మామా! చలివెన్నెల్లో భామ
అమృతము కూడకట్టిన దొర! ఎంత గొప్ప సంబోధన! ఎంత గాఢమైన భావం! ఎంత లోతైన అర్ధం! పిలుపులోనే గొప్పధనమంతా మూటగట్టింది! వే వెలుంగుల సైదోడురే వెలుంగు! అందచందాల మామ చందమామ! ఆ చందమామకు మనసారా చెప్పుకొనే మనోవేదన.
ఏమిటా వేదన!
రమణి ఒకింత కోపన పరాజ్మభి అయింది. అలిగి అటు తిరిగి పండుకొని ఒకే మంచంలో- మంచంమీద కాదు కంగులు తీరు ధోవతి గాలికి కాలికి తాకనీకుండా మంచంపట్టె ఆనుకొని పార్శ్వం అంతా కుదించుకొని వియోగంతో నిట్టూర్పులు కూడా వినిపించకుండా కుదించి పట్టుకునే - సొక్కే-ప్రియురాలు-భార్యకు-భర్తకు మధ్య రాయబారం నడిపేందుకు నింగి నేలల మబ్బుల మధ్య-గాలికి కదులుతూ కాలాన్ని కదిలించే శశినిదూతపు కమ్మని ప్రియుడైన భర్త వేడుకునే విన్నపం శశిదూతం.
అలిగిన భార్యను ప్రసన్నం చేసుకోవాలని ఎన్ని విధాల ప్రయత్నించినా ఎన్నెన్ని మాటలు చెప్పుకొన్నా వినకపోతే ఇక లాభంలేదని అటుతిరిగి పడుకున్న ఆమె జబ్బ పట్టుకొని ఇటుతిప్పి లేత చెక్కిలిమీద పెనముద్దు పెట్టి గిలిగింతలు పెడ్తే వెక్కివెక్కి ఏడ్చే ముద్దరాలికీ తనకీ సంధిచేయమని నిశాపతిని వేడుకొనే రమణీయ కమనీయ భావనా లహరి శశిదూతం.
నిజానికి రాయబారులు పూర్వం ఎవరెవరు? ఒక నిషధేశ్వరేంద్రుడికి ఒక మరాశమతల్లి-హంస-మరి ఒక రఘువంశ దేవుడికి-రాముడికి-ఒక ప్లవంగమ వీరుడు-హనుమ మరి ఒక శాపగ్రస్తుడైన యక్షకుడి ఒక పయోధర సాధువు మేఘుడు-వీళ్ళ వల్ల వాళ్ళకు సుఖములు కలిగాయి-కాబట్టి నీవల్ల నేను సుఖమందగ కోరుకుంటున్నాను.
అయితే వాళ్ళు భారం వహించిన ఆ రాయబారాల్లో ఎంతో కష్టం ఉంది. ఎంతో క్లిష్టత ఉంది! ఎలా అంటే దమయంతికి నలుడుమీద ప్రేమ బీజాలు నాటడం అంత సులువుకాదు. కష్టం. అలాగే ఎక్కడ సీత ఉందో వెతుక్కుంటూ పోవడం హనుమకు సులభం కాదు! క్లిష్టం. ఏ కొండమీద ఉందో- ఏ పర్వత సామవుల నీడల్లా ఉందో, యక్షుడి సతి-ఆమెకై కొండ కొండని కొండ గుర్తుగా చేసుకొని వెళ్లడం అంత తేలిక్కాదు-మరి ఇక్కడ? ఈ రాయబారంలో ఆ కష్టం క్లిష్టత ఏవీలేవు. ఎందుకంటే ఇక్కడ రాయబారం తీసికెళ్ళేది కులపత్ని-సుందరికి అదీ సంగతి!
లోకంలో ఎందరో ఎన్నో ఉండగా ఈ చంద్రుడ్నే రాయబారిగా ఎన్నుకోవడానికి కారణం ఏమిటి. ముగుదలు, పూలు, చందురుడు ఒక మోస్తరు కోమల జీవులట అంతేకాక వీళ్ళంతా పూలకుటుంబం వాళ్లట! ఒకరంటే ఒకరికి పూలంటే స్త్రీలకు-స్త్రీలంటే పూలకు, చంద్రుడికి ఎంతో స్నేహమట. మీరు మీరూ ఒకటి కాబట్టి ఈ రాయబారం చేసిపెట్టు అని అడుగుతున్నాడు. చంద్రోదయం ఎంత మనోహరంగా ఉంటుందట! కుంకుమాంకితయై వలిపంపు రైకనుండి బయట పడిన తూర్పు కన్నెరొమ్ములాగా తూర్పుకొండకొన కొమ్మున ఉదయిస్తాడట చంద్రుడు!
మరి ఆ చంద్రుడికి ఓ మచ్చ ఉంది. నిజానికి క్షీరసాగర మధన సమయంలో గిరి కవ్వము దూసుకుపోగా ఏర్పడ్డ మచ్చట! లోకమంతా మచ్చ లేని చందమామకి మచ్చ కల్పించారట. నిజానికి విష్ణువు రొమ్మున ఉన్న మచ్చ అరవిందం అంటారు. భోగలక్షణంగా చెప్పుకుంటారు. అలాగే చంద్రుడ్నీ పొగడొచ్చుగా! ఉహూ! అది కళంకమట! ఎందుకయిందట? ఇచ్చకాలు చెప్పే పధ్ధతి అలాగే వుంటుందట మరి!
ఓ కలువరాయా! నువ్వు మాకు ప్రసన్నం కావయ్యా! నీ వెన్నెల ఎలాటిది? వెన్నెల అనే దారాలతో వెండిపటం అల్లుతావు. దాని మధ్య గూడు కట్టుకుంటావు. సాలీడు గూడు అల్లినట్లుగా అల్లి కూర్చిన నీ పెనుదారాల చిక్కుల్లో-నీ పున్నమ దీప్తిలో-చీకటి అనే పురువులను పట్టి పలారుస్తూ లోకమంతా వెన్నెల నింపుతావు. అదిగో ఆ వెన్నెల చలువలై మరి మాకు ప్రసన్నం కావాలి ప్రభూ!
ఓ చంద్రా నీకు ధన్యవాదాలయ్యా బాబూ! ఈ లోకంలో ఒక మనిషి ఇంకొక మానవుడిని అడగడం చచ్చిన చావుకదా! ఒక వేళ నోరు తెరిచి అడిగినా కూడా ఒకడు ముఖం తిప్పుకుని వెళతాడు. మరొకడు ముఖం మటమట లాడిస్తాడు. కొందరు చిరాకు పడ్తారు. ఎవడో ఒకడు నోట లేదనేది చేతుల్తో లేదంటాడు. కానీ నీవు చేసే ఈ ఉపకారం శిబిదధీచి మొదలయిన దాతల్ని తలపిస్తోంది.
ఏం చేశానంటావా?
నా చెలి - గుండెల్లో పొంగే కోరికతో తానై చేరింది. నా కంఠం చుట్టూ తన మృదు హస్తాలను మాలగా వేసి పరవశత్వం పొందింది. అంతేనా నా గుండెల మీద వాలిపోయింది. అంతేనా నన్ను క్షమించమని నా గడ్డం పట్టుకొని బతిమాలుతోంది. ఇదంతా నీ దయ కాదా!
అయినా నిను కుంటెన కాడిని చేశానని బాధపడకు
వేడుకుంటే కోరిక తీర్చే దాతలు ఎవరున్నారు?
మరి నీవో?
ఉత్తముల్లో ఉత్తముడిని.
ఎలా అంటావా?
ఇత్తునటించు తా అధముదీయడు. రేపులు తిప్పి తిప్పి - తాయిత్తు అటంచు మధ్యముడు ఇచ్చును. తప్పక రేపోమాపో - తాయిత్తు అటంచు నోట అనడు - ఇచ్చును వందలు వేలు లక్షలై ఉత్తముడు. అట్టి ఉత్తముల ఉత్తముడౌదువు నీవు చంద్రమా!
చందమామా ఈ దయచాలు ఉహు ఎవ్వడయినా ఎప్పుడైనా ఎన్నడైనా భార్యా విరహంతో బాధ పడ్తుంటే వాళ్ళని ఆదుకో - చలి వెన్నెల సోన జల్లుతో ఆదుకొని వాళ్ళీద్దర్నీ ఒకటి చెయ్!
వెన్నెలకన్నా చల్లగా వెన్నకన్నా మృదువుగా ద్రాక్షాపాకంలో సాగిన కమనీయ రచన విశ్వనాధ సత్యనారాయణగారి శశిదూతము. గుండెలనిండా ప్రేమ ఉన్న ప్రతి భావికుడు చదివి తీరాల్సిన రమణీయ రచన శశిదూతము.
---*---