Read more!
 Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 1 పేజి 2


    ఆలాంటపుడు వేదంలో మంత్రాలను భాష్యకారుని వ్యాఖ్యాన నేత్రం నుంచి చూచి అర్థం చేసికోవాలి. ఋగ్వేదంలో 1017 సూత్రాలు, 10,580 ఋక్కులు లేక మంత్రాలు, 1,53,826 శబ్దాలు, 4,32,000 అక్షరాలు ఉన్నాయి.

    నేను ప్రతి మంత్రాన్నీ పూర్తిగా అర్థంచేసుకోవాలి. అనుమానాలను నివృత్తి చేసుకోవాలి. మంత్రం తన సంపూర్ణ జ్యోతితో నాకు దర్శనం ఇవ్వాలి.

    నాకు అర్థం కానిది నేను చెప్పలేను. అర్థం అయిన తరువాత దాన్ని తెలుగులో నేను అనువదించాలి. తేట తెలుగు అందరికి అర్థమయ్యే తెలుగులో చెప్పాలి.

    అందుకు నేనొక తపస్సు చేశాను. రోజుకు పదిగంటలపైన పరిశ్రమ చేశాను. ఇరవై నాలుగు గంటలు నిద్రలో సహితం మంత్రాల మననం ! అర్థం వెదకడానికి పలవరింపులూ సహజం అయిపోయాయి!!

    వేదంముందు పెట్టుకుని కూర్చున్నపుడు మహారణ్యంలో అగమ్యగోచరంగా అడుగు పెడుతున్నట్టుండేది. ఈ అరణ్యంలో అడుగు పెట్టగలమా అని భయం! కాని అలా కాగితం మీద కలం పెట్టగానే అరణ్యం ఉద్యానంగా మారుతుంది. రాచబాటలు- పూలపొదలు-వృక్షచ్చాయలు. తామర కొలనులు అంతా మనోహరంగా కనిపిస్తుంది.

    రచన అనాయాసంగా సాగుతుంది.

    ఏదో ఒక మహత్తమ శక్తి నాతో వ్రాయిస్తున్నట్లు అనిపిస్తుంది. వెనక్కు చూస్తాను. అదృశ్యం! ఏమీ ఉండడు!!

    వ్రాస్తున్నంతసేపు ఏదో చల్లని వెలుగు నన్ను నడిపిస్తుంది! కలం సాగుతుంది!! మనసు పొంగుతుంది!!! అదే భగవచ్చక్తి. ఆ భగవానుడే వ్రాయించి ఉండాలి. కాకుంటే నావంటి సామాన్యునికి ఇంతటి మహాకార్యం సాధ్యం అగునా?

    ఎన్ని విచిత్ర, వింత, విశిష్ట సంఘటనలు!

    ఒక్కొక్కసారి వాక్యం ప్రారంభిస్తాను. తరువాత ఏం వ్రాయాలో తెలియదు. అయోమయం. లిప్తలో కలం వెంట వెలుగు పాయ! వాక్యం పూర్తి అవుతుంది!! నాకే ముద్దొచ్చేంత అందంగా ఉంటుంది!!!

    శ్రీమదాంధ్రమహాభాగవతంలోని సిరికింజెప్పుడు.... పద్యం స్వయంగా శ్రీరామచంద్రమూర్తి పూరించాడంటారు. అలాంటివి నాకు ప్రత్యక్ష అనుభవాలు! భగవానుడు దర్శనం ఇచ్చాడని అబద్ధం చెప్పలేను. కాని అతడే వ్రాయించిన అద్భుత ఆశ్చర్యకర అనిర్వచనీయ అనుభూతులు ఈ రచనలో అనేకానేకం! అది అక్షరానికి చాలదు!!

    నేను ఈ అనువాదానికి కర్తనుకాను ద్రష్టను మాత్రమే అనిపిస్తుంది! కాదు అదే సత్యం!! అదే నిజం!!! ఒక్కొక్కసారి మంత్రం నన్ను ముప్పు తిప్పలు పెడ్తుంది. సాయణుని వ్యాఖ్య, త్రిపాఠీ అనువాదం వగైరాలు కరదీపికలు కాలేవు. సతమతం అవుతాను. ఒక కొండ నెత్తిన కూలినట్లవుతుంది. ఇహ అనువాదం సాగదు అనిపిస్తుంది. గుండె గుబులు పుడుతుంది.

    ఆలాంటప్పుడు కళ్లు మూసుకుంటాను. నిశ్శబ్దంగా ధ్యానంలోకి జారిపోతాను. అది యోగధ్యానం కాదు. అది నాకు రాదు. మరేధ్యాసలేని ధ్యానంలోకి జారిపోతాను. పరిసరాలద్యాస ఉండదు. అలా కొన్ని క్షణాలు గడుస్తాయి. ఒక వెలుగు రేఖ మొదలవుతుంది. అలా అది ఒక బింబం అవుతుంది!

    అప్పుడు కళ్లు తెరుస్తాను.

    మంత్రం అర్థం అవుతుంది!

    వివరణ విదితం అవుతుంది!!

    అనువాదం సాగిపోతుంది.!!!

    భగవానుడు అంతటి కృపాకటాక్షం కురిపించకుంటే ఇంతటి మహత్కార్యం ఇంత కొద్ది వ్యవధిలో అసాధ్యం! అనితర సాధ్యం!! దుస్సాధ్యం!!!

    1. నేను అరవై ఎనిమిదేళ్ల వృద్ధుణ్ణి.

    2. మధుమేహ వ్యాధి గ్రస్తుణ్ణి.

    3. మరీ అంత ఆరోగ్యవంతుణ్ణికాను.

    4. బలం కలవాణ్ణి అసలే కాను.

    అలాంటివాణ్ణి ఋగ్వేదంలోని 10,580 మంత్రాలను అనువదించడం భవ పుష్య పౌర్ణమి 16-1-95 నాడు ప్రారంభించి యువ మార్గశిర అమావాస్య 22-12-95 నాడు పూర్తి చేయగలిగానంటే అది కేవలం భగవదనుగ్రహమే ! పౌర్ణమినాడు, ప్రారంభించడం! అమావాస్యనాడు ముగించడం!!

    ఈ పదకొండు నెలల్లో వైశాఖంలో యమునోత్రి, గంగ్రోత్రి, కేదారనాథ్, బదరీనాథ్ యాత్రకు సకుటుంబంగా వెళ్లివచ్చాం. నేను రచించిన శ్రీ మహాభారతాన్ని బదరీ స్వామికి అంకితం సమర్పించి వచ్చాం.

    ఒకనెల అలా గడిచిపోయింది!

    అనారోగ్య కారణంగా ఒక నెల రచన నిలిచిపోయింది!!

    మిగిలిన తొమ్మిది నెలలలో సుమారు ఆరువేల పేజీలు  అధ్యయనం చేసి 1853 వ్రాత పేజీలు  రచన చేశాను! ఇది నా వంటి సామాన్యునకు సాధ్యమూకాదు! సాధారణమూకాదు!! అసాధారణములన్నీ భగవత్ప్రేరితములే అనేది నా విశ్వాసం మాత్రం కాదు. ఇది ఋతం. ఇది సత్యం. ఇది తథ్యం!!!

    ఈ కార్యంలో నాకు ఏ ఒక్కరూ సాయపడలేదు.

    కనీసం అడిగిన పుస్తకం అందించలేదు!!

    పుస్తకం వెదికి కావలసినది చూసినవాడు లేదు!!!

    ఒక్క అక్షరం మరొకడు వ్రాయలేదు. !

    ఇంత మహాగ్రంథం నేనొక్కణ్ణే వ్రాశాను!!

    నాకు వ్రాయసగాడు లేడు!!!

    ఇదంతా మానవ మాత్రునికి సాధ్యం అంటారా? ఇది కేవలం భగవదను గ్రహమే! మరొకటి కానే కాదు!! అగుటకు వీలులేదు!!! "నమో భగవతే వాసుదేవాయ".

    శ్రీమద్రామాయణ, శ్రీ మహాభారత, శ్రీమద్భాగవతం సహితంగా నవలలు, కథలు, వ్యాసాలూ, అనువాదాలు కలిసి పదేవేల పేజీలపైన నా రచనలు ఇప్పటికి అచ్చయినాయి.

    వాటిలో వేటినీ తొలిప్రతే తప్ప మలిప్రతి శుద్ధప్రతి వ్రాయలేదు. వ్రాసింది వెనుదిరిగి చూడలేదు. సవరణలుగాని, తిరిగి వ్రాయటంగాని చేయలేదు!! వింతకాదా?

    పిల్లలమర్రి పినవీరభద్రునివలె "వాణినారాణి" అనలేను కాని పోతనామాత్యునివలె "పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండుట" అనగలను.

                                వేదమంటే?

    1. "వేదం" ఏకవచనము. ఇది పవిత్ర విద్య అని అథర్వ వేదం. శతపథ బ్రాహ్మణం, తైత్తరీయ బ్రాహ్మణంలో చెప్పబడింది.

    "ప్రాజాపత్యోవేదః అని తైత్తరీయం"

    2. "వేదాః" బహువచనము.

    "చత్వారోవా ఇమే వేదా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో బ్రహ్మవేద ఇతి" అని గోపథ పూర్వము వేదాలు నాలుగు. అవి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, బ్రహ్మవేదములు అని. బ్రహ్మవేదమే అథర్వ వేదము.

    3. ఏవమిమే సర్వేవేదా నిర్మితాః సంకల్పాః, సరహస్యాః, సబ్రాహ్మణాః, సోపనిషత్కాః, సేతిపసాః, సాన్వాఖ్యానాః, సపురాణాః, సస్వరాః, ససంస్కారాః, సనిరుక్తాః, సామశాసనాః సానుమార్పునాః సవాకోవాక్యాః అని గోపథ పూర్వము. 

    వేదములన్నీ సంకల్పము, రహస్యము, బ్రాహ్మణములు, ఉపనిషత్తులు, ఇతి హాసములు, వ్యాఖ్యానములు, పురాణములు, స్వరములు, సంస్కారములు, నిరుక్తములు, అనుశాసనములు, అను మార్జనములు, వాక్కు యొక్క వాక్యముల సహితముగా నిర్మించబడినవి.

    4. "అనన్తావై వేదాః" అని తైత్తరీయము. వేదములు అనంతములైనవి.

    ప్రాజాపత్యో వేదాః

    వేదములు ప్రాజాపత్యములు అన్నాడు. ప్రజాపతి అనగా నేమి? 

    1. "ప్రజాః సృష్ట్యాపాలయస్వేతి తస్మాత్ప్రజాప్తి రభవత్" అని గోపధ పూర్వము. ప్రజలను సృష్టించి పాలించుట వలన ప్రజాపతి అయినాడు. వేదములును అట్లే అయినవి.

    2. ప్రజాపతిరగ్నిః 3. ప్రజాపతిర్వైమనః 4. ప్రజాపతిర్వైవాచస్పతిః 5. సంవత్సరోవై ప్రజాపతిః 6. యజ్ఞ ప్రజాపతిః 7. ప్రజాపతిర్వై సవితా 8. ప్రాణాహి ప్రజాపతిః 9. అన్నంవై ప్రజాపతిః 10. పతద్వై ప్రజాపతిః 11. ప్రజాపతిర్వై భూతః 12. ప్రజాపతిర్భన్ధుః 13. ప్రజాపతిర్వై హిరణ్యగర్భః 14. ప్రజాపతిర్వై చంద్రమాః 15. ప్రజాపతిర్వై మహాన్దేవాః 16. ప్రజాపతిర్వై మనుః 17. ప్రజాపతిర్వై విశ్వకర్మా 18. ప్రజాపతిర్వై సుపర్ణోగరుత్మాన్ 19. ప్రజాపతిర్వై మూర్ధా 20. ప్రజాప్రతిర్వా ఓదనః 21. ప్రజాపతిః సర్వః 22. సర్వాణి చంధాంసి ప్రజాపతిః 23. ప్రజాపత్యోవా ఆశ్వః 24. ప్రజాపతిః సదస్యః 25. ప్రజాపతిః ఉద్గాతా 26. ప్రజాపతిరుద్గీతః 27. అథర్వావై ప్రజాపతిః 28. సత్యంహి ప్రజాపతిః 29. ఘృతంచ మధుర ప్రజాపతి రాసీత్ 30. ఆత్మాహ్యయం ప్రజాపతిః 31. పురుషోహి ప్రజాపతిః 32. పితరః ప్రజాపతిః 33. ప్రజాపతిర్దాతా 34. ప్రజాపతిర్వై జమదగ్నిః 35. ప్రజాపతిర్వై ద్రోణ కలశః 36. ఇమేలోకాః ప్రజాపతిః 37. ప్రజాపతిః సర్వే దేవతాః 38. ప్రజాపతిర్వా అమృతః 39. ప్రజాపతిర్హి స్వరాజ్యమ్.
 
    అపరిమితోహి ప్రజాపతిః

    ప్రజాపతి అపరిమితుడు. కావున వేదము అపరిమితము. "అనన్తావై వేదాః" అన్నదానికి సరిపోయింది.

    వేద సంహిత :

    మానవునికి జ్ఞానం కలిగించింది వేదం. వేదం మనిషికి ఎరుక పరిచింది. ఈ జ్ఞానం సాపేక్షం. మానవునికి తెలియనిదాన్ని తెలియపరచడం జ్ఞానం.

    మనిషికి అన్నం తెలియనినాడు అది తెలియపరుస్తే జ్ఞానం అవుతుంది. అది తెలిసిన తరువాత అన్నం జ్ఞానం కాదు.

    బట్ట తెలియనపుడు బట్టను గురించి తెలియపరచడం జ్ఞానం. అది తెలిసిన తరువాత వస్త్రం జ్ఞానం కాదు.

    అలాగే కుటుంబం ఏర్పడడం, వ్యవసాయం, వ్యాపారం, బంధుత్వం ఇలాంటివి ఇంకెన్నో!

    అయితే సత్యం, సత్యస్వరూపుడైన భగవానుడు మానవునికి ఎన్నటికీ అందరు. కాబట్టి అది ఎల్లకాలం జ్ఞానం అవుతుంది.

    కాని సత్యం, సత్యస్వరూపుడగు భగవానుడు మానవునికి ఎన్నటికీ గోచరించడు. అందువల్ల అందుకు సంబంధించిన సమస్త సాహిత్య సంపదా జ్ఞానమే అవుతుంది.

    మానవునికి లౌకిక, పారలౌకిక, ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ వేదమే ప్రవచించింది.

    ఎంతటి మహాత్ములు, మహామహులైనా పరాత్పరుని అంశామాత్రంగానే దర్శించారు. పరమాత్ముని పరిపూర్ణ స్వరూపం మానవునికి గోచరం కాలేదు - కాదు - కాబోదు.

    మానవుని మంచివాణ్ణి చేయడానికీ, మంచి మార్గమున నడిపించడానికీ, మనిషిని చేయడానికి అనాది నుంచి అనేక సంస్థలు, ఆచారాలు, సంప్రదాయాలు ఏర్పడుతూనే ఉన్నాయి. నిరంతర యత్నం వలన మహర్షులు మహాత్ములు వాటిని ఏర్పరుస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. స్థిరపరుస్తున్నారు.

    ఆ మహర్షులు, మహాత్ములు నిస్వార్థులు. నిష్కల్మషులు. తేజోమూర్తులు. దివ్వెవలె తమ జీవితాలను మానవ కళ్యాణానికి అర్పించినవారు అంకితం చేసినవారు. వారు సూర్యచంద్రాదులవంటివారు. పర్వతములు, నదులు వృక్షములవంటివారు.

    ప్రకృతి ప్రాణులకు తన సర్వస్వం అర్పిస్తుంది. అంతే తాను వాటినుండి ఏదీ ఆశించదు.

    తనను కొట్టిన గొడ్డలికే పరిమళం ప్రసాదిస్తుంది చందన వృక్షం అంటాడొక కవి.

    అయితే చెట్టు ఉన్నపుడు చీడపురుగు వలె సమాజంలోని అన్నింటినీ తమ స్వార్థం కోసం మాత్రమే వాడుకునే స్వప్రయోజన పరులుంటారు. వీరు సమస్తాన్నీ తమ కొరకే వాడుకుంటారు! తామే నిస్వార్థులం అనే వేషం వేస్తారు! జనాన్ని నమ్మిస్తారు!!!

    మహర్షులు, మహాత్ములు సృష్టించిన సంస్థలు, ఆచారాలు సంప్రదాయాల స్వరూప స్వభావాలను దిగమింగి వీరు కనీసం త్రేన్చరు. వాటి స్థానంలో ఆత్మ కోల్పోయిన రూపాలను ప్రతిష్టించి దాన్నే సత్యం అని నమ్మిస్తారు. వీరికి చేతనయింది నమ్మించడం. జనం నమ్ముతారు!! రూపాలను విడిచి ప్రతిరూపాలవెంట పడ్తారు!!!

    ఈ స్వప్రయోజన నరులు స్వచ్చ గంగా జలాన్ని సహితం విషపూరితం చేయగలరు! కలుషితమే గంగాజలం అని నమ్మించగల అసాధ్యులు వీరు!

    అయితే అనాదిగా వీరు సమాజాన్ని వశపరచుకుంటున్నారు. వాస్తవ సంప్రదాయలకు అపార్థాలు కలిగిస్తున్నారు.

    మనకు తెలిసిన కొలదిమాత్రపు చరిత్రలో నాటి బౌద్ధం నుంచి నేటి గాంధీవాదం వరకు ఇదే జరిగింది. వివరణ అక్కరలేదు. నిజం చేదు. మొన్నటి మార్కృజానికీ అదే గతి పట్టింది!

    ఇది మనకు తెలిసిన కథ. మూల సిద్దాంతాలను పదిలపరచడానికి అనేక సదుపాయాలున్నాయనుకుంటున్న కాలం ఇది.

    వేదం ఏనాటిదో తెలియదు. ఎన్నడు మొదలయిందో తెలియదు. అది అనాగరిక మానవుని నుంచి నిర్మలంగా నిష్కల్మషంగా ప్రవహించింది. మనిషి మనసు మలినాన్ని దూరం చేసింది. మానవుని దైవత్వపు అంచులకు కొనిపోయింది.

    స్వప్రయోజనపరులకు వేదం ఒక్క లెక్కకాదు! వారు వేదాన్ని సహితం వేలం వేయగలరు!! వేటినో చూపి వీటినే వేదం అనిపించగలరు. అసలు వేదాన్ని అడుగున వేసి తాము చెప్పిందే వేదం అనిపించగలరు. అందుకే 'విస్సన్న చెప్పిందే వేదం' అన్న మాట జనులనోట సామెత అయింది.

    ఈ విస్సన్నలు అసలు వేదాన్ని తలదన్నిన వేదాలను కల్పించి ఉంటారు!

    అలాంటి సమయంలో వేదవ్యాస మహర్షి అవతరించి నిజమైన వేదాన్ని ఉద్ధరించారు.

    వ్యాసభగవానుడు త్రికాలజ్ఞుడు. అతడు రానున్న తరాలవారు కేవలం భౌతికవాదులు. జీవులు అవుతారని గ్రహించాడు.

    ఏవం చకార భగవాన్ వ్యాసః కృపణ వత్సలః ||
    వ్యవధాత్యజ్ఞసంత్యై వేదమేకం చతుర్విధం ||

    కృపావాత్సల్యాలు గల వ్యాసభగవానుడు ఒకే వేదాన్ని నాలుగు విధాలుగా చేసినాడని భాగవతంలో చెప్పబడింది.

    "చకార వేదమేకం చతుర్విధం" అని ఒక్క వాక్యంలో చెప్పాడు. కాని మానవ కళ్యాణమే ధ్యేయంగా తన జీవితాన్నంతటినీ కప్పురంలా అర్పించిన వ్యాసుడు ఎంత శ్రమించిందీ చెప్పలేదు!

    పాఠ్యాంతరాలు గల కావ్యాలను పరిష్కరించడానికి పండితులు పడిన శ్రమ ఇంతంత కాదు. అనేక పాఠాలను చూచి నిర్ణయించడానికి అనేకమంది సాయము కావలసి వచ్చింది. కొన్నింటిని పరిష్కరించడానికి విశ్వవిద్యాలయాలు పండిత పరిషత్తులు పూనుకున్నాయి.

    "అనంతావైవేదాః" అనంతములైన వేదాలను పరిష్కరించి నాలుగుగా నిర్ణయించడం మానవ మాత్రులకు సాధ్యమయ్యేదికాదు.

    వ్యాస భగవానుడు మధ్యాహ్న సూర్యుడు ఆసీనుడై నక్షత్ర మండలం వంటి శిష్యమండలి పరివేష్టించి ఉండగా ఒక్కొక్క మంత్రము, సూక్తమును ఇందరు చదువుతూ నిర్ణయించి ఉండవచ్చు! మనోఫలకం మీద వెలసిన ఆ దృశ్యమే అద్భుతం! ఆశ్చర్యకరం!! ఆనందకరం!!!

    వ్యాస భగవానుడు ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్లు, ఎన్ని మాసములు, ఎన్ని సంవత్సరములు నిరంతరం కృషిచేసి వేదములను నాలుగుగా నిర్ణయించినాడో! ఇవి మాత్రమే వేదములని చెప్పగలిగినాడో! ఇవే వేదములు అన్యములు కావు అని ఒప్పించడానికి వ్యాసుడు, అతని శిష్యగణము ఎంత శ్రమించినారో! దాన్ని గురించి కనీసం అంచనావేయగల శక్తి స్తోమతలు మనకు లేవు. మనది అల్పబుద్ధి! మనము అల్పాయుష్కులము!!

    వ్యాస భగవానుడు మానవజాతికి చేసిన సేవను గురించి చెప్పుకునే శక్తిలేదు ఈనాటి 'దౌర్భాగ్య', 'కృతఘ్న' మానవాళికి!

    వ్యాసుడు భరతవంశము అంతరించకుండ రక్షించినాడు! పంచమ వేదమగు శ్రీమహాభారతం రచించారు. మానవజాతికి అమృత తుల్యమైన శ్రీమద్భగవద్గీతను శ్రీకృష్ణపరమాత్మచే ప్రవచింపచేశాడు! మానవజాతికి శాంతిప్రదమగు భక్తిని శ్రీమద్భాగవతమున ప్రతిపాదించాడు! అనేక పురాణాలు రచించాడు!

    అతడు సంఘ సంస్కర్త అయినాడు!

    భిషస్వరుడు అయినాడు!

    రాజకీయవేత్త అయినాడు!

    అతడు కానిది ఏది?

    అతడు సర్వస్వమైనాడు!

    వ్యాస భగవానుడు మానవజాతికి ఎన్నటికీ తరగని మహోపకారం చేసియూ తనకోసం ఏమి చేసికోలేదు. ఏ చెట్టుకిందనో పర్ణశాలలోనో ఉండి పిడికెడు మెతుకులు తిని ఇంతటి ఘనకార్యములు సాధించినాడు! కనీసం సాధించానని చెప్పుకొనలేదు.!!

    దివ్వెవలె తనను వెలిగించుకొని మానవజాతికి వెలుగు ప్రసాదించినాడు!

    అతడు సూర్యునివంటి తరగని వెలుగును మానవాళికి ప్రసాదించియు తాను దివ్వెవలెనే నిలిచినాడు!

    మనం అల్పులం మనం అంతటి మహోన్నత మనిషికి భగవానునికి ఏమి ఇవ్వగలం?

    వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తీఃపుత్రమ కల్మషం |
    పారశరాత్మజం వన్దే శుకతాతం తపోనిధం ||

    వ్యాస భగవానుడు దర్శనం ఇస్తే అతని పాదారవిందములు చుంబించాలని ఉంటుంది! నాకు గల అసాధ్యములైన ఆశల్లో అది ఒకటి!

 Previous Page Next Page