అల్లంత దూరాన
దీపాల కళ్ళ మనిషి
పర్ణశాలకు అల్లంత దూరంలో లేమావి తోటలో ఎలమావి గున్నకు నీళ్ళుపోస్తూ చూస్తోంది తార! పదారు వన్నెల బంగారు ఛాయతో మిసమిస లాడ్తున్నాడు ఆ కుర్రాడు. బృహస్పతిముందు చేతులొగ్గి ఏదో చెప్తున్నాడు. కాని తార మనసంతా ఆ కుర్రాడి సోయగం మీదే ఉంది.
"నా అంత వాడిని చేస్తా చంద్రా!" అంటున్న భర్త మాటలు విందామె. ఒహో! తారా మనోహరుడా! అనుకుంది. చక్కని చోటికి వచ్చి చిక్కాల్సిన చోట చేతికే చిక్కుతున్నావులే! గురువుగారు అష్టాదశ విద్యలు నేర్పుతాడు.... నేను...." అనుకుంది తార. చంద్రుడు విద్యాభ్యాసం ప్రారంభించాడు. ఏళ్ళు గడిచాయి. మొక్కను ప్రేమతో పెంచి ఫలం ఆశించే విధంగా చంద్రుడ్ని పెంచింది తార.
యౌవనం వచ్చింది ఎండిపోయిన చెట్టుపై వసంతుడు దాడి చేస్తే నిలువెల్లా పూచినట్లు యౌవనావిర్భావంతో నిలువెల్ల అందమే నిండిపోయింది. తార గుండెలనిండా కోరికలు నిండాయి. అతన్ని చూస్తే కులుకుచూపుల చూడని మీనాక్షి లేదు. అతని పెదవులు చూసి అనురక్తి చెందని బింబాధరా కానరాదు. అతను భాషిస్తే పలుకరించని చిలుకలకొలికి లేదు. అతని ముఖం చూసి తమిచెంది, కందని కమలముఖి లేదు. నిలువెల్లా చూసి అతన్నల్లుకుపోవాలని ఆశపడని లతాంగి ఉండదు. ఏ ప్రమద చూసినా పారవశ్యం చెందాల్సిందే! ఏ హేమాంగి చూసినా మరుని కాకకులోను కావాలి! అబలలు చెంతచేరి దయ చూడమంటున్నారు! గజ గమనలు కేలెత్తి మొక్కుతున్నారు. అతని రూప యౌవన విలాస విభ్రమాలు చూసి తత్తర చెందని తరుణులే లేరంటే అది స్వభావోక్తి!
ఇంట్లో ప్రతిక్షణం తిరుగాడ్తూ తన నగ్న వక్షాన్ని విశాల బాహువుల్ని ప్రత్యక్ష పరుస్తోన్న చంద్రుడ్ని చూసిన తార-తాళలేకపోయింది. ఎలాగైనా ఇతడ్ని లొంగదీసుకోవాలి అనుకొంది. న్యాయం కాదేమో అనుకొని న్యాయాన్యాయాలు విచారిస్తే నిలువగలనా అని సరిపెట్టుకుంది.
మెలమెల్లగా అతని సమీపంలో తిరుగాడ సాగింది. బృహస్పతి లేని సమయంతో చెంతచేరి రెప్పవేయకుండా చూస్తోంది. అతని దగ్గరగా వెళ్ళి ఓర పయట జారేట్లుచేసి చెంతచేరి భుజానికి తన మనోభూరుహాల్ని సోకిస్తోంది.
అల్లప్పుడు-బాపడా! చిన్ని కుమారా! రారా! బాబూ! అని పిలిచేది. ఇప్పుడో ఓ సామి! ఓ కాయజ మోహనాకార! వగకాడ! జాణా! అని నర్మోక్తులతో పిలుస్తోంది.
అమాయకం నటిస్తున్న చంద్రుడ్ని ఏకాంతానికి పిల్చి జిలుగుచీర విడిచి చెంగావిచీర కట్టుకుని ఏ చీరలో బావున్నాను అని అడుగుతోంది. జడ వదిలి కొప్పుకట్టి ఎలా వుంది అని అడుగుతోంది. అతన్ని దగ్గరికి పిలిచి ఒళ్ళు రాచుకునేలా నిలబడి నువ్వెత్తా నేనెత్తా అని ప్రశ్నిస్తుంది. ఎవరయినా చూస్తున్నారేమో అనే సిగ్గు కూడా ఉండదు.
చంద్రా! చంద్రా! ఇలారా! అద్దం లేదు! ఈ తిలకం ముఖాన దిద్దిపో అని పిలుస్తుంది. బుద్ధిగా వచ్చి తిలకం అతడు దిద్దితే పెదాలు కుదురుచేసి మద్దిడుకో అన్నట్లు సమీపిస్తుంది. అతడు అమాయకుడిలా మౌనం వహిస్తే రుసరుసలాడుతుంది.
ఇక ఇదికాదని యిలారా! నీ తలకట్టు చిక్కుతీసి నున్నగా దువ్వుతా అని అతన్ని రప్పించుకుని తాను పీటమీద కూర్చుని అతని తలను తన గుండెలకు హత్తుకుంటూ చిక్కుతీస్తుంది! మాటామాటా కలిపి తటాలున బుగ్గ గిల్లుతుంది. అయినా అతడు రమ్మనడంలేదు కిమ్మనడం లేదు.
ఓరోజు ఆదమరచి నిద్రిస్తుంటే తమకం ఆపుకోలేక ఆ లేతబుగ్గలు ముద్దుపెట్టుకుంది. చంద్రుడు నిద్రలేచి లేవగానే అద్దంలో ఆ ముద్దు గుర్తులు చూపించి వెళ్ళొచ్చావు? ఎవరిలా ముద్దాడారు? చెప్పు? గుట్టుగా చదువుకొమ్మని మీవాళ్ళు పంపితే ఇలా రాయడిలా రట్టు చేస్తున్నావా అని నిలదీసింది. పాపం నోరెత్తలేదు చంద్రుడు!
అలా అలా తార మితిమీరి రెచ్చగొడితే చంద్రుడిలో తొందర మొదలైంది. ఆలోచన అనంత శాస్త్రాలు వదిలి అనంగశాస్త్రం చుట్టూ తిరగసాగింది. ఆమె మోమును మోవిని హొయలను చూపును మెచ్చుకోసాగాడు. లోకంలో ఎందరిని చూడలేదు! చందమామ ముఖంతో ఎందరున్నా ఈ అందచందాలు ఎవరికున్నాయి! నాలోనేమో కోరికలు ఎక్కుటమై పోతున్నాయి! ఇదేమో అందరాని ఫలమైంది! ఏం చెప్పవలె! అని మన్మధ వేదనకు లోనవుతున్నాడు. ఏ వేదాలు ఏ శాస్త్రాలు ఏ వాదాలు ఏ వివేకం ఎలా నిలుస్తుంది అనుకుంటున్నాడు. శాస్త్రాలు శాస్త్రాలు అంటారే కానీ పొలయలుకలు ఈ పొలతుకతో తర్కించడం తర్కశాస్త్రం కాదా? అనంగ రంగకేళిలో ఈవిడతో కలిసి కళాస్వరాలు పలకడం స్వరశాస్త్రం కాదా! ఈమె మోమున మోము చేర్చడం యోగశాస్త్రం కాదా! ఈమె రతిక్రీడా గుణాలను లెక్కించడం సాంఖ్యశాస్త్రం కాదనగలరా! ఆవిడ నీవి వదిలించడం మోక్షశాస్త్రం అనలేమా! అంతేనా ద్వైతం అద్వైతం మా కలయికలో తేటతెల్లం కాదా! అని వింతవాదన చేస్తున్నాడు అంతరంలో.
ఆమె చెక్కిలిమీద నొక్కులుంచడం గురుప్రతిష్ట సలపడంలా భావిస్తున్నాడు.
ఎన్ని విధాలా ఆలోచించినా కోరిక తీరే తరుణం రావడంలేదు. తార రకరకాలుగా రెచ్చగొడుతోందే తప్ప దరిచేరి చేర్చుకుని విరహం దరిచేరేలా చేయడంలేదు. నిద్రించే కోరికలు రెచ్చగొట్టి వొళ్ళు సలసల కాగేలా చేస్తుంది తప్ప సరస శృంగార సీమకు స్వాగతం పలకడంలేదు.
ఎలా? ఎలా? ఎలా?
చంద్రుని కోరికలు పండే తరుణం వచ్చిందా అన్నట్లు బృహస్పతికి పిలుపువచ్చింది. యజ్ఞం చేయించడానికి అమరావతికి వెడుతూ రకరకాల నీతి బోధ చేసి చంద్రుని ప్రేమగా చూసుకొమ్మని చెప్పివెళ్ళాడు.
ఇంక తార కోరికల తెర తొలగింది ఆపై.... ....
---*---
వయసుకు కాపలా!
ఓ మహానుభావా! నేను మహేంద్రుడి దూతను ఆయన యజ్ఞం చేయ సంకల్పించాడు. మిమ్మల్ని గౌరవ పురస్కారంగా తోడ్కొని రమ్మని నను పంపినాడు అని దూత బృహస్పతి వద్దకు వచ్చి చెప్పగానే బృహస్పతికి మొగమింతై అలాగా! సురేంద్రుడు జన్నము సేయాలని నన్ను రమ్మన్నాడా! అలాగే కానీలే వస్తానని పాకలోనికి వెళ్లారు.
అక్కడ---
అలిగిన సత్యభామలా, కలగిన రతీదేవిలా వుంది తార. ఆమె భర్త సురలోకం వెళ్లడం మనస్సులో సంతోషం కల్గించినా పైపైకి మాత్రం ఎంతో బాధ ప్రకటిస్తోంది. భర్తను చూడగానే మూతి సున్నాలా చేసింది. ముఖం ముడిచింది.
అయినా - బృహస్పతి అదేం గమనించనట్టు ఓ గజేంద్ర గామినీ! ఇంద్రుడు యాగం చేయాలి ఆలిని విడిచిరావయ్యా అని కబురు పంపాడు. నువ్వు నా వియోగం ఎలా సహిస్తావో! మూడు లోకాల యేలిక రారమ్మని కబురు చేస్తే ఎలా తిరస్కరించడం! పైగా రమ్మన్నది యాగం చేయించడానికి! క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగి రమ్మని పంపించు! నువ్వు మనస్సులో బాధ తొలిగించుకో - ఇల్లూ వాకిలీ భద్రంగా చూసుకో! ఓ మదమత్తేభేంద్ర కుంభస్తనీ! నేను వూరు విడిచి వెళ్ళినపుడు నువ్వు చరించాల్సిన, ఆచరించాల్సిన విధానాలు కొన్ని ఉన్నాయి! చెబుతా విను!
నువ్వు నున్నగా తలకట్టు దువ్వి జడలు వేసుకోరాదు. అలా వొంటి జడ వేసుకోవాలి! రకరకాలయిన సరస్నానాలు తినకూడదుసుమా! ఉప్పు కారం తింటే ముప్పు కదా! గంధం పూసుకోరాదు ముఖాన తిలకం తీర్చిదిద్దుకోరాదు రకరకాల ఆభరణాలు ధరించకూడదు. అన్నట్టు తల నిండ పూదండ తురుముకోకూడదు.... అవన్నీ నీకే విధించడం లేదు భర్త వూళ్లో లేనపుడు ఏ సాధ్వి అయినా ఇలాగే ఉండాలి.
నువ్వు నన్నే తలచుకోవాలి! చెప్పకున్నా చెప్పినా నీ మనస్సులో నేనే వుంటాలే!
అదిగో ఏంటా కోపం!
అన్నట్టు ఇంకో మాట! మా ప్రియ శిష్యుడు చంద్రుడున్నాడే! వాడు అన్నిటా బుద్ధిమంతుడు! నీ మనస్సు తెలుసుకుని తగినట్లు యింట్లో మెలుగుతాడు. నువ్వు ఏ అరమరిక రేకుండా కావలసిన పనులు చెప్పి చేయించుకో!
వాడు వయస్సులో బాలుడే! అయితేనేం పరిపక్వమైన తెలివిలో చాలా పెద్దవాడు! గృహకృత్యాల్లో నన్ను మరిపిస్తాడు! అయితే ఎండ కన్నెరుగని సుకుమారుడు సుమా చంద్రుడు!
వాడు ఇంటిని కని పెట్టుకుని వుంటాడు అడగలేని ఆ అర్భకుడికి వేళ చూసి వడ్డించు! అతన్ని ఎంతయినా ప్రేమగా చూడాలి సుమా అన్నాడు.
తార కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
నిజంగా! నిజంగా పయనమా! నవ్వులాటకు అంటున్నారా నాధా! నామీద కోపమా! నన్ను వొంటరిగా విడిచి పెడతారా! తారానాధులు తమరికి ఏ రీతిగా మనసొప్పింది, మిమ్ము విడిచి ఎలా వుండటం?
ఎందుకండి వెళ్లడం అందామ యజ్ఞ భంగం చేసిన దోషం! కన్నీరు నింపితే అమంగళం! వెళ్ళిరండి అనడానికి నోరు రావడం లేదు. నన్నూ మీతో తీసుకుని వెళ్ళండి అంటే అదెంత భారమో!
అయినా! మిమ్మల్ని అనేం లెండి!
కొన్నాళ్ళు తీర్ధాల వెంబడి తిరిగారు. కొన్నాళ్ళు యజ్ఞ దీక్ష అన్నారు. కొన్నాళ్ళు వొక్క పొద్దులు! మరికొన్నాళ్ళు తపస్సు, కొన్నాళ్ళు పాఠ ప్రవచనాల జోరు - అది తగ్గితే నేడమవాస - నేడు పున్నమి - కొన్నాళ్ళు ఇవి ఋతు దినాలు అని మరికొన్ని రోజులు - కొన్నాళ్ళు అలసట -
ఇలా నా యెల ప్రాయమంతా పోయింది! ఏ నాడూ ఒక్క మధురమైన కౌగిలి కానీ ఒక్క తియ్యని మాట, ముద్దు కానీ ఎరగను. చివరకు యిప్పుడు ప్రయాణ వియోగం.
అయినా యజ్ఞం యజ్ఞమంటారు కదా! జఘనమనే వేదిక వుంది. జగి సిబ్బెపు గుబ్బల కళాశాలలున్నాయి. అధర సుధారస సోమరస ముంది! తాగియ్యొచ్చు! గళరవ మంత్రాలతో చెలరేగే ఆ మన్మధ శతృవు కంటే వేరే పున్నెముందా, జన్మముందా ప్రభూ!
దేవా నాకు మాటలు రావు! మీరు నిర్ధయగా నన్నొంటరిని చేసి వెళతానంటే నేను తాళలేను - ఎలాగైనా పయనమై మీతో వస్తా -
అని బుడి బుడి ఏడ్పులు ఏడ్చింది -
లోపలేమో పోరా పో ముసలోడా - నువ్వు చెప్పినట్టే నీకంటే బాగా గృహ కృత్యాలు నెరవేర్చే నా అందాల చందమామ వున్నాడు. మామ కోరికలు తీరుస్తాడులే అని ఉబలాటం - పైనేమో దెప్పులు - ఏడ్పులు.
అది చూసి కన్నీరు తుడిచి - భలే! అలా మాటాడితే ఎలా? ఇక్కడివన్నీ ఎవరు చూస్తారు! అయినా స్వర్గం అంటే - నట విట వారవధూటీ సమేతం. అక్కడికి అయినింటి ఆడపడుచులు ఎవరూ రారు!
వద్దు నా మాటకు అడ్డు చెప్పవద్దు....
'అలాగే లెండి, పోయిరండి! మీ మాటలకు ఎదురు చెప్పగల దాననా! ఇక్కడి దిగులు పెట్టుకోకుండా అక్కడ యాగం అవుతూనే నిమిషం కూడా ఆగక రండి!
మీ అత్రి కుమారుని ఆత్మకు మారునిలా చూసుకుంటాను. ప్రాణప్రదంగా గౌరవిస్తా! మీకు ప్రియుడైతే నాకూ ప్రియుడు కాడా!
ఇక్కడి సంగతులు మరిచి వెళ్ళిరండి! అంటూ అటు రధ మెక్కించి ఇటు..., పెచ్చు రేగింది... ఎలా?
----*----