Next Page 
సప్తపర్ణి పేజి 1

                                 


                                 సప్తపర్ణి

                                               __ యామినీ సరస్వతి

 




    ఉషాకాంత సంపూర్ణ సౌందర్యాన్ని సంతరించుకోకముందే... తొలికోడి గొంతు విప్పకముందే, సగం వూరు యింకా నిద్రలో వుండగానే లేచి చెరువుకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానజప తపాధ్యనుష్టానాలు తీర్చుకుని యింటికి వచ్చేస్తారు పరబ్రహ్మశాస్త్రి.

    ఆయన యింట్లోకి అడుగుపెట్టేసరికి భార్య పార్వతమ్మ ఆ వేళకే స్నానం చేసి కాఫీ తయారుగా వుంచుతుంది. ఇంటికి రాగానే మడినీళ్ళ బిందె దేవుడి అరుగుమీద పెట్టి భార్య యిచ్చిన కాఫీ త్రాగి దండెంపై ఆరవేసిన మడి పంచె కట్టుకుని దేవతార్చన ప్రారంభిస్తారు.

    దేవుడి పూజ అయ్యేసరికి రేడియోలో భక్తిరంజని పూర్తవుతుంది. ఆయన బయటికి వచ్చేసరికి అప్పటికే హాజరుగా వుంటారు శిష్యులు. ఆయన ఎమ్. ఎ. చదవలేదు. యూనివర్శిటీలో పి.జి. సెంటర్స్ లో ఉద్యోగం చేయలేదు. చదివింది ఎసెసెల్సీ, అభిమానంగా చదువుకుంది విద్వాన్. చదువంటే ఆయనకి తపస్సుతో సమానం. చిన్నప్పుడు చాలా కష్టపడి చదువుకుని పైకివచ్చారాయన. సరస్వతీదేవి ఆయన ఇంటిలో కంటిలో కాపురం పెట్టింది. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతివాక్కు విద్యార్ధులకు అపురూపంగా ఆనందంగా వుంటుంది.

    ఆయన మక్కువపడి చేసేది స్కూల్లో తెలుగు పండిత పదవి. అయినా ఆయనదగ్గరకి బి.ఏ. చదివేవాళ్ళు ఎమ్.ఎ చదువుతున్నవాళ్లూ వచ్చి సందేహాలు తీర్చుకుంటారు. పాండిత్యానికి తోడు మంచి కవితాధార వుంది తనకు. నచ్చిన దృశ్యం కంటబడినపుడు తను మెచ్చిన వూహ మదిలో మెదిలినపుడు ఆయన నోటివెంట పద్యాలు ఆశువుగా వచ్చేస్తుంటాయి. అదొక అపురూప వరం ఆయనకి.

    రీసెర్చి చేసి పి హెచ్. డి డిగ్రీ తీసుకున్న విద్యార్ధులు సైతం ఆయన ప్రతిభకి పాండిత్యానికీ ఆశ్చర్యపోతుంటారు. యూనివర్శిటీలో ఏ ప్రొఫెసరూ చెప్పని కొత్త కొత్త విషయాలు శాస్త్రిగారు చెపుతుంటే వాళ్ళకి ఆనందంతో నోట మాటరాదు.

    "మాస్టారూ! మీరు ఏ యూనివర్శిటీలోనో ఉండాల్సినవారు" అంటూంటారు అభిమాన పూర్వకంగా. దానికాయన తేలిగ్గా నవ్వేసి వూరుకుంటారు.

    ఎంతో క్లిష్టంగా వుండే వ్యాకరణం సైతం ఆయన కంఠంలో అలా అలా కరిగి మైనపు ముద్దలా సాగిపోవాల్సిందే__

    పద్యం ఎలా చదవాలి అని ప్రారంభించి, పద్యం ఎలా కంఠస్థం చేయాలో చెప్పి తెలుగుపాఠం ప్రారంభిస్తారాయన. అందుకే ఆయనవద్ద చదువుకోవాలంటే హరికధకు వచ్చినట్లు, సినిమాకు వచ్చినట్లు ఉత్సాహంతో వస్తారు.

    ఆరోజు కూడా ఆయన మామూలుగా అనుష్టానాదులు ముగించుకుని బయటికి వచ్చేసరికి నలుగురైదుగురు అబ్బాయిలు కూర్చున్నారు. ఆయనవచ్చిన కొద్దిసేపటికి ఆయన యేకైక కుమార్తె శ్రీవిద్య వచ్చింది.

    శ్రీవిద్యను చూసినవాళ్ళకి శాస్త్రిగారు తూచి తూచి పేరుపెట్టారా? అనిపిస్తుంది. అసలు శ్రీవిద్య యిలాగే వుంటుందేమో అన్న భావన కలిగితీరుతుంది. అందం, చందం, రూపం, విద్య అన్నీ అమరినట్లుగా వుంటుంది. వినయానికి మరోపేరులా భావిస్తుంది. ఇంటర్మీడియేట్ సెకండియర్ చదువుతోంది.

    వ్యాకరణం పాఠం చెబుతున్నారాయన. వ్యాకరణమైనా ఛందస్సయినా ఆయన కమ్మగా అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లుగా చెబుతారు.

    పాఠం పూర్తయి విద్యార్ధులు లేచారు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి బి.ఏ. ఫస్టియర్ వాళ్ళు వస్తారు. 

    విద్యార్ధులు వెళ్ళగానే శ్రీవిద్య నవ్వుతూ వచ్చింది.

    "డుమువులు ,ప్రధమావిభక్తి అని తెలియనివాళ్ళకి కూడా ఎలా పాఠాలు చెపుతారు నాన్నగారూ! నాకైతే మహా తలనొప్పి" అంది.

    ఎక్కువగా ఆయనదగ్గరకి తెలుగుమీద ఇంట్రస్టులేనివాళ్ళు వస్తారు. విసుగ్గా యీ తెలుగుపాఠాలు ఎందుకు చదవాలిరా అని తలపట్టుకు వచ్చినవాళ్ళు__ 'మాస్టారు యింకాసేపు పాఠాలు చెపితే బావుండునే' అనుకునేలా చెప్తారాయన. అదే ఆయనలోని విశిష్టత!

    "ఏం చెయ్యమంటావమ్మా. వీళ్ళకి గ్రూప్ సబ్జెక్ట్స్ మీద వుండే యింట్రస్టు తెలుగుమీద వుండదు. క్లాస్ రావాలని అవే బాగా చదువుతారు. తెలుగులో పాసైతే చాల్లే అనుకుంటారు. మరి అలాంటి వాళ్ళకి ముక్కుకి తాడేసి లాక్కురావాలంటే శ్రమ పడక తప్పదు" కూతురివంక ఆప్యాయంగా చూస్తూ అన్నారాయన.

    అసలు వీళ్ళకి తెలుగంటే అంత చిన్నచూపు దేనికో" తండ్రి ఎదురుగావున్న కుర్చీలో కూర్చుంటూ సాలోచనగా అంది.

    "చిన్నచూపు కాదు. కష్టపడటం యిష్టంలేక. అమృతం సాధించడం ఎంతకష్టమైనా ఆస్వాదిస్తున్నప్పటి ఆనందం ఎంత గొప్పదో తెలుసుకోలేని మూర్ఖులు. దేశ భాషలందు తెలుగు లెస్స అని పొగుడుతూనే వుంటారు. ఆ ఏం తెలుగు లెద్దూ! అని చప్పరిస్తూనే వుంటారు. అదోరకం చిత్రమైన మనస్తత్వం" కళ్ళజోడుతీసి సరిగా తుడుచుకుంటూ అన్నారాయన.

    "విద్యా కాస్త కాఫీ తెచ్చిపెట్టు తల్లీ!" టైమ్ చూసుకుంటూ అడిగారు.

    నవ్వింది శ్రీవిద్య.

    "నాన్నా! పదేళ్ళనుంచి మీకు సరీగా యీవేళకు కాఫీ తెచ్చి యిస్తున్నాను. ఒక్కసారికూడా మర్చిపోలేదు. అయినా మీరు అడగటం మానరేం?"

    కూతురి ప్రశ్నకు నవ్వారాయన. "నువ్వీ పదేళ్ళలో మీ అమ్మ యీ ముప్పయ్యేళ్ళల్లో ఎన్నడూ కాఫీ ఇవ్వటం మర్చిపోలేదు. నిజమే నేను అడగటం కూడా మర్చిపోలేదు. నేను మరిచిపోతే మీరూ మరిచిపోతారేమోనని భయం."

    శ్రీవిద్య నవ్వుకుంటూ వెళ్ళి కాఫీ తెచ్చి యిచ్చింది. గడియారం చూడక్కర్లేదు. ఆయన రెండోసారి కాఫీ తాగారంటే సమయం ఏడూ యాభై. గడియారాలు సరిదిద్దుకోవచ్చు.

    వచ్చిన విద్యార్ధులని కూచోబెట్టి పుస్తకం చేతిలోకి తీసుకున్నారు. శ్రీకృష్ణరాయబారం మెల్లిగా మృదుమధురమైన కంఠంతో పద్యం చదివారాయన. ఆయన పద్యం చదివితేనే సగం అర్ధమైపోతుంది.

    "మాస్టారూ! యీ రాయబారం వుత్త వేస్టే కదా! వెళుతున్న శ్రీకృష్ణుడికీ తెలుసు అది కుదరదని... పంపిస్తున్న పాండవులకీ తెలుసు. తెలిసి తెలిసీ యీ నాటకం దేనికి? డైరక్టుగా యుద్ధభేరీ మోగించక?" ఒక విద్యార్ధి ప్రశ్నించాడు.

    అతని కదో అలవాటు. అతని తలనిండా అన్నీ ధర్మసందేహాలే. ఫ్రండ్సందరూ అతన్ని మాస్టర్ సందేహం అని పిలుస్తుంటారు. పాఠం మొదలుపెట్టకముందే ప్రశ్నలేసి చంపుతాడు. 'అది అలా ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు జరగలేదు; అలా బాగాలేదు' అని విమర్శిస్తుంటాడు. అనవసర విషయాలమీద కుతూహలం ఎక్కువ.

    ఆ విద్యార్ధి ప్రశ్నకి శాస్త్రిగారు మృదుమందహాసం చేశారు.

    "అదొక రాజకీయ రహస్యం నాయనా! సంధి కుదిరేది కాదని అందరికీ తెలుసు. సంధి కుదిరినా యిరుపక్షాలకీ మనసులో రవరవలు తప్పవు. ఎన్నాళ్ళనుంచో రగులుతున్న అగ్ని ఒక్కసారి భగ్గుమని జ్వాలలాగా చెలరేగక తప్పదు. సంధికి ప్రయత్నించటం ఆచారం. అది తు.చ. తప్పకుండా చేశాడు కృష్ణుడు. తన రాజనీతి చతురతనంతా వినియోగించి తను పూర్తిగా సంధివేపుకే మొగ్గుతున్నట్లు లౌక్యం ప్రదర్శించాడు. అది శ్రీకృష్ణుడి వ్యక్తిత్వంలోని ప్రత్యేకత"__ 

Next Page