Read more!
 Previous Page Next Page 
ప్రయాణంలో పదనిసలు పేజి 2

    టెలిగ్రాం వచ్చినవెంటనే రాజారావూ, ఈశ్వర్రాలూ వేర్వేరుగా టూర్ ప్రపోజల్ ఫారంస్ నింపి అధికారికివ్వగా ఆయన వాటిని సంస్థ డైరెక్టరుకు పంపించి శాంక్షన్ తీసుకున్నాడు. డాని ఆధారంగా ఆఫీసులో టియ్యే బిల్లు తయారుకావడానికి సుమారు వారం రోజులు పట్టింది. అక్కణ్ణించి చెక్కు తయారై వీళ్ళ చేతికి వచ్చేసరికి ఇంకోమూడురోజులు పట్టింది. ఈ మధ్య కాలంలో రాజారావు, ఈశ్వర్రావు అంచెలంచెలు వేసుకుని అవసరమయిన సెక్షన్స్ అన్నీ తిరుగుతూండేవారు. ఎందుకంటే అంతదూరప్రయాణానికి రిజర్వేషన్ చాలా అవసరం. రిజర్వేషన్ ముందుగా చేయించుకుంటేగానీ దొరక్కపోవచ్చు. పోనీ ముందుగా పెట్టుబడిపెట్టి టికెట్సు కొనుక్కుందామా అంటే అది ఫస్టుక్లాసు ప్రయాణం. సుమారు ఆరువందల రూపాయలు ఇద్దరూకలసి పెట్టుబడిపెట్టాలి. స్వంత పని కానప్పుడు-అందులోనూ అది ప్రభుత్వపనయినప్పుడు పెట్టుబడిపెట్టడం ముందు ఎవరికిష్టముంటుంది?   
    చెక్కు చేతికిరాగానే బ్యాంకుకు వెళ్ళి డబ్బులు మార్చుకుని వుత్సాహంగా రైల్వేస్టేషన్ కు వెళ్ళారు. ఫస్టు క్లాసుగదా-ప్రయాణానికింక నాలుగురోజులే టైమున్నప్పటికీ రిజర్వేషన్ దొరక్కపోదు- అని ఇద్దరూ అనుకున్నారు. అయితె దేశమెంత దీనావస్థలో ఉన్నప్పటికీ సెకండ్ క్లాసుకు దొరికినంత సులభంగా ఫస్టుక్లాసుకు టికెట్స్ దొరకవని వారిద్దరికీ తెలిసిరావాడానికెంతోసేపు పట్టలేదు. సెకండు క్లాసులో కాళీలున్నాయట కానీ ఫస్టుక్లాసులో ఆ తేదీకి ఏమీ కాళీలు లేవని తెలిసేసరికి ఇద్దరికీ క్షణంపాటు ఏం చేయడానికీ పాలుపోలేదు.   
    "దేవుడువరమిచ్చినా పూజారివరమివ్వడని-ఈ విధంగా నయినా ఫస్టుక్లాసు కంపార్టుమెంటులో ప్రవేశించేయోగం లేకపోయింది-" అన్నాడు ఈశ్వరరావు బాధగా.   
    "మరీ అంత బాధపడకండి...అన్నాడు రాజారావు-" చాలామంది ఇలా టూర్ కి వెళ్ళినప్పుడు సెకండు క్లాసులోనే వెడతారు..."   
    "అదేం కర్మ!"   
    "కర్మకాదు. ఆఫీసు మనని రసీదులడగదు..."  
    హఠాత్తుగా ఈశ్వర్రావు ముఖం వెలిగింది- "మరి చెప్పారుకాదేం?" అన్నాడు. అతను అప్పటికప్పుడు ఫస్టు క్లాసుకీ సెకండుక్లాసుకీ ఉన్నతేడా అంచనా వేసుకున్నాడు సుమారు నాలుగురెట్లకు పైగా ఉంది.   
    "ప్రభుత్వమిచ్చే దారిభత్యం మనకు చాలదు. అందుకని టూర్ వెళ్ళినప్పుడు ఫస్టుక్లాసులో వెళ్ళివచ్చామంటే చేతిడబ్బులు ఒకటి రెండు వందలు ఖర్చవుతాయి. సెకండు క్లాసులో వెళ్ళడంవల్ల అది కలిసొస్తుంది..." అన్నాడు రాజారావు.   
    "అయితే టికెట్సు బుక్ చేసేస్తాను...." అన్నాడు ఈశ్వర్రావు రిజర్వేషన్ అప్లికేషన్ స్లిప్ తీసుకున్నాక ఈశ్వర్రావుకింకో అద్భుతమయిన అయిడియా వచ్చింది.   
    వాళ్ళుంటున్నది భువనేశ్వర్లో. ఎక్కబోతున్న ట్రయిన్ ఈస్ట్ కోస్టు ఎక్స్ ప్రెస్, అది భువనేశ్వర్ సాయంత్రం ఏడుగంటల ప్రాంతాలకొస్తుంది. వాల్తెరు మద్రాసు తెల్లవారుజామున నాలుగున్నరకు చేరుకుంటుంది అక్కడ యీ ట్రయినికే ఒక బొంబాయిబోగి తగిలిస్తారు. అందులో రిజర్వేషన్ సంపాదిస్తే వాల్తేరునుంచి బొంబాయి వరకూ సుఖంగా వెళ్ళిపోవచ్చు. ఈ సరాసరి ప్రయాణసదుపాయం ఒక్క రెండవ తరగతికే ఉన్నది. ఈశ్వర్రావుకు వాల్తేరులో మంచి స్నేహితులున్నారు. వాళ్ళకో టెలిగ్రాం ఇస్తే అందులో రిజర్వేషన్ చేసేస్తారు. కాబట్టి ఇప్పటి టికెట్ వాల్తేరువరకూ తీస్తే చాలును.   
    రాజారావు అంగీకరించాడు కానీ ఈశ్వర్రావుని అతని స్నేహితున్ని నమ్మవచ్చు అని రెండుమూడుసార్లు అడిగాడు ఈశ్వరరావు చాలా నమ్మకంగా చెప్పడంతో వాళ్ళిద్దరి టికెట్సూ వాల్తేరు వరకూ మాత్రమే బుక్కయ్యాయి. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ కు కటక్ లో వాల్తేరు వరకూ వెళ్ళే బోగీ ఒకటితగిలిస్తారు. అందులో రిజర్వేషన్ సాధారణంగా దొరుకుతూంటుంది.
    ఎమర్జన్సీ వున్నా లేకపోయినా భువనేశ్వర్ రిజర్వేషన్ కౌంటరులో అవినీతిలేదు. అందువల్ల రాజారావు పని క్షణాల మీద సులభంగా అయిపోయింది.
    టికెట్సు కొనడం అయిపోయిందని తనపై అధికారికి చెప్పినప్పుడు రాజారావు మనసులో "సెకండుక్లాసు" అనుకున్నాడు. అశ్వద్దామా హల్: అని నెమ్మదిగా కుంజర: అన్న ధర్మరాజుకు వచ్చినంత పాపమే తనకూ వస్తుందని అతను మనసులో సంతృప్తి పడ్డాడు. ధర్మరాజు నిజమే చెప్పాడు కానీ ఆ నిజం తాలూకు ముఖ్యాబద్దం అతనికి యుద్దంలో విజయాన్ని సాధించి పెట్టింది. రాజారావిప్పుడు చెప్పిన నిజంలో ముఖ్యాబద్దం అతనికి నాలుగు డబ్బులు మిగిల్చి పెడుతోంది.
    రిజర్వేషన్ అయిపోయిన రాజారావుకి అంత తృప్తిగా లేదు. వాల్తేరులో ఈశ్వర్రావు స్నేహితుడు రిజర్వేషన్ చేయించక పోయినా, ఒకవేళ వాల్తేరులో అతనికి దొరక్కపోయినా- అప్పుడు తమ ప్రయాణంలో కష్టాలు వాల్తేరు నుంచే ఆరంభమవుతాయి. భువనేశ్వర్ నించి హైదరాబాద్ వరకూ రిజర్వేషన్ సౌకర్యం ఉన్నప్పటికీ అది తాముపయోగించుకోలేదని అతనికి మనసులో బాధగా ఉంది. వాల్తేర్ నించి హైదరాబాదూ, హైదరాబాద్ నించి బొంబాయీ, బొంబాయినించి బరోడా- ఈ ప్రయణాలన్నీ రిజర్వేషన్ లేకుండా చేయాలని తలచుకునేసరికి అతనికి గుండెలవిసి పోతున్నాయి. అయినా అతను మేకపోతు గాంభీర్యాన్ని వహించాడు.

 Previous Page Next Page