Previous Page Next Page 
ప్రయాణంలో పదనిసలు పేజి 3

    భర్త ముఖంలో బాధను గమనించిన వసుంధర-అతన్ని ఓదార్చింది. అతని బాధ తనను విడిచి వుండలేకపోవడమనే అపోహ ఆమెకు కలిగినందువల్ల ఆమె అలా చేసింది.   
    గతంలో కలిగిన ప్రభావాలనుబట్టి రాజారావు గ్రహించిన సత్యమేమిటంటే-వివాహమయినప్పట్నుంచీ తను పూర్తిగా భార్యకు దాసుడయిపోయాడనీ, ఆమె లేనప్పుడు ఏ పనీ చేయలేని అసమర్ధుడవుతున్నాడనీ! అయితే ఇప్పుడు తను ప్రయాణపు కష్టాల గురించి ఆలోచిస్తూండడంవల్ల, ఆ కష్టాలలో ఈ విరహం ఇంకా స్ఫురించలేదు. ఇప్పుడు భార్య అది గుర్తుచేయడంతో అతన్ని మరి కాస్త ఆవహించింది.   
    "అవును వసూ! నిన్ను వదిలి ఎలా- ఒకటికాదు, రెండుకాదు- సుమారు పదిరోజులు...." అన్నాడతను.   
    "మీకు ఈశ్వర్రావు. నాకు పిల్లలూ తోడు..." అంది వసుంధర.   
    ఆఫీసులో కూడా రాజారావు దిగులౌగా వుండడం కనిపెట్టిన అతని కొలీగ్సు- "గవర్నమెంటు డబ్బుమీద దర్జాగా బరోడా వెళ్ళివస్తూ అలా డల్ గా వున్నావేమిటి?" అని నవ్వుతూ అడిగేవారు. అయితే రాజారావు తన బాధపైకి చెప్పుకోలేడు. ఆ సందర్భంలో అతనికి తన అన్న మోహనరావు చెప్పిన సంఘటన గుర్తుకొచ్చింది.   
    ఒక పర్యాయం మోహనరావు బూటుకొనడం అశ్రద్ధ చేశాడు. అతను వేసుకుంటున్న బూతుకు అడుగున బాగా కన్నం పడింది. తప్పనిసరిగా ఆ బూటేవేసుకుని ఆఫీసుకు వెళ్ళివస్తున్నాడు. రోజూ వెళ్ళి కొనాలనుకుని మరిచిపోవడమో, బద్దకించడమో జరుగుతోంది. ఆఫీసులో మధ్యాహ్నం లంచపరులో తన కొలీగ్ తో హోటలుకి నడుస్తూ రోడ్డుమీదకు వచ్చాడతను. ఆ రోజు ఎండ బాగా కాస్తోంది. అతని బూటు కన్నం ఎంత పెద్దదయిందంటే- మోహనరావు కాలు కాలుతోంది- అదేమాట అతను పైకి అన్నాడు- "ఈరోజు  ఎండ బాగా కాస్తోంది. కాళ్ళు కాలిపోతున్నాయి..." మోహనరావు స్నేహితుడు ఆశ్చర్యంగా అతని కాళ్ళవంక చూసి-"అదేమిటోయ్- బూట్లు వేసుకొని కాళ్ళుకాలిపోతున్నా యాంటావు! అన్నాడు. మోహనరావు గతుక్కుమని- "సరే- మనకయితే బూట్లున్నాయి. ఫరవాలేదు. అవిలేని వాళ్ళ సంగతేమిటంటావ్? ఆ బాధ మాత్రం మనది కాదంటావా? అని తప్పించుకున్నాడు. ఈ అనుభవం అతను ఇంటి దగ్గర చెప్పేక భార్య అతన్ని దెబ్బలాడి ఆ రోజే కొత్తబూట్లు కొనిపించింది.   
    ఈ విధంగా కొన్ని చెప్పుకోలేని బాధలుంటాయి. తనది ఫస్టుక్లాసు ప్రయాణం కాదనినలుగురికీ అతను ప్రచారం చేయలేడు. అలాగని మనసులో బాధపడకుండా ఉండలేడు. మనసులోని భావాలు ముఖం మీదకు రాకమానవు.   
    నెమ్మదిగా ప్రయాణం రోజు రానేవచ్చింది, "పన్లెపోతే కాస్త త్వరగా వచ్చేయండి. అన్ని రోజులు నేనుండలేను. బెంగగా వుంటుంది...." అంది వసుంధర.   
    "ఆ సంగతి నాకూ తెలుసు. కానీ వెధవది- ప్రయాణానికే ఆరు రోజులు పోతాయి. అయినా శాయశక్తులా ప్రయత్నిస్తాను- వీలయినంత త్వరగా రావడానికి.... అన్నాడు రాజారావు. అయితే ఈసారి ప్రయాణంలో తను చేయగలిగినదేమీ లేదని అతనికి తెలుసును.   
    రాజారావు పిల్లలిద్దరూ మాత్రం సంతోషంగా- "నాన్నగారూ బరోడా నుంచి మాకేమయినా తప్పకుండా తీసుకురావాలి-" అనడిగారు.   
    "మీకేదయినా తీసుకురావడం గురించే కదా నేను బరోడా వెడుతూంట-" అన్నాడు రాజారావు. తర్వాత భార్యవంక చూసి- "మరి నీకు?" అనడిగాడు.   
    వసుంధర ఏమీ మాట్లాడలేదు- "ఈశ్వర్రావుని భోజనానికి రమ్మనమని చెప్పడం మాత్రం మరిచిపోకండి-" అన్నదామె కాసేపాగి.   
    ఈశ్వర్రావూ, రాజారావూ కలసి భోజనాలు చేశారు. సాయంత్రం. టైము ఆరుంపాసయ్యేసరికి ఆఫీసుకారు రాజారావు ఇంటికి వచ్చింది.   
    రాజారావు తన సామానంతా ఒక పెద్ద బ్యాగులో సర్దుకున్నాడు. ఆ బ్యాగునతను జర్మనీనుంచి తెచ్చుకున్నాడు. అతను బరోడాలో వుండే ఆరు రోజులకూ లెక్కపెట్టి సరిగ్గా మూడేమూడు జతల బట్టలు వేసింది వసుంధర. మూడు పాంట్లూ, మూడు షర్టులూ, మూడు బనియన్లూ మూడు డ్రాయర్లూ, రెండు తువ్వాళ్ళూ, రెండు దుప్పట్లూ, ఒక సబ్బుబిళ్ళా, ఎలక్ట్రిక్ షేవరూ, చిన్న పౌడరుడబ్బా, రబ్బరుదువ్వెన. ఇవి అతని సామాను. ఇవికాక ఆఫీసు కాగితాలున్న చిన్న బ్రీఫ్ కేస్ కూడా ఆ బ్యాగులోనే సర్దేసిందామె. అది బయట వుంచుతానని రాజారావంటే- "ఇది బయట పెడితే- సంచీలో కాళీ వుందికదా అని ఇంకేమయినా సరుదుతారు. తిరిగి వచ్చేటప్పుడే బ్రీఫ్ కేస్ ఎలాగూ బయట పెట్టుకోవాలి. ఇప్పటినుంచీ ఎందుకూ?" అంది వసుంధర.   
    "తిరిగి వచ్చేటప్పుడు బ్యాగులో సామాను పెరుగుతుందనుకుంటున్నట్లున్నావ్. నీకు చీరలు తెస్తానని అడగడం లేదుకదా!" అన్నాడు రాజారావు.   
    "ఇన్నేళ్ళుగా మీతో కాపురం చేస్తూ ఆ మాత్రం తెలుసుకోలేనా?" అంది వసుంధర. రాజారావు ఇంటర్వ్యూలకు వెళ్ళినా, టూర్ కి వెళ్ళినా భార్యకు చీరతీసుకునిరాడు. అదంత చెప్పుకోతగ్గ విశేషం కాదని అతనంటాడు. కానీ అతని ఆఫీసులో మిగతా మగవాళ్ళందరూ ఒంటరిగా బయటకు వెళ్ళినపుడల్లా చీరలు కొని తెస్తారని వసుంధర అంటుంది. మరి పెళ్ళికాని మగవారి సంగతి? అని అతనడిగినపుడు- "వాళ్ళు కూడా కాబోయే భార్య కోసమని ఇప్పట్నించీ చీరలు కొనిదాస్తున్నారు-" అని ఆమె అంటుంది, అలాగని వసుంధరకు చీరలమీదా అభిమానంలేదు. భర్త తనకుతానై బలవంతపెట్టినా ఏదోసందర్భాలలో తప్ప ఆమె బట్టలు కొనుక్కోదు.

 Previous Page Next Page