వివాహం
-చలం
తమ్ముడు రామ్మూర్తి చచ్చిపోయినాడని వినగానే డిప్టీ కలెక్టరు వెంకన్నగారి మనసుకి చాలా విశ్రాంతి కలిగిందిగాని, రామ్మూర్తి సంసారానికి దిక్కులేక పోవడమూ, తనే బాధ్యత వహించి తీరాలి కొంతకాలమన్నా అనే సందేహమూ అతనికా చావు పూర్తిగా రుచించకుండా చేశాయి. చిన్నప్పణ్ణించీ రామ్మూర్తి పెంకెవాడు. తన మనసుకి తోచాయనే గాని, తను చేసే పనులవల్ల చుట్టుపక్కల వాళ్ళకి యేం కష్టం కలుగుతుందో అని ఆలోచించే మనిషి కాడు.
రామ్మూర్తి స్వతంత్ర వ్యక్తి కావడానికి వీల్లేదనీ, గడియారంలో చక్రంవలె సంఘంలో భాగమని, స్వతంత్రమని పేరుపెట్టి, తక్కిన చక్రాలకి ఎదురు తిరగడానికి హక్కులేదనీ, ఎన్ని సంగతులు వెంకన్న పంతులు చెప్పినా విన్నాడు కాదు రామ్మూర్తి. దానికి తోడు అతనికి సంఘ సంస్కరణం పిచ్చి పట్టింతరవాత "ఇంపాసిబిల్" అయినాడు. అతను తన తమ్ముడని చెప్పుకోవడమే నామర్దాగా వుండేది, మర్యాదస్తుడు వెంకన్న పంతులుకి.
రామ్మూర్తికి ఏం సంస్కరణ చేద్దామా అనే విచారం కలిగింది. వితంతు వివాహం చెయ్యాలంటే ముసలి తల్లినెవరూ పెళ్ళే చేసుకునేట్టు లేరు. ఆ బావలెవరూ చచ్చి చెల్లెళ్ళు వితంతువులు కాలేదు. కూతురికింకా పెళ్ళే కాలేదు. కనక వితంతూ వివాహ సంస్కరణం లాభంలేదనీ, రజస్వలానంతర వివాహం పట్టుబడ్డాడు. అతని కూతురు రవణకి పదమూడేళ్ళు వొచ్చాయి. రజస్వల అయిందనే అందరి నమ్మకమూ కాకపోయినా, అయిందనే నమ్మకం పుట్టించేవాడు అతను చూడండి.
"చూడండి. మా అమ్మాయి పెద్దమనిషి అయినా..." పెళ్ళిచేయననో, పెళ్ళి చేయలేదనో యేమనేవాడో యెవరూ సరిగా వినలేదు. రవణకి పదేళ్ళు దాటగానే వెంకన్న పంతులు రామ్మూర్తితో భోజన సంబంధం మానేశాడు. మానేసినట్టు వీలైనంతవరకు తెలిసిన వాళ్ళందరితోటీ చాటించాడు. తెలీని వాళ్ళముందు తనకు తమ్ముడు లేనట్లే ప్రవర్తించాడు. ఆంధ్రపత్రికలో ప్రకటించేవాడే, కాని యీ ప్రకటనకి అవసరమేమై .యుండునా అని కొందరు సందేహిస్తారని భయమేసింది. తమ్ముడు సంఘ సంస్కర్త కాకముందు వెంకన్న పంతులుకి కొంచెం అనాచార ముండేది. ఇప్పుడు "క్రాపు" గొరిగించాడు. తలగుడ్డ చుట్టినా పిలక కొంచెంగా కిందికి దిగజార్చాడు; బొట్టు పెద్దయింది.
"ఇప్పుడే జపంనుంచి లేచానండీ" అంటాడు అనేక మందితో.
తనమీద కసికొద్దీ రామ్మూర్తి చచ్చాడు.
అరవై రూపాయల జీతంలో వున్న రామ్మూర్తి యేదీ ఆదా చెయ్యలేదు. అనాధలయిన ఆ తల్లీకూతురు ఏమౌతారిప్పుడు?