Previous Page Next Page 
మానిని మనసు పేజి 4


    అక్కడ్నుంచి ఓ వారం శెలవుపెట్టి ఊటీ వెళ్ళడానికి ప్లానువేశాడు.
    అనసూయ ఆనందానికి అంతులేదు. ప్రయాణానికి కావాల్సిన సామానులు సర్దటం ప్రారంభించింది.
    "ఇప్పటినుంచే ఎందుకోయ్ ఈ సర్దుళ్ళు" అంటూ ఎగతాళి చేశాడు.
                                            3
    "అనూ! అనూ! ఎక్కడోయ్?"
    "అబ్బ ఏమిటండీ ఆ గావుకేకలు. ఇక్కడే ఉన్నానుగా."
    "మరి పలకవేం?"
    "నేను పలికిందాకా మీకు ఓపిక ఉంటేనా? ఒకటే కేకలు పెడ్తారాయె."
    "టికెట్లు కనపర్మ్ అయ్యాయి. మనం మూడున్నర కల్లా బయలుదేరాలి."
    ఆమె మాట్లాడలేదు.
    "ముందు భోజనం చెయ్యండి" అంటూ వడ్డించసాగింది.
    "నువ్వు తిన్నావా?"
    "లేదు."
    "మరి నువ్వూ కూర్చో."
    "ముందు మీరు తినండి. నాకు తలనొప్పిగా వుంది."
    "మరి చెప్పవేం. డాక్టర్ కు ఫోన్ చెయ్యవా?"
    "ఇంత మాత్రానికే డాక్టరెందుకండి? అనాల్జిస్ వేసుకున్నాను. అదే తగ్గిపోతుంది."
    "సామానులు సర్దావా?"
    "ఆ..."
    "దాదాపు పన్నెండు రోజులు అవుతుంది. బట్టలు సరిపోను తెచ్చుకో!"
    ఆమె మాట్లాడలేదు.
    రమణ భార్య ముఖంలోకి చూశాడు.
    ఆ ముఖంలో వుత్సాహంలేదు. ఏదో చెప్పాలనే మధన కన్పిస్తోంది.
    "ఏమిటి అనూ! అలా ఉన్నావేం?"
    "ఎలా ఉన్నానూ?" పేలవంగా నవ్వింది.
    "ఏదో ఉంది. చెప్పు?"
    "మీరు బాధపడతారేమోనని భయంగా వుంది."
    "ఇంతకీ సంగతేమిటో చెప్పు. సస్పెన్సుతో చస్తున్నాను."
    "నేను మీతో క్యాంపు రావడంలేదు."
    రమణ తెల్లబోయి భార్య ముఖంలోకి చూశాడు.
    అంతవరకూ టేబుల్ మీద వున్న టెలిగ్రామ్ ను రమణ గమనించలేదు.
    "ఆ టెలిగ్రామ్ ఏమిటి? ఎక్కడ్నుంచి వచ్చింది?" ఆదుర్దాగా అడిగాడు.
    "సావిత్రి టెలిగ్రాం...
    "ఆవిడెవరు?"
    "నా స్నేహితురాలు..."
    "ఏమైందట ఆవిడకు?"
    "ఏమీ కాలేదు. ఇవ్వాళ విశాఖపట్నం బయలుదేరి రేపు ఉదయం వస్తున్నాదట!"
    "మధ్యలో ఈవిడెవరు పానకంలో పుడకలాగ. ఆరునెలల నుంచి మనకు ఎక్కడకీ వెళ్ళడానికి కుదర్లేదు. తీరా అవకాశము వచ్చేసరికి, ఈ పానకంలో పుడక ఒకటి..."
    "సావిత్రి నేనూ కలసి చదువుకున్నాం. ఒకే ప్రాణంగా మెలిగాం ఆవిడ తల్లిదండ్రులు నన్ను వాళ్ళ కూతురిలాగే చూసే వాళ్ళు..."
    "ఇన్నింటికీ ఏమంటావ్?" విసుగ్గా అన్నాడు రమణ.
    "తను వస్తుంటే..."
    "నువ్వు వుండాలంటావ్!"
    "అవునండీ. నన్ను చూడటానికే వస్తుందనుకుంటాను. ఇంటికి తాళం వేసి మనం వెళ్ళిపోతే ఈ కొత్త ఊళ్ళో ఎక్కడికి పోతుంది?"
    "తర్వాత రమ్మని టెలిగ్రాం ఇవ్వు"
    "టైమ్ లేదుగా? ఇవ్వాళే బయలు దేరుతోందిగా!"
    రమణమూర్తి ముఖం గంభీరంగా మారింది.
    "బాధపడుతున్నారా?
    "అబ్బే! చాలా సంతోషిస్తున్నాను." ఉడుక్కుంటున్నట్టు అన్నాడు.
    అనసూయ పకపక నవ్వింది.
    "నీకు నవ్వులాటగా ఉందా?"
    "అది కాదండీ..."
    "నాకేం చెప్పకు."
    ఆమె లేచవచ్చి భర్త మెడ చుట్టు చేతులువేసి వీపు మీదగా వంగి "మా వారు చాలా మంచివారు. నా మీద అసలు కోపమే రాదు" అంది.
    రమణ కరిగిపోయాడు.
    "సరే ఒక టికెట్ క్యాన్సిల్ చేస్తాను."
    "మీరు కూడా మానెయ్యకూడదూ?"
    "వీలులేదు మద్రాసు వెళ్లాలి. ఆఫీసు పని చూసుకొని నాలుగురోజుల్లో వచ్చేస్తాను."
    "నాకూ బాధగానే వుంది. ఆ సావిత్రి ఇప్పుడే ఊడిపడాలా? దాన్ని చూసి చాలాకాలమైంది. అది వస్తుందన్న సంతోషం ఒక వైపు, మన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందనే బాధ మరోవైపూ..."
    "మరోసారి వెళదాంలే."
    "మీరు ఇంత త్వరగా శాంతిస్తారనుకోలేదు. మా వారు మహా మంచివారు..."
    ఆయన నవ్వాడు.
    "నువ్వు భోజనం చెయ్యి. నాకు టైమౌతోంది" అన్నాడు రమణమూర్తి.
    రమణమూర్తి పెట్టె తీసుకొని బయలుదేరాడు.
    "వెళ్లొస్తాను?"
    "త్వరగా వస్తారు గదూ!"
    పని పూర్తి కాగానే రెక్కలు కట్టుకుని రాణీగారి ముందు వాలిపోనూ! కొంటెగా చూస్తూ అన్నాడు రమణమూర్తి.

 Previous Page Next Page