Previous Page Next Page 
సరస్వతీ మహల్ పేజి 2

                                శృంగార లహరి
        పారదోలితివే సవతి పోరు తలగంగ   
        కూర్మి మగని పక్క జేరి గౌరి?
        అమ్మ! నీవు మగని రొమ్మెక్క పొగులు నీ
        సవతి చల్ల పరుప సాగె చెల్లి
    పార్వతిని మేలమాడింది లక్ష్మి. "ఏమ్మా గౌరీ! మొగుని పక్క చేరి నీ సవతి పోరు తొలిగేలా గంగను పారదోలావా?" సరసవంతులు సరస సంభాషణా చతురమతులు సమయం సందర్భం దొరికితే మాటలతో ఈటెలు విసరడం సహజాతి సహజం. అలా పార్వతి లక్ష్మి కలుసుకున్నప్పుడల్లా ఎవరో ఒకరు ఎత్తి పాడవడం - దానికి తగ్గట్టు అన్నవారి మొహం చిన్నబోయెట్టు సమాధానం మరొకరు ఇవ్వడం మామూలే. ఒకసారి "బిచ్చ గాడెక్కడమ్మా" (భిక్షుః క్వాస్తి) అని అడిగిందట లక్ష్మి. దానికి గౌరి బలిచేసే యజ్ఞం దగ్గరకు వెళ్ళాడు.
(బలిర్మఖే) అని సరసంగా జవాబిచ్చిందట. ఆ కోవలోనే ఏడమ్మా నీ సవతి....ఆమెని పారదోలి సవతి పోరు తొలిగించుకున్నావా అని అడిగిందట లక్ష్మి. దానికి గౌరి... అవునమ్మా నేను మగనిలో సగమైతే. నువ్వు మీ ఆయన రొమ్మెక్కి కూచున్నావు. దాంతో పొగులుతున్న నీ సవతి భూదేవిని చల్లబర్చటానికి నా చెల్లి వెళ్ళింది అందిట. సాధారణంగా గంగను గౌరిని కవులు అక్కచెల్లెళ్ళుగా సంభవిస్తారట. సవతులుగా భావించరట. గంగను చెల్లిగా తలపోసింది గౌరి గౌరి. భూదేవి ఉడుతు మోత్తనంతో 'పొగలు' తే చల్లబరిచేది గంగే (వర్షం) కదా! ఎంత గొప్ప భావన.
    ఇది ఒక ముక్తకం...రసికుడైన కవి తన కొండంత భావాన్ని గోరంత 'చిన్ని' పద్యంలో ఇమిడ్చి ప్రతిభా పాటవాన్ని ప్రదర్శిస్తాడు. హాలుని గాధా సప్తశతి, అమరుకం అలాంటివి. ఇది ఈ 'శృంగార లహరి' ఇటీవలి (1981) కాలంలో వెలువడిన ఒక ఆణిముత్యాల సరం. దీనిలో ఏ పద్యానికి ఆ పద్యమే! దేనికదే గొప్ప. నాలుగు పాదాల్లో నవ్వుల హరివిల్లు - అలతి అలతి మాటల్లో అసదృశ భావనకు బొమ్మ కట్టడం - చాలా 'ప్రతిభ'గల కవి 'పండించిన' గొప్ప శృంగార కావ్యం ఇది.
    జోస్యం జనార్ధన శాస్త్రిగారు 508 ముక్తకాలతో నాలుగు తరంగాలుగా తీర్చిదిద్దిన 'శృంగార లహరి' ప్రతి పద్య రమణీయంగా ప్రతి పద కమనీయంగా ఉంది. ప్రతి పద్యాన్ని 'ఎత్తి చూపాలి' అంటే కష్టం....ఎత్తి పొడవడం మీద వి'శ్లేషించి'న పద్యం (343 పు 70) ఆలోచనామృతం.
    చమత్కారాలు చేయడానికి దేవతల విషయాలు వీలిచ్చినంతగా మరే విషయాలు ఇవ్వవు అందుకే ముందుగా శాస్త్రిగారు దేవతల 'పని' పట్టారు. ఆ మీదట సాంసారికము.
    ప్రాయపుసిరి పొంగువారు మేన్ బిగి జిగి
    సోయగంబు లొలుకు తోయజాక్షి
    కలువ కన్నుల బాల ఆ బేల - ఆమె మేను బిగి - పటుత్వము - జిగి జగజగా మెరిసే అందం - అవేకాక ఆమె ప్రాయం - ఎలా ఉంది? ఆ ప్రాయపు సిరి పొంగువారుతూ ఉంది. అందమా చెప్పతరం కాదు. కన్నులా కలువ కన్నులు ఇక యవ్వనమా? విరిసి విరిసి పొంగి పొర్లుతుంది జిగిబిగి ఉంది--- ఇక అలాటి అందగత్తెను---చూడ,
    తోడనిలువ, సుంత తోడ్పడ పలకరింపు బుద్ధి పుట్టునెవనికైన అంటారు శాస్త్రిగారు. బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు అన్న రీతిగా అన్నారు. అంతోటి జిబ్బోక వతిని చూడాలని, తోడు నిలవాలని, కొంచెం సాయం చేయాలని పలకరించాలని బుద్ధి పుడ్తుందట ఎవ్వరికైనా! ఎంత లోకానుశీలనం---
    ఆ మీదట జానపదులుల జాణతనాలు "పదుల్లో" లెక్కించి చెప్పారు కవిగారు మొట్టమొదట - ఆడవారి చేయి అందుకుని - స్వతంత్రంచి - ఆ చేతులకు గాజులుతొడిగే - పల్లెసీమ వ్యాపారి గాజులసెట్టిపై సారించారు.
    పల్లె పల్లె తిరిగి మాల్లారముల్మోసి
    అడప దడప కదప గడప త్రొక్కి
    చిల్లర తిరునాళ్ళు గుళ్ళు నంగళ్ళు నీ
    పట్టని చేయి లేదు పడతులందు
    ఈ పద్యానికి ప్రతి పదార్ధం అక్కర్లేదు భావం వివరింప అక్కర్లేదు. పుత్ర కామేష్టి గురించి ఎంత మధుర కల్పన చేశారో చూడండి. అధరమాచ మించి హస్తద్వయి బ్రశస్త పూర్ణ కుంభయుగ్మమున్ వహించి శ్రోత్రియుడు పవిత్ర పుత్ర కావేష్టిలో కోరివేల్చు (359 పద్యం 79 పు) ఈ పద్యం కూర్పులోని సొగసుదనానికి - కవిగారి గడుసుదనానికి. "భళా"! అనక తప్పదు ఇంకో పద్యం చూద్దాం.
    గురు తరాసహ చిరవిరహజ్వరార్తకు
    నాడి చూచి పలుకు కోడె వెజ్జు
    మందువలవ దొక్క మారులంఘునమె
    పద్యము హితపర 'మౌషద'మ్మటంచు
    ఇందులో కూర్చిన పదాల పొందిక - సరస సంభాషణా సరస్వతి అందియ....'అనుభవ రసికో విజానాతి' ఇవే కాదు.... పుష్పలావికల ప్రబంధ ప్రసంగాలకు సరి దీటైని పద్యాలు - పల్లెటూళ్ళలో మాట విరపుల మరుని లీలలు ఎన్నో ఎన్నో ఇందులో గుది గుచ్చారు.
    తర్వాత నాల్గో తరంగంలో నాయికా నాయికుల 'సంగతులు'....ఇద్దరు భార్యలమగడు అతగాడు. ఒకామెకు అందరూ ఆడపిల్లలే. ఇంకొక భార్యకు అంతా మగసంతే! వాళ్ళిద్దర్నీ సమంగా సంభావిస్తూ మనకు అల్లుళ్ళ కోడళ్ళు వసారు. అంటాడుట దక్షిణ నాయకుడు.
    సంసారంలో సరిగమలు పలికిస్తూ 'అవ్వ మంచము పయి అమ్మ నన్నొదిలేసి నాన్న పక్కన పడుకొన్న దనుచు' పట్టుదలగా చేయు చిట్టి ఫిర్యాదుకు వదినెలు మరదండ్రు పక్కుమండ్రు అంటారు. ఇది ఇంటింటి భాగవతం పసితనపు రామలీలలు....అమాయకపు' భారతం.
    పది పండ్లల్లో ఒక పండు తీసి రుచి చూపించ గలుగుతారు. పది ముత్యాలలో ఒక ముత్యం తీసి దాని నాణెం ప్రదర్శిస్తారు. కుండెడు అన్నాన్ని ఒక మెతుకు చూసి దించేస్తారు. ఏదైనా అంతే! అంతే లేని భావనా పటమికు అడుగడుగునా అద్దం పట్టే కవిత్వాన్ని చిన్ని పరిచయంలో చూపించడం నాలాటి వారికి సాధ్యం కాదు వాచవి చూపించేస్తే రుచి మరిగి మొత్తాన్ని గ్రహిస్తారని ఆశ.
    ఈ ఐదొందల "ముక్తక స్రవంతిలో" మునిగితే ఆనందంలోంచి తేలడం కష్టం. అయినా ఎవరి కృషి వారిది! నీటి కొలిది తామర ముగింపు శాస్త్రిగారి మాటలే అంటాను.
    మచ్చుకొకటి నచ్చి మెచ్చు కొన్నను చాలు
    నచ్చ కృతి రచించు కృషి పలింను
    తలపు కొలదు లాట వెలదు లన్నింటిలో
    నేది యగునో ఎవని మోదవలనకు
    పంచ శతాధిక 'ఆట వెలిదీ' సమూహం పదాలని శృంగార తరంగ లహరిని సృష్టిస్తూ ఉంటే ఎవరికి దక్కిన ఆనందం వారికి దక్కుతుంది.
                                                       --*--

 Previous Page Next Page