Next Page 
మనస్విని పేజి 1

                                 

 

                                     మనస్విని
    
                                                              ---శారదాఅశోకవర్ధన్

 

                           
    
  

     'వదినా!'
    
    వాకిలిఓరగా తెరచి చూశాడు.
    
    తలెత్తిచూసింది.
    
    సారధి!
    
    కొంగుసవరించుకుని అంది.  

 

    'రా! సారధీ.'
    
    మంచం దగ్గరగా వచ్చి అన్నాడు.    

 

    'ఎలావుంది వదినా?'    

 

    పేలవమైన ఓ చిరునవు నవ్వి అంది.

    

    'ఇలా వున్నాను చూడు సారధీ!'
    
    పసుపురాసుకున్న ముఖంతో, రక్తం లేని కళ్ళతో, తలకు నల్లనికొంగుతో, బలహీనమైన శరీరంతోవున్న ఎవలేని వర్చస్సులీనుతోంది శరీరకాంతి, నయనాల కాంతి.
    
    'కూర్చోవచ్చా?'
    
    'కూర్చో సారధీ....నీకేమభ్యంతరం?'    

 

    'అదికాదు వదినా....బాలింతరాలివిగదా....మంచంమీద కూర్చోవచ్చో, రాదోనని.'
    
    వదనంలో ఓ విషాద మేఖం అలాతారట్లాడింది. సంబాళించుకుంటూ అంది.    
    
  'పిల్లలేని బాలింతరాలు..ఇంకాఏమో అంటారు చూడూ...అయినా నీకేంలే సారధీ.....కూర్చో.'
    
    మంచంమీదే ఓ వారగా కూర్చున్నాడు.
    
    అక్కడే కొంచెం పక్కకి జరిగి పడుకుంది.
    
    'వదినా!'
    
    '......'
    
    'అన్నయ్యరాలేదా?'
    
    లేదన్నట్లుతలూపింది.
    
    'వదినా'
    
    '......'
    
    'మంచిపిక్చర్ వచ్చింది. బెనిఫిట్ షో వేస్తున్నారు'
    
    'వెళతావా'
    
    'ఔనువదినా'
    
    'వెళ్ళిరా.....'
    
    'మరి.....'సందేహంగా చూశాడు.
    
    'ఓహో!.......నేనులేవనయ్యా.....ఆడ్రాయర్లో వుందిపర్స్ చూడు నీకెంతకావాలో తీసుకో'
    
    లేచివెళ్ళి రెండు అయిదురూపాయలనోట్లు తీసుకున్నాడు.
    
    వదినవైపు చూశాడు.
    
    'బాగా చదువుతున్నావా సారధీ'
    
    'చదువుతున్నానువదినా'
    
    తలనేలకు మంచి బొటనవ్రేలితో రాస్తూ అన్నాడు.    

 

    అతనికి ఎవరైనా తన చదువుని గురించి అడిగితే ఎనలేనిసిగ్గు.
    
    'ఏమోసారధీ! నీవూ ఓ ఇంటివాడవై నీ కాళ్ళమీద నీవు నిలబడగలిగితే, మీ వదినకి తృప్తికలిగించితే అంతేచాలు.....మీవదినకి. ఆ మాత్రం గుర్తుంచుకో చాలు......'
    
    మౌనం వహించాడు సారధి.
    
    'సరేవెళ్ళి రావయ్యా......'
    
    నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు సారధి వెళ్ళినవేపే చూస్తూ అలాగే పడుకుంది సుభద్ర.
    
    పిక్చర్ అయిపోయాక సారధి, సరోజ ఓ రిక్షాలో కూర్చుని బయలుదేరారు ఊరికి. పట్నానికి ఓ మైలులోపుగా ఉన్న కాలనీలాంటిది సారధీవాళ్ళ గ్రామం. ముందుగాసారధి నడిచి పోదామన్నాడు కాని సరోజ పడనివలేదు. ఇద్దరూ ఒకే రిక్షాలో పోవాలనిమంకుపట్టి పట్టింది.
    
    సారధికి సరోజ మీద మనసులోని అంతులేని ప్రేమవుంది. సరోజని చూస్తే ఆమె కోరికని కాదనలేను అనిపిస్తుంది సారధికి. వికసించినపద్మంలాంటి ఆమెముఖాన్ని చూస్తే అతనికి కోపం ఎండసోకినఆవిరిలా మాయమవుతుంది.
    
    కానీసారధికి ఆడవారి కంటేసిగ్గూ బిడియం అధికం.
    
    రిక్షాలో ఓ మూలగా ఒదిగి కూర్చున్నాడు. అతని 'రిక్షా విశాలంగా వుంది కదా బావా'
    
    సరోజమరి కాస్త అతని వైపు జరుగుతూ అంది.    
    
    ఇబ్బందిగా ఆమెవైపు చూస్తూ అన్నాడు.  

 

    'విశాలమూ, ఇరుకూ అనేవి మనసుని పట్టివుంటాయి సరూ!'
    
    'మరైతేనీ మనసంత ఇరుకా బావా'
    
    నవ్వుతూ అంది.
    
    జవాబులేదు.
    
    'బావా మల్లీశ్వరిలోని బావామరదళ్ళగా వుండరాదా? ఎందుకీ టెక్కు?'
    
    అప్పుడేచూసి వస్తున్న బెనిఫిట్ షోని గుర్తుచేసుకుంటూ అంది.
    
    అదోలా చూశాడు సారధి.
    
    అతన్నిరాసుకునేలా దగ్గరిగా జరుగుతూ అంది.    

 

    'అయినాబావా! నేనేం చేశానని నేనంటే నీ కెందుకంత.....'
    
    అర్దోక్తిలో ఆపింది.
    
    సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు.    

 

    'మనంపోతోంది రిక్షాలో సరూ! కార్లల్లోకాదు ఎడ్లబండిలోకాదు'
    
    గట్టిగా నవ్వి అంది.
    
    'అసలుకార్లో అయితే నన్ను వెనుకసీట్లలో తప్పఫ్రంటుసీటులోకి రానిస్తావా? ఒకవేళ బలవంతానవచ్చినా తలుపునికాదని ఇవతలికి జరిగి రానిస్తావా నీవు? ఎక్కడ యాక్సిడెంటు అవుతుందోనని నీభయం......'
    
    సారధిఅసలు మాట్లాడలేదు.
    
    మౌనంగా పక్కపక్కగా వెనక్కి సాగిపోతున్న వరి మళ్ళని చూస్తున్నాడు.
    
    'బావా! మల్లీశ్వరీ, నాగరాజులకథని అంత మధురంగా ఊహించిన కృష్ణశాస్త్రిగారి భావన ఎంత గొప్పది......'
    
    విసుగ్గా అడ్డొస్తూ అన్నాడు.
    
    'అబ్బబ్బ! ఊరుకో సరూ! పాత చింతకాయపచ్చడిలా పులుస్తూవుంటావు ఎప్పుడూనూ మల్లీశ్వరి బావుంది చాలా బావుంది.....సంగీతంమాటలు, పాటలుఒకటేమిటి అన్నీ బావున్నాయ్..... బావులేంది అందులో లేనేలేదు. అయినా ఎప్పటిది పదిహేను ఏళ్ళక్రింది నుంచో ప్రజలంతా పొగడుతున్న సినిమాని ఈనాడు నీవు చూసి మళ్ళీ అదే వరుస వాయిస్తే......'
    
    సరోజవైపు చూచేసరికి ఆమెకళ్ళనీళ్ళ పర్యంతమైవుంది.
    
    మౌనంవహించాడు వాక్యం పూర్తి చేయకుండానే
    
    అంతలో ఊరి పొలిమేరలోకి వచ్చారు.
    
    రిక్షా నక్కడే ఆపుతూ తను దిగాడు సారధి.
    
    'ఇక్కడేదిగు సరూ!'
    
    'ఉహూ.....నేనింటిదాకా వెళ్ళాలి......'
    
    చేయిపట్టిరిక్షాలోంచి లాగుతూ 'దిగమంటుంటే' అన్నాడు.
    
    విధిలేకదిగి వచ్చింది.
    
    అక్కడికి గ్రామం ఇంకా నాలుగు చేలదూరంలో వుంది.    

 

    మెల్లగానడక సాగించాడు సారధి.
    
    మౌనంగా అనుసరించింది.

Next Page