Previous Page Next Page 
చెక్ పేజి 5


    ఆయనది గుండ్రటి ముఖం. గుబురు మీసాలు. బండ పెదాలు. పెద్దనల్ల కుండను బోర్లించినట్టు పొట్ట. చెయ్యెత్తు మనిషి. ఆయనను చూస్తేనే ఏదో భయం పుట్టేది.

 

    ఆయనకు మొత్తం ఆరుగురు ఆడపిల్లలు. మగపిల్లవాడు పుట్టి, వంశాన్ని వుద్ధరించకపోతాడా అని మామయ్య ఇంకా ఆ ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు.

 

    మా అత్తమ్మను చూసిన మొదటి క్షణంలోనే ఆమెమీద నాకు అపారమైన జాలి కలిగింది. ఎండిపోయిన పుల్లలాగుండేది. మొత్తం శరీరమంతా గీసినా పావుకేజి కండకూడా వుండేది కాదు.

 

    ఉదయం నిద్రలేచింది మొదలు పడుకునేవరకు ఆమెకు పనే. ఇంటి చాకిరీ అంతా చేసి పిల్లల సంరక్షణ అంతా చూసి రాత్రి మామయ్య ఆవేశం తీర్చేసరికి పదకొండు గంటలయ్యేది.

 

    జెండా పండుగనాడు స్కూల్ ముందునాటే జండా కొయ్యలా వుండే అత్తమ్మను చూసి నలభైఏళ్ళ వయసులో కూడా ఆవేశపడుతున్న మామయ్యను చూస్తే ఆశ్చర్యమేసేది నాకు.

 

    మామయ్యకు పిల్లలంటే చాలా ఇష్టం. మాతో చాలా బాగా మాట్లాడేవాడు. చంటి పిల్లకయితే ఆయన పొట్టే ఆట స్థలం. ఆ పొట్టమీద కూర్చుని ఆ పిల్లది రకరకాల ఆటలు ఆడుకునేది.

 

    ఇంట్లో ఆయన పడుకుంటే మాకెవరికీ స్థలం సరిపోయేది కాదు. అంత భారీ మనిషి. ఇక ఆయన తిండి తినడం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జీతం కాక పైన వచ్చే చిల్లర కొట్టుడంతా ఆయన భోజనానికే ఖర్చు పెట్టేవాడు. ఒక క్షణం సేపు అభోజనం ఆలస్యమైతే గిలగిల్లాడిపోయేవాడు. ఆయన ఏదో ఒక రోజు అర్దరాత్రిపూట ఆకలేసి మా అత్తమ్మను తినేస్తాడనిపించేది నాకు.

 

    ఆయన పొట్ట ఎంత పెద్దదో గుండె కూడా అంతే పెద్దది. భయం ఎలా వుంటుందో తెలియదాయనకు. ప్రతిరోజూ సాయంకాలం ఒక్కడే తుపాకీని భుజంమీద వేసుకుని ఇంటి వెనుకనున్న ముళ్ళపొదల్లో దూరి అడవికి వెళ్ళేవాడు. ఏ ఎనిమిదికో, తొమ్మిదికో ఇంటికొచ్చేవాడు. అప్పుడు ఆయన భుజంమీద తుపాకీతో పాటు ఏ కుందేలు పిల్లో, తాబేటి చిప్పో పేరు తెలీని రెండు పిట్టలో వుండేవి.

 

    ఇక అప్పటి నుంచి పంట ప్రారంభం. మామయ్య ఇల్లు వూరికి కొద్దిదూరంలో వుండేది. కరెంట్ కూడా లేదు. వున్న ఒకే లాంతర్ తో వంట మొదలయ్యేది. మరో లైట్ లేకపోవడంతో పిల్లలమంతా పొయ్యిదగ్గిర చేరేవాళ్ళం. మామయ్య మాతో మాట్లాడుతూ స్నానంచేసి భోజనానికి కూర్చునేవాడు.

 

    ఆ వూర్లో మామయ్యకు తిరుగుండేది కాదు. ఆయన మాట వేదవాక్కు. ఓ మారు రెండు గ్రూప్ ల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. అటు యాభైమంది. ఇటు యాభైమంది చేరి రాళ్లూ, షోడాబుడ్లూ విసురుకున్నారు. అప్పుడు బస్టాండ్ లో వున్న మామయ్య అభిమన్యుడిలా దూకాడు. దొరికిన వాడ్ని దొరికినట్టు చితకబాదాడు. దీంతో రెండు వర్గాల వాళ్ళూ ఇళ్ళల్లో దూరి తలుపులు వేసుకున్నారు. ఇక ఆ రాత్రి మామయ్య ఒక్కడే గస్తీకాశాడు. ఉదయానికల్లా పల్లాం ఎస్.ఐ. వచ్చి రెండు గ్రూపుల మధ్యా రాజీ కుదిర్చాడు.

 

    మామయ్య సాహసానికి మెచ్చి ప్రభుత్వం ఏభై ఒక్క రూపాయిలను బహుమతిగా ఇచ్చింది.

 

    ఆ డబ్బుతో మామయ్య ఏం చేశాడనుకున్నావ్ ? అటునుంచి కాళహస్తికి వెళ్లి ఆ డబ్బుకి జేబులోని అయిదు రూపాయిలూ కలిపి ఎనిమిది కేజీల పొట్టేలు మాంసం తీసుకొచ్చాడు.

 

    బహుమతి సొమ్ముతో చీరో, కడకు రవిక గుడ్డో తీసుకొచ్చాడన్న ఆశతో ఎదురెళ్లిన అత్తమ్మ చేతిలో ప్యాకెట్ పెట్టాడు. ఆవురావురుమని ప్యాకెట్ విప్పిన అత్తమ్మ అందులోని మాంసాన్ని చూసి మామయ్యకేసి చూసిన చూపు నాకు ఇంకా గుర్తే. అవి చూపులు కావు, నిగనిగలాడే కత్తులు.

 

    కీర్తి కిలకిలా నవ్వడంతో కథ ఆపాను.

 

    "ఏమైంది?"

 

    "మీ అత్తమ్మను చూసి జాలేస్తోంది" అంది.

 

    చుట్టూ చూశాను. పది గంటలై వుండచ్చు. చీకటి కంబళిపురుగులా లోకంమీద పాకుతోంది. పార్క్ లోని దీపాలు మంచు పొరను కప్పుకుని రాక్షసుని కనుగుడ్లలా వున్నాయి. చుక్కలు లేని ఆకాశం కంటికి ఆనడం లేదు. గాలి జాడ తెలియడంలేదు.

 

    సిగరెట్ వెలిగించాను. నానోటికీ, నడుముకీ మధ్య ఎర్రటి చుక్క తమాషాగా కదుల్తూ వుంది.

 

    "కథ కానీ."

 

    మళ్ళీ నేను కథలోకి .....

 

    ఆ రోజు అందరం భోజనాలు ముగించి నిద్రపోవడానికి అన్నీ సర్దుకుంటున్నాం. రాత్రి పది దాటింది. మామయ్య మంచంమీద పడుకుని తాంబూలం వేసుకుంటున్నాడు.

 

    అప్పుడొచ్చాడు ఔట్ పోస్టు సెంట్రీ.

 

    ఆయన్ను చూస్తూనే మామయ్యకు కబురొచ్చిందని అనుకున్నాం.

 

    మామయ్య లేచి ఏమిటని అడిగాడు సెంట్రీని.

 

    "వరదయ్యపాలెం దగ్గర యాక్సిడెంట్ అయిందట. ఎస్.ఐ. లైన్ లో వున్నాడు. నిన్ను అర్జెంట్ గా రమ్మంటున్నాడు" అని ఆయాస పడిపోతూ చెప్పాడు సెంట్రీ.

 

    మామయ్య ఎస్.ఐ.నీ, తన ఉద్యోగాన్నీ, యాక్సిడెంట్ చేసిన వెధవనీ అందర్నీ తిట్టుకుంటూ లేచాడు.

 

    ఇప్పుడే వస్తానని అత్తమ్మతో చెప్పి లుంగీతోనే వెళ్ళాడు.

 

    మామయ్య వెళ్ళిపోవడంతో నాకు భయం పట్టుకుంది. వచ్చే నిద్ర కూడా ఎక్కడికో ఎగిరిపోయింది. చుట్టూ గాఢాంధకారం. అడవిలోనుంచి విన్పిస్తున్న నక్కల అరుపులు తెలియని భయాన్ని కలుగ జేస్తున్నాయి.

 

    నేను ముడుచుకుని పడుకున్నాను.

 

    ఠక్కున అమ్మా వాళ్లు గుర్తొచ్చారు. బంగారం లాంటి మా ఇంట్లో అమ్మమ్మ పక్కన నిశ్చింతగా నిద్రపోవాల్సిన నేను అలా చీకట్లో అడవిలో వున్న ఇంట్లో నిద్రరాక దొర్లవలసి రావడంతో నామీద నాకే జాలేసింది. అప్పటికప్పుడే పరుగెత్తాలనిపించింది.

 

    మామయ్య లేకుండా ఆ ఇంట్లో పడుకోవడం నాకు భయంగా వుండేది.

 

    నిద్రపట్టక అటూ, ఇటూ దొర్లుతున్నాను.

 

    అంతలో ఎవరో వస్తున్న అలికిడి విన్పించింది.

 

    కళ్ళు తెరుచుకున్నాను.

 

    వచ్చింది మామయ్య.

 

    "ఏరా ! ఇంకా నిద్రపోలేదా !"

 

    "లేదు మామయ్యా" అన్నాను.

 

    లాంతరు వెలిగించి అత్తమ్మను నిద్ర లేపాడు. ఆమె దిగ్గున లేచి కూర్చుంది.

 

    "ఇంత రాత్రిపూట ఏమిటట" అత్తమ్మ ప్రశ్నించింది.

 

    "వరదయ్యపాలెం దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. ఎవరో ఓ యువకుడ్ని లారీ గుద్దేసిందట. శవం దగ్గర కాపలా వుండమన్నాడు ఎస్.ఐ. ఈ రోజు హెడ్డూలేడు, కానిస్టేబుల్ గిరిధరూ లేడు. స్పెషల్ డ్యూటీ మీద కాళహస్తికి వెళ్లారు. ఒక్కడ్నే కాపలా కాయాలి" అని డ్రస్ అందుకున్నాడు.

 

    నేను కళ్ళప్పగించి చూస్తున్నాను.

 Previous Page Next Page