Previous Page Next Page 
మానిని మనసు పేజి 3


    వివాహం గురించి ఆమెకి కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలుండేవీ. వివాహమనేది స్త్రీకి ఎంత అవసరమో పురుషుడికి అంతే అవసరం అనీ కట్నం యిచ్చి వివాహముచేసుకోవడం స్త్రీ తననుతానే కించపరుచుకోవడమనీ ఆమె భావం. కనీసం చదువుకున్న స్త్రీలైనా ధైర్యంగా యీ దురాచారాన్ని యెదుర్కోవాలని అంటూ వుండేది.
    మరో విషయంలో కూడా ఆమె వాదిస్తూ వుండేది. ముక్కూ మొహం తెలియని మనిషిచే మూడు ముళ్ళూ వేయించడం, అతడితో పాటు గదిలోకి పెద్దలు ఆడపిల్లను నెట్టడం... ఆ తరువాత ఆ పిల్ల ఆ కొత్త వ్యక్తి చేతులు చాచగానే... ఆ చేతుల్లోకి వాలిపోయి కరిగిపోవడం... దారుణమంటు లెక్చర్లు దంచేది.
    "చూస్తాంగా నువ్వెలాంటివాడ్ని చేసుకుంటావో?" తోటి విద్యార్ధినులు అంటే...
    "ఎలాంటివాడా? నాకు నచ్చినవాడు... నన్ను అర్ధం? చేసుకునే వాడు... నన్ను గౌరవించేవాడు... అర్ధమైందా ముక్కూ మొహం తెలియనివాణ్ణి చస్తే చేసుకోను. పరిచయమున్న మనిషినే చేసుకుంటాను."
    "అంటే ప్రేమించి పెళ్ళి చేసుకుంటావన్నమాట?" అనేవాళ్ళు తోటి విద్యార్ధినులు.
    "అది ప్రేమో కాదో నాకు తెలియదు. అతన్నీ అతని భావాలనూ అర్ధం చేసుకున్న తరువాతే వివాహము గురించి ఆలోచిస్తాను."
    అలాంటి భావాలుగల ఆమె ముక్కూ మొహమూ తెలియని వాడనే చేసుకొంది.
    తల్లీ, అన్న కుదిర్చిన సంబంధం కాదనలేకపోయింది. కారణం కుటుంబ పరిస్థితులు. అంతే కాదు ఒక భార్య చనిపోయిన వ్యక్తిని చేసుకుంది.
    ఆమెకు ఏం.ఏ. చదవాలనీ, లెక్చరర్ గా పనిచెయ్యాలనీ వుండేది. చదువు పూర్తయ్యాక తనకు నచ్చినవాడు తటస్థపడితే పెళ్ళి చేసుకోవాలనుకునేది.
    తల్లికి ఆమె పై చదువులకి వెళ్ళడం ఇష్టముండేది కాదు. కాని తండ్రి కూతుర్ని సమర్ధించేవాడు.
    అనసూయ బి.ఏ. ఫైనల్ ఇయర్ లో ఉంది.
    ఇంటికి వెంటనే రమ్మంటున్నారని కాలేజీకి కబురువచ్చింది. ఆ వచ్చిన మనిషి కారణం చెప్పలేదు.
    అనసూయ హడావిడిగా ఇంటికొచ్చింది.
    ఇంటి ముందు జనం ఉన్నారు.
    అనసూయ అడుగు ముందుకు పడలేదు. కొయ్య బారిపోయి నిల్చుండిపోయింది.
    అనసూయ మేనమామ ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళాడు. అనసూయ తండ్రి శవం చాపమీద పడి వున్నది. తల్లి శవం మీద పడి భోరుభోరున ఏడుస్తున్నది.
    అనసూయ స్థాణువులా నిలబడిపోయింది. ఏడుపు కూడా రావటం లేదు.
    ఉదయంఆమె కాలేజీకి బయలు దేరుతున్నప్పుడు రామశేషయ్య వరండాలో ఈజీ చెయిర్ లో కూర్చుని పేపరు తిరగేస్తున్నారు.
    "మంచిది తల్లీ!" రామశేషయ్య కూడా అలవాటు ప్రకారము అన్నాడు.
    "వెళ్ళొస్తాను నాన్నా!" అనసూయ అలవాటు ప్రకారము అన్నాడు.
    రెండు గంటలముందు మాట్లాడిన తండ్రిని నిర్జీవంగా చూసిన ఆమె బుర్ర పనిచేయడం మానేసింది.
    పేపరు చదువుతూ కూర్చున్న భర్త ఆఫీసు టైమ్ ఔతుందనీ, భోజనానికి రమ్మని చెప్పింది నాగరత్నమ్మ.
    ఎంతసేపటికీ భర్త లోపలికి రాలేదు. విసుక్కొంటూ బయటికి వచ్చిన నాగరత్నమ్మ భర్త ఛెయిర్ లో కళ్ళుమూసుకుని పడుకొని వుండటాన్ని చూసింది.
    "ఈ వేళప్పుడు నిద్రేమిటి? అన్నం పెట్టాను. ఆరిపోతుంది లేవండి" అంది.
    రామశేషయ్య ఉలకలేదు. పలకలేదు.
    నాగరత్నమ్మ దగ్గరికొచ్చి నొసటిమీద చెయ్యి వేసింది. షాక్ తగిలినట్టు కెవ్వున అరచింది. ఇరుగు పొరుగు పరిగెత్తుకొచ్చారు.
    రామశేషయ్య మరణంతో ఆ ఇంటి పరిస్థితులు తారుమారైనయ్. తారు రోడ్డుమీద ఫారిన్ కారులా వెళుతోన్న సంసారం గతుకుల బాటలో పడిపోయినట్టయింది.
    అనసూయ బి.ఏ. పరీక్షలు రాసింది.
    ఆమె అన్న గోపాలం ఫైనల్ ఇంజనీరింగ్ లోకి వచ్చాడు.
    ఆమెకి ఎం.ఏ చదవాలని వుంది. కాని పరిస్థితులు అర్ధం చేసుకొని ఆ ప్రయత్నం విరమించుకుంది.
    పట్నంలో కాపరం ఎత్తెసి నాగరత్నమ్మ అన్న ఇంటికి చేరింది అనసూయతో సహా.
    నాగరత్నం అన్నయ్య వ్యవసాయం చేస్తాడు. ఐదెకరాల భూమి ఉన్నది. అయిదుగురు పిల్లలు. వాళ్ళదే చాలీచాలని సంసారము. అనసూయ ఉద్యోగంకోసం ప్రయత్నాలు చెయ్యసాగింది.
    నాగరత్నమ్మకు కూతురి పెళ్ళి చెయ్యాలని ఉంది.
    ఆమె మేనమామ సంబంధాలు వెతకసాగాడు.
    చివరకి రమణమూర్తి సంబంధం ఖాయమైంది.
    "ఏమ్మా ఆ అబ్బాయి నీకు నచ్చాడా?" మేనమామ అడిగాడు.
    ఆమె అదోలా నవ్వింది.
    "చెప్పు తల్లీ! నీకు ఇష్టం లేకపోతే మరో సంబంధం చూస్తాం" అంది తల్లి.
    "ఆఁ చూస్తారు. కానీ కట్నం ఇవ్వలేనివాళ్ళకు ఇంతకంటే మంచి సంబంధాలు వస్తాయ్" వ్యంగ్యంగా అన్నది ఆమె మేనమామ భార్య.
    "మీ అందరికీ నచ్చితే నా కభ్యంతరము లేదు" అనేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయిందామె.
    గొడ్లసావిడి వెనక్కి వెళ్ళి తండ్రిని తల్చుకుని కుళ్ళికుళ్ళి ఏడ్చింది.
    అనసూయ పెళ్ళిచూపుల్లో రమణమూర్తిని సరిగా చూడలేదు. నిర్లిప్తంగా వుండిపోయింది.
    రమణమూర్తితో ఆమె వివాహం జరిగింది.
    ఆయన హైదరాబాద్ లో ఒక బ్యాంక్ లో డెవలప్ మెంట్ ఆఫీసరుగా పనిచేస్తున్నాడు.
    స్త్రీని ఎలా గౌరవించాలో ఆయనకు తెలుసు.
    భార్య అభిప్రాయాలను మన్నించడం తెలుసు.
    ఆమె తన అదృష్టానికి పొంగిపోయింది.
    రమణ ఆఫీసు పనిమీద మద్రాసు వెళుతున్నాడు.

 Previous Page Next Page