుకుంటుంది తను.
కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఆఫీసులో రోజూ ఇలా తిండి తిప్పలూ మర్చిపోయి ఇంత శ్రమపడవలసి వస్తే, ఇంక తను డైటింగూ చెయ్యనక్కర్లేదు. ఎక్సర్ సైజూ చెయ్యనక్కర్లేదు.
నైటీ తొడుక్కుని, మెత్తటి రబ్బరు స్లిప్పర్సు వేసుకుని, కిచెన్ లోకి వెళ్ళింది అమూల్య. వంటచేసుకునే ఓపికలేదు ఇంక. తినడానికి ఆకలి కూడా లేదు.
సంతోషంతోనే సగం కడుపు నిండిపోయినట్లు ఉంది.
సంతోషం కాదూ మరి? తను డీల్ చేస్తున్న మొదటికేసే సెన్షేషనల్ కేసు అయితే?
ఎప్పుడూ ఎవరితో సరిగా మాట్లాడకుండా, ముక్తసరిగా మాత్రమే మాట్లాడే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా మూడురోజుల నుండి మంచి మూడ్ లో ఉన్నారు. దానికి కారణం ఉంది.
పెద్ద చేపల్లాంటి నేరస్థులని పట్టుకోవడానికి వలపన్నారు. హైదరాబాద్ పోలీసులు.
కానీ -
వలలో పడ్డది పెద్ద చేపకాదు.
బ్రహ్మాండమైన తిమింగిలం! నిఖిల్!
అవును! నిఖిల్!
అతను చెయ్యని నేరంలేదు. చేయించని ఘోరంలేదు. తలపెట్టని అత్యాచారం లేదు. హత్యలు, మానభంగాలు, దోపిడీలు, దొమ్మీలు, స్మగ్లింగ్.....
అతను చేసిన నేరాల లిస్టు రాస్తే అతని చేతికంటే పొడుగ్గా ఉంటుంది.
అతనొక క్రిమినల్ అని దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు.
కానీ అతన్ని ఎప్పుడూ ఎవరూ అరెస్టు చెయ్యలేకపోయారు.
కారణం - అతను దొరకడు. మనిషి పట్టుకోవడానికి దొరకడని కాదు.
చట్టానికి అందడు. అతను ఏ నేరం చేసినా, దానికి రుజువు లేకుండా చేస్తాడు.
అలాంటి నిఖిల్ ని ఇన్నాళ్ళకి అరెస్టు చెయ్యగలిగారు. సాక్ష్యాలూ, రుజువులతో సహా!
అదంతా గుర్తుతెచ్చుకుంటూ, ఫ్రిజ్ లోనుండి రెండు బ్రెడ్ స్లయిసెస్ తీసి వాటికి వెన్న పూసి తేలిగ్గా పెప్పరూ సాల్టూ జల్లి, ఒక శాండ్ విచ్ తయారు చేసుకుంది అమూల్య.
మళ్ళీ ఆలోచనలు.
అనుకోకుండా అతి విచిత్రంగా జరిగిపోయింది నిఖిల్ ని అరెస్టు చెయ్యడం.
రాత్రి పదిగంటలు దాటాక, మద్యం సేవించి ఆ మత్తులో వాహనాలు నడిపేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రమాదాలు కూడా అప్పుడే ఎక్కువగా జరుగుతాయి.
వాటిని నివారించడానికి 'బ్రెత్ ఎనలైజర్' అనే పరికరాలను ఉపయోగించడం ఈ మధ్యనే మొదలెట్టింది పోలీసు శాఖ. టార్చ్ లైట్ సైజులో ఉండే ఈ 'బ్రెత్ ఎనలైజర్'లు మద్యం సేవించిన వాళ్ళను సులభంగా పట్టేస్తాయి. వాహనాలు మితిమీరిన వేగంతో నడుపుతున్నా, పోలీసులకు అనుమానం వచ్చినా, పోలీసులు ఆపి, ఆ పరికరాన్ని నోటిదగ్గర ఉంచి ఊదమంటారు. వాహనం నడుపుతున్న వ్యక్తి లిక్కర్ తాలూకు మత్తులో ఉంటే బ్రెత్ ఎనలైజర్ లో చిన్నలైటు వెలుగుతుంది. 'బీప్ బీప్' అని శబ్దం కూడా వస్తుంది.
బాణంలా దూసుకు వెళుతున్న ఒక స్కూటర్ ని ఆపారు పోలీసులు. బ్రెత్ ఎనలైజర్ ని పెట్టి పరీక్ష చేసారు.
స్కూటర్ వాలా తాగిలేడని తేలింది.
వెళ్ళిపోవచ్చన్ననట్లుగా తల పంకించాడు హెడ్ కానిస్టేబులు.
వెంటనే చెప్పలేనంత రిలీఫ్ కనబడింది స్కూటర్ వాలా మొహంలో.
అది చూసి అనుమానమొచ్చింది పోలీసుకి. ఎందుకింత సంతోషం వీడికి? వీడు ఇంక దేనికైనా భయపడుతున్నాడా?