Previous Page Next Page 
చెక్ పేజి 2


    కాటేజ్ చాలా బావుంది. రెండు పోర్షన్లనూ కలిపి ఒకే వరండా, ముందు పార్క్. దానికి అటుగా లోయ, దూరంగా తెల్లటి గీతలా కనిపిస్తున్న సెలయేటి పాయ.

 

    అన్నీ బ్రహ్మాండంగా వున్నాయి. ఎవరికి వారు విడిగా రెండు పోర్షన్లలో వుండడమే బాగాలేదు. మరి తనను ఆ పోర్షన్ నుంచి నా పోర్షన్ లోకి రప్పించడమెలా?

 

    ఆ ఆలోచనలే నా మెదడును తొలిచేస్తున్నాయి.

 

    భార్య కాబోయే అమ్మాయి వుంది. నాన్నలు, అమ్మలు, బామ్మలూ ఎవరూలేని ఏకాంతం వుంది. ఇలాంటి సమయంలో కోరికకు బిరడా వేయడం మానవమాత్రుడికి సాధ్యమయ్యే పనికాదు.

 

    మా పెళ్ళికి ఖచ్చితంగా రెండు నెలలా రెండురోజులా పదకొండు గంటలున్నాయి. ఆ మూడుముళ్ళూ వేసేశాక కీర్తి నా స్వంతమైపోతుంది. అప్పుడిక విరహాలూ, వియోగాలూ, షరతులూ వుండవు. డిసెంబరు పదిన మా పెళ్ళి. మంచి చలికాలం. ఆ చలిలో మా అనుభవాలే చలి సెగళ్ళు.

 

    అంతవరకు ఓపిక పట్టడం చాలా కష్టంగా వుంది. హిల్స్ కు రాకుండా వుండుంటే ఈ గొడవ వుండేది కాదు. తీరా వచ్చాక 'రామా ఈజ్ ఎ గుడ్ బాయ్' లా కూర్చోవడం చాలా కష్టంగా వుంది.

 

    టైం చూశాను. ఆరు గంటలవుతోంది.

 

    కొండ అంచులనుంచి జారి భూమిలోకి దిగబడిపోయిన లోయలో సాయం సంధ్య ఎర్రగా ఒళ్ళు విరుచుకుంటోంది. గాలి చలిని పౌడర్ లా ముఖానికి రాసుకుని షికారుకి బయల్దేరింది.

 

    ఇంకా కీర్తి రాలేదేమిటి చెప్మా? దర్శనం ఆలస్యమై వుంటుంది.

 

    ఇంతకీ కీర్తిని మొదటిసారి యూనివర్సిటీలో ఎప్పుడు చూశాను ?

 

    ఆ రోజు ఏప్రిల్ పన్నెండా ? పదమూడా ?

 

    ఖచ్చితంగా పన్నెండే.

 

    ఆరోజు గురవారమా ? శుక్రవారమా ?

 

    శుక్రవారమే.

 

    అప్పుడు టైమ్ పదా ! పదకొండా ?

 

    పదే.

 

    సైకాలజీ ఫైనల్ కు ఏ గది కేటాయించారోనని వెదుక్కుంటూ వస్తున్న నాకు ఒక్కసారి ఒళ్ళు జలదరించింది. నా కళ్ళల్లో మెరుపు విరిగింది.

 

    కళ్లు చిలకరించి చూశాను. ఆర్ట్స్ బ్లాక్ మెట్లెక్కి మలుపు తిరుగుతూ కీర్తి. అప్పుడు తన పేరు కీర్తి అని తెలియదుగానీ, ఆ అందం నన్ను భయపెట్టిందని మాత్రం తెలుసు.

 

    ఇక ఫైనల్ కు ఏ గది కేటాయించారో నా కనవసరమనిపించింది. బయటకొచ్చి నేరుగా క్యాంటీన్ కి వెళ్లాను.

 

    నా మనసు మనసులో లేదు. ఓ క్షణంపాటు నామీద పారిజాతాల వాన కురిపించిన ఆ అమ్మాయి మీదే వుంది.

 

    షుగర్ చాలదని ఎప్పుడూ పేచీపెట్టే నేను అప్పుడు కాఫీని చాలా కామ్ గా తాగేస్తుంటే "ఏమిటీ జీవికి పిచ్చిగాని పట్టిందా" అని సర్వర్ వెర్రి వెర్రిగా చూశాడు.

 

    "అవును నాకు కీర్తి పిచ్చి పట్టింది" అని తిక్క తిక్కగా చెప్పాలనిపించింది నాకు.

 

    ఇక అప్పటి నుంచి కీర్తి ధ్యాసే.

 

    రెండోరోజు ఆమె ఎవరో కనుక్కోమని నా మాత్రుడు ఒకడ్ని పురమాయించాను.

 

    వాడు అరగంటకంతా తిరిగొచ్చి మొత్తం కీర్తి జాతకమంతా నాతో చెప్పాడు.

 

    "పేరు కీర్తి. ఇంగ్లీష్ ప్రివియస్ లో చేరింది. ఊరు కాకినాడ. హాస్టల్ లో వుంటోంది. రూమ్ నెంబర్ నూటపన్నెండు. వయసు ఇరవై ఒకటి, బరువు యాభై కేజీలకు ఇటూ, అటూ. ఎత్తు అయిదున్నర. చెస్ట్ ముప్పై..." ఇక చాలన్నట్టు వాడినోరు మూశాను.

 

    ఇక అప్పటినుంచి కీర్తికోసం పడిగాపులు కాశాను. ఆర్ట్స్ బ్లాక్ ముందున్న మర్రిచెట్టుకింద నిల్చోవడంతోనే సరిపోయేది. చదువూలేదూ, సంధ్యాలేదు. తన క్లాస్ కి వెళ్లేప్పుడు కళ్ళార్పకుండా చూసి, క్యాంటీన్ కు రావడం - లంచ్ వరకు కాఫీలు, సిగరెట్లతో కాలం గడపడం - ఆ తరువాత మళ్లీ మర్రిచెట్టు నీడలో చేరడం. దీంతోనే దినచర్య గడిచేది.

 

    తనను చూసిన నెల రోజుల తరువాత మొదటిసారి లైబ్రరీలో తనతో మాట్లాడాను.

 

    ఆ క్షణాలు నాకిప్పటికీ గుర్తే.

 

    ఆ రోజు పదిగంటలకల్లా లైబ్రరీకి వెళ్ళాను ఓరియంటల్ సెక్షన్ క్లర్క్ నా ఫ్రెండ్. క్యాంటీన్ లో బోరుకొట్టి ఆయనకోసం వెళ్ళాను.

 

    ఆయనతో పిచ్చాపాటి వేస్తుంటే కీర్తి అక్కడకు వచ్చింది.

 

    "పద్మనాభరావుగారూ! నాకు ఇలియట్ పుస్తకం కావాలి. లైబ్రరీ కార్డు రూమ్ లో మరచిపోయి వచ్చాను. మీరో కార్డు ఇప్పిస్తే పుస్తకం తీసుకుంటాను" అంది.

 

    "మదన్ ! కార్డుందా?" అని ఆయన నన్నడిగితే మంత్రముగ్ధుడిలా పుస్తకంలో పెట్టిన కార్డు తీసిచ్చాను.

 

    "థాంక్స్ మీరు ఏ డిపార్ట్ మెంట్?" అని కీర్తి అడిగింది నన్నే. ఉబ్బితబ్బిబ్బయి పోయిందీ నేనే.

 

    "సైకాలజీ. పేరు మదనగోపాలరావ్" అని కలలో మాట్లాడినట్టు మాట్లాడాను.

 

    చిన్నగా చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది కీర్తి.

 

    ఆ పరిచయం మరి కాస్తంత ముందుకు సాగి, మొగ్గలేసి, ప్రేమగా పుష్పించేసరికి సంవత్సరం దాటింది.

 

    మరో ఆరు నెలలకల్లా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. ఒక్కతే కూతురు కావడం వల్ల తన ప్రేమను వాళ్ళ నాన్న అంగీకరించాడు. ఇక మా ఇంట్లో మొదట అంగీకరించకపోయినా. కోడల్ని చూశాక ఒప్పేసుకున్నారు.

 

    అలా మా పెళ్లి - అందరికీ ఇష్టంగాను కుదిరిపోయింది.

 

    ఇంతకీ ఈ రోజు కీర్తి నా ట్రాప్ లో పడుతుందా? అలా నాలో నేనే అనుకోవడం ఖచ్చితంగా ముప్పై ఆరోసారి.

 

    పార్క్ లో జనం పలుచబడ్డారు. కాస్తంత ఎత్తులో వున్న హిల్ వ్యూ గెస్ట్ హౌస్ వెలుగు కొలనులావుంది. దానికి వేలాడతీసిన రంగుల దీపాల తోరణాలు ఎవరో చక్కిలిగింతలు పెడుతున్నట్టు అటూ ఇటూ వూగుతున్నాయి. చీకట్లు భయం భయంగా లోకంమీద వాలుతున్నాయి.

 

    చీకట్లు ముసిరేకొద్దీ నాలో ఆరాటం ఎక్కువైంది. అనుభవం కోసం మనసు మన్మధ జలాన్ని స్రవిస్తోంది.

 

    మరి కీర్తిని 'ఎ' పోర్షన్ నుంచి నేనుండే 'బి' పోర్షన్ కి రప్పించడమెలా?

 

    "కాఫీ ... కాఫీ"

 

    కాఫీ కెటిల్ తో రోడ్డుమీద పోతున్న అతన్ని పిలిచాను.

 

    "కాఫీ ఇవ్వు" అనడిగాను.

 

    అతను గ్లాస్ లో కాఫీ పోసిచ్చాడు.

 

    కాఫీ చిరుచేదు నాలుకకు తగిలేసరికి ప్రాణానికి ఎంతో హాయిగా వుంది.

 

    "నీ పేరేమిటి ?" అని ప్రశ్నించాను.

 

    "దాము"

 Previous Page Next Page