Next Page 
డి.కామేశ్వరి కథలు పేజి 1

                                 


                                           సమాంతర రేఖలు

                                                                    డి. కామేశ్వరి

       

    'హాయ్' అంది ఫోనులో గొంతు - ఎన్నేళ్లయినా ఆ గొంతు గుర్తే నాకు.
    'పావనీ' గొంతు పెగుల్చుకుని ఆ ఒక్కమాట అనగలిగాను.
    'ఫరవాలేదే గుర్తుపట్టారే, పేరు అడ్రస్సు చెప్పుకోవాలేమో అనుకున్నాడు-' అవతల్నించి నవ్వు.
    "ఎక్కడనించి, ఇండియా ఎప్పుడొచ్చావు - ఎక్కడున్నావు... యీవురొచ్చావా' ఉద్వేగం గొంతుని నొక్కేస్తుంటే పెగుల్చుకుని అన్నాను.
    'అదంతా తర్వాత... ముందు మీ అడ్రసు చెప్పు.. అక్కడికెలా రావాలో ఈ డ్రైవరుకి చెప్పు... ఓ గంటలో వస్తా.. కల్సి భోంచేద్దాం.. భోంచేస్తూ కబుర్లు చెప్పుకుందాం. వండే ఓపిక లేకపోతే హోటలు కెడదాం... వద్దు, వద్దు. అన్నట్టు శ్రావణి మాట మర్చిపోయాను. అది హోటల్లో మనల్ని కూచోనీయదు, ఇల్లే బెటరు - కందిపొడి, ఆవకాయ, చారు, పెరుగుచాలు, ఏం వండకు అంటూ చెప్పేసి ఫోను డ్రైవరుకి యిచ్చింది. ఎలా రావాలో గుర్తులు చెప్పి వంటింట్లోకి పరిగెత్తాను - వండిన వంట కూర పప్పు, పులుసు వుండనే వున్నాయి. దానికి ఉడకబెట్టి వేయించిన బంగాళాదుంపల కూర యిష్టం - నాలుగు బంగాళాదుంపలు కుక్కర్లో పడేసి, ఉల్లిపాయలు తరిగి వేయించేశాను. ఊరగాయలున్నాయి. ఏదన్నా స్వీటుంటే... యివన్నీ యిప్పుడు కుదరవు. ఇది ఇన్ ఫార్మల్ లంచ్. మరోసారి భోజనానికి పిలిచి విందు భోజనం పెట్టొచ్చు. గబగబ మొహం కడుక్కుని ఇస్త్రీ చీర కట్టుకుని, డ్రాయింగు రూములో పేపర్లు, పుస్తకాలు అవి సర్దుతుండగా సుడిగాలిలా రానే వచ్చి చుట్టేసింది. 'అంటీ.. అంటుంటే దాని కళ్లల్లో నీటి పొర - తెలియకుండానే కళ్లు నిండాయి. కౌగిలించి విడవడి నామొహం చూసి 'సారీ... వెరీసారీ... నాకు ఇక్కడికి వచ్చేవరకు, మా పద్మత్త చెప్పేవరకు మీ వారి సంగతి తెలియలేదు. సడన్ గా పోయారటగా. ఎలా వున్నారు? వంటరిగా వుండగలుగుతున్నారా... అదే అలవాటవుతుంది.. ఏం చేస్తాం... యిద్దరిలో ఎవరో ఒకరు ముందో వెనకో తప్పదు గదా - ప్రశ్న జవాబులు తనే చెప్పేస్తూ సానుభూతి మాటలు చెప్పేసింది. "ఇట్స్ ఓకే... బానే వున్నాను. అలవాటు అయిపోతుంది ఇప్పుడిప్పుడే.. గట్టి పిండాలం మనం..." నవ్వుతూ అన్నాను.
    "బాగా చెప్పారు.. అలాగే వుండాలి ఈ రోజుల్లో - ఎవరికెవరు అన్నట్టు డిటాచ్ మెంట్ గా వుండడం నేర్చుకోవాలి-" భుజం తట్టి చేయిపట్టుకొని సోఫాలో కూర్చోపెట్టింది. అప్పుడు చూశాడు శ్రావణిని - సోఫాలో కూర్చుని మా ఇద్దరివంక ఆశ్చర్యంగా చూస్తున్న రెండేళ్ల పాపని. తెల్లగా బొద్దుగా ముద్దుగా వుంది. పొట్టి జీన్ స్కర్ట్, తెల్లటి బ్లౌజ్ వేసుకుని ప్రకటనల్లో బేబిలా వుంది. 'నీ కూతురెంత బాగుందే, నీలానే వుంది. ఎత్తుకుంటూ అన్నాను. కొత్త మొహం చూసి బిక్కమొహం పెట్టి తల్లివైపు వాలిపోతూ చేతులు చాచింది. కూతుర్ని అందుకుని 'ఇట్స్ ఓకే హనీ, ఆంటీ యీజ్ మై బెస్ట్ ఫ్రెండ్...' లాలిస్తూ వళ్లో కూర్చోపెట్టుకుంది.
    "ఏంటసలు, ఏమయిపోయావు యిన్నాళ్లు. ఒక్క ఫోనన్నా చెయ్యడానికి తీరిక లేదా... నీ గురించి ఎంత బాధపడ్డానో... మీ మామయ్య భార్యని రెండు మూడుసార్లడిగా.. ఆవిడ సరిగా చెప్పలేదు. మరి తెలియక చెప్పలేదో.. యిష్టంలేక చెప్పలేదో... అసలు వాళ్ళు ఎప్పుడూ ఇండియాలో వుండనే వుండరు. నీ గురించి ఏ కబురు తెలియక అల్లాడిపోయాను.. ఎంత కోపం వచ్చిందో నీ మీద' కోపం బాధ ఆవేదన అన్నీ కల్సిపోయాయి నా మాటల్లో. పాపని కింద కార్పెట్ మీద కూర్చోబెట్టి క్యారీబ్యాగులోంచి నాలుగైదు బొమ్మలు ముందు పడేసింది ఆడుకోవడానికి - "ఏం చెప్పమంటావు.. గత నాలుగేళ్ళు నా జీవితంలో బ్లాకు ఇంకుతో రాసుకోవాల్సిన పేజీలు .. అదంతా ఓ పీడకల అనుకోవాలి - అబ్బ ఆ టెన్షన్. ఆ బాధ దినదిన గండం లాంటి బతుకు. ఆంటీ... నా లైఫ్ లో నేను చేసిన అతిపెద్ద తప్పు పెళ్లిచేసుకోవడం - ముప్ఫై ఐదేళ్లకి ఆపాడు బుద్ధి పుట్టి నన్ను నేను రొంపిలోకి దింపుకున్నందుకు తిట్టుకోని క్షణం లేదు. కావాల్సిందే నాకీ శాస్తి అని నన్ను నేను శపించుకునేదాన్ని.. ఏదో ఓ బలహీన క్షణంలో యీ వంటరి జీవితం కంటే ఓ తోడుంటే బాగుంటుందేమో... జీవితానికి ఓ అర్థం కనిపిస్తుందేమోనన్న పేరాశకి లొంగిపోయానే అదే నా పాలిట శాపమయిపోయి కూర్చుంది. కావాల్సిందే నాకిలా..' దాని గొంతు రుద్ధమయింది.
    "పావనీ... ఛ.. వూరుకో నీలాంటి ఆడపిల్లలు కళ్ల నీళ్లు పెట్టకూడదు. నీ అంత ధైర్యవంతులు అలా బేలగా మాట్లాడకూడదు. జీవితంలో ఆటుపోట్లు ఎంతటి వారికైనా తప్పవు.. అంతా సవ్యంగా, ఆనందంగా మనం అనుకున్నట్లు కోరుకున్నట్టు జరిగిపోతే అది జీవితం అవదు. ఊహించని మలుపులు కథల్లోనే కాదు జీవితాల్లోను వుంటాయి - ఎదుర్కొని, పరిష్కరించుకునే నిబ్బరం ఈ తరం అమ్మాయిలకుంది, అసలేమయింది. నీవు పెళ్లి చేసుకున్నావు అన్నదే నే విన్న ఆఖరి కబురు.. ఓ పక్క ధైర్యం చెపుతూ, ఓదార్పుగా అన్నాను.
    "అవును, అదే నా సంతోషానికి ఆఖరి రోజుగా...యింక వినడానికేముంది" నిర్వేదంగా అంది.
    "ఏమిటి నీ సమస్య - చెపితే గదా ఎవరన్నా ఏదన్నా సలహా చెప్పడమో, సాయం చేయడమో చెయ్యగలరు".
    "ఎవరికి చెప్పుకోవాలి. నాన్న, అమ్మా మూడేళ్లలో ఒకరి తర్వాత ఒకరు దాటిపోయారు. అన్నయ్యలిద్దరూ ఎవరి జీవితాలు వాళ్లవి. నా గురించి పట్టించుకునే తీరిక, కోరికా లేదు..."
    "ఈ ఆంటీని మర్చిపోయావా.. కనీసం మాట సాయమన్నా చెయ్యలేననుకున్నావా మనసులో బాధ పంచుకోడానికన్నా గుర్తురాలేదా' నిష్టూరంగా అన్నాను.
    "ఆంటీ, కొన్ని విషయాలు ఎలా చెప్పాలి? ఏమని చెప్పుకోవాలో తెలియనివి - ఎదుటి వారికి చాలా చిన్నదిగా కనిపించే విషయం అనుభవించేవారికి భూతంలా భయపెడ్తుంది...
    "సరేలే, ముందు లే, భోం చేద్దాం.. పాపకి ఏదన్నా పెడతావా?" "యిప్పుడేం వద్దు, పెట్టే తీసుకువచ్చాను. అదిగో నిద్రపోయింది సోఫాలోనే"
    పాపని లోపల పడుకోబెట్టి, యిద్దరం భోం చేస్తూ, పక్కల మీద వాలి, లేచి టీ తాగుతూ పావని వున్న నాలుగు గంటల్లో మొత్తం నాలుగేళ్ల కథ విడత విడతలుగా చెప్పుకొచ్చింది. కాసేపు ఆవేశం, మరికాసేపు ఆవేదన, మరికాసేపు నిస్పృహ, నిర్వేదం రకరకాల భావాలు ఆమెను ముంచెత్తాయి.
    'నీ పెళ్లివరకు తెల్సు - ముప్ఫై ఐదేళ్ళకేనా పెళ్ళి చేసుకున్నావు. ఏదో లైఫ్ లో సెటిల్ అయ్యావు. ఓ తోడు దొరికిందని సంతోషించాను. ఆ పెళ్లి నీకు ఆనందాన్నివ్వకపోగా వున్న మనశ్శాంతిని కూడా పోగొట్టుకోవడం నిజంగా బాధగా వుంది పావనీ' 'చెప్పాగా, బుద్ధి తక్కువ పనిచేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఏదో అమ్మ పోయేవరకు నాపెళ్లి చింతతోనే పోయిందని, ఆవిడకి చేతిలో చెయ్యేసి మాటిచ్చానని, సరే ముప్ఫై ఐదేళ్లు స్వేచ్చగా నా యిష్టానుసారం జీవించాను. ఈ వంటరి జీవితమూ బోరుకొట్టి మార్పు కావాలనిపించి, తప్పటడుగు వేశాను. హు - తప్పటడుగు అని అప్పుడు తెలియదుగదా..
    "కొలీగ్ అంటావు, తెలిసిన వాడంటున్నావు - మరి అతని గురించి నీవేం గ్రహించలేకపోయావా? అతని వ్యక్తిత్వం, మైనస్ పాయింట్లు గుర్తించలేకపోయావా, అతని స్వభావాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు?
    "ఆంటీ పెళ్లయ్యేవరకు అంతా మంచివాళ్లే, గర్ల్ ఫ్రెండుగా వున్నన్ని రూలు లోపాలేం కనపడవు. ఆ 'పెళ్ళి' అన్న రెండక్షరాల పదంతో మొహానికి కప్పుకున్న మాస్క్ తొలగి నిజరూపాలు బయటపడతాయి - భార్య అనగానే స్వంతం, ఏమనడానికైనా ఓ హక్కుంది అనుకుంటారు మగాళ్లు. ఇవతలి మనిషికీ ఓ వ్యక్తిత్వం, యిష్టాయిష్టాలుంటాయని గుర్తించరు - ఇదివరకు ఆడవారయితే మరో గతిలేక ఆర్థిక స్వాతంత్ర్యం లేక సహించేవారేమో! యిప్పుడూ అలా వుండాలంటే ఎలా ఆంటీ..."
    "చేసుకోక చేసుకోక పెళ్లి చేసుకున్నావు. కాస్త సర్దుకుని కాపురం నిలబెట్టుకుంటే బాగుంటుందని మా తరం వాళ్లం అంటాం - కానీ దానికి ఎంతో ఆత్మాభిమానం పణంగా పెట్టాలో, ఎంత మనసు చంపుకు బతకాలో నాకూ తెలుసు పావనీ... కానీ యిప్పుడు పాప కూడా ఉంది. తల్లి, తండ్రి యిద్దరి మధ్య పెరగాలి పిల్లలు - రేపు పెద్దై తండ్రిని దూరం చేశానని నిన్ను నిందించకూడదు గదా".
    "ఏ మొగుడో ఓ మొగుడు యింట్లో మరో మనిషి తోడు నీకవసరం. అందులో ఇప్పుడు పాప వుందిగదా. ఏదో మేల్ ఇగో, డబ్బు మనిషి, తన ఆధిపత్యం చెల్లాలనేతత్వం తప్ప మరీ చెడ్డవాడు కాదనీ నీమాటల బట్టి అర్థం అవుతుంది. కొంతవరకు సర్దుకోవచ్చేమో మరొక ఛాన్స్ అతనికిచ్చి చూడచ్చేమో.. ఆలోచించు కొన్ని షరతులతో కాపురాన్ని నిలబెట్టుకోవచ్చేమో..."
    "షరతులతో, ఒప్పందాలతో కాపురాలు సాగుతాయా ఆంటీ. ఆలుమగలు మధ్య అండర్ స్టాండింగ్, అన్యోన్యత లేని అదీ ఓ కాపురమేనా ఆంటీ - ఇద్దరం గిరి గీసుకుని ఒకరినొకరు గీత దాటరాదన్న ఆంక్షలతో ఓ యింట్లో కల్సి ఎలా బతకాలి ఆంటీ ఇందుకోసమా ఇన్నేళ్లకి పెళ్లి చేసుకున్నది. అనురాగం, ఆప్యాయతలు లేని సంసారం కోసమా!-' నిష్టూరంగా అంది.

Next Page