Previous Page Next Page 
మ్యూజింగ్స్ -2 పేజి 5


    జీవితమంతా పెద్ద ప్రశ్నార్ధకంగా ఎక్కడన్నా స్థిరమైనది అనే ఆధారం వున్నదా అని వెతుకుతూ హృదయాన్ని రోడ్డుమీద పారేసేవాడు, అన్ని సౌందర్యాలూ, ఏలేశమైనా ఏమూలనున్నదో తప్పించుకుంటోందనే thought తో కుంగిపోయేవాడు. లోకంలో ఏమూల బాధ వున్నా, తను ఆనందపడలేనివాడు ఆనందంగా కనపడుతున్నాడా?
    ఆనందం అంటే ఏమిటి? చి__ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా హృదయం ఆగడం బాధా మాదుర్యమా? ఆ ఉదయాన చల్లని గాలి తాకినప్పుడు నేను అనుభవిస్తున్నది ఆనందమా! బాధా! దేహం హాయి అంటుంది. మనసు ఏదో తెలీని ఆరాటంతో గుంజుకుంటుంది తాను అందుకోలేని దేనికోసమో! తాను వదిలి సగం జ్ఞాపకపడే దేనికోసమో! ఈనాడు యే ఆనందంగానూ కనపడని ఘడియలు వారంరోజుల తరవాత వెనక్కి చూసుకుంటే చాలా అందంగా కనపడతాయి. ఈ మార్పు అంతా కాలంలోనూ, అనుభవాన్నిస్తున్న పదార్ధాల్లోనూ వుందా! లేక మనసు కల్పిస్తున్న విచిత్రమా? లేక లోపలి యీ మనసూ బైట యీ ప్రపంచమూ కలిసి చేస్తున్న మోసమా? లేక యీ మనసూ ప్రపంచమూ, అంతా ఒకటేనా? సౌందర్యం కలిగించే హృదయ చలనం ఎంతవరకు పూర్వ సౌందర్యానుభవాల జ్ఞాపకం వల్ల? 'పూర్వం' అంటే యీ జన్మలోనేనా, లేక ఇంకా వెనకా?
    ఈనాడు ధనం దాచుకునే, గొప్పగా అనుభవించే భాగ్యవంతుల మీద తమ హక్కుల్ని దోచుకున్నారని ఆగ్రహిస్తున్నారు గాని, పరిశీలిస్తే, intrinsic values దగ్గరికి వెళ్లిచూస్తే, వీళ్లకీ ఉత్త ఈర్ష్య తప్ప, తమకు లేనిది ఇంకొకరికి వుండిపోయిందనే ఆగ్రహం తప్ప యీ సుఖదుఃఖాలలో మనిషికీ మనిషికీ అట్టే తేడా లేదనే విశాల దృష్టి లేదేమో! జీవితమంతా అలవాట్ల పుట్ట. ఆ అలవాటే ఎంత బాధలో, దరిద్రంలో వుండే చురుకుదనానికీ నల్లమందు పూత పూస్తుంది. ఆ అలవాటే ఎంత ఐశ్వర్యంలో వుండే ఆనందాన్నీ మామూలు చేసి ఆత్మని తీరని కోర్కెలతో క్షోభ పెడుతుంది. మహారాజు భోజన పదార్ధాలకీ, దరిద్రుడి భోజన పదార్ధాలకీ లక్ష భేదం వుండవచ్చు. కాని వాటియా ఆరోగ్యపు విలువ గాని ఆనందపు విలువ గాని సమానమే కావచ్చు లేకపోవడంలో లేదు బాధ, లేదని యాడవడంలో వుంది బాధ అంతా. అవసరంగా కావలసిన వాటికి ఏడవకుండా వుండడం చాలా కష్టం. కాని ముప్పాతిక ప్రపంచంలో దుఃఖం అవసరం లేని వాటికి యాడవడం వల్లనే కలుగుతోంది. ఈ పై భేషజాలని తొలిగిస్తే, అన్ని దేహాలు వొకటే ఐనట్టు, పై మెరుగులు తీసేస్తే మనసులన్నీ వొకటేనేమో! మన స్వంత మనసులే దుఃఖిస్తున్నాయో, సుఖిస్తున్నాయో కనుక్కోలేమే, ఇతరుల సంగతి మనకేం తెలుసు? మేడలు చూసి సుఖమని, గుడిశలు చూసి దుఃఖమని మన మనసు విభజించుకుంటుంది. అంతే!
    నిన్న __య్య వచ్చాడు. యెనిమిదేళ్ళ తరవాత! తన టీచరు సర్టిఫికెటు పూర్తిచెయ్యడానికి తాను లంచాలు మొదలైన వాటికోసం మూడు నెలల జీతం ఖర్చుపెట్టిన సంగతి చెపుతున్నాడు. అతని ఆకారాన్ని చూసి అందరూ నవ్వుతున్నారు. కాని అందవికారం అతనికి మామూలయింది. అతని భార్యకీ అయింది. వాళ్ళిద్దర్లో ఎవరికీ విచారం లేదు. ఆ విచారమంతా చూసే మనసుల్లోనే.
    పట్టుకున్నారు. లంచాలు తీసుకున్న అధికారిని శిక్షించడానికి __య్యని వాంగ్మూల మిమ్మన్నారు. ఇవ్వనన్నాడు.
    "ఎందుకు ఇవ్వలేదు? ఇట్లా బీదల్ని దోచుకునే అధికార్లు నాశనం కావాలి" అన్నాను, లోక సంస్కరణ ప్రయత్న వాసనలు చావని నేను.
    __య్య ఒక్క నిమిషం ఆగాడు.
    ఒకనాడు వర్షంలో తడుస్తూ పోయినాను వాళ్ళ యింటికి. భార్య చిన్నది. అమాయకురాలి. "నన్ను అప్పులపాలు చేసిన అధికారి మీద కోపం కలిగినప్పుడల్లా, ఆమె ముఖం నా యెదుట నిలబడుతుంది" అన్నాడు, ఎందరు హర్షిస్తారు __య్య హృదయ మార్దవాన్ని! అందవికారుల్లో అందవికారుడు, దరిద్రులలో దరుద్రుడు, ఏ తెలివీ, ఆశయాలూ లేని పూర్వాచార పరాయణుడు, మూర్ఖుడు బడిపంతులు __య్య.
    ఇంకా ఇటా, అటా అని నేను సంశయిస్తున్న రోజుల్లో, ఓనాటి అర్దరాత్రి, గాంధీగారు కలలో కనపడ్డారని, లేచి తువ్వాల దులిపి, శిబిరంలో చేరి, సాయింత్రానికి తల పగిలి, మర్నాడు జైల్లో పడ్డ __య్య ధీరత్వం ఎందరు గుర్తించారు? ముందు గతిని, తలుచుకోక పూటకి తిండిలేని సంసారాన్ని వదిలి, 'call' వచ్చిందని పరిగెత్తిన __య్య ఆత్మలో వుండే బలాన్ని! నన్ను చూడగానే, నా పాదాలమీద చేతులేసి కళ్ళ నద్దుకున్నాడు. ఏనాడో ఎనిమిదేళ్ళకిందట కష్ట దశలో సహాయం చేశాడతనికి. నేను మరచిపోయినా ఆ కృతజ్ఞతా భారం ఆ హృదయాన్ని వేధిస్తూనే వుంది గావును!
    నాకన్నా చాలా గొప్పవాడివని చెప్పగలిగిన ధైర్యం నయు లేదు. ఎందుకు వచ్చాడా? ఏ రికమెండేషన్లకా? అప్పు అడగడానికా అనే పనిచేస్తోంది నా మెదడు. ఎంత అసహ్యించుకున్నా, ఎంత వేదనపడి ప్రయత్నించినా యీ భీరుత్వాలు. యీ అధికార బిడియాలు, హృదయాన్నించి వేరుపరిచే యీ అనుమానాలు వదలవు గావును మానవుల్ని! ఈ దుర్గుణాలతో పోట్లాడి లాభం లేదు. ఒక్కొక్కటే వేరుగా విడతీసి తీసివెయ్యలేము. ఒక దాన్ని నరికితే, దానికి సంబంధించినవి పది ప్రక్కనే మొలుస్తాయి. ఈ మానవ అసహాయత్వాన్ని క్రిస్టియన్లు 'Original sin' అని తత్వనిరూపణ చేసి, ఈశ్వర కటాక్షం వొక్కటే మానవుడికి దుష్టత్వం నుంచి విముక్తి నియ్యగలదన్నారు.
    అసలు ఇది సుగుణమనీ, ఇది దుర్గుణమనీ దేన్ని నిర్ధారణగా చెప్పగలం? ఒక పరిస్థితిలో, ఒక సమయంలో, ఒక కోణం నించి, ఒక్కొక్కరిలో దేశకాల పాత్రల ననుసరించి యీ గుణాల గుణం మారుతూ వుంటుంది. మనిషిని చంపలేను. చంపి ధైర్యంతో పశ్చాత్తాప పడకుండా భయపడకుండా బతకలేను. ఇది సుగుణమా? భీరుత్వమా? ఒక కోణం నించి పురాణాల వాళ్ళు ప్రాతివ్రత్యాన్ని సుగుణం చేశారు. ఇంకో కోణం నుంచి నేను ఆ పాతివ్రత్యాన్నే అతి నీచత్వంగా ప్రదర్శిస్తున్నాను. కనకనే యీ గుణాలన్నిటినీ కలిపి, ఏ గుణమూ లేని ఏ గుణాలకీ అతీతమైన ఏకత్వం సంపాదించాలన్నారు వేదాంతులు. వీటినన్నిటినీ ద్వంద్వాలనేసి, యీ విరుద్ధాలూ విరోధాలూ ఈశ్వరుడిలో సమన్వయమౌతాయన్నారు. ఆ సమన్వయం యీ సామాన్య ప్రపంచపు plane లో అర్ధమయ్యేట్టు లేదు. ఉన్నతమైన వాతావరణం అందుకుని అక్కణ్ణించి చూస్తే ఆ అనుభవంలో యీ భేదాలూ, యీ స్వల్పత్వాలూ వాటంతట అవే మాయమౌతాయేమో! చిరుతపులి మచ్చలు ఒక్కొక్కటే ఏరి రుద్దితే పోతాయా? చర్మమే వదుల్చుకోవాలి గాని చాతనైతే!

 Previous Page Next Page