Previous Page Next Page 
జీవితం! గెలుపు నీదే!!  పేజి 3


    "వెయ్యి రూపాయలే! అయిదొందలు తీసుకో బావా" అంటూ లోపలికెళ్ళి ఐదు వంద రూపాయల నోట్లు తెచ్చిచ్చాడు గోపి.
    "ఫిఫ్టీ పర్సెంటు కట్ అన్నమాట- ఏం చేస్తాం" ఈ రోజులలో అన్నీ కట్సేగా" నవ్వుతూ డబ్బు తీసుకుని పర్సులో పెట్టుకున్నాడు అజయ్.
    "బావా! ఇకముందు నుంచి నువ్వు నీకు కావలసిన దానికంటే డబుల్ అడగాలి. వంద కావాలనుకో రెండొందలు అడగాలి, వెయ్యి కావాలనుకో రెండువేలు అడగాలి."
    "ఇప్పుడంతే చేశానులే. నాక్కావలసింది అయిదొందలే, నాన్నగారిమాటలు విన్నాను."
    "అమ్మదొంగా వినేశావా?"
    "కొంచెం విన్నాను. నువ్వు పూర్తిగా చెప్పేశావు" నవ్వుతూ అన్నాడు అజయ్.
    "ఔను, చెప్పేశాను కదూ" తనూ నవ్వేశాడు గోపి.
    "ఔనూ! ఆదివారం వెళ్ళి ఎప్పుడు తిరిగొస్తారు?" అడిగాడు.
    "ఏం? ఏమైనా పనుందా?"
    "మామయ్య అన్ని వివరాలూ చెప్పకపోతే ఊరుకుంటారా?"
    "నిజమేలే. నాలుగు రోజులు ఉందామనుకుంటున్నాం. ఈ సంవత్సరంలో నలుగురూ నాలుగు వైపులకి పోతాం. ఉద్యోగం, ప్రాక్టీసు వీటిల్లో పడిపోతే ఇంక ఇలాంటి సరదాలకి సమయం కావాలన్నా దొరకదు" అన్నాడు అజయ్.
    అప్పుడే అటుకేసి వస్తూన్న మృత్యుంజయరావుగారు ఆ మాటలు విన్నారు.
    "ఏమిట్రా! నాలుగు రోజులు సమయం అంటున్నావ్?" అన్నారు.
    "ఫ్రెండ్సందరం కలిసి నాగార్జునసాగర్ వెళ్తున్నాం నాన్నా"
    "హాస్పటల్ తరపు నుంచి ఏమైనా క్యాంపా బాబూ"
    కాదండీ పిక్ నిక్ వెళుతున్నాం."
    "డబ్బు తీసుకున్నావా బాబూ!" అన్నారాయన ఆప్యాయంగా.
    "తీసుకున్నాను నాన్నా" అన్నాడు అజయ్.
    "ఎంతిచ్చావురా గోపీ?" అన్నాడు గోపీనుద్దేశించి.
    "అయిదొందలిచ్చాను మామయ్యా"
    "నాలుగు రోజులకి పరాయిచోట అయిదొందలేం సరిపోతాయిరా ఈ రోజుల్లో.
    "నువ్వు చెప్పినట్లుగానే వెయ్యి అడిగితే, ఫిఫ్టీ పర్సెంట్ కట్ చేసి అయిదొందలే ఇచ్చాను" అన్నాడు గొప్పగా. గోపీ మామయ్య మాటను తను తూ.చ తప్పకుండా పాటించానన్న గర్వంతో.
    అఘోరించావ్! పరాయి చోట డబ్బు సరిపోకపోతే అవస్థ పడడూ?"
    "నువ్వే కద మామయ్యా! అడిగినంతా ఇవ్వొద్దన్నావ్?"
    "అన్నాన్రా! కానీ వేరే చోటికి వెళుతున్నప్పుడు ఎలా?"
    మృత్యుంజయరావు గారి ఆందోళన చూసి, చిన్నగా నవ్వుకున్నాడు అజయ్ తృప్తిగా.
    "నాన్నా నాక్కావలసింది అయిదొందలే. చాలు, సరిపోతుంది" అంటూ లోపలికెళ్ళిపోయాడు.
    "ఒరేయ్! చూశావట్రా. ఎవరబ్బాయిరా వాడు! వాడికి కావలసినదానికంటే రూపాయెక్కువడగడు" అంటూ కొడుకుని పొగుడుతూ, గర్వంగా చెప్తున్న అతనికేసి చూసి "ఔను మామయ్యా బావ అజయ్ అచ్చు నీ పోలికే" అన్నాడు నవ్వుతూ గోపి.
    ఆదివారం ఉదయం ఆరింటికల్లా బయలుదేరారు అజయ్, ఫ్రెండ్సందరూ కలిసి. నాలుగు కార్లూ కిక్కిరిసి వున్నాయి. ఒకదాని వెనుక ఒకటి పోటీ పడుతున్నట్లుగా పరుగెడుతున్నాయి. ఇబ్రహీంపట్నం దాటి సాగర్ దగ్గర పడుతూన్న కొద్దీ, చల్లటి గాలులు వింజామరల్లా వంటికి తాకుతున్నాయి.
    ఆంద్రదేశం గర్వించదగ్గ ప్రదేశాలలో నాగార్జున సాగర్ ఒకటి. సాగర సౌందర్యం అంతా కనిపించేలా కట్టిన అందమైన గెస్టు హౌస్ ఆ ప్రదేశానికే ఒక అలంకారం. భోజన సదుపాయాలు, ఉండడానికి అందమైన గదులు, అక్కడ కూర్చుంటే ప్రాచీన బౌద్ధ సంస్కృతి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. మ్యూజియంకి వెళుతూంటే ప్రకృతి అంతా ఒక్కచోట గుమిగూడినట్లు, పచ్చటి చెట్లూ చేమలూ, ఒక పక్క లోయలూ, మరోపక్క సాగరానికి కనువిందు చేస్తున్నట్లుంది. 'మేసనరీ డామ్, ఆర్త్ డామ్, వర్క్ షాప్, యూనివర్సిటీ, మ్యూజియం, నాగార్జున రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ అన్నీ చూసుకుని మర్నాడు సాగర్ కి దిగువ భాగాన వున్న 'ఎత్తిపోతల' లోని చంద్రవంక 'వాటర్ ఫాల్స్' చూడడానికి వెళ్ళారు అందరూ.
    నీళ్ళని చూస్తే ఏదో ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఎవరికైనా పసిపిల్లల్లా కేరింతలు కొడుతూ, వళ్ళు మరిచి తిరిగారు ఆ ప్రదేశమంతా అజయ్, అతని స్నేహితులు. మెల్లగా సాయంత్రానికల్లా సాగర్ గెస్ట్ హౌస్ చేరుకున్నారందరూ. రెండు రోజులూ రెండు నిమిషాల్లా గడిచిపోయాయి అందరికీ.
    మర్నాడు పగలంతా కబుర్లు చెప్పుకుంటూ గెస్ట్ హౌస్ లోనే గడిపేశారంతా. సాయంత్రం ముస్తాబై అలా బ్రిడ్జికేసి నడిచారు. ఎత్తైన వంతెన, పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే కృష్ణవేణి, పల్లవి పాడుతున్నట్లు చల్లని పిల్లగాలి మైమరపిస్తుంది. అల్లంత దూరాన ఆకుపచ్చని చీరలో అందంగా వయ్యారంగా నడుస్తూన్న ఒక స్త్రీ వారి దృష్టి నాకర్షించింది. ఆమె వెనకే నడుస్తున్నతను ఏమన్నాడో ఏమో, ఆమె అతని చెంప మీద కొట్టడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
    "అబ్బ! భలే వేడిగా ఇచ్చింది చెంపమీద బ్రేవో" అన్నాడు దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూస్తున్న వేణు.

 Previous Page Next Page