Previous Page Next Page 
జీవితం! గెలుపు నీదే!! పేజి 4


    "దెబ్బతిన్నా అలా అందమైన అమ్మాయి చేతిలో తినాలి" అన్నాడు విఠల్.
    "వాడు వట్టి ఫూల్ లా వున్నాడు. ఆడదాని చేతిలో తన్నులు తిన్నాడు. 'టాక్ట్ లెస్ ఫెలో' అన్నాడు అజయ్.
    'టాక్ట్' చూపించడానికి ఇది కాలేజీ కాదు నాయనా, రోడ్డు. ఆ అమ్మాయి తలుచుకుంటే తను తన్నడమే కాదు, పదిమంది చేత తన్నించి ఉండేది కూడా. అందుకే ఆ మహానుభావుడు దెబ్బతిని కిక్కురుమనకుండా వెళ్ళిపోయాడు" అన్నాడు మహేంద్ర.
    "ఏడిశాడు. మట్టి బుర్ర" అన్నాడు అజయ్.
    వేణుకి అజయ్ ని ఓ ఆట పట్టించాలనిపించింది.
    "అదే నువ్వైతే ఏం చేసేవాడివేం?" అన్నాడు.
    "చేసి చూపించనా" అడిగాడు అజయ్.
    "ఓ.కే." అన్నాడు వేణు.
    "ఎంత బెట్"
    "రెండొందలు"
    "ఓ.కే." వెళ్ళాడు అజయ్.
    "గుడ్ లక్" అన్నాడు వేణు.
    అందరూ కుతూహలంగా అటుకేసి చూడసాగారు.
    "ఒరేయ్ చెంప జాగర్తరా, పళ్ళు  భద్రం" అని అరిచాడు విఠల్.
    అజయ్ మెల్లగా ఆమె వెనకాలే నడవడం మొదలుపెట్టాడు. ఒక చోట ఆగి నీళ్ళకేసి చూస్తూ నుంచుంది ఆమె.
    "అయ్యో! పడిపోయింది" అన్నాడు గట్టిగా అజయ్. ఆమె వెంటనే తిరిగి చూసి ఏమిటండీ! ఏం పడిపోయింది అంది కంగారుగా అజయ్ దగ్గరకొచ్చి.
    "అదేనండీ" అంటూ గట్టిగా ఆమె చెయ్యి పట్టుకుని నీళ్ళలోకి తొంగిచూశాడు అజయ్.
    "ఏయ్! ఎవరు నువ్వు? చెయ్యొదులు ముందు" అంది అతని చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ.


    "ఏమిటండీ? ఏమయిందీ?" అన్నాడు చెయ్యి వదలకుండానే.
    "చెయ్యొదులు ముందు" కటువుగా అంది.
    అంతలోకే జనం పోగయ్యారు అక్కడ.
    "వదలను. చూస్తూ చూస్తూ మిమ్మల్ని ఆత్మహత్య చేసుకోనిస్తానా? నా మాట వినండి. పదండి పోదాం. మిమ్మల్ని మీ ఇంటిదగ్గర దిగబెట్టి వెడతాను" అన్నాడు.
    "ఏమిటీ? నేను ఆత్మహత్య చేసుకుంటున్నానా? మీరు కాపాడుతున్నారా? నాన్సెన్స్! పోలీసుల్ని పిలుస్తాను జాగ్రత్త. వేషం చూస్తే పెద్దమనిషిలా వుంది. వేషాలు చూస్తే వెకిలిగా వున్నాయి. వదలండి" చెయ్యి విదిలించుకుంటూ అంది ఆమె.
    "సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది. పట్టుబడిపోయానన్న ఉక్రోషంతో ఏదేదో అంటున్నారు. పదండి ఇంటికి పోదాం"
    "చెయ్యొదులు" అని అరిచిందామె.
    "పాపం! అతను చూశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈపాటికి ఎంత పనైపోను?" అన్నాడు ఒకతను గుంపులో నుంచి.
    "ఇదేం పోయోకాలం? నిక్షేపంలా వుంది, చస్తానంటుందేంటి మరో గొంతు.
    "ఈ కాలప్పిల్లలంతేలే? ఏం పాడుపని చేసిందో ఏమో?" ఇంకో కంఠం.
    ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    "పదండి! నలుగుర్లో అల్లరైపోతారు" అన్నాడు ప్రాధేయపడుతూ అజయ్.
    "చెయ్యొదులు" మళ్ళీ అరిచిందామె.
    "వదలడమేమిటి? ఎత్తుకు తీసుకెళ్ళి ఇంట్లో పడేస్తే సరి. పాడుపని చేస్తూ పైగా దబాయింపు కూడా" అన్నారెవరో గుంపులోంచి.
    కాసేపుంటే ఆ గుంపులోంచి ఎవరో ఒకరు వచ్చి ఎత్తుకుని తీసుకెళ్ళేలా ఉన్నారు. అది గమనించిన అజయ్ మీరు వెళ్ళండి. నేను స్వయంగా తీసుకెళ్ళి ఈమెను ఇంటిలో దిగబెడతాను. జనాన్ని చూసి బతిమాలాడు అజయ్.
    ఒక్కొక్కరే వెళ్ళిపోయారు.
    పిచ్చెక్కినట్టయింది ఆమెకు. కళ్ళంట నీళ్ళు జలజలా రాలాయి.
    "మీ పేరు నాకు తెలీదు. నా పేరు అజయ్. నేను డాక్టర్ని. ఈ ఏడాదే హౌస్ సర్జన్ పూర్తయిపోయింది. స్నేహితులమందారం కలిసి 'పిక్నిక్ కి ఇక్కడికొచ్చాం. ఇక్కడ గెస్టు హౌస్ లో వుంటున్నాం. మీ చెయ్యి పట్టుకుని నడిపించుకొస్తానని నా ఫ్రెండ్స్ తో బెట్ కట్టాను. అందుకోసం ఏం చెయ్యాలో తెలియక ఇలా చేసేను. నన్ను క్షమించండి" అంటూ చెయ్యి పుచ్చుకుని నడుస్తున్న ఆమె చెయ్యొదిలేసి దండం పెట్టాడు.
    ఏం చెప్పాలో తెలియక పదిమందిలోనూ జరిగిన ఈ అవమానానికి బాధతో కన్నీళ్ళు కారిపోతూంటే ఆపలేక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది ఆమె.
    అజయ్ కి ఆమెనెలా ఓదార్చాలో అర్థం కావడం లేదు.
    "మీ పేరు" అన్నాడు జాలిగా.
    "మాధవి. నేను ఇక్కడ డిపార్ట్ మెంటల్ స్టోర్సులో 'సేల్స్ గరల్' గా పనిచేస్తున్నాను" అంది.

 Previous Page Next Page