Previous Page Next Page 
అహల్య పేజి 6


    అందగాళ్ళ కల్లా అందగాడని మన్మధుడిని సృష్టించాను. అతనికి చాటుగా మాటుగా వుండాలని వసంతుడ్ని కల్పించాను. అందంలో సాటి వారిలో మేటిగా ఉండాలని ఇంద్ర కుమారుడికి-జయంతునికి రూపు దిద్దాను.


    అయినా నా మనస్సుకి పరిపూర్ణత కలగలేదు. ఎప్పుడూ- ఇప్పుడు మళ్ళీ ఇన్ని యుగాలు గడిచాక, జగాలు నడిచాక- నా మనసులో ఏదో అపూర్వ భావం తారట్లాడింది. వింత వింత ఊహలు అల్లి బిల్లిగా కదలాడాయి. అదే సమయంలో దేవీ సరస్వతి ఓ వినూత్న రాగాన్ని ఆలపించింది.


    రాగ భావానికి అంకురార్పణ చేసింది.


    ఆ సమయంలో-ఒక అపురూప సృష్టి చేసి సకల ప్రపంచానికీ కానుకగా సమర్పించాలనే ఆలోచన వచ్చింది. మీరా సమయంలో వచ్చారు.


    మీరు కోరుకుంటున్నది-నేను ఆలోచించిందీ ఒకటే అవుతున్నది. కనుక...' బ్రహ్మ ఆగాడు.


                                                                          5


    అది నదీ తీరం.


    తన శిష్యులతో గౌతముడు నివసించే పవిత్ర భూమి. నదికి కొద్దిపాటి దూరంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు గౌతములవారు. శిష్యులకు పాఠాలు చెపుతూ మిగిలిన సమయంలో తపస్సు చేసుకుంటూ, తన తపస్సులో దర్శిస్తున్న సూత్రాలు శిష్యులకు వివరించి పాఠం చెపుతూ న్యాయ శాస్త్రాన్ని నిర్మిస్తున్నాడాయన.


    ఆశ్రమ నిర్వహణకు అవసరమైనవన్నీ ఇక్ష్వాకుల నుంచి అడగబడకుండానే వస్తూంటాయి. కందమూలాలు కావలసినన్ని లభిస్తాయి.


    ఆశ్రమ భూములను దున్ని సశ్యానుకూలం చేసిన శిష్యులు తొలకరి చినుకులు పడగానే భూమి విత్తడానికి అనుకూలం కాగానే రకరకాల కూరగాయలు విత్తుతారు. నివ్వరి ధాన్యాన్ని చల్లుతారు.


    అవి పుష్కలంగా ఫలిస్తాయి. చాలినన్ని స్వీకరించి మిగతావి పొరుగు ఆశ్రమాలకు పంపుతారు. పశు పక్ష్యాధులకు ఫలహారం పెడతారు. గౌతములవారు అప్పుడప్పుడూ విదేహ రాజ్యానికి వెళతారు. ఆ రాజర్షి సన్నిధిలో తను ఏర్పరుస్తున్న గౌతమ న్యాయ సూత్రాలను చర్చిస్తారు. జనక మహారాజు రాజ యోగి. మహర్షులన్నా మహాత్ములన్నా ఆయనకు ఎనలేని గౌరవం.


    గౌతముడి నిర్మల జీవితం ఆయనకి గౌరవ భాజకం ఆయన దర్శించి నిర్మిస్తోన్న న్యాయ సూత్రాలు సర్వ కార్యాలకూ, సర్వ దేశాలకూ, సర్వ జనులకూ శిరోధార్యాలనీ, వాటికి తగిన ప్రాచుర్యం ప్రచారం కల్పిస్తున్నారు.


    ఆనాడు గౌతములవారు శిష్య సమూహాన్ని వెంటబెట్టుకుని నదికి వెళ్ళి పవిత్ర జలాలను తీసుకొచ్చారు. యోగం కల్పించే ఓ ప్రక్రియ పూర్తి చేయడానికి తగిన హోమం నిర్వహిస్తున్నారు. తనే కర్తగా కూర్చుని ఆ హోమం నిర్వహించసాగారు. శిష్యులు గురువుగారి సన్నిధిలో నిలుచుని హోమ ద్రవ్యాలు అందిస్తున్నారు. హోమం చక్కగా సాగుతున్నది.


    గౌతముడి కంఠం నుండి వెలువడుతున్న మంత్రాలు ఆశ్రమ వాతావరణాన్ని మరింత ప్రశాంతం చేస్తున్నాయి.


    ఆ సమయంలోనే...


    అయోధ్యాపూరి నుంచి కోసల రాజ్యం వెళుతూ మార్గ మధ్యం కాకపోయినా దారి మళ్ళించుకుని గౌతముడిని దర్శించి ఆశీర్వదించి వెళ్ళాలని భృగు మహర్షి తన శిష్య సంతతితో ఆశ్రమం చేరుకున్నాడు.


    ఆయన ఆశ్రమ ద్వారం చేరుకోగానే పెంపుడు చిలుకలు స్వాగత మంత్రాలు పఠించాయి.


    'స్వాగతం మహర్షి సత్తమా! స్వాగతం!' అన్నాయి.


    అప్పుడే హోమం పూర్తయింది. పూర్ణాహుతి మిగిలిపోయింది. హోమగుండం వద్ద ఆశీనుడైన గౌతమ మహర్షి క్రతు మర్యాదననుసరించి ఆసనం నుండి లేవకుండా కదిలీ కదలనట్లుగా కదిలి తన ప్రధాన శిష్యులకు హెచ్చరిక చేశారు.


    'శిష్యా! ఎవరో మహర్షులు విచ్చేసినట్టున్నారు. వెళ్ళి స్వాగతం పలికి ఆర్ఘ్య పాద్యాదులు సమర్పించు నాయనా!' అన్నారు.


    శిష్యులు కదిలారు.


    ఆశ్రమ ద్వారానికి పరుగు పరుగున వెళ్ళి భృగు మహర్షికి పూర్ణకుంభ స్వాతం సమర్పించుకున్నారు. ఆర్ఘ్య పాద్యాదులతో ఆశ్రమ మర్యాదలతో వారికి అతిథి సేవ చేశారు. ఆపై 'మహర్షీ! గురువులు హోమ నిర్వహణలో ఉన్నారు. పూర్ణాహుతి చేయాలి. తమరు విచ్చేసి...'


    భృగువు లేచాడు.


    యజ్ఞ వాటిక నివాస కుటీరానికి అల్లంత దూరాన ఉన్నది. అక్కడికి చేరగానే మహర్షులు పరస్పరం కనుసన్నలతోనే గౌరవించుకున్నారు. గురువులయినా, పెద్దలయినా, దేశాన్నేలే రాజాధి రాజయినా, యజ్ఞ వేదిక సమీపంలోనూ, ఆలయంలో దైవసన్నిధిలోనూ తారసిల్లితే నమస్కరించవలసిన ధర్మం నిర్వర్తించనక్కరలేదు. వారికి నమస్కరిస్తే ఆలయంలోని దైవాన్ని, యాగ వేళలో ఆహ్వానింపబడిన దైవాల్ని అవమానించినట్టే. అందువల్లనే ఆలయంలోనూ యజ్ఞ వేదిక వద్దనూ పరస్పర గౌరవాలు కనుసన్న మాత్రాలే!


    భృగు మహర్షిని ప్రార్ధించారు గౌతముడు.


    'అనుకోని రీతిగా తమరు విచ్చేయడం మా అదృష్టం! యగావసాన సమయంలో భృగు మహర్షుల రాక మా ఆశయ ఫలానికి సూచనగా భావిస్తున్నాము. తమ ఆధ్వర్యంలో ఈ యాగ పరిసమాప్తి కావాలని మా అభ్యర్ధన. పూర్ణాహుతికి ఆదేశించి ప్రారంభించండి!'

 Previous Page Next Page