Previous Page Next Page 
మ్యూజింగ్స్ -2 పేజి 7


    మల్లెపూలకేక వినగానే 'చే' గంతులేస్తుంది. ఆడపిల్లలు 'మల్లెపూలో' అనే కేక వినబడగానే 'మల్లెపూలే అమ్మా' అని గోల పెడతారు. మల్లెపూల నుంచి నేను పొందే యీ సుకుమారమైన సౌఖ్యం వాళ్ళనీ ప్రోత్సహిస్తుందా? లేక మల్లెపూలు పెట్టుకున్నామనే సాంఘిక గౌరవం కోసం ఆరాటమా?
    ఎవరో గుచ్చి ఇచ్చినవీ, అమ్మినవీ దండలు తలలో పెట్టుకుంటే యీ శాంతి యీ యీ మాధుర్యం కలుగుతుందా? ఇలా చేతితో తాకి విశ్రాంతిగా గుచ్చిన అనుభవం! __శుక్రుడి కాంతి వలె తెలీకుండా రక్తం మధ్య యెక్కడో చలించే శృంగారం! జాతికారే సంగీతం వలె నరాల మధ్య చక్కలగిలి పెట్టే చిరునవ్వు!!
    మార్దవమైన అమాయకమైన సౌఖ్యాలు క్రమంగా తొలిగిపోతున్నాయి జీవితాల్లోంచి. నాగరికత వల్ల నరాల్ని కొట్టి, గుంజి, తీవ్రంగా కంపింపజేస్తేనేగాని చలనం కలగటంలేదు హృదయాలకి. సినిమా రంగులు, రేడియో అరుపులు, అత్తరు ఘాటులు, కాఫీ హోటలు బరువు రుచులు, పట్టణపు స్త్రీలు మల్లెపూలు గుచ్చుకోరు. విద్యావంతులు మాటలు, కబుర్లు, తగాదాలు, క్లబ్బులు వీటితో గడుపుతారు. సాయంత్రాలు తల్లో మల్లెపూలు విచ్చినప్పుడు ఆ వాసనని అంగీకరించేందుకు వ్యవధి లేదు, కుర్చీలమీద కూచుని 'బ్రిడ్జీ' ఆడే స్త్రీలకి. మల్లెపూలు గుచ్చడం మాని, సిల్కు చీరెలూ, భర్తల గొప్పదనాలూ, పిల్లల విద్యా, అధికారం గల స్నేహితుల షోకులూ, వియ్యంకుల విరాళాలూ__ ఇవీ వీళ్లు చేస్తున్న పనులు. స్వతంత్రాన్వేణంలో విద్యా వ్యామోహంలో శాంతికీ, సుఖానికీ దూరమైనారు. పోనీ, ఆ స్వాతంత్ర్యమేమీ రాలేదుకదా, ఒక విధమైన బానిసత్వం నుంచి యింకో విధమైన బానిసత్వానికి ప్రయాణమైనారు. వడ్డాణాలు, కాసులు పేర్లూ మాని సన్న గొలుసులకీ, రవ్వల గాజులకీ దాసులైనట్లు. ఆర్ధిక స్వాతంత్రం వచ్చినా సెక్సు స్వాతంత్రం రాలేదు. భర్త కోసం వెతకడం, భర్త దొరికింతరవాత తగాదాలు ఈర్ష్యలు, దాచుకోడాలు; నటనలూ. భర్త దొరక్కపోతే రహస్య ప్రియులు_ ఇవీ నవీన స్త్రీల చరిత్రలు.
    మల్లెపూలతో నాకీ ఆత్మసంబంధం బాల్యం నుంచి వుంది. మా మల్లె పొదని సాయంత్రం వెతికి మొగ్గలెన్ని కోసినా యెట్లాగో పాపం! కొన్నిటిని ఆకుల్లో కనబడకుండా దాచుకునేది. తెల్లారే లేచివచ్చి ఆకుపచ్చ పొదమీద తెల్లగా విచ్చిన పూలని చూసి నక్షత్రాలు కొన్ని రాత్రి భూమికి రాలాయా అన్నట్టు వెర్రిగా చూసేవాణ్ణి. మొన్న పెదవిరివాడలో చింతచెట్టుమీద కూచున్న తెల్లకొంగల గుంపుని చూస్తే చిన్నప్పటి నా మల్లె పొదే జ్ఞాపకం వచ్చింది. దగ్గిరకెడితే ఆ పూలు ఎగిరిపోవా అనిపించేది. దరిద్రపు పనిలో యెలాగో గడిచిన సంవత్సర చక్రం తిరిగి ఫాల్గుణమాసంలో మొదటి మల్లెపూల పరిమళం తగిలేటప్పటికి యింకా సౌందర్యం లోకంలో నశించలేదనీ, యెంత తొక్కి ధ్వంసం చేసినా, యీ పిచ్చి హృదయాలకీ, యీ కఠిన ప్రపంచానికీ, యీ శృంగార సంబంధం వదలదనీ మళ్ళీ రూఢి కలుగుతుంది.
    మల్లపూలు, తెల్లని మల్లెపూలు, విచ్చిన మల్లెపూలు! ఆ పరిమళం నాకిచ్చే సందేశం యేమాటలతో తెలపగలను! సాయంత్రాలు స్నేహానికి చల్లని శాంతినిచ్చే మల్లెపూలు; అర్ధరాత్రులు విచ్చి జుట్టు పరిమళంతో కలిపి నిద్రలేపి, రక్తాన్ని చిందులు తొక్కించే మల్లెపూలు; వొళ్ళ మధ్య, చేతుల మధ్య నలిగి నశించిన పిచ్చి మల్లెపూలు; రోషాలూ నవ్వులూ, తీవ్రమైన కోర్కెలతో తపించి వాడిపోయిన పెద్ద మల్లెపూవులు; సన్నని వెన్నెట్లో ప్రియురాలి నుదిటికన్న తెల్లగా_పిచ్చి! యేమి చెయ్యాలో తెలీని ఆనందంతో గుండె పట్టి చీలికలు చేసే మల్లెపూలు; తెల్లారకట్ట లేచి చూసినా యింకా కొత్త పరిమళాలతో, రాత్రి జ్ఞాపకాలతో, ప్రశ్నించే మల్లెపూలు; ఒక్క స్వర్గంలో తప్ప ఇలాంటి వెలుగు తెలుపు లేదేమో అనిపించే మల్లెపూలు; అలిసి నిద్రించే రసికత్వానికి జీవనమిచ్చే ఉదయపువ్వులు; రాత్రి సుందర స్వప్నానికి సాక్షులుగా అవి మాత్రమే మిగిలిన నా ఆప్తులు మల్లెపూలు.
    ఎండాకాలపు దక్షిణగాలి, తెల్లారకట్ట అలసట నిద్ర, కోవిల అరుపు, లేవవొద్దనే ప్రియురాలి గట్టి కౌగిలి, మల్లెపూల పరిమళం_ అన్నీ ఒకటిగా కలిసి జ్ఞాపకం వస్తాయి _ లోకం సార విహీనమని అధైర్యపడినప్పుడల్లా.
    అందమైన వుదయం. పెద్ద చెట్టు ఆకాశం కనబడకుండా రోడ్డుపక్కనించి నెత్తిమీద కలుసుకోడం చేత వాటి ఆకుల్లోంచి లోపలికి వచ్చే కాంతి రకరకాల రంగులతో కళ్ళకి శాంతినిస్తోంది. పాటలు పాడాలి. వీరకార్యాలు చెయ్యాలి. "సర్వలోకాః (శేషాచారి కూడా) సుఖినోభవంతు" అనాలనిపించే ఉదయం. నేనూ, 'ఓల్డుహార్సు' మాత్రమే కనుచూపుమేర, సర్ గాలహెడ్ ననీ, డాన్విక్ సాట్ ననీ ఇమేజిన్ చేసుకుంటూ పోతున్నాను; నా సైకిల్నీ, నన్నూ యెగరగొట్టాలని నా చుట్టూ నవ్వుతున్న గాలిలో_ నిరంతర తాలూకా ప్రయాణ నిమగ్నుణ్ణయి.
    ఏడుపు...గుంపు...ఓల్డు హార్సు సకిలించి వేగం తగ్గించింది. నాకంటే పూర్వమే, అందమైన మనిషి తన కంటబడ్డదా, నేను కళ్ళెం లాగకపూర్వమే మందగించడం అలవాటయింది నా ఓల్డు హార్సుకి.
    మొన్న ఒక స్కూలులో విజిట్ కి వెళ్ళినప్పుడు టీచరు లేడు. అంటే అతనికి ఒక్క ఏడాది జీవనాధారం అపాయంలో పడ్డదన్నమాట. విసుక్కుని నేను ఓలు హార్సు యెక్కాను, వచ్చిన పొలం మోడులమీదనించి స్వారీ చేయటానికి; ఓల్డుహార్సు సకిలించి కదల్లేదు. ఎందుకు బెదిరిందా అని దిగి నాలుగు దిక్కులా చూశాను. బడి పక్కన ముందు పందిరిగుంజమీద చేతినానించి టీచరు భార్య - సౌందర్యవతి నుంచునివుంది. దిగాలుపడి చూస్తో, ధేనువుని లాక్కుపోతూ వుంటే చూసే జమదగ్ని భార్యవలె.
    కళ్ళల్లో నీళ్ళా! వెళ్ళి పలకరించవా? నేను_ 'చలం' కాదు, కధకుణ్ణి కాదు, మనిషిని కాదు, శృంగారలేశానికై తహతాహలాడే రసికుణ్ణి కాదు. స్త్రీ అశ్రుల్ని భరించలేని సహృదయుణ్ణి కాదు. రాతిని ప్రభుత్వ బానిసను, స్కూళ్ళ తనిఖీ దారుణ్ణి, ఉపాధ్యాయ వర్గ ప్రాణ మూషికలకి మార్జాలన్ని.
    రామతిలకం కన్న యీమె అందంగా వుంది. కాని 'పోవుచున్నాడే' అనే పాట వినపడ్డది నాకు. లాభం లేదు. ఈ ఇనస్పెక్టరు యముడు వరాలివ్వడు. ఇచ్చే మహిమా లేదు. "పోవుచున్నాడే__ నా విభుని జీతమును గొని, పోవుచున్నాడే......"
    పక్కన పరిగెత్తే వరిపొలాల ఆకుపచ్చ పట్టునునుపునీ కంటి నీళ్ళలో _ ఇద్దరం కిటికీ దగ్గిర _ ఇదంతా వేశ్యా జాణతనమా,... వాస్తవమా, జీవితం హృదయాన్ని నలిపి పిండుతోందా అశ్రువుల్ని లేక ఎందుకు, నాముందు ఎందుకు, అనే నా సందేహాలకి _ నా మిత్రులందరికీ అమృతాన్ని రుచిచూపిన నీ పెదవిలో వొణుకు - ఏయే అధముల గూఢప్రదేశాలకి విలువ నిచ్చిన నీ వేళ్ళ తొందర__

 Previous Page Next Page