Next Page 
పగలే వెన్నెల పేజి 1

                                 

       

                                        పగలే వెన్నెల
    
                                                              -----మేర్లపాక మురళి
    
                            
  

      అక్కడెక్కడో దూరంగా వున్న లోకాల నుంచి  ఆకాశపుటొడ్డుకు కొట్టుకొచ్చిన గవ్వలా వున్నాడు చంద్రుడు. ఎండకు భయపడి అప్పటి వరకు కాలు బయటపెట్టని గాలి అప్పుడే  షికారుకు బయల్దేరినట్టు చల్లగా తగుల్తోంది.


    మల్లెపూలు వేసుకున్న పైటను ఎవరో ఆకతాయి లాగేసినట్టు  ఆ ప్రదేశమంతా సువాసనలు  చుట్టుమడుతున్నాయి.


    అక్కడక్కడా  విసిరేసినట్టున్న పెంకుటిళ్లు భూదేవి తన పాదాలకు రాసుకున్న గోరింటాకు లతల్లా వున్నాయి. ఇళ్లమధ్య వున్న రహదారి వెన్నెల్లో వెండిపట్టీలా మెరుస్తోంది.  


    సురేష్ వర్మ మెల్లగా ఆ దారంట నడుస్తున్నాడు. క్ర్గీగంట పరిసరాల్ని గమనిస్తున్నాడు. ఆ వాకిట్లో నిలబడి వుందెవరు? జయంతనుకుంటా -  వెన్నెల్లో గోధుమ చేలమధ్యన నిలబడ్డట్టుంది ఆమెను చూస్తుంటే.


    బాగా మరగకాచిన పాలరంగు ఆమెది. ఒడ్డూపొడుగుతో మగాడి కేదో సవాల్ విసిరినట్టుంటుంది.  అంత భారీమనిషితో  పడకటింట్లో యుద్దం  చేయడానికి ఆమె భర్త వెంకటేశ్వర్లు ఎంత కష్టపడుతున్నాడో? ఆత్మ విశ్వాసం కాబోలు రోజూ సాయంకాలమైతే కల్లుకొట్టు దగ్గరుంటాడు.


    అయినా చదువు అంతంత మాత్రమే వచ్చిన వాడికి జేమ్స్ జాయిస్ యులిసిస్   గ్రంథం ఇచ్చినట్టు పిట్టలా వుండే వెంకటేశ్వర్లుకు జయంతితో పెళ్లేమిటి? అందుకే పెళ్లి చేసేప్పుడూ ముఖ్యంగా ఈడూ   జోడూ చూడాలనేది -


    "దండాలండి" అన్నారెవరో.


    "ఆఁ" అంటూ తలవూపాడు సురేష్ వర్మ.


    నీ ఆరోగ్యం ఎలా వుంది అని అడగాలనిపించీ వూరకుండిపోయాను. పాపం రాముడికి సంవత్సరంనుంచీ ఏదో నరాల జబ్బు. నిద్ర లేచేటప్పటికి కాళ్లలోని నరాలన్నీ ఉబ్బిపోతాయి. డాక్టర్  దగ్గరికి వెళ్లి ఆ వ్యాధేమిటో కూడా తెల్సుకోలేని పేదరికం. అప్పుడెప్పుడో తన దగ్గరికొచ్చి  వెయ్యో రెండువేలో  తీసుకున్నట్టు గుర్తు.


     పాపం - రోజూ కష్టపడ్డా  పూటకే గడవని స్థితి. మరి మందులకీ మాకులకీ ఎలా వస్తుంది? ఏ పనీ చేయని పెద్ద పెద్ద రైతులు జ్వరం వచ్చినా  త్రీస్టార్' నర్సింగ్  హోమ్ లకి వెళతారు.


    ఎంత దారుణం?


    మార్క్స్ చాలా కరెక్టు. పనిచేసేవాడికి తిండి. గోర్బచేవ్ పెరిస్త్రోయికా సాక్షిగా మార్క్సిజమ్ కు దహనసంస్కారాలయిపోయాయి. ఇంకా ఎక్కడున్నాం మనం?


     ఆ వస్తున్నది ఎవరు? పద్మ - భర్తనొదిలి పుట్టింటికి వచ్చేసిందని బాబు  చెప్పాడు. వాడి ద్వారానే విశేషాలు తెలిసేది. వాడే తనకి ఏకైక టీ. వీ. ఛానెల్. కళ్లకు కట్టినట్టు అన్నీ చెబుతుంటాడు. అయినా ఆ పిల్లేమిటి తనని చూసి అలా సిగ్గుపడింది. తన వయసెక్కడ? ఆ పిల్లవయసెక్కడ? తనకి ముప్పై - ఆ పిల్లకంటే బహుశా పద్దెనిమిది  వుంటాయోమో ఆ పిల్ల తత్వమే అంతేనని బాబూ చెప్పాడు.


    మగాడైతే చాలు అన్నట్టు ప్రవర్తిస్తుందట. కారణం ఏమైవుంటుంది? కొందరంతే - సంసారం చట్రంలో ఇమడలేరు. హార్మోన్ల సమతుల్యం  లోపమా? లేకుంటే డాన్ జ్యూక్ లాంటి మనస్తత్వమా? తన స్త్రీతనాన్ని  ఎప్పటికప్పుడు  లోకానికి   చాటటానికి  వచ్చిన మగాడితో రాత్రయితే ఏ గడ్డి  వానము చాటునో, ఏ కాశి రాయిమీదనో - ఆ ఐదునిముషాలు మనసులో  కాకరపువ్వొత్తుల్ని  వెలిగించుకుంటుంది కాబోలు. ఏమో -  లోగుట్టు పైనున్న ఫ్రాయిడ్ కెరుక. సాయంకాలమయితే చాలు  పెళ్లికూతురిలా తయారయి పోతుంది.


    తనెప్పుడు చూసినా ఫుల్ మేకప్ లో కనిపించేది.  దట్టంగా,  మసక చీకట్లో అయినా తెల్లగా తెలిసేటట్టు పౌడర్ రాసుకుంటుంది. చీకట్లతో పోటీపడే  విధంగా కాటుక రాసుకుంటుంది. నుదుటను గుండ్రటి  ఎర్రటి  స్టిక్కర్ - తలలో లూజుగా కిందకు వదిలేసిన మల్లెపూల దండ - వేళ కాగానే 'భోజనం తయార్' అన్న బోర్డును హోటల్ వాళ్లు వీధిలో పెట్టినట్టు - ఆమెను చూసినప్పుడంతా ఆ బోర్డే గుర్తుకొచ్చేది తనకు.


    "బాబయ్యా! టైమెంతయిందయ్యా?"


     సురేష్ వర్మ ఇ లోకంలోకి జారిపడ్డాడు.ఎవరో ఈ ఊరు మనిషి కాడు- పరాయి ఊరు.


    టైమ్ చూసి చెప్పాడు - "ఎనిమిదిన్నర."


    ఆ మనిషి వెళ్లిపోయాడు.


    సురేష్ వర్మ తిరిగి బయల్దేరాడు.


    అబ్బ ఏమిటంత వెలుగు? కృష్ణారెడ్డి ఇంటి వరండాలో  బల్బు కరెంటునంతా తాగి బలిసినట్టుంది. వెన్నెలంతా  మేసి ఏరు నిదురోయింది అన్నది మనసులో ఇంకిపోవడంవల్ల ఇలా అనుకున్నానా? ఏమో ఈ ఆలోచనాస్రవంతికి ఏది మూలం?  ఏదికాదు? ఎప్పుడు దేనిమీద మనసు పోతుంది? బోర్ ఎందుకు కొడుతుంది?


    ఒక్కోసారి ఎందుకంత ఉత్సాహంగా? మరొక్కప్పుడు ఎందుకంత దిగులుగా? ఏదీ అర్దంకాదు సాల్వకార్ డాలీ చిత్రంలాగా, ఏదీ ఒక పట్టాన బోధపడదు. అంతా తికమకే - మకతికే.


    కృష్ణారెడ్డి పరమ భక్తుడు. అంత దరిద్రంలో కూడా పూజలకీ, పునస్కారాలకీ లోటు రానివ్వడు. దేవుడు వున్నాడని చెబితే చాలదు. ఆ దేవుడు మెచ్చుకునే  విధంగా ప్రవర్తించాలని కందుకూరి  వీరేశలింగం కాబోలు అన్నాడు. ఇప్పుడవన్నీ  తిరగబడిపోతున్నాయి. కొంతమంది సుఖం కోసం కోట్లమంది కష్టాలు పడుతున్నారు. వోల్టేర్ నుంచి  మహా మేధావులంతా చెప్పింది అదేకదా.


    కృష్ణారెడ్డి పక్కనున్నది ఎవరూ? వసంత -  దామోదరరెడ్డి భార్య. రాత్రయినా  పగలయినా ఎప్పుడూ బంగారాన్ని  ఒంటి్నిండా దిగేసుకుని  కనపడుతుంది. నగల పిచ్చేమో - మెడనుంచి  పాదాలవరకు బంగారునగలే. అవన్నీ విప్పేలోపే దామోదర్  రెడ్డి  చల్లబడిపోతాడేమో.


    అంతేకదా - శరీరాన్ని తాకుతూ నగలని విప్పడం అంటే తమాషానా? ఉద్రేకం వేళ్లకొసల్లో చిట్లి చల్లబడిపోదూ - దామోదర్ రెడ్డి ఎలా భరిస్తున్నాడో ఏమోగాని  తనకైతే నగలన్నీ  వేసుకున్న స్త్రీలు నచ్చరుగాక  నచ్చరు. తనకి స్త్రీ ఎంత సింపుల్ గా వుంటే తనకు అంత ఇష్టం కలుగుతుంది.


    తను శాలీనుడు కాబోలు -  మరి సుగాత్రి ఎవరు? కళాపుర్ణోదయంలో  శాలీనుడికి స్త్రీలలో అలంకారాలు, ఆడంబరాలు, డంబాలు నచ్చవు. అతడి భార్య సుగాత్రి.  ఆమెకి  అలంకారాలమీద ఓ వీసమెత్తు మోజు.


     అందుకనే అతనికి భార్యకంటే ఇష్టం వుండదు.  సహజసిద్దంగా వున్నదానిని ప్రేమిస్తాడతను.


     ఓ రోజు సుగాత్రి తోటలో వుంటుంది. వర్షానికి తడవడంవల్ల  అలంకారాలంతా మాసిపోయి సహజ సౌందర్యంతో మెరిసిపోతూ వుంటుంది.  ఆ క్షణంలో ఆమెను చూసిన శాలీనుడు  మరులుకొంటాడు. భార్యను కౌగిలించుకుంటాడు - ఎంత మంచి కథ.

Next Page