అగ్ర - హారాల అందాలు
"వహ్హా! వహ్హా! ఏమి సారశెంబు"
సుమారు అరవై డెబ్బై ఏళ్ళ క్రితం పండిత సమావేశాల్లో చాలా ఎక్కవగా వినిపించే ఈ మాటాల వెనుక ఓ పెద్ద కధవుంది. మరో గొప్ప నాటకం కూడా ఉంది! ఎవరైనా పండిత్మన్యుడు పరిచయా భిజ్ఞతను ప్రకటింప చూసినపుడు వరసైనవారో, అయినవారో, కానివారో హేళనగా అనే ఈ మాటలు ఆనాడు ఆంధ్రదేశంలో సామెతగా ఆమెతవాగా చెలామణి అయ్యాయి!
ఇవి ఒక సంస్కృత కావ్యంలోనివికావు. రామాయణంలాటి ఐతిహాసిక కావ్యంలోనివికావు. పండితజన రంజకాలైన ప్రబంధాల్లోవి కావు.
ఒక తెలుగు నాటకంలోనివి!
ఒక తెలుగు నాటకకర్త హృదయంలోంచి పుట్టుకొచ్చినవి!
ఒక తెలుగు వాడి వేడి తెలిపేవి.
అవి ప్రతాపరుద్రీయ నాటకంలోనివి!
ఆ నాటక రచయత కళాప్రపూర్ణ వేదం వేంకట రాయశాస్త్రి గారి వాదం వేదం! శాస్త్రిగారి పదం వేదం! శాస్త్రిగారి పదం వేదం! శాస్త్రిగారి మాట వేదం! అలా పేరు ప్రఖ్యాతి సంపాదించిన వ్యాఖ్యాత పండితోత్తముడు నాటక రచయిత నభూతో నభవిష్యతి
యుక్తికి యుగంధరుడు వైయుక్తికి యౌగంధ రాయణుడు, కుయుక్తికి చాణక్యుడు - ఈ మంత్రిత్రయం మూర్తి త్రయమే! ఆపదల్లో ఆర్తత్రాణ పరాయణుడిలా, సాక్షాత్ పరమేశ్వరుడిలా సృష్టిలో అపరబ్రహ్మల్లా వ్యవహరించిన మంత్రులు మళ్ళీలేరు! రారు రాబోరు అలాంటి యుగంధర యుక్తివైచిత్యమే ప్రతాపరుద్రీయము.
ఈ నాటక కధ చారిత్రాత్మక కల్పిత గాధ పాత్రలన్నీ సజీవాలు! చారిత్రకాలు! ఢిల్లీ సుల్తాన్, ఓరుగల్లు ప్రభువు, మంత్రి, పండితులు అందరూ ఆనాడే కాదు నేడూ జీవించివున్న సజీవ మూర్తులు. కుచ్చితాలకు అలవాలమైన ఆలంపనా - కుయుక్తులకు ఎత్తుకు పై ఎత్తులకు ఆలంబమైన మంత్రీ కావ్య లోకంలో ఆ చంద్ర తారార్కం నిలిచే ప్రతాపరుద్ర యశో భూషణ కర్తా - ఈ ముప్పేటల మధ్య ముడిపడిన కల్పనా నల్ప శిల్ప భూమి ప్రతాపరుద్రీయము.
వీళ్ళందరితో తలతూగే కల్పిత వ్యక్తి పెరిగాడు. ఆ సృష్టికర్త విచిత్రంగా కొన్ని పోలికలతో ప్రతాప రుద్ర చక్రవర్తిని పోలేలా పేరిగాడ్ని సృష్టిస్తే -- ఆ పోలికలతో సాటిలేని మేటి నాటకం ఆడించిన ఘనత యుగంధర మంత్రిది.
ఢిల్లీ సుల్తాన్ పట్టుక పోతాన్
మూడే నెల్లెకూ పట్టుక పోతాన్
నీరణ్ని రాగణ్ని మన్ను చేయిస్తాన్
గోతిలో పాలించి గోరి కట్టిస్తాన్
ఇవి వెర్రి మొర్రి కేకలు! ఢిల్లీ పట్టణంలో రేయింబవళ్ళు మార్మోగిన వెర్రి వాడి కేకలు.
అలా ఎందుకు కేకేశాడయ్య అంటే
వలీఖాన్ ఢిల్లీ సుల్తాన్ సర్వ సేనాపతి మైత్రి నటిస్తూ సర్వ సేవలతో విచ్చేసి రాయబారం నడుపుతున్నట్టే నటిస్తూ త్రిలింగ రాజ్యాధినేత అయిన ఓరుగల్లు ప్రభువు ప్రతాపరుద్ర మహారాజు కోసం వచ్చాడు. రాజునగరంలో లేడు. మంత్రి యుగంధరుడూ లేడు. ఆయన తమ్ముడు జనార్ధన మంత్రి మాత్రమే ఉన్నారు.
రాజు వేటకు వెళ్ళాడని తెలుసుకున్న వలీఖాన్ ఇక్కడ సహాయం అర్ధించే నాటకం ఆడ్తూనే అటు అడవికి వెళ్ళి రాజును బంధించి ఢిల్లీకి పట్టుకపోతాడు.
విద్యానాధుడనే కవి ఓడలో వెళ్తున్న రాజును చూస్తాడు. కూతురి పెళ్ళి కోసం రాజదర్శనానికి వెళ్ళి కృతి కన్యను దత్తం చేయాలనుకుంటున్న ఆ కవి రాజ ముద్రిక పొంది రాజకీయ నాటక రంగంలో పాత్ర అవుతాడు.
ఓరుగల్లు చేరిన మంత్రికి కధ యావత్తూ తెలుస్తుంది. రాజముద్రిక ఒక పాచికగా చేసుకొని - రాజుగారి పోలికలతో వున్న పేరిగాడ్ని రాజవేషం వేసి సభలో కూర్చో బెట్టి ఢిల్లీ సుల్తాన్ పట్టుక పోయింది. రాజు పోలికలతో వున్న పేరిగాడిని అనే వదంతి పుట్టిస్తాడు. ఇదే నాటకానికి ఆయువు పట్టు.
ఆపై యుగంధర్ ఢిల్లీ వెళ్తాడు. ఇక్కడ మంత్రులు పేరిగాడితో వినోద విద్యాగోష్టులు నిర్వహిస్తూ వుంటే అక్కడ ఢిల్లీలో పాదుషా కళ్ళు గప్పుతూ నాటకం ఆడ్తూ వుంటాడు యుగంధర్.
అదిగో--- ఆతొలి మాటలు ఓరుగల్లులోనివయిలే మలిమాటలు ఢిల్లీలోనివి---
రాజకీయం నెరపి రాజ తంత్రం నడిపి ఢిల్లీ సుల్తాన్ పట్టుక పోతాన్. ఇదుగో ఇప్పుడే పట్టుక పోతాన్ అని ఢిల్లీపాదుషాతో సహా ప్రతాపరుద్రుడ్నీ ఓరుగంటికి తెచ్చి ఇద్దరి మధ్య స్నేహ ఒప్పందాలు ఏర్పరచి రాజ్యాన్ని సురక్షితం చేస్తాడు యుగంధరుడు!
ఇక నాటకంలోని పేరిగాని వాక్కులు హాస్యానికి పేరిమి కూరిమి మంత్రాలే! నాట్యకత్తెతో సంభాషణ, కవిగారితో మాటల భేటి భలే పసందుగా వుంటాయి "ఆటగత్తె" అనే మాటకు "ఆటకత్తేంటి?" కత్తి ఆడుద్దా?" అని అడుగుతాడు.
ఆశువుగా కవిగారు---
"సలవ మడతలకి మతెనే ఎలిబూడిద సౌడు సున్నమొల్లల మలెనే
కలునీలమలె మడేల యెలిగే నీ యసమునేల కెలకో కవురా!
అనితనని పొగిడితే "అచ్చరనచ్చలు" ఇమ్మంటాడు
అన్నీ ముగిశాక కొలువుతీరిన రాజసభకు విద్యానాధుడు వస్తాడు.
"నవలక్ష ధనుర్ధరాధినాథే
పృధివీం శాసతి వీరరుద్ర దేవే
అభవత్ప రమగ్రహార పీడా---
అని ఆర్దోక్తితో ఆగుతాడు. రాజుకు ఆశ్చర్యం! ఆగ్రహం! తొమ్మిది లక్షలు విలుకాండ్రున్న రాజు తాను ఆ ప్రతాపరుద్రదేవుడు పాలిస్తూ వుంటే అగ్రహారాలకు బాధ కలిగిందంటే అది ఆశ్చర్యం కాదా! అగ్రహకారణం కాదా? దానికి ముక్తాయింపు--- మరీ ఇంపుగా చెప్పాడు.
"కుచ కుంభేషు కురంగలోచనా"
దాంతో అంతా మారిపోయింది. అగ్రహారపీడ నిజమే! కానీ అవి అగ్రహారాలనే వూళ్ళక్కాదు---
అగ్రహారాలు--- కురంగలోచనలయిన స్త్రీల కుచ కుంభాలపై మెరిసే అగ్రహారాలు---
భళి భళి మహాకవి అని ప్రశంస పొందాడు కవి.
ప్రతాపరుద్రీయం ఆద్యంతం చదవాలేకానీ మనమూ బళీ బళీ మహాకవి అంటాం! అక్షర లక్షలు ఇవ్వగలిగిన కవిత్వ కల్పన చదువుతాం.
---*---