పానకంలో పుడక లాగ అమరుల ప్రసక్తిలో ఆంధ్రుల ప్రసంగం అధిక ప్రసంగమే అవుతుంది. ఇదీ వారి సామెతే! రంభా, ఊర్వశీ, మేనక, తిలోత్తమ, హేమ, హరిణి, చిత్ర, ఘ్రుతాచి, ఈ ఎనిమిది మందీ ఆటగత్తెలే! అయినా అందంతో, చందంతో, నృత్య గాన విలాసాలతో భూమిని అష్ట దిగ్గజాలూ మోస్తున్నట్లు ఈ సురేంద్రుడి సింహాసనాన్ని భరిస్తున్నారు. ఆపదలో ఆదుకుంటున్నారు. ఎవరు తపస్సు చేసినా, యజ్ఞాలు ప్రారంభించినా తన పదవి మీద కన్నేశాడనే కదా అతగాడి భ్రమ! భయం! అప్పుడు వారిని చెదరగొట్టినా, బెదరగొట్టినా వీళ్ళే కదా నేర్పరులు!
ఉండనీ! ఆ కథ....
నవ యవ్వన రంభ-రంభ అందగత్తె.. ఉహూ ఉహూ సౌందర్య రూపసి. ఊర్వశి అందగత్తె- కాదు కరిగించి కరిగిపోయే ఘ్రుతాచి అందగత్తె. బంగారు వన్నెలు కురిపించే హేమ- ఆహా మేను మరిపించే మేనక- ఉత్తమ శరీర లక్షణ తిలోత్తమ సొగసు గత్తె. లేదు. మనస్సు హరించే హరిణి. చిత్ర విచిత్ర వైఖరులు ప్రదర్శించే చిత్రరేఖ. వీళ్ళెవరూ కాదు ఎవరో ఒకరు. అందగత్తె అనేస్తే సరిపోదూ! తన మాటకు అడ్డుందా! తన నిర్ణయానికి తిరుగుందా! కాదనే వారెవరు? వాదుకు దిగేదెవరు? తను అఖిల లోకాధిపతి తన శాసనం వజ్ర శాసనం!
అలా చెయ్యలేదు.
పరిషత్తులో అభిప్రాయాన్ని అర్ధించినట్టు తమ అభిప్రాయాన్ని వెల్లడించమని అడిగాడు. సురాపన చిత్తులకు మత్తెక్కువ కదా! అందుకే అలా అడిగాడు. ఏముందీ! ఎవరిష్టం వారిది. వాక్స్వాతంత్రం వుంది కదా!
సురపతే అడిగాడు కదాని ప్రతీవాడూ తనకు నచ్చిన సుందరి పేరు ప్రకటించేశాడు. పాపం! వారి కంటికి ఆమె అందగత్తెగా, అతిలోక సౌందర్యవతిగా కనిపించడంలో ఆ సంగతమేముందీ?
చివరికి అమరేంద్రుడు విప్పుకోలేని చక్కని చిక్కులో పడ్డాడు! చక్కనమ్మ చిక్కినా అందమే! అంటార్లే ఆంధ్రులు. చిక్కు వచ్చినా అందమైన చిక్కే వచ్చింది.
జగదేక సుందరిని ఎన్నిక చేసి ఆమెకు అందాలరాశి అని బిరుదిచ్చి, గౌరవించడం అలతి కార్యంగా భావించాడు! అది ఇప్పుడు అంతఃకలహాలకు దారి తీసేలా ఉండటంతో... పితామహులుండగా మనకెందుకీ పేచీ అని మీ దగ్గరికే వెళదాం అని నిర్ణయించాడు. ఇదొక్కటే శచీపతి జీవిత కాలంలో చేసిన చక్కని నిర్ణయం. ఇక సర్వం తమ సన్నిధికి వచ్చింది. నిర్ణయం మీది సన్మానం దేవేంద్రుడిది.
ఆ మాటలకు అందరూ సంతసించారు.
విషయాన్ని వివరించడంలో గానీ వివదించడంలో గానీ తనకి తానేసాటి అని మరోమారు రుజువు చేసుకున్నాడు దేవర్షి.
'రంగం ఇక్కడికి మారిందన్న మాట!'
'అవును పితామహా! అఖిల సృష్టి జరిగే రంగస్థలం కదా ఇది! ఈ స్థలానికి రంగం మారడంలో ఔచిత్యం లేదూ!'
బ్రహ్మ శిరస్సులు నాలుగూ ఊగాయి.
'మీరలా తలలూపారంటే నాలుగు వేదాల సాక్షిగా సమ్మతించారనే నాకు తోస్తున్నది.'
'ఇన్నేళ్ళకి మాట లెస్సగా పలికావు' అన్నాడు దేవేంద్రుడు.
నారదుడింకేం అనలేదు. పరమేష్టి సరస్వతి వైపు చూశాడు.
ఆమె పెదాలు విచ్చీ విచ్చకుండా విరి అరవిరిసినట్లు నవ్వింది.
'మహేంద్రా! మంచి ఆలోచనే వచ్చింది నీకు! అంతకంటే మంచి పనే చేశావు. సురాధినాధుడను కదా! సకల సృష్టికీ పాలకుడణు కదా! అని భావించి, అహంభావించి నీ మనసుకు నచ్చిన-నీకు మచ్చికైన అచ్చెర మచ్చెకంటికో- అమర భామకో- మానవ కాంతకో- మరో సుందరికో- తొందరపడి సందడి చేసి ఏలికగా ఎన్నిక చేసి బహుకరించి బహు విమర్శల పాలు కాలేదు. సభాస్తారుల చక్కని అభిప్రాయాన్ని అడిగేవు. అది నీ పాలన లోని అభిరుచిని వ్యక్తీకరిస్తున్నది. అందుకు నీవు బహుదా శతధా అభినందనీయుడవు'
పరమేష్టి వాక్కులు పరిపూర్తి చెందగానే ఓ పూల మాల శచీపతి కంఠ సీమను అలంకరించింది.
చందన జలం చిలకరించబడింది. పరిమళభరిత జలం చిలకరించబడింది.
సృష్టికర్త చమత్కారానికి అంతా మురిసిపోయారు. ఎంతైనా చతురమతి కదా! చతురాననుడు ఒక్క క్షణం నిశ్శబ్దం. అమరేంద్రుడు అభివాదం చేశాడు.
వేదగానశీలుడు మళ్ళీ ప్రారంభించాడు.
'నిజం చెప్పాలంటే ఏ లోటూ లేని స్త్రీని నేను సృష్టించలేదు.'
ఆ మాటలు అందరి గుండెల్లో రాళ్ళలా పడ్డాయి.
'కొరత లేని కాంతని కల్పించలేదు. నలుగురిలో సర్వ శ్రేష్ఠ సర్వాంగ సుందరిని నేను సకల హృదయ రంజని అయిన నారీమణిని సృష్టించనే లేదు. ఏ అందగత్తెని పరిశీలించినా ఎక్కడో కొరత! ఏదో లోపం! ఎందుకో అసంతృప్తి! నాకేనాడూ పరితృప్తి అనిపించనే లేదు!'
బ్రహ్మ ఆగాడు క్షణం సేపు.
'సృష్టించిన సుందరీమణులంతా అందగత్తెలే! సోయగాల సొగసుల నిలయాలే అని మనసారా అనలేను. ఏయే స్త్రీ పూర్వజన్మ ఫలాన్ని బట్టి ఆయా స్త్రీకి అందం, ఐశ్వర్యం లభిస్తుంది. అష్ట లక్ష్ములలో చేరకపోయినా అందం కూడా సంపన్న లక్షణమే! విద్య, వినయం, వివేకం లాగే అందం కూడా! అవి అందరికీ లభించవు కదా! అవన్నీ అటుంచుదాం! ఈ సృష్టి ప్రారంభించడానికి ముందు నా మనస్సులో ఏదో తీయని భావన. మరేదో మధుర కల్పన తోనికిసలాడింది. అలాగే మన్మధుడిని కల్పించడానికి పూర్వం నా మదిలో ఒక వింత భావం! వినూత్న ఊహ మెదిలింది! అదే విధంగా రతీదేవిని సృష్టించడానికి పూర్వం ఈ విద్యాధిదేవత సరస్వతీ సృష్టి సంకల్ప సమయంలో నా మనస్సులో అందమైన ఆలోచనలూ, కొత్త కొత్త భావాలు తారాడాయి.