Read more!
Next Page 
అగ్ని పరీక్ష పేజి 1

                                 


                                                                  అగ్ని పరీక్ష
                                                                            ----డి. కామేశ్వరి

                             

    సికింద్రాబాదు స్టేషనులో కోణార్క ఎక్స్ ప్రెస్ కూతవేసి కదిలింది. రైలు ఎక్కిన స్నేహితుడికి వీడ్కోలుగా చేయి ఊపాడు రాజేష్.
    ఆ క్షణంలోనే పక్క కంపార్టుమెంటు అతని ముందుకు వచ్చింది. అక్కడ కిటికీ దగ్గర కనిపించిన మొహం చూసి సంభ్రమాశ్చర్యానందాలతో "అర్చనా!" అంటూ ఒక్క కేకపెట్టాడు రాజేష్.
    రైలు చప్పుడులో ఆమెకాకేక వినపడలేదు. రాజేష్ మరేం ఆలోచించకుండా ఒక్క ఉదుటున తన ముందుకు వచ్చిన కంపార్టుమెంటు కమ్మీపట్టుకు రైలెక్కేశాడు. రెండేళ్ళ తరువాత అర్చన కనిపించింది. ఆమె ఎడ్రసు తెలియక, ఆమె యెక్కడుందో వెతికినా కనబడక, ఎడ్రసు అడగని తన తెలివి తక్కువ తనాన్ని కొన్ని వేలసార్లు తిట్టుకుని వుంటాడు ఈ రెండేళ్ళలో. ఈరోజు అప్రయత్నంగా ఆమె కనబడేసరికి అతనికి సంతోషంతో మతిపోయింది.
    కంపార్టుమెంటులోంచి అర్చనవున్న కంపార్టుమెంటువైపు పరిగెత్తి నట్టే దూసుకుపోయాడు రాజేష్. ఆమె కిటికీలోంచి బయటికి చూస్తోంది. రాజేష్ రాకని గమనించకుండా. "అర్చనా.....అర్చనగారూ....."రాజేష్ గొంతు వణికింది.
    అర్చన చివుక్కున తల తిప్పి చూసింది. ఆమె కళ్ళల్లో మెరుపు ఆశ్చర్యానందంతో "అరే.....మీరా?.....ఎన్నాళ్ళయింది. ఎక్కడనుంచి, ఎక్కడికి వెళుతున్నారు?...." ఆమె మాటలు కూడా తడబడ్డాయి....."రండి ....కూర్చోండి" కాస్త జరిగి తన పక్కన సీటు చూపించింది.
    "ఏమిటిలా హఠాత్తుగా కలుసుకున్నాం. యీ రోజు మిమ్మల్నిలా చూస్తాననుకోలేదు. మీరింకా ఢిల్లీలోనే వున్నారా.....ఎక్కడికెడుతున్నారు?" ఆరాటంగా చూస్తూ ప్రశ్నలు కురిపించింది. రాజేష్ కి నోట్లోంచి మాట రావటంలేదు. ఆమె కనపడిన ఉద్వేగం, పరుగున రైలెక్కడం, ఆత్రుత, ఆరాటం ఏదో తెలియని ఉద్విగ్నతతో అతని నోరు మూగపోయింది. కంపార్టుమెంటులో ఉక్కగా, ఉక్కిరిబిక్కిరిగా అనిపించింది. "ఒక్క నిముషం.....చెపుతా" అంటూ రాజేష్ జేబులోంచి రుమాలు తీసి మొహం తుడుచుకున్నాడు. మనసు స్థిమిత పరచుకోడానికి.
    "ఈ రెండేళ్ళుగా మీగురించి ఎన్నిసార్లనుకున్నానో-కనీసం మీరు నా ఉత్తరానికి జవాబన్నా రాస్తారనుకున్నాను. ఎన్నాళ్ళు ఎదురు చూశానో మీ జవాబు కోసం.......ఉత్తరం రాకపోయేసరికి, 'ఏదో అవసరంలో ఆదుకున్నారు అంతే, అతనింక నాతో ఏ సంబంధం పెట్టుకోదలుచుకోలేదు' అనుకుని కొన్నాళ్ళు బాధపడ్డాను. నేనే యింకోసారి రాద్దామనుకుని మీరేం అనుకుంటారో, మీకిష్టంలేదేమోననుకొని" ఆమె చెప్పుకుపోతోంది.
    "అన్యాయం.....అన్యాయం అర్చనగారూ!" ఆరాటంగా ఆమెని అడ్డుతూ "ఎంత నెపం వేస్తున్నారు నామీద. ఎడ్రసివ్వకుండా మీరు ఉత్తరం రాశారు. మీ ఎడ్రసు తెలియక నేపడ్డ ఆరాటం, అవస్థ ఆ దేముడి కెరుక. మిమ్మల్ని ఎడ్రసు అడగని నా మతిమరుపుని ఎన్నిసార్లు తిట్టుకున్నానో.....మరో ఉత్తరం ఎడ్రసిస్తూ రాస్తారు రాస్తారని ఎదురుచూశానో ఎలా చెప్పను మీకు. మీరెలా వున్నారో.....ఏమయ్యారో.....ఏ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో అని ఎంత ఆరాటపడ్డానో.....బాధపడ్డానో మీకెలా చెప్పను" రాజేష్ విచలితుడై అన్నాడు.
    అర్చన తెల్లబోయింది "ఎడ్రసు యివ్వలేదూ, అరే నేను వచ్చే ముందు ఎడ్రసిచ్చాననే అనుకున్నాను. చూడండి ఎంత స్టుపిడ్ నో, కనీసం ఉత్తరంలోనైనా రాయకుండా మీనుంచి జవాబులేదని ఎంత బాధపడ్డానో. ఎన్ని రకాలుగా అపోహపడ్డానో." అర్చన విలవిల్లాడింది.
    "అర్చనగారూ గత రెండేళ్ళలో మీ గురించి తెలుసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలుసా, రెండు నెలలు ఉత్తరంకోసం చూసి చూసి ఆఖరిన మీవారు తిట్టినాసరే ఏమన్నాసరే ఎడ్రసు అడగాలని ధైర్యం చేసి వెళ్ళాను - మీ అడ్రసు అడిగితే ఆయన తీక్షణంగా, అనుమానంగా చూశారు. మా ఆవిడ ఎద్రసా. ఎందుకు?.....ఆవిడ ఎడ్రసు మీకెందుకు కావాలి...." అంటూ నిలువునా చీరేస్తున్న చూపులతో ఎంత అవహేళనగా అడిగారో ఆఖరికి ఎడ్రసివ్వకపోగా ఎంతమాట అన్నారో తెలుసా." ఏం కథ, ఆవిడగారు నీతో కూడా ఏమన్నా గ్రంథం నడిపిందా. పక్కన వున్నావు. అందుబాటులో వున్నావు అదా కథా." అంటూ మాట్లాడుతూంటే- నాలుగు తిట్టి నోరు మూయించి వచ్చాను. ఆ తరువాత ఇంకెవరిచేతనైనా అడిగించాలనుకున్నాను. యీలోగా ఆయన యిల్లు ఖాళీచేసి వెళ్ళిపోయాడు."
    "సారీ వెరీ వెరీ సారీ రాజేష్ గారూ - నా తెలివి తక్కువ తనంతో మిమ్మల్ని యింత బాధపెట్టినందుకు క్షమించండి."
    "నిజమే రెండేళ్ళు మీరు నన్ను నిజంగానే బాధపెట్టారు." ఆమె కళ్ళల్లోకి సూటిగాచూస్తూ అన్నాడు. అర్చన అతని చూపులకు యిబ్బంది పడి మొహం వాల్చుకుంది.
    "అర్చనా......ఒకసారి మీ ఏలూరు ప్రత్యేకం వచ్చాను తెలుసా. మీరెక్కడున్నారో వెతికి పట్టుకోవాలని." అర్చన ఆశ్చర్యంగా ప్రశ్నార్దకంగా చూసింది.

Next Page