విశ్వామిత్రుడు గర్వంగా నవ్వాడు.
రంభ ముఖం చిన్నబోయింది.
'కాబట్టి మనలో మనకు ఈ విషమ సమస్య పరిష్కారం కాదు. ఒకరిపై ప్రేమ మొగ్గు చూపినప్పుడు మరొక మాట రాదు! మరొకడు చెప్పినా అది వినరాదు. అందుకని ఈ నారీ లోకాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త బ్రహ్మదేవుడి వద్దకే వెళదాం! పరమేష్టి నిర్ణయమే మనకు శిరోధార్యం. ఇక్కడి అచ్చెరలనూ, దేవతా స్త్రీలనే కాక, నాగ కన్నెలనూ, మానవ కాంతలనూ, మరెందరినో సృష్టించిన, సృష్టిస్తూన్న, సృష్టించబోతున్న ఆ పరమేష్టి మాటే మనకు వేదం!'
'లెస్స పలికావ్!' అన్నాడు విశ్వామిత్రుడు.
'మంచి ఆలోచనే!' అన్నాడు బృహస్పతి.
'అయితే ఇంకెందుకు ఆలోచన! సందడి చేస్తూ పదండి!!' అన్నాడు నారద మహర్షి.
త్రిలోకాధిపతి తన సింహాసనం దిగాడు. స్వర్గలోకం కదిలింది.
4
'దేవీ!' పిలిచాడు సృష్టికర్త.
'పతిదేవా! ఏమి తమ ఆలొచన!'
'ఎన్నడూ లేని మోహం పుట్టుకొచ్చింది. మరేనాడూ లేనిది మనస్సు చలించింది. ఎందుకో మనసునిండా నీ అందమే ఆక్రమించింది'.
'నాలుగు శిరస్సులున్నా, నాలుగు నోళ్ళున్నా, వేనోళ్ళ పొగడగల శక్తి ఉన్నా, నాలుగు నాలుకలున్నా, ఎనిమిది చేతులూ, అలాగే ఎనిమిది కళ్ళూ, ఎనిమిది చెవులున్నా, తమరికి మనస్సు మాత్రం ఒక్కటే...'
వాణి చతుర వాక్కులు అడ్డుకుంటూ అన్నాడు చతురాననుడు 'ఆ ఒక్క మనసూ దేవిగారికే అంకితం!'
కొంటెగా అడిగింది పుస్తక పాణి 'ఏ దేవి గారికి అంకితం?'
నాలుగు మోములూ విప్పారేలా నాలుగు నోళ్ళూ నిండుగా నవ్వాడు. 'ఈ చిత్తజుడి సృష్టికర్త చిత్తమెన్నడూ పరాయత్తం కాదు-కాలేదు. కాదు. కాబోదు నారదమాతా!'
'నారదుడు తమ మానస పుత్రుడు లోకకర్తా!'
'ఆ మనస్సు నీదే కదా సరస్వతీ!'
'ఆ పిలుపు 'సరసవతీ' లాగ ధ్వనించింది.'
'మహద్భాగ్యం!' అందామె.
'అసలు విషయాన్ని అవతలి మార్గం పట్టించడంలో అతివలు మిన్నలు కదా! మాట మార్చినా ఏమార్చినా మనస్సు మరలి పోదులే! ఆ ఏమన్నానూ మనసునిండా అందమే ఆక్రమించింది. అందుకని...
ఒక అపూర్వ సృష్టి చేయాలని ఉంది! ఎన్నడూ సృష్టించని విధంగా సృష్టించాలని ఉంది. ఒక అద్భుత లోకం కల్పించనా?
ఒక అద్భుత వనం నిర్మించనా? ఒక అద్బుత పురుషుడిని సృష్టించనా? ఒక అద్భుత లావణ్యవతికి ప్రాణం పోయానా? ఒక అరుదైన జంతువునో, పక్షినో పర్పంచానికి అందివ్వనా?' కోరుకో అన్నట్లు అడిగాడా? సూచించు అన్న రీతి చెప్పాడా? తెలియలేదు చదువుల తల్లికి.
'పద్మ సంభవా! ఎన్నడూ లేని సందేహం యీనాడు ఎందుకు కలుగుతున్నది. నిముష కాలంలో సకల చరాచరాన్ని సృష్టించగల నేర్పరులే! ఊహ క్రియ ఏక కాలంలో ఫలింప జేసుకోగల చతురులే! మీకు నా సలహా కావాలా? విచిత్రంగా ఉంది నాధా!'
బ్రహ్మ నవ్వేడు మళ్ళీ.
అంతలో అల్లంత దూరాన కలకలం ఎందరో వస్తున్నట్లు గాలి మార్పు.
నేత్ర హస్తుడు బరా బరులు పలికాడు.
'జయహో! భువనైక నిర్మాతా! జయహో! సమస్త దేవతా గణం, ముని గణం, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి వసిష్టుడు, దేవ గురువు బృహస్పతి, దేవర్షి నారదుడు, తమ సన్నిధికి వస్తున్నారు'
అలా విన్నవించి వెనక్కి వెనక్కి నడుచుకు వెళ్ళాడు నేత్ర హస్తుడు.
బ్రహ్మ మెడ తిప్పాడు. వాణి నవ్వింది. వాగ్దేవి నవ్వుకి అర్ధం తెలిసింది బ్రహ్మకి.
అంతలో ఇంద్ర లోకం విడిచి అందరూ బ్రహ్మ సన్నిధికి వచ్చారు.
బ్రహ్మను స్థితించాడు నారదుడు 'దేవరాజా! కట్ట గట్టుకుని అందర్నీ వెంటబెట్టుకుని విచ్చేశావేమిటీ! ఏ రాక్షసుడూ ఈ సమయంలో విజృంభించినట్లు వినలేదే! ఇది అసుర సమయం కాదే! సందిగ్ధ సంధ్య సమయం కాదే! మీ రాక లోని ఆంతర్యం విప్పి చెప్పు!'
'నేను చెబుతాను తండ్రీ!' ముందుకు నడిచి అన్నాడు నారదుడు.
'కలహ కోలాహలమా కుమారా!'
'అలాంటిదే తండ్రీ!'
పితామహుని చూస్తూ చెప్పసాగాడు.
'ఈ సురరాజు సురాపానం చేస్తూ, సుర భామల నాట్యం చూస్తూ, భాసుర వైభవంతో పాలిస్తూ, సుఖ భోగాలలో తేలియాడుతూ కాలం గడపడు! ఉల్లాసంగా ఉన్న ప్రాణానికి ఉరి పెట్టుకుని ఉసురుమంటూ ఉసురు పోగొట్టుకుంటారని భూలోకంలో సంచరిస్తుండగా సామెత లాగ విన్నాను. భూలోకంలో ఆంధ్రులకు సామెతల వాడకం ఆమెత లాంటిదే! ఈ మహర్షి విశ్వామిత్రుడికి సంతతి కదా ఆంధ్ర జాతి! ఆనందం ఆగ్రహం రెండూ పక్కపక్కనే ఉంటాయి.