Previous Page Next Page 
చెక్ పేజి 3


    పరిశీలించి చూశాను. ముప్పై ఏళ్ళుంటాయి. ఒకప్పుడు బలంగా వుండి ఇప్పుడు సన్నబడ్డట్టు చర్మం వదులు వదులుగా వుంది.

 

    "ఏమిటి సార్?"

 

    "ప్రతీ అరగంటకీ కాఫీ పడకపోతే ప్రాణం జిలార్చుకు పోతుంది. అందువల్ల నీవు ఇటొచ్చినప్పుడు నా దగ్గరకొచ్చి కాఫీ ఇస్తూండాలి."

 

    "అంతేకదా సార్. నా వ్యాపారమే అది. అలానే ఇస్తాలెండి."

 

    "చాలా థాంక్స్ దామూ" అని పది రూపాయల నోటు అందించాను.

 

    చిల్లరివ్వబోయాడు. "ఉంచుకో దామూ. తరువాత లెక్కలేసుకుందాం" అన్నారు.

 

    "అలానే సర్"

 

    వెళ్లిపోయాడు దామూ.

 

    పార్క్ లో జనం పూర్తిగా మాయమయ్యారు. డజన్లకొద్దీ నక్షత్రాలని ప్రసవించిన ఆకాశం పచ్చిబాలింతలా, తెల్లగా పాలిపోయింది. చీకటి లోకాన్ని మరింత దగ్గరగా లాక్కొంటూ వుంది.

 

    మళ్ళీ నేను నా ఆలోచనల్లోకి...

 

    కీర్తిని రాత్రికి తన పోర్షన్ లో కాకుండా నా పోర్షన్ లో పడుకునేట్టు చేసుకోగలిగితే చాలు. ఈ ఏకాంతం- ఎముకల్ని కాకుండా చర్మాన్ని కొరుకుతున్న సన్నటి చలి- ఏవేవో గమ్మత్తులు చెబుతున్న కొండ గాలి ఇవన్నీ తనను నా దగ్గరకు చేరుస్తాయి. మరి తనను నా గదిలోకి రప్పించే మార్గమే తట్టడం లేదు.

 

    ఒంటరిగా పడుకోలేనంతగా తనను నేను భయపెట్టగలిగితే సక్సెస్ కాగలను. రూమ్ లోకి వచ్చేస్తే మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు.

 

    మరి తనను ఎలా భయపెట్టడం ?

 

    ఏదైనా హారర్ మూవీ చూపిస్తే-? హారర్ మూవీ అటుంచి 'భక్త ప్రహ్లాద' చూపించడానికైనా ఇక్కడ థియేటర్లు లేవే !

 

    మరి ఇంకేం చేయడం-?

 

    'ఎగ్జార్సిస్ట్' లాంటి పుస్తకం తను చదవగలిగేటట్టు చేస్తే ఫలితం వుంటుంది. అక్షరం దెయ్యం తొడుక్కున్న మాస్క్ లా కనిపిస్తుంటే తను నా రూమ్ కు పరిగెత్తుకు రావడం ఖాయం. కానీ ఇక్కడ అలాంటి పుస్తకాలు దొరకవే ! 'వేంకటేశ్వర మహత్యం' లాంటి భక్తిరస పుస్తకాలే అమ్ముతారు. ఇప్పుడు కావల్సింది భక్తి కాదు రక్తి.

 

    అలా ఆలోచిస్తున్న నాకు ఓ అద్భుతమైన ఐడియా తట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో తనను భయపెట్టాలంటే గొప్ప హారర్ కథను చెప్పగలగాలి.

 

    ఆ కథ విని కీర్తి భయపడిపోవాలి. 'ఒంటరిగా పడుకోలేను మహాప్రభూ' అంటూ తను నా రూమ్ తలుపు దబదబా బాదాలి. అప్పుడు నేను ఏమీ తెలియనట్టు ముఖంపెట్టి తలుపు తీయాలి. ఇక అంతవరకు వచ్చాక తనను ముగ్గులోకి దింపడం పెద్ద కష్టంకాదు.

 

    ఇక కీర్తి వస్తూనే నా పావును జరపదలుచుకొన్నాను.

 

    ఈ రాత్రి నుంచి మొత్తం ఆరు రాత్రులున్నాయి. ఏరోజో ఒక రోజు తను భయపడి ఒంటరిగా పడుకోలేక నా పోర్షన్ లోకి రాకుండా వుంటుందా? తప్పక వస్తుంది. అయితే అందుకు తగ్గట్టు తను భయంతో గడ్డకట్టిపోయే కథ చెప్పగలగాలి నేను. నేరేషన్ అద్భుతంగా వుండాలి. ఆ రోజు ఏం కథ చెప్పాలా అని ఆలోచనలో పడ్డాను.

 

    "హలో సార్! ఏమిటి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నారు?" ఉలిక్కిపడి కళ్ళు విప్పాను.

 

    ఎదురుగా కీర్తి.

 

    "ఇంతాలస్యం అయిందేమిటి ?"

 

    "ఏం చేయను మహానుభావా ? విపరీతమైన రష్. స్పెషల్ దర్శనానికి వెడితేనే ఇంత సమయం పట్టింది. ఇక ధర్మ దర్శనానికి వెళ్ళుంటే బహుశా నీ తల నెరసిపోయుండేదేమో నే వచ్చేటప్పటికి."

 

    చేతిలో కొబ్బరికాయతో, నుదుటన పావలా సైజు కుంకుమ బొట్టుతో, పట్టుచీరలో అచ్చు మొదటిరాత్రి పెళ్ళికూతురిలా వుంది కీర్తి. తను ఇలా కనిపించకపోయినా నాకు 'ఫస్టునైట్' ఆలోచన వచ్చేదికాదేమో.

 

    "భోజనానికి వెడదామా?"

 

    "జస్ట్ వన్ మినిట్. చీర మార్చుకొస్తాను" లోపలికెళ్ళి మార్చుకొచ్చింది.

 

    టొమేటో రంగు చీరలో కీర్తి.

 

    హిల్ వ్యూ కాంటీన్ కి వెళ్ళి ఇద్దరం భోజనాలు ముగించుకొచ్చాం.

 

    కాటేజ్ వరండాలో కూర్చున్నాం.

 

    కీర్తి చీరలోంచి నైటీలోకి మారిపోయింది. నైటీ ట్రాన్స్ పరెంట్ గా వుండడంతో నా చూపులు బ్రాపట్టీని పట్టుకుని వేలాడుతున్నాయి.

 

    కీర్తి ఇరవై ఒక్క సంవత్సరాల యవ్వనం నురగలా పొంగుతున్నట్టే వుందినాకు.

 

    నేను కుర్చీలో ఇబ్బందిగా కూర్చున్నాను.

 

    'ఇంతకీ నా పథకం ఫలించి, నేను సక్సెస్ అవుతానా?' అలా అనుకోవడం ఖచ్చితంగా ఎన్నోసారో తెలీదు.

 

    హారర్ కథ చెప్పి తనను భయపెట్టి, నా పోర్షన్ లోకి రప్పించుకోవాలి. ఇదంతా సాధ్యమయ్యే పనేనా?

 

    'హారర్ కథ విని తట్టుకునేంత హార్డ్ నెస్ ఆడపిల్లల కుండదు. ప్రొసీడ్ మదన్' అని నాకు నేనే భరోసా చెప్పుకున్నాను.

 

    రాత్రి తొమ్మిది దాటింది. తపస్సు చేసుకునే రుషిలా వాతావరణం ప్రశాంతంగా వుంది.

 

    మా కాటేజ్ ముందున్న ఫ్లోర్ సెంట్ దీపానికి అదేదో వింత జబ్బన్నట్టు వెలుగుతూ, ఆరుతూ వుంది.

 

    మా వరండాలోని లైట్ ఆర్పివేయడంతో ఆ దీపం వెలిగినప్పుడు ఎవరో మా మీద గుప్పెడు వెలుగును విసురుతున్నట్టుంది. అది ఆరినప్పుడు చీకటి మమ్మల్ని కప్పేస్తోంది.

 

    చీకట్లో సైతం మెరుస్తున్న కీర్తిని చూస్తుంటే నాలో వెచ్చటి ఆవిర్లు ప్రవహిస్తున్నాయి.

 

    "ఏదైనా మాట్లాడు మదన్."

 

    "ఇలాంటప్పుడు మనసు మాటల్ని పూయదు."

 

    "అందుకేనా ఇంత దూరం తీసుకొచ్చింది."

 

    "ఒకందుకు తీసుకొచ్చాను" అని అందామనుకున్నాను. కానీ అనలేకపోయాను. గొంతు పెగల్లేదు.

 

    "మరి టైమ్ పాస్ ఎలా ? ఏదైనా మాట్లాడు."

 

    "టైమ్ పాస్ కోసం ఓ పాట పాడు కీర్తి."


    
    "అమ్మో! నేను పాట పాడితే తిరుమల అదిగో అక్కడి లోయలో ముఖాన్ని దాచుకుంటుంది" అంది.

 

    తనే మళ్ళీ "పోనీ నువ్వు ఓ కథ చెప్పకూడదూ" అనడిగింది.

 

    పాపం ! తనకు తెలియకుండానే చదరంగంలో ఓ బంటును కదిపింది.

 

    తప్పదు. నేనూ ఓ ఎత్తు వేయాలి.

 

    "నేనేం కథ చెప్పగలను?" బెట్టుపోతూ అన్నాను.

 

    "మొన్న కథా గోష్టిలో తిలక్ 'పల్లజెర్ల రోడ్డు' కథ మీద గంటసేపు లెక్చర్ దంచిన నువ్వు కథ చెప్పలేనంటే నేను నమ్మను."

 

    "ఏం కథ చెప్పను?"

 Previous Page Next Page