భార్య పిల్లలిద్దరిని పిలిపించడం తెలీని కేశవరావు హఠాత్తుగా వచ్చిన ఇద్దరినీ చూసి కాస్త ఆశ్చర్యపడ్డాడు. అప్పుడే టెన్నీస్ ఆడి వచ్చిన అతను ఇంట్లో పిల్లలని చూసి ఆశ్చర్యంగా "వాటె ప్లెజంట్ సర్ ప్రైజ్" అన్నాడు సంతోషంగా.
"ఏమిటి కబురన్నా లేకుండా ఇద్దరూ ఒకేసారి వూడిపడ్డారు-" షూ లేసులు విప్పుకుంటూ అన్నాడు కేశవరావు.
"మమ్మీ మాట్లాడాలి అని రమ్మంటే..." ఇద్దరూ ఒకేసారి అన్నారు. కేశవరావు తలెత్తి సందిగ్ధంగా భార్యవంక చూసాడు.
"ఆ... నేనే రమ్మని ఫోను చేశాను... మీ జన్మభూమి" పిచ్చి గురించి చెపుదామని రాజేశ్వరి కాస్త హేళనగా అంది.
"డాడీ మమ్మీ అంటున్నది నిజమేనా... ఎందుకంత సడన్ గా యిలాంటి నిర్ణయం తీసుకున్నారు..." ఎంత అమెరికాలో పెరిగినా, పిల్లలిద్దరితో ఇంట్లో తెలుగు మాట్లాడడంతో పిల్లలకి చదవడం రాకపోయినా మాట్లాడడం బాగానే వచ్చింది.
"అదేదో మీ మమ్మీనే అడగండి...అదీ చెప్పే వుంటుందిగా. కేశవరావుకి భార్య తనకు చెప్పకుండా పిల్లలని పిలిపించిందన్న వార్త కాస్త బాధ కలిగించింది!" చెప్పింది. కాని అసలు యిదంతా మీరు సీరియస్ గా ఆలోచించే చేయదల్చారా..." కొడుకు విక్రమ్ అన్నాడు.
"డాడీ యిన్నాళ్ళబట్టి యిక్కడుండి, యిప్పుడు హఠాత్తుగా అక్కడికెళ్ళి ఎడ్జస్ట్ అవడం అంత సుళువుకాదు అని నా ఉద్దేశ్యం..." ముప్పైఏళ్ళ కొడుకు తండ్రితో డిస్కషన్ ఆరంభించాడు.
"డాడీ మమ్మీకి అసలు యిష్టం లేదు. సుఖానున్న ప్రాణం దుఃఖాన ఎందుకు పెట్టుకోడం... ఆలోచించండి..." కూతురు వంత పాడింది.
"వారంరోజుల నుంచి చెప్పి, చెప్పి విసుగెత్తింది. ఆయన పాట ఆయనది- నా మాట వినడంలేదనే మిమ్మల్ని రమ్మన్నాను- కనీసం మీరయినా ఆయనకి కాస్త అర్థమయ్యేట్టు చెపుతారని..."
కేశవరావు బూట్లు పట్టుకులేచి "స్నానం చేసి వస్తా..." అంటూ బాత్ రూంవైపు వెళ్ళిపోయాడు. అంతా మొహాలు చూసుకున్నారు.
ఆగిపోయిన సంభాషణ రాత్రి డైనింగు టేబిల్ దగ్గర. ఈసారి కేశవరావే ఆరంభించాడు. "చూడండి- నాకు నా దేశం కోసం, నేపుట్టిన వూరు కోసం ఏదన్నా చెయ్యాలనిపిస్తూంది. అది తప్పాలోచన అంటారా?"
"ఆలోచన తప్పుకాదు. కానీ ఆచరణ చాలా కష్టం డాడీ. మీరు ప్రాక్టికల్ గా ఆలోచించడంలేదనిపిస్తుంది" విక్రమ్ అన్నాడు.
"అక్కడ సదుపాయాలుండఉ. ఈ సుఖాలలవాటయ్యాక అక్కడా అడ్జస్ట్ అవడం కష్టమన్న పాయింట్ ఒక్కటేనా మీ అందరి అభ్యంతరం- యింకేదన్నా వుందా?" అందరివంకా ప్రశ్నార్థకంగా చూసాడు కేశవరావు. పిల్లలిద్దరూ తల్లి వంక చూశారు.
"అదే గదా పెద్ద అభ్యంతరం. ఆ వెధవ పల్లెటూరిలో జీవితంతో యీ చరమాంకంలో వచ్చి వుండమనడం. ఆ అభ్యంతరం చాలదా..." రాజేశ్వరి కాస్త తీవ్రంగా అంది.
"చూడు రాజీ. నీకిక్కడ దొరికే సదుపాయాలు, సుఖాలు అక్కడ దొరికేట్టు చేస్తే అక్కడికి రావడానికి నీకు అభ్యంతరం ఉంటుందా. నీకు మంచి యిల్లుండాలి- పంపులు తిప్పితే వేడి, చన్నీళ్ళు రావాలి. షవర్ బాత్ లు, టబ్ బాత్ లు కావాలి. వంటగది ఆధునికంగా అన్ని సదుపాయాలతో ఉండాలి. ఎలక్ట్రిసిటీ యిరవై నాలుగు గంటలు వుండాలి. కారులో ప్రయాణించడానికి రోడ్లు బాగుండాలి. నీకు కాలక్షేపం కావాలి... ఇవన్నీ ఏర్పాటుచేసే పూచీ నాది. డబ్బుతో కొండ మీద కోతినయినా తీసుకురావచ్చు. నాకు నాలుగయిదు నెలల టైము ఇవ్వు... అన్నీచేసి నిన్ను తీసుకెళ్ళి చూపిస్తా. నచ్చితే వుండు. వున్నాక ఇంకా నీకు ఆ వాతావరణము, పరిసరాలలో ఇక్కడుండలేననిపిస్తే మళ్ళీ అమెరికా వచ్చేయ్..."
"వచ్చేయ్ అంటున్నారు...మీరు అక్కడే వుంటారా..." అనుమానంగా అడిగింది.
"రాజీ... తరువాత ఏమవుతుంది అన్నది... వుండగలమా లేదా అన్నది నేను యిప్పుడు ఆలోచించడం లేదు. వెళ్ళాలి అన్నదాని మీదే యిప్పుడు నా దృష్టి వుంది. తరువాత సంగతి నేనేం చేస్తానో యిప్పుడు చెప్పలేను."
తండ్రి మాటలనుబట్టి తండ్రి చాలా సీరియస్ గానే యిది ఆలోచిస్తూ ఒక స్థిర నిశ్చయానికి వచ్చినట్లు పిల్లలకి అర్థం అయింది. యింకేం చెప్పమంటావు అన్నట్లు తల్లివంక చూశారు.
"గోరంతలు కొండతలుగా ఊహించకండి. ఏదో మృత్యుగుహలోకి వెడుతున్నట్టు బెంబేలు పడుతున్నారేమిటి...నచ్చకపోతే, నేను అనుకున్నది చేయలేననిపిస్తే, అక్కడ ఇమడలేననిపిస్తే వెనక్కి రావచ్చు. మన ఇల్లు, వాకిలి, ఆస్థి అంతా ఇక్కడే వుంటుంది. కొంత కేష్ మాత్రం ఖర్చు అవుతుంది. నాకు ఇంత వుంది. అందులో కాస్త తగ్గినంత మాత్రాన నష్టం లేదు..."
"ఈ ప్రాక్టీసు అది వదులుకుంటే మళ్ళీ కావాలన్నప్పుడు..." విక్రమ్ అన్నాడు.
"నా జూనియర్లున్నారు...కొన్నాళ్ళు వాళ్ళకి అప్పగిస్తాను. నేను వెనక్కివస్తే నా ప్రాక్టీసు నాకు మళ్ళీ వస్తుంది. అయినా నేను క్రమంగా ప్రాక్టీసు తగ్గించుకుంటున్నాను. ఇదివరకంత శ్రమ అక్కరలేదు నాకు. కేవలం కాలక్షేపం కోసం కొన్ని గంటలు చాలు నాకు" డాక్టర్ కేశవరావు అన్నాడు.
"అయితే ఎప్పుడు వెళదాం అనుకుంటున్నారు డాడీ..." కూతురు అడిగింది.
"ఏది వారం కిందటే ఓ నిశ్చయానికి వచ్చాను. ముందు నా ఉద్దేశం ఇది అని ఆంధ్ర ముఖ్యమంత్రికి రాశాను. అతని నుంచి జవాబు వచ్చాక టిక్కెట్టు అవి కొనుక్కోడం...కనీసం నెల పట్టవచ్చు. నేను ఏర్పాట్లు చేసుకుని బయలుదేరేసరికి...ముందు నేను వెడతాను.
"నేను ఒక్కర్తినే ఇక్కడేం చెయ్యాలి... పదండి నేనూ వస్తాను."
"వద్దు... అన్ని ఏర్పాట్లు చేయకుండా నిన్ను తీసుకెళ్ళను..అక్కడ నీవు ఇబ్బందిపడడం నాకు ఇష్టం లేదు" రాజేశ్వరి ఏదో అనబోయింది.
వాళ్ళ మాటలమధ్య ఫోన్ మోగింది. పక్కనే వున్న ఫోన్ తీశాడు కేశవరావు. "హలో... డాక్టర్ కేశవరావుగారు మాట్లాడేది... ఇండియానుంచి ముఖ్యమంత్రిగారు మాట్లాడతారు... జస్టే మినిట్...ముఖ్యమంత్రి పర్సనల్ అసిస్టెంట్ అన్నాడు. కేశవరావుగారు ఆశ్చర్యానందాలతో... "హలో...సర్, గుడ్ యీవినింగ్. నా ఉత్తరం అందిందా, ఫాక్స్ పంపాను అందుకే."
"డాక్టర్ కేశవరావుగారూ, మీ ఉత్తరం చదవగానే నాకెంత సంతోషం కలిగిందో చెప్పలేను. నా మాటలు, భావాలని అర్థం చేసుకుని మీరు యిలా రియాక్ట్ అయి మీ జన్మభూమికి సేవ చేసేందుకు నిర్ణయించుకున్నందుకు మీకు నా కృతజ్ఞతలు సార్. మీరు రండి. మీకిక్కడ ఏం కావాలన్నా మా గవర్నమెంటు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తుంది... మీరు చూపిన యీ దారి మరికొందరికి మార్గదర్శకం అవుతుంది. ఎవరో ఒకరు దారితీస్తేగాని మనదేశం ముందుకు వెళ్ళలేదు- మీరు వెంటనే రండిసార్... మీకోసం ఎదురుచూస్తాను. వచ్చాక మిగతా వివరాలు మాట్లాడి ఒక ప్రోగ్రాం ఛాకౌవుట్ చేద్దాం...ఐ యామ్ సో హ్యాపి డాక్టర్.
థాంక్యూ సార్... మరివుంటా. మీరు రాగానే నన్ను కాంటాక్ట్ చెయ్యండి. "జై జన్మభూమి" ముఖ్యమంత్రి చాలా ఉత్తేజితుడై మాట్లాడాడని ఆయనకి అర్థం అయింది. కేశవరావుకి అప్పుడే ఏదో సాధించినంత ఉద్విగ్నంగా "థాంక్స్ సార్. త్వరలో వచ్చి కలుస్తాను, గుడ్ నైట్" అంటూ ఫోన్ పెట్టేశాడు.