"పిలువు చాలదా?" భర్త మాటలకి నవ్విందామా.
"నాన్నా! అమ్మ పిలుపే మనకి కాలింగ్ బెల్!" అన్నాడు రవికాంత్.
"అలా అయితే యిలా పిలవకూడదు! ఏదో శబ్దం చేయాలి! నాన్న ఏమిటి అని అడగాలి! సారీ టు డిస్టర్బ్ అని-" యింకేదో చెప్పబోయాడు రవికాంత్.
"వంటయింది భోజనం చేస్తారా? అని అడగాలి అమ్మ!" అంది నంద పూర్తి చేస్తూ.
"నువ్వేం రాచబిడ్డవా? మీ నాన్న చక్రవర్తా?" అంది సుందరి.
"మరి మనింటి పేరేంటి?" కళ్ళు తాటిస్తో అడిగింది నంద.
నవ్విందామె ఆ ప్రశ్నకి. కూతురు మాటలకి ఆమె ఎక్కడలేని నవ్వొస్తుంది. అంత తెలివైంది నంద.
"ఇంటి పేరు చక్రవర్తులవారు!" ఎప్పుడో ఏ చక్రవర్తికో కావలసిన వాళ్ళయి ఆ భోగం నడుపుకుని వుంటారు. ఆ దర్జా వెలగబట్టి వుంటారు! ఇప్పుడెక్కడ? అంతా పోయింది తాము మామూలు మనుషులయిపోయారు. రెక్కాడితే డొక్కాడని రోజులివి! ఆ రోజులు- ఆరోజులు- ప్చ్! ఆ రోజులు పోయాయి. ఆఖరికి జమీన్ దారులు కాలేరు ఇప్పుడు.
తమకి ఏం మిగిలింది? తమ పెద్దలు ఏం మిగిల్చిపోయారు ఈ యిల్లు తప్ప!
ఈయన ఉద్యోగం తప్ప యింకో ఆధారం ఏముంది?
అనకూడదు కానీ ఏ యిబ్బంది అయినావచ్చి వోనెల రోజులు సెలవు పెట్టేస్తే తమ పని ఖాళీ! అప్పు చెయ్యాలో-"
"ఆలోచనల్లో మునిగిపోతావా? అన్నం పెడతావా?" అన్నాడు నారాయణ.
ఆమె ఆలోచనలు చెదిరిపోయాయి.
"మీదే ఆలస్యం!" అని నవ్వుతూ లోపలికి వెళ్ళింది.
ఆమె భర్తకీ, పిల్లలకీ కంచాలు పెట్టింది.
నందకి భర్త ప్రక్కనే వెండిగిన్నె పెట్టింది.
అదొక్కటే పురావైభవ చిహ్నమన్నట్టుగా మిగిలిపోయింది.
తమ పుట్టింటి వాళ్ళు తొలికాన్పులో రవికాంత్ కి అన్న ప్రాశన చేయిస్తూ యిచ్చింది. తర్వాత అందరికి అదే అయింది.
అయినా నంద ఒక్కతే యింకా ఆ గిన్నెలో తండ్రి కలిపి ముద్దలు పెడితే భోం చేస్తుంది. అది ఆమెకే స్వంతం అన్నట్టుగా.
"వూ, వూ రోజూ అక్కయ్యేనా? ఈరోజు నేనూ నాన్న దగ్గరే భోం చేస్తాను?" గునిసింది విమల. మగపిల్ల లిద్దరూ ఏమీ అనరు!
వాళ్ళకి తండ్రి అంటే ఎంత ప్రేమో అంత భయం! అందుకే ఆయనకి అల్లంత దూరంలో వుంటారు. వాళ్ళ ముద్దు ముచ్చటలు అన్నీ తల్లి దగ్గరే.
"విమలా!" పిలిచారు నారాయణ.
"నాన్నా!" బిక్క ముఖం వేసింది అప్పటికే. అతనినేమీ అనలేదు.
తల్లి వెళ్లి కూతురికి అన్నం కలిపి పెట్టింది. పెద్దకూతురిపై అలిగిన చిన్నమ్మాయిని లాలించింది. విమల కిమ్మనకుండా భోజనం చేసింది.
"రడియా!" తను ఆఫీసుకి తయారవుతూ అడిగాడు పిల్లలందరినీ.
"వో!" కోరస్ గా సమాధానం వచ్చింది.
"రండి!" కేకేశాడతను. నందవచ్చి సైకిల్ పై కూర్చుంది.
మిగతా ముగ్గురూ బిక్కముఖాలు వేశారు. మామూలుగా. రోజూ జరిగేదే యిదంతా! అందుకే "ఒరేయ్! ఎందుకురా ఆ ఏడుపుగొట్టు ముఖాలు? చూడండి నా తల్లి ముఖం! ఎప్పుడైనా అలా వుంటుందా?" గర్వంగా అన్నారు నారాయణ.
"ఒక్క రోజు నడిపించి చూడండి తెలుస్తుంది!" అంది శివకామసుందరి.
"సుందరీ! నా తల్లిని నడిపిస్తానా?"
"ఎందుకో ఆ ప్రత్యేకత!"