Previous Page Next Page 
మ్యూజింగ్స్ -2 పేజి 6


    "నీకు ఆనందమైన పనులేవో చెయ్యి. ఇతరుల్ని అడిగి ఏం ప్రయోజనం?" అన్నాను నా తాత్కాలిక చెరువుగట్టు శిష్యుడు tell me తో.
    అతనికి కోపం వచ్చింది. నేనేదో రహస్యాల్ని దాచుకుంటున్నా ననుకుంటున్నాడు.
    "నాకు మమ్మల్ని ప్రశ్నలు వెయ్యడమే ఇప్పుడానందం" అన్నాడు.
    "నాకు మాట్లాడక పోవడమే ఆనందం" అనబోయి నేను అతని వెర్రితనం చూసి "కానీ, భరిస్తాను" అన్నాను కళ్ళతో.
    నా భోజనం, నా ప్రవర్తన, నా బట్టలు, అన్నిటికీ అర్ధాలు విచిత్రాలు ప్రశ్నించాడు. జవాబు చెప్పాను. కాని అతనికి తృప్తినిచ్చేది ఏమీ చెప్పలేక పోయినాను.
    అతను వెళ్ళేప్పుడు మాత్రం దిగులు వేసింది. ఏమిటో అతని బాధ? అతనికే తెలీదు. ఏదో తెలుసుకోవాలని ఉంది. నానించి అతనికి. అతని అవసరాన్ని గుర్తించి సహాయం చెయ్యగల ఔన్నత్యం నాకు లేకపోయింది.

                                         * * * *

    మధ్యాహ్నం Musings వాయిద్దామా, మల్లెపూలు గుచ్చుదామా అనే సమస్య పది నిమిషాలు మనసుకి పనిపెట్టింది. ఇట్లాంటి చిన్న వ్యవహారాల్లో కూడా యింతసేపు ఆలోచించడం మామూలు క్విక్ డెసిషన్ చేతకాదు. ఇది ఒక డిఫెక్టు అనీ, దాన్ని మానుకోవాలనీ ప్రయత్నం చేశాను. చాతకాలేదు. జాతకం వాళ్లూ, సామిస్టులూ మళ్ళీ అదే అన్నారు, క్విక్ డెసిషన్ చాతకాదని ఇవన్నీ నా సంగతులు ఎందుకు వ్రాస్తానంటే, ఇవేమీ గొప్పవని కాదు. లోకానికి వీటిల్లో ఇంటరెస్టు వుంటుందని కాదు. నేను కాఫీ తాగినా, తాగకపోయినా; నాకు పందులమీద ఇష్టమున్నా, లేకపోయినా, లోకానికి పట్టిందని కాదు. ఇలాంటి యోచనలూ వీటి నుంచి తేలే ఫిలాసఫీ దానికి సర్వసాధారణమైన ఎప్లికేషన్ వుంటుందని.
    నా ప్రణయాలు గానీ, నా ప్రయాణాలు గానీ, నా ఆలోచనలు గానీ నాకు పాఠాలు నేర్పినట్లే, యితరులకు కూడా పాఠాలు నేర్పకపొతే సుఖంగా నిద్రపోయే మనుష్యుల్ని కదల్చలేకపోతే, కాయితమూ అచ్చూ వృధా శ్రమ. "ప్రజలు మూర్ఖులు నా ఆర్టు వాళ్ళకి అర్ధంకాదు" అనే గొప్పతనానికి రావడం ఇంకా నాచేత కాలేదు. ప్రజలు మూర్ఖులైతే వాళ్ళకి అర్ధం కాకుండా వ్రాసిన నేనూ మూర్ఖుణ్ణే.
    డెసిషన్ ఆలస్యం కావడమనేది ఒక లోపమే. నిజమే. కాని దాన్ని తరిచి చూస్తే ఏదో వాంఛనీయమైన గుణంతో లంకెను కలిగి వుంటుంది. ఏ ఇమేజినేషన్ తోనో క్విక్ డెసిషన్ తెచ్చుకోడానికి ప్రయత్నించి సఫలులమైనామా, ఆ ఇమేజినేషన్ని చంపిన వాళ్ళం కావొచ్చు. ఇది బిడ్డలా శిక్షణలో చాలా ముఖ్యమైన అంశం.    
    అట్లానే అనేకమందిలో మనం చూసే లోపాలు చాలా మంచి గుణాలతో సంబంధం కలిగి వాటి ఛాయలై వుంటాయి. మంచి గుణానికి తోడు నీడగా, కాంప్లిమెంటరీగా ఒక దుర్గుణం వుండనే వుంటుంది. దయకి ఆపాత్రదానం; సత్యానికి క్రూరత్వం; ధర్మానికి_ మూర్ఖత్వం. అందువల్లనే సకలగుణ సంపన్నుడు అంటారే ఆ వింత మృగం సృష్టిలో వుండడానికి వీల్లేదు. శరభ గండభేరుండాలతో ఏ లోకాల్లో వున్నాడో ఆ గుణాభిరాముడు. ఈ పతివ్రతల్ని, పురాణ పురుషుల్ని యిట్లా పరిపూర్ణుల్ని చెయ్యడానికి ప్రయత్నించడం వల్లనే నావంటి వాళ్ళకి వాళ్ళని కారికేచర్ చెయ్యడం యింత సులభమయింది.
    పూర్వపు క్రిస్టియన్ల మాంకులూ, యీనాటి బ్రహ్మసమాజము వారూ తమ దుర్గుణాలతో యుద్ధం చెయ్యాలని చూశారు. ఏ దుర్గుణమూ నాశనం కాదు. గుణ రూపం మట్టుకు మారుతుంది. పైపెచ్చు కొన్ని సుగుణాల్ని చంపి తీరుతుంది. దుర్గుణాన్ని హాని చెయ్యకుండా మళ్ళించడానికి ప్రయత్నం చెయ్యాలి. అందువల్లనే యీ దుర్గుణాల్ని వదిలించుకోవాలంటే, తపస్సు ద్వారా, అసలు గుణాలకే అతీతమైన ప్లేన్ అందుకోవాలని చూసినట్టున్నారు హిందూ దేశంలో. గుణాల్ని వెతికి మార్చాలనుకోవడం గొంగట్లో మెతుకు లేరినట్లే యెందుకంటే మనస్సు యొక్క యేర్పాటులోనే, లిమిటేషన్ లోనే, క్వాలిటీలోనే వుంది గుణ విభజన.
    మననిట్లా చాలాకాలం నుంచీ బాధిస్తున్న గుణాల సంగతీ మనకు పూర్తిగా తెలీని వాటి సంగతీ, సులభంగా జ్యోతిష్కులు యే జాతక చక్రమో, అరిచేతి గీతలో, చూసి మనకి చెప్పేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అదేమిటి? దస్తూరి నుంచి ముఖాల నుంచి స్వభావం విప్పి చెప్పగల వాళ్ళున్నారు. ఇదంతా చూస్తే దీనికంతా మనిషిలో ప్రతి అంగానికీ, సుఖంలో ముడతలకీ, చేతిలో గీతలకీ, అరికాలు వొంపుకీ, కంటి రంగుకీ, పుట్టిన సమయానికీ, వంశానికీ, పరిస్థితులకీ, వ్రాసే అక్షరాలకీ, పలికే మాటలకీ, ఆలోచించే యోచనలకీ, గ్రహ స్థితులకీ, కర్మకీ, అన్నిటినీ కలిపి అర్ధమిచ్చే ఒక్కటే ఏక సూత్రం వుంది గావును! అందువల్లనే వీటిలో ఏ వొక్కటీ తెలిసినా తక్కినవన్నీ తెలిసిపోతాయి, ఆ శాస్త్రం తెలిసినవాళ్ళకి.
    మల్లెపూలు గుచ్చడం చాలా సరదా. మధ్యాహ్నం వరండాలో రోడ్డుకేసి చూస్తూ కూచుని, తీరిగ్గా ఏవేవో ఆలోచించుకుంటూ, మధ్య మధ్య సౌరీస్ తో ఆలోచనలు ఎక్చేంజ్ చేసుకుంటూ విశ్రమించడం చాలా సరదా. కాని musings వ్రాయడం డ్యూటీ కదా అనుకున్నాను. ఏమిటా డ్యూటీ అనిపించింది. ఉన్నతమైన పని, లాభకరమైన పని, ఆర్టు యిట్లా ఆలోచించాను. ఏమిటా ఉన్నతం? ఏమిటా లాభం? ఏమిటా ఆర్టు? అని తరిస్తే ఏమీ కనపళ్లేదు. అదే తమాషా. వూరికే పని అన్ ఇంపార్టెన్సుని ఘనతగా కల్పించుకుని సమర్థించుకోడానికి మనసు కల్పించుకుంటూంది, యీ మాయల్ని_ తానేదో చాలా గొప్ప పనుల్ని చేస్తున్నానని, ఏదో చదివే వాళ్ళకి ఆనందాన్ని కల్గిస్తున్నాము, జ్ఞానాన్నిస్తున్నాము అనుకోడం ఇదంతా వుత్తవాటికి ఏమో విచారాన్నే కలిగిస్తున్నామో లేక తప్పుడు జ్ఞానాన్నిస్తున్నామో, కుటుంబ కలహాల్ని కలిగిస్తున్నామో, లేక విదిపోవలసినవాళ్ళని కలుపుతున్నామో! అయినా యిదంతా ప్రజోపకారార్ధం అనుకోడం సెల్ఫ్ డిసెప్షన్ self deception. అంతా మన ఆనందానికే. దేనికైనా చివర నిజం_ నేను, నా ఆనందం_ అనేది తప్ప వేరు లేదు. ఇతరులకి ఉపకారం చేస్తే ఆ వుపకారం చెయ్యడం నాకేమి ఉపకారం చేసిందనేదే అంత్య ప్రశ్న. 'నేను' అనేది తప్ప వేరే కొలత, వేరే ఆధారం యెక్కడా దొరకదు, ఎవరికీ కూడా.
    ఫాల్గుణమాసపు మధ్యాహ్నం వేడిగా వున్నానా, చల్లగా వున్నానా అని సందేహించే సోమరి గాలి, విచ్చని మల్లెపూల పసి తెల్లదనం, వాటిలో దాక్కుని నిద్రపోతూ వున్న పరిమళాన్ని సూచించే పచ్చి వాసన, గిన్నెలో నీళ్ళ చల్లదనం _ అన్నీ కలసి యేదో శాంతత్వాన్ని ఇస్తున్నాయి మనసుకి, నాకు కూడా _ చాలా ఆరాటాలకి అలవాటైన నాకు కూడా. నాకే యిట్లా వుంటే, యీ ఎండాకాలపు నెలలు మధ్యాహ్నాలప్పుడు తీరికగా మల్లెపొదల నుంచి పూలు కోసి, మాటలు చెప్పుకుంటూ, వాటిని సోమరిగా దండలు కట్టి, తలలో పెట్టుకునే యువతులకి ఎంత సంతుష్టి నిస్తాయో, యీ పువ్వులు! ఏ ప్రశ్నలూ లేకుండానే అన్ కాన్షస్ గా, యీ మల్లెపూవుల్ని తాకితే వేళ్ళ కొనల్లోంచి పైకి నెమ్మదిగా పాకే ఆనందాన్ని తీసుకుంటారు వాళ్లు.

 Previous Page Next Page