Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 1 పేజి 3


                                    సంహిత

    "సంహితం భవతి హ్యక్షిరణి ధనం ప్రతిష్ఠాయై" అని తాండ్యము

    సంహిత వర్గ సంయోగము, వేదమునందు కొంత భాగము, శాస్త్రము, సంధించబడినది అని శబ్దరత్నాకరము.

    సంహితమ్ కూడుకొనునది అని సంస్కృతాంధ్ర నిఘంటు.

    ఒకదాన్ని ప్రతిష్ఠించడానికి, స్థాపించడానికి చేసే కూర్పు సంహిత అవుతుంది. దీన్ని మనం ఈనాడు సంకలనం అంటున్నాం.

    వేదవ్యాసుడు వేదములను సంకలనం చేసినాడు. అందుకే అవి వేద సంహితలు 1. ఋగ్వేద సంహిత 2. యజుర్వేద సంహిత 3. సామవేద సంహిత 4. అథర్వవేద సంహిత.

    వేదాల్లోని సూక్తాలను వివిధ ఋషులు, వివిధ సమయాల్లో దర్శించారు. దర్శించింది అక్షర బద్ధం అయింది. అలా ఎంతకాలం ఎన్నివేల సంవత్సరాలు జరిగిందో చెప్పటం కష్టం. ఎంచేతంటే పాశ్చాత్యులకువలె మన చరిత్ర మూణ్ణాళ్లదికాదు! మనకు కాలం బ్రహ్మవలె అనంతం!!

    అలా పెరుగుతూపోయిన వాస్తవ సూక్తాలూ విస్సన్నలు చెప్పినవీ ఎన్ని కోట్లు అయినాయో! అందుకే "అనంతావైవేదాః"

    అంతటి అనంత రత్న, శిలారాసుల నుండి వన్కెకెక్కినరత్నాలను వెలికి తీసినాడు వ్యాస భగవానుడు. అలా రత్న రాసులను కూర్చి వాటి ద్రష్టలు స్మర్తలగు ఋషులను నిర్ణయించినాడు. ఆ సూక్తాలన్నిటినీ కూర్చాడు. అలా కూర్చి నాలుగు వేదాలను ఏర్పరచినాడు.

    ఇది ఎంత కష్టసాధ్యమో విద్యానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమా! నవంధ్యాని జానాతీం ప్రసవవేదానా గుర్వీం, విద్వాంసునకు మాత్రమే విద్వాంసుని శ్రమ అర్థం అవుతుంది.

    గొడ్రాలికి ఏం తెలుస్తాయి పురిటి నొప్పులు.

    ఇలా నాలుగు విధాలుగా వేదాన్ని విభజించడాన్ని "వేదచతుష్టయ" అని అంటారు. వేద చతుష్టయి వేదాల విషయ నిర్ణయం చేస్తుంది.

    1. ఋగ్వేదం దేవతల గుణగణములను స్తుతిస్తుంది.

    2. యజుర్వేదం వివిధ యజ్ఞములను నిర్దేశిస్తుంది.

    3. సామవేదం దేవతలను ప్రసన్నులను చేయుగాన విధిని వివరిస్తుంది.

    4. అథర్వవేదం బ్రహ్మజ్ఞానం సహితంగా అనేకానేక లౌకిక విషయాలను వివరిస్తుంది.

    వేద చతుష్టయ కాక మరొక విభజనను వేదత్రయ, అనికూడా అంటారు. ఇది పద్య, గద్య, గేయ విభజన, వేదాలు పద్యాల్లో దర్శించినవీ, గద్యంలో దర్శించినవీ, గేయంలో దర్శించినవీ ఉన్నాయి. అలాంటి విభజనను 'వేదత్రయ' అంటారు.

    కొంచెపు బుద్ధిగల పాశ్చాత్య విద్వాంసులు "వేదత్రయ"ని మూడు ఋగ్యజుస్సామ వేదాలను అర్థం చెప్పారు. అవకాశం దొరికిందని అథర్వవేదం తరువాత వచ్చిందని చెప్పారు.

    "ఏవమేవం సర్వేవేదా నిర్మితాః సకల్పాః సరహస్యాః సబ్రహ్మణాః సోపనిషత్కాః సేతిహాసాః సాన్వ్యాఖ్యానాః సపురాణాః సస్వరాః ససంస్కారాః సనిరుక్తాః సోమశాసనాః సానుమార్జనాః సనాకోవాక్యాః" అంటుంది గోపథిపూర్వం. 

    ఇన్నింటితో కూడింది వేదం. ఇన్నింటిని అధ్యయనంచేసి వేదాన్ని అర్థం చేసికోవాలి. శరీరం మాత్రమే తెలిసిన పాశ్చాత్యులకు ఆత్మజ్ఞానంతో కూడిన వేదం అర్థం కావడం కూపస్థమండూకానికి మహాసాగరం వంటిది!

    "వేదా బ్రహ్మాత్మ విషయాస్త్రికాండ విషయా ఇమే

    పరోక్షవాదా ఋషయః పరోక్షం మమచ ప్రియం" అన్నాడు శ్రీకృష్ణపరమాత్మ భాగవతంలో.

    వేదం మూడింటిని ప్రతిపాదిస్తుంది. 1.బ్రహ్మ 2.ఆత్మ 3.ఆత్మ బ్రహ్మల ఏకత్వం. ఋషులు పరోక్షవాదులు. నాకూ పరోక్షం అంటేనే ప్రియం.

    "పరోక్షం" అంటే ప్రత్యక్షంగా కనిపించే దానికంటే వెనుకదాగి ఉండేది.

    కంటికి కనిపించని దానిని కనుగొనడమే కదా జ్ఞానం! ఋషులు పరోక్షవాదులు!! ప్రత్యక్షంగా దర్శించటం కష్టం!!!

    పాశ్చాత్యులు కంటికి కనిపించిన దానినే కానలేరు! భూమి గుండ్రంగా ఉందన్న వానిని శిక్షించారు!

    వేదాన్ని అర్థం చేసుకోవడానికి మన మహర్షులు ఒక నిర్ణీత పద్ధతిన ఆరు వేదాంగాలను మూడు ఉపవేదములను ఏర్పాటు చేశారు.

    1.శిక్ష 2. వ్యాకరణము 3.నిఘంటు 4. ఛందస్సు 5. జ్యోతిష్యము 6.కల్పము. ఇవి వేదాంగములు.

    1. గాంధర్వవేదము 2. ఆయుర్వేదము 3. ధనుర్వేదము 4. అర్థవేదము ఇవి ఉపవేదములు. 

    వేదార్థాన్ని గ్రహించడానికి 1. ఉపనిషత్తులు 2. కణాదుని వైశేషికము 3. గౌతముని న్యాయము 4. కపిలుని సాంఖ్యము 5. పతంజలి యోగము 6. జైమిని పూర్వమీమాంస 7. బాదరాయణుని ఉత్తర మీమాంస ఉపకరిస్తాయి.

    వేదము శృతి. శృతి శాస్త్రము కాదు. శాస్త్రానికి శృతిమూల భూతము. శృతి శాస్త్ర యోని "శాస్త్రయోనిత్వాత్"

    శాస్త్రమున శృతి అని భ్రమించరాదు. శృతి అపౌరుషేయము. శాస్త్రము మానవ నిర్మితము. వృక్షము శృతి. కర్రతో చేసిన వస్తువులు శాస్త్రము అనవచ్చు.

    ఇవన్నీ గ్రహించకనో, గ్రహించీ మనసు కొంచెపు వారిని చేయడానికో "వేదత్రయ"కి తప్పు వ్యాఖ్యానం చెప్పి మనను వేదాలు మూడే అని నమ్మేట్లు చేశారు తెల్లతోలువారు!

    నమ్మించేట్లు చేసేవాడు వంచకుడు!

    వంచకుడు చెప్పింది నమ్మేవాడు బానిస!!

    భాగవతంలో "వేదమేకం చతుర్విధం" అని చెప్పబడింది.

    "చత్వారోవా ఇవే వేదా ఋగ్వేదో యజుర్వేదః

    సామవేదో బ్రహ్మవేద ఇది" అని గోపథ పూర్వము.

    కావున మనవారు చెప్పిందే సత్యం. వేదాలు నాలుగు. అవి ఋగ్యజుస్సామ అథర్వవేదాలు. ఇందులో సంశయం ఉండడానికి ఆస్కారం లేదు. ఇది సత్యం! ఇది తథ్యం!!

    మనిషిని చూడగానే మనం అర్థం చేసుకోలేం. అతని మనసును, విజ్ఞానాన్ని, సంస్కారం మొదలైన వాటిని అన్నింటిని చూచినా ఎదుటి మనిషి మనకూ పూర్తిగా అర్థంకాడు. అంటే ప్రత్యక్షంగా మనకు కనిపించేదానికన్న పరోక్షం అధికం కదా!

    అట్లాగే వేదవాక్యాన్ని అర్థం చేసికోవడానికి కొన్ని దశలు ఉన్నాయి. 1. అన్నమయము. ఇది భౌతికము కంటికి కనిపించేది. 2. ప్రాణమయము. ఇది దృష్టిగోచరం. 3. మనోమయం. ఇది మనసును గ్రహించటం. 4. విజ్ఞానమయం. ఇది బుద్ధిని గ్రహించడం. 5. అత్యంత విశిష్ఠమైన ఆనందమయం. ఇది అనుభూతికి సంబంధించింది. సర్వోత్తమం "ఆనందోబ్రహ్మ" ఇది అందుకొనవలసిన లక్ష్యం.

    ఒక్క అగ్ని అనే పదానికి దీనిని అన్వయించి చూతాం.

    1. కంటికి కనిపించే అగ్ని అన్నమయము.

    2. ఈ అగ్నికి ప్రాణభూతుడగు సూర్యశక్తి ప్రాణమయము

    3. విశ్వస్థితికి కారణభూతమగు తేజస్సు మనోమయము.

    4. బుద్ధి వికాసమునకు కారణమగు తేజోశక్తి విజ్ఞానమయము.

    5. సకల విశ్వాంతరాళాలను వెలిగించు బ్రహ్మ జ్యోతి ఆనందమయము.

    అందువల్ల పదానికి గల బాహ్య అర్థంలో మాత్రమే వేదాన్ని అర్థం చేసికోవడం పరిమితి జ్ఞానంతో పరిశీలించడం సమంజసం కాదు.

                                                  వేదకాలం

    "అప్రాచ్యుడు"

    తిట్టాల్సి వచ్చినపుడు మా తండ్రిగారు వాడిన పదం అది! ప్రాచ్య దేశాలకు చెందనివాడు అప్రాచ్యుడు. అంటే మనం నేడు అతినాగరకులు అనుకుంటున్న ప్రాశ్చాత్యులు అప్రాచ్యులు. వారు ఆటవికులు, అనాగరకులుగా ఉన్నప్పుడు ప్రాచ్యదేశమైన భారతదేశం ఇతర దేశాలకు నాగరకత, సభ్యత, సంస్కృతి అందించింది. నాటి సుసంపన్న భారతదేశానికి కొందరు యాత్రికులుగా కొందరు దండయాత్రికులుగా వచ్చారు. కొందరు సాంస్కృతిక సంపదను, కొందరు రత్నరాసులను కొల్లగొట్టారు.

    కాని భారతదేశానికి అసలు సంపదలైన వేదములు, ఉపనిషత్తులు, రామాయణ, భారత, భాగవతాలు అనంత సాహిత్య శిల్ప సంపదను దోచుకొని పోలేకపోయారు! అది భారతదేశపు వాస్తవ సంపద! అక్షయసంపద! అమృత సంపద! అనంత సంపద!

    "యునాన్ - బ-మిస్రొరూమా సబ్ మిట్ గయే జహాఁసె
    అబ్ తక్ మగర్ హై బాకీ నామెనిశాఁ హమారా" అంటాడు ఇక్బాల్ కవి.


    గ్రీకు, ఈజిప్టు రోమన్ నాగరకతలన్నా లోకంలో లేకుండా చెరిగిపోయాయి. అయినా ఇప్పటికీ మా ఊరూ పేరూ నిలిచి ఉన్నీయంటాడు.

    అంతటి విశిష్ఠ, సభ్య నాగరక సమాజానికి పునాది వేసింది వేదం. మన విశ్వాసం ప్రకారం కాలం అనంతం. వేదం అనంతం. మనం వేదాన్ని పరిరక్షించుకున్నాం. దాని పుట్టుపూర్వోత్తరాలు గురించి ఆలోచించలేదు.

    ఒక మందానిలం వీచింది. ఒక వెన్నెల కాచింది. ఒక పరిమళము వ్యాపించింది. వాటిని పుట్టుపూర్వోత్తరాల కోసం గాలించటం పాశ్చాత్యులనుమతం. ఆనందించలేరు!

    పాశ్చాత్యుల చరిత్ర సాంతం వందల, వేల సంవత్సరాలదే. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల చరిత్ర వందల ఏళ్లదే! అసలు హిస్టరీ, అనే పదం పుట్టి ఇంకా అయిదు వందల ఏళ్లుకాలేదు. ఈ కొలతలతో వేద కాలాన్ని కొలవడం గజం బద్దతో ఆకాశాన్నీ, బకెట్టుతో సముద్ర జలాన్నీ కొలవడం వంటిది!

    మనం ఇంకా బానిసలం కాబట్టి మన మహత్తును ఎరుగలేకున్నాం. వారి కొలతలనే నమ్ముతున్నాం. ఆత్మవిశ్వాసం లేని జాతికి అభ్యుదయం అంత సులభం కాదు!

    కాలం కొలతలు మనకు తెలిసినంతగా మరొకరికి తెలియవు. సృష్టి మొదలై ఇప్పటికి 195, 58, 85, 696 సంవత్సరాలయిందని ప్రతి సంవత్సరం పంచాంగం మీద గుణించి వేస్తున్నాం.

    వేదం ఒకనాడు పుట్టి ఒకనాటికి పూర్తి అయిన కావ్యం లాంటిది కాదు. ఇది ఒక స్రవంతి. ఒక నిర్ఘరి. ఒక నది. ఒక ప్రవాహం. దర్శించిన ఋషి చెపుతూ పోయాడు. దానిని అక్షర బద్ధం చేస్తూపోయారు. ఈ ప్రవాహం వ్యాసుడు సంహితలు చేసేవరకు సాగింది. తదుపరి సకల నదులు కూడిన తటాకంవలె మానవాళికి ఉపకరిస్తున్నది.

    పాశ్చాత్య విద్వాంసులు, మక్డొనెత్, కీత్ ప్రకారం వేదం క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాల నాటిది. అంటే 3200 సంవత్సరాలకు పూర్వపుది. అంతకు పూర్వపు కాలాన్ని గురించి వారు ఆలోచించలేరు. క్రీస్తు పుట్టి ఇంకా రెండువేల సంవత్సరాలు కాలేదు!

    కలియుగం ప్రారంభం అయి 5096 సంవత్సరాలయిందని మన పంచాంగపు లెక్క ద్వాపరం ముగుస్తున్న సమయంలో భారత రచన జరిగింది. ఆ తరువాత రచించబడిన భాగవతంలో వేద విభజన జరిగిందని చెప్పబడింది. అంటే వేద సంహితం 6000 ఏళ్లనాటిదని చెప్పవచ్చు. కాని వేదం ఎప్పుడు ఆరంభం అయిందీ చెప్పడం దుస్తరం.

    ఇంతకాలంగా ఒక నాగరకత, సభ్యత, సంస్కారం నిరంతరం కొనసాగడం ప్రపంచపు వింతల్లో ఒక్కటి! అయితే మనం చెప్పుకోలేం!!

    పడమటి నాగరకతకు, మతానికి ఇంకా రెండువేల పసిప్రాయమే!

                                      వేదభాష

    వేదకాలపు సమాజము, కుటుంబము, రాజ్యము మున్నగునవి సర్వ సంపూర్ణములు. ఒక పరిపుష్పమైన సంస్కృతము వంటి భాషకు జన్మనిచ్చిన మహోన్నత సంస్కారం గల సమాజం అది!

    'సంస్కృతం' అనే పదంలోనే ఎంతో సంస్కారం ఉంది! సంస్కారంతో ప్రారంభం అయిన భాష మరొకటి లేదు. ఈ వర్గానికి చెందిన 1. ఇరానిక్ 2. హెల్లెనిక్ 3. ఇటలిక్ 4. సెల్లెటిక్ 5. ట్యుటనిక్ 6. లెటొస్లెవిక్ భాషలు పేరుకు మాత్రం మిగిలి ఉన్నాయి !

    సంస్కృతాన్ని మాతృభాష అనే బదులు, మృతభాష అని పాశ్చాత్యులు అవమానించారు. సంస్కృతం వేదకాలం నుంచి ఈనాటి యంత్రయుగందాకా నిండువయసున్న సుందరివలె నాజూకుగా ఉంది. సమాజంలోని అన్ని రంగాలకు ఉపయోగపడేంత సమర్థవంతంగా ఉంది!

    ఈనాటి రాజకీయాలు మాట్లాడ్డం రంకు లాంటిది. కాని ఒక్కొక్కసారి రంకు తప్పదు! భారతదేశానికి స్వతంత్ర్యం అనేది వచ్చిన తరువాత భాషను రాజకీయ రంకు చేయకుండా ఉంటే సంస్కృతం జాతీయభాష కావలసింది. అట్లా జరిగి ఉంటే ప్రాంతీయ భాషా రాజకీయం రాక్షసం ఉండేది కాదు!

    తెలుగు భాష ఉచ్ఛారణ, పదాల అర్థాలు వగైరా గత పావు శతాబ్దంలో ఊహించనంతగా మారాయి. ఉదాహరణలు కొల్లలు. కాని ఉదాహరించడం అప్రస్తుతం.

    అయినా ఇన్నివేల సంవత్సరాలుగా సంస్కృత పదాలు, భాష హిమవదున్నతములై నిశ్చలంగా, సజీవంగా నిలిచి ఉన్నాయి! ఇది ఎంతటి మహత్తర విషయమో మనం గ్రహించవలసి ఉంది! ఇది మనకు గర్వకారణం కావలసి ఉంది!!!

    ఒక వింత ఏమంటే సంస్కృతం జాతీయభాష కాకున్నా మన జాతీయగీతాలు సంస్కృతంలోనే ఉన్నాయి!!

    ఆంగ్లభాష అపర్యాప్తమని ఈ మధ్య గతించిన జార్జి బెర్నాండ్ షా విలపించడం మనం ఎరుగుదుము!

    సంస్కృతం సాంతం ఒకే భాష కాదు. మూలభాష సంస్కృతం. ఇందులో కావ్యభాష, వైద్యభాష, తర్కభాష, జ్యోతిష్య భాష ఇలా అనేక శాఖలున్నాయి. ఒక్కొక్క భాషకు వేరువేరు సాంకేతిక పదాలుంటాయి సంస్కృత విద్వాంసునికి అన్ని శాఖలూ తెలియాల్సిన పనిలేదు. తెలియవు.

    కావున సంస్కృతం తెలిసిన వానికి వేద సంస్కృతం తెలియకపోవచ్చును. వేద సంస్కృత పదాలకు వేరు నిఘంటు, వేద సంస్కృతానికి వేరు వ్యాకరణం ఉంటాయి! నా వరకు నాకు వేద సంస్కృతం అత్యంత సహజమైంది. సులభమైంది అనిపిస్తుంది. అది వెన్నెలవలె మందానిలంవలె ఉంటుంది. కృతకత తక్కువ. సహజత్వం కొట్టవచ్చినట్లుగా కనిపిస్తుంది.

    వేదమే సూర్యునివంటిది, చంద్రునివంటిది, భూమివంటిది, గాలివంటిది.

    సంస్కృతంలో ఉన్న రామాయణం, భారతాలు మరే జాతికీ, భాషకూ లేవు. ఇది సహజోక్తి! అతిశయోక్తి కాదు!!

                               వేదభాష - లిపి :

    పాశ్చాత్యులు తమ స్వప్రయోజనం కోసం మనను తప్పుదారి పట్టించడంలో నూటికి వేయిపాళ్లు విజయవంతులైనారు. రాజ్యం వారిది. 'రాజానుమతో ధర్మం' మన నీతి. మనం ప్రత్యక్షాన్ని అంగీకరించాం. పరోక్షాన్ని కానలేకపోయాం.

    నేను సామాన్యుల విషయం చెప్పడం లేదు. ఇందు విషయంలో అసాధారణులు, మహామహులుకూడా తప్పుటడుగు వేశారు! "స్వధర్మే నిధనం శ్రేయః" మరచారు.

    వేదానికి 'శృతి' అనే పేరు కూడా ఉంది. శృతి అంటే విన్నది అని అర్థం. విన్నది కాబట్టి వేదం తొలుత అక్షర బద్ధం కాలేదనీ అప్పటికీ అక్షరం లేదని పాశ్చాత్యుల అభిప్రాయం, వాదం. నినాదం.

    వేదం అపౌరుషేయం. ఋషి ద్రష్ట. స్మర్త అగును. ఋషి తాను తొలుత విన్నాడు. విన్నది వ్రాసినాడు. అందువలన అది "శృతి" అయింది. అంతేగాని లిపిలేక కాదు.

    సంస్కృతానికి లిపి దేవనాగరి, ఈ లిపియొక్క అక్షరమాల సుమారు పరిపూర్ణము. పరిపూర్ణత సృష్టిలో దేనికీలేదు. ఒక్క భగవంతునికి తప్ప. భారతీయ భాషలన్నీ సుమారుగా ఈ అక్షరమాలనే అవలంబించాయి. మరీ విశేషమైన ఉచ్చారణలు తప్ప నాగర లిపిలో అన్ని భాషలు వ్రాయవచ్చు.

    లిపిలేనిది వాటిని వ్రాయనిది అనంతములైన వేదాలను భద్రపరచడం అసాధ్యం!

    ప్రపంచ చరిత్రలో ఇంతకాలం నుంచి భద్రపరచిన గ్రంథం ఒక్క వేదం మాత్రమే! మరే భాషకూ, జాతికీ ఇంతగర్వంగా చెప్పుకొనగల గ్రంథం లేదు. అందుకు మనం గర్వించాలి.

    ఒక ఛందశ్శాస్త్రము, వ్యాకరణము ఏర్పడి లెక్కలేనన్ని వేదములు వెలువడిన భాషకు లిపి లేదనుట వంచించుట మాత్రమే!

    నేడు నాగరకములు అనిపించుకుంటున్న అనేక జాతులకు లిపి లేదని తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగవచ్చు. వాస్తవాలు సహితం ఆశ్చర్యం కలిగిస్తాయి.

    నేడు ప్రపంచాన్ని ఆర్థికంగా శాసిస్తున్నామని భ్రమపడుతున్న అమెరికాకు డాలర్లున్నాయి! కాని స్వంత భాషలేదు - లిపి లేదు.

    నేడు భారతదేశానికి జాతీయ భాషాయైన హిందీకి, లిపి లేదు. దేవనాగరియే దాని లిపి.

    స్వంత లిపి గల భాషల్లో తెలుగు సహితంగా మరిన్ని భారతీయ భాషలున్నాయి.

    వేదం తొలినుంచే అక్షరబద్ధమై వ్రాయబడింది అనేది నిర్వివాదాంశం. వేదం నూటికి నూరుపాళ్లు అక్షర బద్ధమైన రచన. ఇందు సంశయానికి ఇసుమంత తావులేదు.

                                             వేదం - స్వరం

    వేదం శృతి. వినదగింది. వినసొంపుగా ఉండడానికి వేదానికి స్వరం ఉంది. స్వరయుక్తంగా చదివిన వేదం శ్రావ్యంగా ఉంటుంది. అది శక్తిమంతం సాధించగలదు.

    వేదం చదివే పద్ధతులకు సహితం శాస్త్రం ఉంది. ఒక శబ్దాన్ని మరలమరల ఉచ్చరించడం ఆ విధానం. అందువలన వేదం కంఠోపాఠంగావడం సులభం అవుతుంది. ఇవి పదపాఠ, క్రమపాఠ, జట మున్నగు పద్ధతులు.

    స్వర, పాదపద్ధతిన వేదాన్ని ఇంతకాలం నిలిపి ఉంచడానికి కొన్ని కుటుంబాలు, వంశాలూ అంకితం అయినాయి. ఇన్ని వేల, లక్షల సంవత్సరాలు ఎలా భద్రపరచారండీ?

    ఇంతకాలం నిరంతరంగా జీవించి ఉన్న గ్రంథం మరొకటి లోకంలో లేదు.

    మా తండ్రిగారు మహా విద్వాంసులు. వారి ద్రావిడ "తిరువాయ్ మొళిని" తెనిగించారు. అనేక గ్రంథాలు రచించారు. వారు 1979లో పరమపదించారు. ఆనాటికి వారి గ్రంథం ఒక్కటి కూడా మాకు లభించలేదు.

 Previous Page Next Page