మా అన్నయ్య దాశరథి కృష్ణమాచార్యులవారు మహాకవి. అంధ్రప్రదేశ్ ఆస్థానకవి. వారు 1987లో పరమపదించారు. వారి పుస్తకాలు అన్నీ ప్రస్తుతం లభ్యం కావడం లేదు.
నా పుస్తకాలు లభించక పరిశోధన చేసేవారు మా ఇంటికి వచ్చి అధ్యయనం చేస్తున్నారు.
ఇది గత అర్ధ శతాబ్దం కథ. అచ్చు యంత్రాలు, ప్రచురణ సంస్థలు, గ్రంథాలయాలు ఏర్పడిన కాలం.
తాళపత్రాలు, భూర్జర పత్రాలమీద సరియైన పాఠాలు వ్రాసుకుని వల్లించి, తరతరాలుగా వాటిని రక్షించడం ప్రపంచపు వింతల్లో ప్రథమం కావాలి.
పిరమిడ్లు - చైనా మహాకుడ్యం - ఎల్లోరా, అజంతా శిల్పాలు తాజ్ మహల్ వంటి మహానిర్మాణాలు కాలదోషం పట్టి అరిగిపోవడమో పోతుండడమో జరుగుతున్నది. కాని వేదం కాలపు జరాజీర్ణాలకు అతీతంగా నిత్యనూతనంగా నిలిచివున్నది. ఇది ప్రపంచంలో తొలివింతకాక మరేమిటి?
అయితే మనం సాంస్కృతిక బానిసలం! మనం ఈ విషయం చెప్పుకోం? ఏలినవారు ఈ విషయం అంగీకరింపనొల్లరు. బానిసల నాగరకత దొరల నాగరకతను మించరాదు.
వేదం శృతి అన్నాం. వినడం ఏమిటి చదువుకొనరాదా? అనవచ్చు.
మనసుకు పట్టడానికీ మనసును కదిలించడానికీ వినడం అవసరం.
నేడు మహామహా పాఠ్యగ్రంథాలున్నాయి. అయినా ఉపాధ్యాయులు బోధిస్తుంటారు.
విన్నది మనసుకు పడ్తుంది. అర్ధ శతాబ్దం క్రితం దాకా ఈ దేశంలో జనం పురాణాలు, హరికథలు, బుర్రకథలు, జముకుల కథల ద్వారానే విద్యావంతులైనారు.
పుస్తకాల వ్యాపారం మొదలైన తరువాత ఈ వినడం వినిపించడం నిలిచిపోయాయి. జనానికి అక్షరాలు వచ్చాయి. విద్య కరవైంది.
శబ్దానికి నాదం ఉంది. అర్థం ఉంది. రెండూ ఉపకరిస్తాయి. అర్థంలేని నాదం ఏమి? అని అడగవచ్చు. అడగడం తేలికగదా! దానికి ఆలోచన అక్కరలేదు.
త్యాగరాయ కృతులు తెలుగులో ఉన్నాయి. త్యాగరాజును తమిళులే ఎక్కువ ఆరాధిస్తారు. వారికి అర్థం తెలియదు. కృతులు వ్రాసుకోవడానికి పర్యాప్తం అయిన లిపి సహితం వారికిలేదు. తమిళులు ఆరాధించేది శబ్దనాదాన్ని. నాదం మనసును కదిలిస్తుంది, కరిగిస్తుంది.
ఈ మధ్య భాష తెలియకున్నా జనం ఇతర భాషల సినిమాలను చూచి ఆనందిస్తున్నారు.
అలాగే స్వరబద్ధమైన వేదనాదం మనసును కదిలిస్తుంది. మంచి కలిగిస్తుంది. శాంతిని ప్రసాదిస్తుంది.
వేదపు అర్థం తెలిసికొనాలనే నేను అనువదించింది. కాని వేదస్వర నాదపు అమృతధారలను సహితం ఆస్వాదించడం ఇహపర సాధకం అవుతుంది.
వేదం శృతి.
దాన్ని వినిపించడంలో ఆనందం ఉంది.
వినడంలో అమృతం అందుతుంది.
వేదం ఆంగ్లేయులు
మనది ఆర్యావర్తము. కర్మభూమి. పుణ్యభూమి. మనం శాంతికాముకులం. 'సర్వేపిసుఖనస్సంతు; మన ధ్యేయం.
మనం శాంతులం. దాంతులం. క్షాంతులం. అంతేకాదు సంపన్నులం.
సంపద పరులను ఓర్చనీయదు. దాన్ని హస్తగతం చేసికోవడానికి అనేకులు ఎగబడ్తారు. దాడి చేస్తారు. కాజేస్తారు.
మన దేశానికి అదే జరిగింది. పొరుగు వారు మనమీద దండెత్తారు. వారు సింధుమీదుగా మనదేశానికి వచ్చారు. వారికి 'స' ను 'హ'గా పలుకుతారు. సింధు నదిని 'హిందు'నది అన్నారు. హిందునది ఉన్న స్థానము కావున హిందుస్థాన్ అన్నారు.
అప్పటినుంచి మనదేశం పేరు హిందుస్థాన్ అయింది. 'హిందు' పదానికి ఏమతం, ధర్మం, శాస్త్రంతో సంబంధంలేదు. హిందు అనే పదం మన మతగ్రంథాలలో కనిపించదు.
"హిందీహైహమ్, వతన్ హై హిందూస్తాన్ హమారా" అన్నాడు ఇక్బాల్ కవి. మేం హిందువులం. మా దేశం హిందుస్తాన్ అంటాడు.
మహమ్మదీయులు హిందూస్తానాన్ని వేయి సంవత్సరాలకు పైగా పరిపాలించారు. వారు మతం మార్చడమే ధ్యేయంగా మనదేశానికి వచ్చారు. కాని ఈ దేశాన్ని చూచి మైమరచారు. స్వర్గం అనేది ఎక్కడ ఉంది? అంటే ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది అన్నారు.
మహమ్మదీయ పాలకులు భారతీయులయినారు. ఈ దేశంలో ఉన్నారు. ఈ దేశాన్ని పాలించారు. సంగీత సాహిత్యాలలో మనను ప్రభావితులను చేశారు. వారు ప్రభావితులైనారు. ఒక మిశ్రమ సంస్కృతి అవతరించింది.
వారు మతాన్ని మార్చలేదని కాదు. మన మతానికి అడ్డురాలేదు.
ఆదిశంకరుని అద్వైతం - రామానుజుని విశిష్టాద్వైతం ద్వైతం - చైతన్య ప్రభువు, జయదేవుడు, మీరావంటి వారి మధుర భక్తి తులసి రామాయణము, కబీర్, సూర్ దాస్ తెలుగు భారత, భాగవత రచనలు ఈ విధమైన మహత్తరం అయిన తాత్త్విక చింతన మహమ్మదీయుల కాలంలోనే వర్ధిల్లింది.
భారతీయ తాత్విక చింతనతో ప్రభావితులైన ముస్లిం సూఫీ కవులున్నారు. ఉపనిషత్తులు అనువదించిన వారున్నారు.
ఆదిశంకరుని అద్వైత ఆవిర్భావానికి ఇస్లాం మతప్రభావమే కారణమని నా ఉద్దేశం. మనం నేటికీ బహుదేవతారాధకులమే! అందుకు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అది మా చరిత్ర, అది మా సంస్కృతి. ఎవరినో మెప్పించడానికి ఏకేశ్వర సంథాను అవలంబించలేం.
చివరి మొగల్ చక్రవర్తి కవిగా కొన్ని ఆలయాలను కూల్చిన మాట వాస్తవం. కాని అది మాత్రమే వేయేళ్ల ముస్లిం పాలనకు ప్రతీక కాదు.
రాజకీయాలకు కంపు పనికి వచ్చినంతగా పరిమళం పనికిరాదు.
ఆంగ్లేయులు వర్తకం కోసం వచ్చి మనదేశాన్ని కొల్లగొట్టడానికే పాలకులయినారు. భారతదేశ చరిత్రలో ఇతర దేశం నుండి పాలించినవారు ఆంగ్లేయులు మాత్రమే!
ఆంగ్లేయులు మన నాగరకతతో ప్రభావితులుకాలేదు. అంతటితో వారు ఆగలేదు. మనజాతిని నాగరికతను సభ్యతను సంప్రదాయాన్నీ భాషను సంస్కృతిని హేళన చేశారు. మహామహులైన రాజారామమోహనరాయ్ వంటి వారితో మన సంస్కృతిని హేళన చేయించారు. వారు అంతటితో ఆగలేదు. మనను చరిత్రహీనులు అన్నారు. మన కోసం వారు చరిత్ర రచించారు. అది మనదే అని మనతో నమ్మింప చేశారు.
వారు మనను చవటలు అన్నారు.
అవును మహాప్రభూ! మేము చవటలమే అన్నాం ఇంకా అంటూనే ఉన్నాం.
మనదేశాన్ని పాలిస్తూ మన సంస్కృతిని రూపుమాపడానికి మన వేదాలను అధ్యయనం చేసిన ఘనత అంగ్రేజు ముష్కరులకు మాత్రమే దక్కుతుంది.
ఆంగ్లేయులు వేదాలను ఈ దృక్పథంతో అనువదింప చేశారు. అధ్యయనం చేయించారు.
పేరు చెప్పను. అతడు గొప్ప విద్వాంసుడు. వేదం అనువదిస్తూ ఇది పూర్తి అవుతే భారతీయులు ఆటవికులని తేలిపోతుంది. అంతా క్రైస్తవులతారు. అని ఒకరికి వ్రాశాడు.
వివరాలకు ఇది తావుకాదు. నాకు అన్యమత ద్వేషం ఇసుమంత లేదు. వేదాలని గురించి ఆంగ్లేయులు చేసిన వక్రభాష్యాలనూ, అవి మన బుర్రల్లో చెరగని ముద్రలుగా ఉండడాన్ని గురించి ఆలోచించుదాం.
ఆంగ్లేయులు వేదం విషయంలో చేసిన అబద్ధపు ఆరోపణలు :-
I) 1. వేదం ఆర్యుల అనాగరక ఆటవిక జీవితానికి వర్తిస్తుంది అనేది ఒక బూటకం ఆరోపణ.
ఈ వ్యాఖ్యకు ప్రధాన కారణం పాలితులు పాలకులకన్న సంస్కారవంతులుకారాదు అనే సామ్రాజ్యవాద కుటిల సూత్రం.
వేదమంత్రం, వేదభాష, వేదజీవితం ఏర్పడడానికి ఎంతో నాగరకం కావాలి. వేదం మొత్తంలో ఆటవిక లక్షణం కనిపించదు. వేదం చదివి ప్రభావితులు కాకపోవడానికి కారణం అక్కసు అహంకారం తప్ప అన్యంకాదు.
2. ఆర్యులు మధ్య ఆసియా దేశాలనుండి దండెత్తి వచ్చారు అనే ఆరోపణ "స్వభావోదురతి క్రమః" అవుతుంది.
"జైసా ఆద్మీ వైసాఖయాల్" మనిషి ఎలాంటి వాడైతే ఆలోచన అలాగే ఉంటుంది అని అర్థం.
ఆంగ్లేయులు సరిగ్గా భారతదేశంలో ఆ పనే చేశారు. కాబట్టి దానిని ఆర్యులకు ఆపాదించారు.
భారత సరిహద్దులు ఆంగ్లేయులు నిర్ణయించినవికావు. ఆర్యులనాడు భారతదేశానికి ఆ హద్దులే ఉన్నాయనుకోవడం వారి తెలివితక్కువదనం.
మేం చదువుకునేప్పుడు భారతదేశపటంలో బర్మా, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక ఉండేది. ఇప్పుడు అవి వేరు వేరు దేశాలు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా విడిపోయాయి. ఇది అర్ధ శతాబ్దంలో జరిగింది.
ఆర్యులనాటి భారతదేశ హద్దులు ఈనాడు నిర్ణయించడం కష్టం. కాని 'రాహుల్ సాంకృత్యాయన్' ప్రస్తుతపు రష్యాలోని ఓల్గానుండి గంగానది వరకు ఒకటే సంస్కృతి అని చెప్పినారు. కాబట్టి ఆర్యులు తమ భూమి మీదనే ఒక చోటునుంచి ఒక చోటుకు వచ్చారు. అది దండయాత్ర ఎలా అవుతుంది? దండెత్తడం, దుంపనాశనం చేయడం ఆంగ్లేయుల నీతి.
జీవిక కోసం మనం ఎన్నెన్ని ప్రాంతాలకో వెళ్తున్నాం. ఆర్యులు రావడాన్ని దండయాత్ర అనిగాని వలస అనిగాని అనడానికి ఏమాత్రం వీలులేదు. వారు తమభూమి మీదనే ఒకచోట నుండి మరొకచోటుకు తరలి వచ్చారు.
II) హరప్ప, మొహంజదారో లో వెలువడిన శిథిలాల ఆధారంగా ఆర్యులకు ముందే దస్యుల ద్రావిడుల నాగరకత ఉండేదనీ, దాన్ని ఆర్యులు నాశనం చేశారనీ ఆరోపణ.
నాగరకతలు ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటాయనేది అజ్ఞానపువాదం. మార్పు ప్రకృతి ధర్మం. పరివర్తనంలో పెరగనూవచ్చు తరగనూవచ్చు. అలా ఎన్ని నాగరకతలు కాలగర్భంలో కలసిపోయాయో! ఎదగడం ఎప్పటికీ ఒకే నాగరకత ఎదగడం వాస్తవమైతే భారత, చైనా, గ్రీకు రోమను నాగరికతలే ఉండాలి. ఆంగ్ల నాగరకత ఉండడానికి వీల్లేదు.
నాగరకతలను నాశనం చేయడం ఆంగ్లేయులకు వెన్నతో పెట్టిన విద్య. రెడిండియన్లను, నీగ్రోలనూ మరెంతో మందిని పశువులకన్న హీనంగ హతమార్చి వారి జాతులను సంస్కృతులనూ ధ్వంసం చేసిన ఘనత వారిది! వారి ఆలోచనా విధానం అలాగే ఉంటుంది.
ఆర్యులు శాంతిప్రియులు. వారు దండెత్తిన జాడలుగాని ఒక నాగరకతను ధ్వంసం చేసిన జాడగాని కనిపించదు. "కృణ్వంతో విశ్వమార్యం" ఆర్యనాగరకత ప్రపంచ వ్యాప్తంగా కావాలని.
III) ఆర్యులు దస్యులను నాశనం చేశారనేది మరొక ఆరోపణ.
ఆర్యులు ఒక జీవిత విధానాన్ని ఏర్పరచారు. యజ్ఞయాగాది క్రతువులు చేసినారు. ఈ విధానం అవలంభించనివారూ ఉంటారు. ఎదిరించినవారు ఉంటారు. మరొక విధానంలో జీవితం గడిపినవారూ ఉంటారు. అలాంటి విభిన్న జీవన విధానాల మధ్య ఘర్షణ తప్పదు.
రెండు రాజకీయపక్షాల మధ్య, ఒకే పక్షంలోని వివిధ గ్రూపుల మధ్య ఉన్నటువంటి ఘర్షణయే ఆర్య, అనార్యుల మధ్య ఉండింది.
సహజీవనం భారతీయ జీవిత విధానం.
ఆర్యులు, అనార్యులు కలిసి జీవించారు. అప్పుడప్పుడూ ఘర్షణలు తప్పవు. అలాంటి చెదురుమదురు సంఘటనలు కొండంతలను చేసి తమకున్న జాతివైషమ్యాన్ని ఆర్యులకు అంటగట్టినారు. ఇది వారి దుష్ట నాగరకతకు సంకేతం!
IV) ఒక అగ్రజాతి బ్రాహ్మణులు వేదాలను తమ స్వార్థంకోసం సృష్టించుకొని రాజ్యాలు హస్తగతం చేసుకున్నారు అనేది మరొక ఆరోపణ.
ఇది విభజించి పాలించు సూత్రం ప్రకారం చేసిన ఆరోపణ.
క్రైస్తవ మతాచార్యులు రాజులమీద పెత్తనంచేసి ఖరీదుకు స్వర్గాన్ని అమ్ముకున్న ఉదంతాలు చారిత్రకాలు. విజ్ఞాన వికాసానికి విరోధులై నిలిచిన మతాచార్యులను క్రైస్తవులలోని ఒక వర్గం ఎదిరించి రాజకీయాన్ని మతం నుండి వేరుచేసింది. ప్రొటెస్ట్ చేసినందున వారుక ప్రొటెస్టెంటులయినారు.
భారత చరిత్రలో బ్రాహ్మణులు ఒక కులంగా రాజ్యాధికారం చేసిన ఉదంతాలు లేవు. విదేశ రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించిన చాణక్యుడు రాజ్యం చంద్రగుప్తునికి అప్పగించి తాను సన్యాసి అయినాడు. విద్యారణ్యుడు హరిహర బుక్కరాయలకు రాజ్యం అప్పగించాడు. తాను రాజ్యం చేయలేదు.
బ్రాహ్మణులు ఒక జాతిగా వేదాన్ని, భారత సంస్కృతిని రక్షించడానికి ఎన్నో త్యాగాలు చేశారు.
అయితే భారతదేశాన్ని సుమారు పన్నెండు వందల సంవత్సరాలు అన్యదేశీయులు, అన్యమతస్తులూ పాలించారు. వేయేండ్లకుపైగా నిలిచిపోయిన సమాజంలో దురాచారాలు, దుష్టచింతనలు చోటుచేసుకోవడం తథ్యం. అలా అనేక లోపాలు జరిగి ఉండవచ్చు. అందుకు పాలకులది తప్ప ఏ ఒక్క వర్గానిదీ దోషంకాదు.
మానవుని దౌర్భల్యం ఏమంటే తనకు చేసిన మేలుకన్న కీడును ఎక్కువచేసి చూపుతాడు! అందువల్ల ప్రయోజనం ఉంటే మరింత! అది రాజకీయం అవుతే అవధులుండవు.
V) లోకంలో ఏ ఒక్క వ్యక్తి, సంస్థ, వ్యవస్థ పూర్తి కీడుకాని పూర్తి మేలుకాని చేయజాలవు. ఎక్కువ కీడు చేసినపుడు కీడు చేశారనీ ఎక్కువ మేలు చేసినపుడు మేలు చేశారనీ అంటాం. ఆంగ్లేయులు భారత సంస్కృతికి - భారత జాతికి భారతదేశానికీ భారత ప్రజలకు ఎంతో కీడు చేశారు. కీడు చేసింది ఆంగ్ల ప్రభుత్వం. వ్యక్తులుగా, ఆంగ్లేయులు భారత సంస్కృతికి ప్రభావితులై ఎంతో మేలు చేశారు. తెలుగు జాతికి సంబంధించినంతవరకు సర్ ఆర్థర్ కాటన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సేవలను తెలుగు జాతి మరువజాలదు.
ఆంగ్లభాష, ఆంగ్లేయుల ప్రజాస్వామ్య విలువలు - వివేకానందుకు, గాంధీ, తిలక్, నెహ్రూ, ఠాగూర్, రాధాకృష్ణ వంటి మహామహుల మహావ్యక్తిత్వాలను తీర్చిదిద్దాయి. వీరు భారతజాతి సాంస్కృతిక విలువలను పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయగలిగారు.
భారత సంస్కృతి సూర్యునిలాంటిది. దానికి గ్రహణం పడుతుంటుంది. ఇది తాత్కాలికమే ! గ్రహణాన్ని వదిలించే మహామహువులు అవతరిస్తుంటారు.
యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మనం సృజామ్యహం ||
భారతీ ! ధర్మానికి గ్లాని జరిగినప్పుడూ, అధర్మం తలయెత్తినపుడు నేను అవతరిస్తాను అన్నాడు శ్రీకృష్ణపరమాత్మ శ్రీమద్భగవద్గీత 4 -7లో.
ఋగ్వేద సంహిత
విశ్వమూలాయ విశ్వాత్మ సనాతన శరీరణే |
నమో వైదిక ధర్మాయ లోక కళ్యాణ హే తవే ||
వేదాలు నాలుగు. వాటిలో ఋగ్వేదానిది ప్రథమ స్థానము. ఉపనిషదాదులు ఋగ్వేదపు ఉల్లేఖనములు అధ్యయనము, పారాయణము మున్నగువానితో ప్రారంభం అవుతాయి.
"ఋగ్రూపోవేదః ఋగ్వేదః"
ఋక్కులు గలది కావున ఋగ్వేదం. ఋగ్వేదపు మంత్రాలను ఋక్కులు అంటారు.
"తేషామ్ ఋగ్యత్రార్థ వశేన పాదవ్యవస్థా"
వాక్యార్థం ఆధారంగా పాదం ఏర్పడిందాన్ని "బుక్" అంటారు.
"ఋచ్యన్తే స్తూయన్తే దేవా అనయా ఇతి బుచ్"
దేవతలను కీర్తించేదీ, స్తుతించేది బుక్.
యజుర్వేద, సామవేద ఆలోచనా విధానం పూర్తిగా ఋగ్వేదంమీద ఆధారపడింది. యజుర్వేదం కార్మానుష్ఠానమును వివరిస్తుంది. ఋక్కుల గేయరూపమే సామవేదం అనవచ్చు.
ఉపనిషత్తులు, బ్రాహ్మణములు అరణ్యకములు ఋగ్వేదం మీదనే ఆధారపడినాయని చెప్పవచ్చు.
ఋగ్వేద శాఖలు
ఋగ్వేద శాఖల్లో 1. శాకల 2. బాష్కల 3. అశ్వలయన 4. శాంఖ్యాయన 5. మాండూక్యాయన ప్రసిద్ధములు.
1. ముద్గల 2. గాలవ 3. శాలీయ 4. వాత్స్య 5. శైశరీయ 6. బౌధ్య 7. అగ్నిమాదర 8. పరాశర
9. జాతూకార్ణ్య 10. ఆశ్వలాయన 11. శాంఖాయన 12. కౌహేతకి 13. మహాకౌహేతకి 14. శాంబవ్య 15. మాంభాక్య
16. బహువృచ 17. పైంగ్య 18. ఉద్దాలక 19. శతబలాక్ష 20. గజమహైతరేయ 21. బాష్కల 22. ఐతరేయ 23. వసిష్ఠ 24. సులభ 25. శౌనకములు.
వీనిలో శాకల సంహిత అందుబాటులో ఉంది.. అచ్చవుతున్నది. ప్రచారంలో ఉంది. మనకు ప్రస్తుతం కనిపించే ఋగ్వేద సంహిత శాకలమే.
'శాకల' ఒక వ్యక్తి పేరు కాదు. ఒక వ్యక్తి యొక్క శిష్య సమూహాన్ని సూచిస్తుంది. వైదిక సంప్రదాయంలో శాకల సంహితకే ఆధారం ఉంది.
ఋగ్వేద విభజన
ఋగ్వేదము 1. అష్టకము 2. మండలము 3. అధ్యాయము 4. అనువాకము 5. సూక్తము 6. మంత్రములుగా విభజించబడింది.
1. అష్టకము :- అష్టకంలో ఎనిమిది అధ్యాయాలు ఉంటాయి ఋగ్వేదంలో ఎనిమిది అష్టకాలున్నాయి. అంటే మొత్తం 8x8-64 అధ్యాయాలున్నాయి. మనకు కళలు అరవై నాలుగు.
అష్టకంలో మండలం ముగియదు. ఒక్కొక్కసారి అష్టకం తరువాత కూడా మండలం కొనసాగుతుంది. ఒక్కొక్కసారి అష్టకంలోనే ఒక మండలం ముగిసి మరొకటి మొదలవుతుంది.
2. మండలం :- మండలంలో అధ్యాయాలుంటాయి. మండలానికి ఇన్ని అధ్యాయాలు ఉండాలని లేదు. కొన్నింటికి ఎక్కువ. కొన్నింటికి తక్కువ ఉంటాయి. మండలం అధ్యాయంతో ముగియాలని లేదు. ఒక్కొక్కసారి మండలం అయిపోయినా అధ్యాయం కొనసాగుతుంది.
ఋగ్వేదంలో పది మండలాలున్నాయి. అందువలన దానిని 'దశతమీ' అనికూడా అంటారు.