ఆంధ్ర సి.ఎం. నా ఫాక్స్ అందుకున్న వెంటనే చాలా సంతోషించి నన్ను రమ్మని స్వయంగా మాట్లాడాడు." ఆనందంగా అంటున్న తండ్రిని చూసి తండ్రి నిర్ణయం మారేది కాదని అర్థం అయింది. ఒక మంచి పనికి నాంది పలకాలన్న తండ్రి ఉత్సాహాన్ని గమనించారు.
"అమ్మా... డాడీ ఏదో చెయ్యాలనుకుంటున్నారు. ఆయనని వెళ్ళనీ. ఆయన అన్నట్టు మీకు అక్కడ నచ్చకపోతే వెనక్కి వచ్చే వీలు ఎప్పుడూ వుందిగదా. పోనీ మీకు కాస్త రొటీన్ నుంచి మార్పు వుంటుంది. కూతరు తల్లిని అర్థంచేసుకో అన్నట్టు మాట్లాడింది. రాజేశ్వరి నిట్టూర్చింది. అంగీకరించడం మినహా తాను చెయ్యగల్గింది ఏమీలేదని ఆమెకీ అర్థం అయింది.
డాక్టర్ కేశవరావు టిక్కెట్టు, వీసా ఏర్పాట్లు, డాలర్లు క్యాష్ ట్రావెలర్స్ చెక్కులుగా, క్రెడిట్ కార్డులుగా మార్చుకోడం- అక్కడ కొన్నాళ్ళు ఉండే వీలుగా కావాల్సిన బట్టలు, యితర సామానులు అన్నిఏర్పాట్లు మరో నెలలో పూర్తిచేసుకున్నారు. రాజేశ్వరి ఆయన్ని వంటరిగా పంపనని తనూ వచ్చి వెంటవుంటానని పట్టుపట్టడంతో ఆవిడనీ వెంటపెట్టుకువెళ్ళక తప్పలేదు కేశవరావుకి. తను పల్లెటూరికి వెళ్లి అక్కడ ఏర్పాట్ల వసతులు స్వయంగా చూడాలని ఆవిడ పట్టుపట్టింది.
హైదరాబాదు చేరిన వెంటనే కేశవరావు చేసిన మొదటిపని ముఖ్యమంత్రితో అపాయింట్ మెంట్ తీసుకోవడం.
"వెల్ కం హోమ్ డాక్టర్. నాకెంత ఆనందంగావుందో చెప్పలేను. మీరీ నిర్ణయం తీసుకోవడం" షేక్ హాండ్ ఇస్తూ అన్నాడు సి.ఎం.
"సార్ నిజం చెప్పాలంటే మీ మాటలు విన్నాక నాకు నా జన్మభూమికి ఏదో చెయ్యాలన్న ఆలోచన కల్గింది. మీ మాటల్లో నిజాయితీ నన్ను ఆకర్షించింది. ఒక రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి రాష్ట్రం కోసం యింత కష్టపడడం చూడడం మొదటిసారి. మీ కార్యదక్షత, మీ పట్టుదల, మీరు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నన్ను ముగ్ధుడిని చేశాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను."
"థాంక్యూ సార్. యిలాంటి చదువుకున్నవారన్నా నన్నర్థం చేసుకొంటే యింతకంటే ఏంకావాలి. రాష్ట్రం కోసం యింతకి పదింతలు కష్టపడతాను. మీలాంటివారు చెయ్యి అందిస్తే మనం ఏదన్నా సాధించగలం సార. మీరాక మిగతా ప్రవాస భారతీయులకి త్రోవ చూపుతుందని ఆశిస్తాను సార్. రండి. మీరేం చెయ్యదలిచారో చెప్పండి.చర్చించుకుందాం. మా ఛీఫ్ సెక్రటరీ కూడా వస్తున్నారు. మనం ఓ ప్రణాళిక సిద్ధం చేద్దాం.
"ముందు నేను నా గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. ఆ వూరిని నేను పుట్టిన వూరిని, పెరిగిన వూరిని అభివృద్ధిపథంలో నడిపించాలని నా ఆలోచన. అది ఏవిధంగా ఆచరించాలో మీరు సూచించండి. అన్నిటికంటేముందు ఆ వూర్లో ఉండడానికి అన్ని సదుపాయాలతో యిల్లు కావాలి. మా తాతలనాటి పెంకుటిల్లు వుంది. అది నివాసయోగ్యంగా మార్చుకోవాలి. అది ఫస్ట్ ప్రయారిటీ."
"కరెక్ట్... ఆ పల్లెలో మీలాంటి వారి స్థాయికి తగిన యిల్లు అద్దెకి దొరకదు. కొత్తదన్నా కట్టాలి. లేకుంటే మీకున్న యిల్లుని మార్పుచేసుకోవాలి.
"సార్ ముందు నా వసతికార్యక్రమం పూర్తి అవనీండి. ముందు నేను, నా భార్య అక్కడికి వెళ్లి ఆ యింటికి చేయాల్సిన మార్పులు అవి చేయించేపని చూసి వచ్చాక మనం మిగతా విషయాలు చర్చించుకుందాం. ఈలోగా మీరు నేను ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవాలంటే ఏంచెయ్యాలో చెప్పండి.
ఓకే... మనిషికి ముందు తనుండాల్సిన యిల్లు సదుపాయంగా లేకపోతే పనిమీద ఏకాగ్రత ఉండదు. యిల్లు, భోజనం, ఫ్యామిలీ అన్నీ సుఖంగా అమరినప్పుడు పనిమీద మనసు కేంద్రీకరించగలదు అన్న పాయింటు రైట్. మీరు వెళ్ళిరండి. మనం తరువాత మాట్లాడుకుందాం" ముఖ్యమంత్రి షేక్ హాండ్ ఇచ్చి మర్యాదపూర్వకంగా గది బయటివరకు వచ్చి సాగనంపాడు.
మెహతా ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియల్ డెకరేర్స్. పెద్ద ఆర్కిటెక్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రాజీవ్ మెహతా, సునీత మెహతా భార్యాభర్తలు. రాజీవ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరు. సునీత ఇంటీరియల్ డెకరేషన్ కోర్సులో పోస్టుగ్రాడ్యుయేట్.
డాక్టర్ కేశవరావు ముందే అపాయింట్ మెంట్ తీసుకోడంతో రిసెప్షనిస్టు ఆయన రాగానే వార్త అందించి గదిలోకి తీసుకెళ్ళింది. గ్లాడ్ టు మీట్ యూ సార్ డైరెక్టుగా రాజీవ్ మెహతా ఆయన్ని సాదరంగా ఆహ్వానించాడు.
పరిచయ కార్యక్రమాలు అయ్యాక పనిలోకి దిగాడు కేశవరావు. "చూడండి నాకు మా గ్రామంలో ఓ పెంకుటిల్లు, మండువా లోగిలి వుంది. అది రిన్నవేట్ చెయ్యాలి. 'ఇన్ సైడ్ ఔట్ సైడ్' అనే హోమ్ డెకరేటర్స్ మాగజైన్ లో కేరళలో అలాంటి పాత పెంకుటింటిని అద్భుతంగా నవీనపరిచారు. ఒరిజినాలిటీ దెబ్బతినకుండా ఆ పాత పెంకుటిల్లు పైకి అలాగే వుండాలి. లోపల యీనాటి మోడర్న్ ఎకిప్ మెంటు వుండాలి. మొత్తం రిన్నవేట్ చెయ్యాలి. మనీ నో ప్రాబ్లమ్..." తను చెప్పింది అర్ధమవుతుందా అన్నట్టు ఆగారు. రాజీవ్ మెహతా అర్థంఅయినట్టు తల ఆడించి ఆ రూములోనే ఉన్న భార్య సునీతవంక అర్ధవంతంగా చూశాడు. ఆమె బయటికివెళ్ళి చేతిలో ఓ పత్రిక పట్టుకొచ్చి "హియర్ యీటీజ్" అంటూ కేశవరావుగారు చెప్పిన కేరళలో యింటి ఫోటో చూపింది. "ఎగ్జాక్ట్ లీ" చూడండి ఆ మండువా లోగిలిని ఎంత అద్భుతంగా మార్చేశారో యిప్పుడు విక్టోరియస్ టైపు ఇల్లు, ఫర్నిచరుకి క్రేజ్... నాకు ఈవిధంగా ఆ ఇంటిని మార్చాలి. మీరు చెయ్యగలరా..."
"అఫ్ కోర్స్... వైనాట్. మీకెలా కావాలో చెబితే, మీ రిక్వైర్ మెంట్స్, మీ బడ్జెట్ తెలియజేస్తే అది ఆచరించి చూపించడానికే మేం ఉన్నాం. "బైదిబై యీమె నా మిసెస్ సునీత. ఇంటీరియల్ డెకరేషన్ ఆమె బాధ్యత" రాజీ మెహతా అన్నాడు. భార్యని పరిచయం చేసి. "ఓకే... మనం ఒకసారి అక్కడికి వెళితే మీరు ఆ యిల్లు చూస్తే నాకేంకావాలో, ఎలా కావాలో చెపుతాను. మీరు నాతో రాగలరా. టాక్సీ బుక్ చేస్తాను. మనీ నో ప్రాబ్లమ్. "ఇదిగో యీ లక్ష రిటైనర్ గా ఉంచండి. అక్కడికి వెళ్ళి సుమారుగా ఎస్ట్ మేషన్ చెబితే సగం డబ్బు ఇస్తా. మెటీరియల్ సమకూర్చుకోడానికి కేశవరావు చెక్కు అందిస్తూ అన్నాడు. భార్యాభర్తల మొహాల్లో సంతోషం. ప్రవాస భారతీయుడైన కేశవరావు, అందులో డాక్టరయిన అతనికి డబ్బుకి లోటుండదు. లెక్క వుండదు అని వారికి తెలుసు. మంచి కష్టమర్ అన్నదో అర్థం అయింది వారికి.
"చూడండి మిష్టర్ మెహతా. నాకేం కావాలో, ఎలా కావాలో చెప్పడంవరకే నా వంతు. మిగతాదంతా ఎ-టు-జడ్ అన్నీ మీరే చూడాలి."
"వుయ్ నో ఇట్ సార్. డోంట్ వర్రీ. మీ టేస్టుకి తగ్గట్టుగా చూసే పూచీ మాది." భరోసా ఇచ్చాడు రాజీవ్ నమ్రతగా.
"అయితే సరే. రేపు ఉదయం ఐదుగంటలకే బయలుదేరదాం. టాక్సీ బుక్ చేస్తాను. 7,8 గంటల ప్రయాణం... మీరు రెడీగా వుంటే వచ్చి పికప్ చేస్తాను." అంటూ వివరించి శలవు తీసుకున్నారు.
ఉరుములేని పిడుగులా కేశవరావు నుంచి వచ్చిన ఉత్తరం చూసి పాండురంగారావు మిన్నువిరిగి మీద పడినట్టు దిగాలు పడిపోయాడు. తన మామయ్యకి యిన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి ముప్పైఐదేళ్ళ తరువాత ఈ బుద్ధి ఎందుకు పుట్టినట్టు? హాయిగా చీకు చింతా లేకుండా పొలం పని చూసుకుంటూ, యింటిపట్టున హాయిగా వుంటున్న అతను ఇలాంటి హఠాత్ సంఘటన ఎదురవుతుందని ఎప్పుడూ అతను అనుకోలేదు. అమెరికాలో వుండి లక్షలు, కోట్లు సంపాదించుకునే మామయ్య సుఖాలన్నీ వదులుకొని పల్లెటూరు రావాలనుకోవడం ఏమిటి? తన దురదృష్టంకాకపోతే మావయ్యకి యీ బుద్ధి ఎందుకు పుట్టింది? యీ పల్లెటూరి మీద ఆయనకి హఠాత్తుగా యింత ప్రేమ ఎందుకు పుట్టింది. సుఖాల మధ్య బతికే ఆయన యీ పల్లెటూరిలో వుంటానని రాయడం అతనికి మింగుడు పడలేదు.