ఈ యింట్లో ఎన్నో ఇబ్బందులున్నాయి. దినదినం జీవితం పోరాడినట్టుగానే వుంది! సమస్యల వలయంలో వున్నారంతా! అయినా ఈ పిల్లకి చీకూ చింతా లేవు. పరిస్థితులు యిలా మారకముందు తను- తను మాత్రం ఎలా వుండేది!
చప్పున బాల్యం గుర్తొచ్చింది.
తను అనుభవించిన సుఖం గుర్తొచ్చింది.
తన చిన్న తనం! ఎంత అందమైన అనుభూతి అది!
తన హాయి! ఎంత తీయని స్మృతులు అవి!
నిజంగా వీళ్ళకి ఆ హాయి సుఖం ఎక్కడిది? తనెంత సుఖపడింది! తనెంత లాలనని ప్రేమని పొందింది. తండ్రి తన నెంత ప్రేమగా చూసుకున్నాడు! తల్లి పూలలోపెట్టి పెంచింది తనను!"
ఒక్కసారిగా ఆమెకి ఆ రోజులు గుర్తుకు వచ్చేయి.
2
"నందా! నందా!" ప్రేమగా వలిచాడు నారాయణ.
"ఊ" మూలిగింది నంద. కళ్ళు తెరవలేదు. చేతులు చాచి తండ్రి మెడ చుట్టూ వేసింది. లాలనగా "లేవమ్మా తెల్లగా తెల్లారిపోయింది!" అన్నారు నారాయణ.
"నిద్రొస్తుంది నాన్నా!" గునిసింది నంద.
"అలా అంటే ఎలో తల్లీ! బడికి వెళ్ళొద్దూ!"
"అబ్బ! బడి ఎప్పుడూ వుండేదే కదా! అయినా బడి పదింటికి! ఇప్పుడెంతయింది!"
"ఎంతయిందా? నువ్వు కళ్ళు తెరిచి చూడొచ్చు! చెవులప్పగించి అయినా విను! అదిగో గడియారం గంటలు కొడుతోంది!" అన్నాడు నవ్వుతో.
ఒకటి! రెండు! మూడు! నాలుగు! అయిదు! ఆరు! ఏడు!
"ఊఁ" బరువుగా కళ్ళు తెరిచింది నంద!
ఆ సరికీ నిద్రలేచి స్నానంచేసి శుభ్రంగా తయారయ్యాడు నారాయణ.
అంతలో అటుగా వచ్చింది శివకామసు సుందరి "ఇంకా లేవలేదా తల్లీ!"
తల్లి చంక నెక్కింది నంద!
"పదేళ్ళపిల్లని నేను మోయలేనమ్మా! అన్నయ్య చూడు లేచి చదువుకుంటున్నాడు. తమ్ముడు స్నానం చేశాడు! చెల్లాయి కాఫీ తాగుతోంది! ఇదెక్కడి గోము తల్లీ!" అందామె.
నవ్వేసింది నంద! పారిజాతాలు గుప్పున రాలినట్లయింది.
వెళ్ళి చకచకా ముఖం కడుక్కుని అలాగే స్నానంచేసి వచ్చి, దుస్తులు మార్చుకుంది. వంటింట్లోకి వచ్చింది నంద. తల్లి యిచ్చిన కాఫీ తాగేసింది. చిరుచిరు చెమటలు తుడుచుకొంటూ తల్లి ముందు కూర్చుంది. కూతురికి చకచకా జడ వేసింది ఆమె!
"తయారయ్యారా?" అడిగాడు నారాయణ.
"ఊ!" అంది నంద.
"రండి! ఎనిమిదిన్నర దాకా పాఠం చెబుతాను!" అన్నాడతను.
పిల్లల్ని నలుగురిని కూర్చోబెట్టుకుని వాళ్ళ సందేహాలకి సమాధానాలు చెప్పసాగాడు. అంతా శ్రద్దగా వింటున్నారు. మధ్యమధ్యలో శివకామసుందరి వచ్చి చూసి వెడుతోంది. ప్రశాంతమైన మనస్సుతో వింటున్నారంతా! ఎనిమిదిన్నరకి అందరూ పుస్తకాలు మూసేశారు.
"మీల్స్ రెడీ!" వంటింటి గుమ్మంలోంచి నవ్వుతో పిలిచింది శివకామసుందరి.
"బోర్డు వేస్తావా? బెల్ కొడతావా?' ఛలోక్తిగా అడిగాడు నారాయణ.