Previous Page Next Page 
చెక్ పేజి 4


    "నీ ఇష్టం" అంది.

 

    "అయితే హారర్ కథ చెబుతాను" నా బంటు తన బంటును తినేసి ముందుకు దూసుకెళ్ళింది.

 

    "ఓకే."

 

    "మరి నువ్వు భయపడతావేమో!" ఉడికించడానికి అన్నాను.

 

    "నేనేమీ భయపడను."

 

    "ఒకవేళ భయపడి ఒంటరిగా పడుకోలేక నా గదిలోకొస్తే..."

 

    "వస్తే ఏం? శుభ్రంగా పడుకుని నిద్రపోతాను."

 

    "అలా నాకు కుదరదే? పక్క పోర్షన్ లో నిన్ను పెట్టుకునే ఎలా నిద్రపోవాలిరా భగవంతుడా అనుకుంటున్నాను నేను. అలాంటప్పుడు సరాసరి నా గదిలోకి వస్తే నిద్రపోగలనా? నా శీలం మంట గలిసిపోదూ" నర్మగర్భంగా మాట్లాడాను.

 

    అది అర్థంకానంత అమాయకురాలేం కాదు కీర్తి.

 

    "నేనేమీ భయపడి నీ పోర్షన్ లోకి రానులే" బుంగమూతి పెట్టి అంది కీర్తి.

 

    "ఒకవేళ వస్తే?" నిలదీశాను.

 

    "అలాంటి పరిస్థితే వస్తే నీ ఇష్టం" సీరియస్ గా అంది.

 

    తను ఆ షరతును కమిట్ అయిపోయి చదరంగంలో తను ఏనుగుని పోగొట్టుకుంది.

 

    "ఎందుకూ అభ్యంతరం చెప్పకూడదు."

 

    నా ఆతృత చూసి పగలబడి నవ్వింది.

 

    "నేను చాలా ధైర్యవంతురాలిని. అలాంటి ఆశలేం పెట్టుకోకు. భయపడివస్తే మాత్రం తప్పక నీ మాట వింటాను."

 

    ఆ మాత్రం భరోసా చాలు నాకు.

 

    'మదన్ ఇక విజృంభించు' అనుకున్నాను మనసులో.

 

    అంతలో దామూ ప్రత్యక్షం. ఇంటికెళ్ళిపోతూ కాఫీ ఇవ్వడానికి వచ్చాడు. కాఫీ తాగి సిగరెట్ అందుకున్నాను.

 

    దామూ వెళ్లిపోయాడు.


                                         2


    పార్క్ లోని చెట్లు నిద్రకుపక్రమించినట్టు ఆకుల రెపరెపలు కూడా లేవు. ఫ్లోరోసెంట్ దీపం వుండుండీ వెలుగుతూ వుంది. అక్కడెక్కడో గాలి ముసుగు తీసుకు పడుతున్నట్టు వుక్కగా వుంది. నక్షత్రాల్ని మింగేసిన ఆకాశం బోసిగా వుంది. మా ముందున్న తురాయి చెట్టులోంచి ఏదో పక్షి టకటకా రెక్కలాడించి భయంగా అరుస్తూ పైకెగిరింది. తలకు నల్లటి మఫ్లర్ చుట్టుకుని తిరుగుతున్న నైట్ వాచ్ మాన్ దెయ్యాల భాష తెలిసిన వాడిలా వున్నాడు.

 

    అప్పుడే వరండాలో పడి మాయమైన వెలుగులో కీర్తి ఒక్కక్షణం మెరిసింది.

 

    సిగరెట్ ఓ మూలకు గిరాటేశాను. మొండెం తెగిన తలలా ఫిల్టర్. దాన్నించి రక్తం కారుతున్నట్టు చివరన ఎర్రగా అగ్గి.

 

    కథ చెప్పడానికి గొంతు సవరించుకున్నాను.


                            *    *    *    *    *


    నాకు అప్పుడు పధ్నాలుగేళ్ళు.

 

    త్వరగా మీసాలు వచ్చేస్తే బావుండు అనుకునే వయసు. లుంగీ కట్టుకోవాలని ఆరాటపడే మనసు. నిక్కరే వేసుకుంటే ఏదో అనీజీగా వుండేది. అప్పుడప్పుడు నిక్కర్ తో వీతిలో నడవాలంటే ఇబ్బందిగా కూడా వుండేది.

 

    నాన్నకు తెలియకుండా ఆయన లుంగీలను కట్టుకునేవాడ్ని. అగ్గిపుల్లను ఆర్పి, దాన్ని నీళ్లల్లో ముంచి నూనూగు మీసాలను మరింత నలుపు చేసుకునేవాడ్ని. మా అమ్మమ్మ నా అవస్థనంతా గమనించి 'అంతా తాతపోలిక' అంటూ ముద్దులాడేది.

 

    ఎనిమిదిలోంచి తొమ్మిదో తరగతిలోకి వచ్చాను.

 

    మా వూర్లో అంతవరకే వుంది. తొమ్మిదిలో చేరడానికి మరో వూరు వెళ్ళాలి. పట్నంలో చేర్పించాలని నాన్న ప్రయత్నాలు ప్రారంభించాడు.

 

    మా వూరికి పట్నం నలభై కిలోమీటర్లు. అంత దూరంలో వుంచి చదివించడానికి అమ్మమ్మ ఒప్పుకోలేదు. ఈ తాతను చూడకుండా ఆమెకు ఓ రోజు గడవదు. ఆమెకు మా అమ్మ ఒక్కత్తే కూతురు. అందుకే ఈ ముద్దుల మనవడ్ని ఒడిలోంచి దించేది కాదు. కాణీ నాకు మాత్రం ఆ ముసలి వాసన భరించవీలయ్యేదికాదు. లేత లేత అమ్మాయిలమీదే నా మనసు లగ్నం కావడం ప్రారంభమైంది.

 

    పట్నం పంపడానికి అమ్మమ్మ ఒప్పుకోక పోవడంతో సమస్య మరింత జటిలమైంది.

 

    "ఎలా పడాలి మీ అమ్మతో. వాడ్ని ఒక్కడే పెట్టుకుని చదివించాలంటే మనమే స్వంతంగా ఆమె మొగుడిపేర మీద హైస్కూల్ ప్రారంభించాలి. వీడు కాలేజీ చేరేసరికి ఆమె ఎలానూ ఠపీమని వైకుంఠ యాత్రకు బయల్దేరుతుంది కనుక ఆ తరువాత ఎక్కడికైనా పంపించవచ్చు" నాన్న అమ్మ దగ్గర అమ్మమ్మ మీద పరోక్షంగా ఎగిరిపడ్డాడు.

 

    "ఎందుకలా తోక తొక్కిన కుక్కపిల్లలా ఎగిరిపడతారు. బుచ్చిరెడ్డిపాలెం దగ్గరే కాబట్టి అక్కడ చదివించండి" అని ఖస్సుమంది అమ్మ.

 

    అమ్మమ్మ ఆస్తి బాగానే వచ్చింది అమ్మకు. అందుకే ననుకుంటా నాన్నను ఎంత మాటంటే అంత మాటనేది.

 

    "అవును మరిచేపోయాను. బుచ్చిరెడ్డి పాలెంలో చదివించడం అన్నిటికీ అనుకూలంగా వుంటుంది. ఇక్కడ్నుంచి పట్టుమని పది కిలోమీటర్లు కూడా వుండదు. బిడ్డను చూడాలనుకున్నప్పుడు వెళ్లి చూసి రావచ్చు. వాడికి బుద్ధి పుట్టినప్పుడు వాడూ రావచ్చు" అని నాన్న ఒప్పుకోవడంతో నా చదువు ఎక్కడ కొనసాగాలో నిర్ధారణై పోయింది.

 

    అయితే ఆ వూర్లో నన్నెక్కడ వుంచాలన్నది మరో సమస్య.

 

    మా నాన్నగారి స్నేహితుడు ఆ హైస్కూల్ లోనే టీచర్ గా వుండేవాడు. ఆయనింట్లో నన్ను వుంచుతానన్నాడు నాన్న. అయితే దీనికి అమ్మమ్మ ఒప్పుకోలేదు. కారణం ఆయన గిరిజనుడు కావడమే. అమ్మమ్మకు అనవసరమైన విషయాలే గుర్తొస్తాయి.

 

    ఇక అప్పుడు మా మామయ్య ఇంట్లో వుంచి చదివించాలని ఇంటిల్లిపాదీ ఏకగ్రీవంగా నిర్ణయించారు. నెలకు కొంత బియ్యం, ఖర్చులకింద ఇరవై రూపాయిలు ఇవ్వాలని తీర్మానించారు.

 

    మరుసటిరోజే నాన్న, మామయ్యతో అన్ని విషయాలూ మాట్లాడారు. అలా నేను బుచ్చిరెడ్డిపాలెం హైస్కూల్ లో చేరడం జరిగింది. మామయ్య ఇంట్లో మకాం.

 

    మామయ్య కానిస్టేబుల్ గా వుండేవాడు. ఆ వూర్లో ఔట్ పోస్టు వుండేది. పల్లాం పోలీస్ స్టేషన్ కింద పని చేసేది. మామయ్యతోపాటు ఓ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ వుండేవారు.

 

    బుచ్చిరెడ్డిపాలెమంతా నిమ్మతోటలే. మరో పంట వుండేది కాదు. ఆ తోటల్లో దొంగలు పడుతుండడంతో అక్కడ ఔట్ పోస్టు పెట్టారు. ఆ వూరి చుట్టుపక్కల చుట్టంతాడవే. గుబురు పొదలతో ఆ ప్రాంతమంతా పచ్చగా వుండేది.

 

    బుచ్చిరెడ్డిపాలెం వదిలితే మరో పది కిలోమీటర్ల వరకు మరేవూరు రాదు. శ్రీకాళహస్తి నుంచి తడకు వెళ్ళే రూట్ లో వుండేది ఆ వూరు. ఆ రూట్ లో మద్రాసుకు వెళ్ళే రెండు మూడు తమిళనాడు బస్సులు తప్ప మరే వాహనాలూ వెళ్ళేవి కావు. రోడ్డు పక్కనేవున్నా ఆ వూరు మాత్రం డెవలప్ కాలేదు.

 

    మామయ్య ఆ వూర్లో చిన్నసైజు పోలీసు ఆఫీసర్లా వుండేవాడు. 

 Previous Page Next Page