చెక్
_ మేర్లపాక మురళి
కాబోయే శ్రీమతికి 'చెక్' చెప్పబోతున్నాను. మరి రాణీగారు ఎటు అడుగువేస్తారో, తనను ఎలా రక్షించుకుంటారో చూడాలి.
ఈ ప్రేమ చదరంగంలో నేను సక్సెస్ అయితే నా కౌగిట్లో కీర్తి. అలా అనుకోవడంతోనే టెన్షన్ మొదలైంది నాలో.
పెళ్ళికి ముందే 'తొలిరేయి' గడపడానికి అన్ని పరిస్థితులూ అనుకూలంగా వున్నాయి, ఒక్క రాణీగారు తప్ప.
నా ప్రమేయం ఏమీ లేకుండానే పరిస్థితులు అలా కలిసొచ్చాయని తను భ్రమించేటట్టు చేసుకోవాలి. ఎక్కడా ఏ పొరబాటూ జరగకూడదు. బంటుల్ని పక్కకు తప్పించేసి, గుర్రాలకు కళ్ళెంవేసి, ఏనుగులను కట్టెయ్యాలి. రాణీగారి మంత్రి అయిన 'నిగ్రహాన్ని' దెబ్బతీయగలిగితే చాలు కీర్తి నా కౌగిట్లో వుంటుంది.
రాత్రే మాకు చదరంగం బల్ల, మనోనిబ్బరం, ధైర్యం, ఎథిక్స్, లాజికల్ థింకింగ్ ... ఇవే మా పావులు. వీటిని చిత్తుచేసి కీర్తిని దక్కించుకోవాలి.
ముద్దబంతిలాంటి కీర్తితో, మల్లెపూవులాంటి కీర్తితో, గులాబీ మొగ్గలాంటి కీర్తితో 'ఫస్ట్ నైట్' అనుభవాన్ని ఊహించుకుంటూ వుంటే నరాలు నాగుపాము లౌతున్నాయి. రక్తం మరింత ఎరుపై సెగలు రేపుతోంది. ఇందులో నేను విజయం సాధిస్తే కీర్తితో పంచుకున్న మధుర క్షణాల్ని నెమరేసుకుంటూ పెళ్ళి ఘడియ కోసం ఎదురుచూడచ్చు.
పెళ్ళిపీటల మీద కూర్చున్న కీర్తి కళ్ళల్లోకి ఆ అనుభవం తాలూకు జ్ఞాపకాలను నా కళ్ళు ఒలకబోసినప్పుడు ఏమౌతుంది? ఆ బుగ్గల్లోని సిగ్గు నా మీదకు పాకి చెంపలను చిలిపిగా గిల్లుతుంది.
భార్యాభర్తలు కాబోయే నేనూ, కీర్తి ఆడుకోబోయే ఈ చదరంగంలో విజయం ఎవరిదో ?
ఒకే కాటేజ్ లో ఇద్దరం కలిసి వారంరోజులపాటు వుంటాం కాబట్టి ఈ ఆట మొదలుపెట్టాలని అనుకుంటున్నాను. పెళ్ళికి ముందే కాబోయే భార్యతో కలిసి రాత్రిని పంచుకోవడం థ్రిల్లింగ్ గా వుంటుంది. ఆ థ్రిల్ ఫీలవ్వాలనే నా తొందరంతా.
కీర్తీ, నేనూ తిరుమల హిల్స్ కు బయల్దేరడంతోనే చదరంగానికి రంగం సిద్ధమైంది. బస్సులో తన పక్కన కూర్చోగానే కోరిక శరీరాన్ని మండించింది. బస్సు మెలికలు తిరిగినప్పుడంతా తన ఒడిలో ఆనిన నా వేళ్ళు తనకు చాలా కథలే చెప్పుంటాయి. ఆ కథలన్నీ కీర్తి విన్నదా? విననట్టే విండోలో నుంచి దూరమౌతున్న తిరుపతిని చూస్తూ వుండిపోయింది.
తిరుమలకొస్తూనే కాటేజ్ లో సామాన్లు పడేసి, దేవుడ్ని చూడాలని కీర్తి హడావుడిగా వెళ్ళింది. దేవుడిమీద నమ్మకంలేని నేను కాటేజ్ లోనే వుండిపోయి, ఇలా తనను స్వంతం చేసుకోవాలన్న దుష్టపథకం వేస్తున్నాను.
చుట్టూ చూశాను.
'హిల్ వ్యూ' కాటేజ్ లు కొండ అంచులమీద వాలి రెక్కలు ముడుచుకున్న పావురాయిల్లా వున్నాయి. మా కాటేజ్ ముందు పరుచుకున్న పూలతోట దేవతలు నేసిన చీర అంచులా వుంది. అందులో వున్న సోడియం దీపాలు ఆ అంచులో బిగించిన అద్దాల్లా వున్నాయి. అక్కడక్కడా గుంపులు, గుంపులుగా వున్న జనం సృష్టి వైచిత్రిని చూడడానికి వచ్చిన దేవుని అతిథుల్లా వున్నారు.
ఇంత అద్భుతమైన కాటేజ్ దొరకకపోయినా ఆ వెధవ ఆలోచన వచ్చేది కాదు.
కీర్తిలాంటి ఆడపిల్లతో ఆరు రోజులు ఉత్తినే గడపడం స్వర్గంలో కూర్చుని, నరకాన్ని చూస్తుండడంలా వుంటుంది. స్వర్గంలో కూర్చుని, స్వర్గాన్నే చూడాలనే నా పథకం ఫలిస్తుందా?
కీర్తి వాలకం చూస్తే కనీసం ముద్దు పెట్టుకునేందుకు కూడా అనుమతించేట్టు లేదు. నాతో ఇక్కడకు రావడానికే ఎన్నో షరతులు పెట్టింది. మొత్తం ఏడు షరతులకు నే ఒప్పుకున్నాకే నాతో హిల్స్ కు బయల్దేరింది. అవి ఏమిటంటే - హస్త సాముద్రికం చూడడం నిషిద్ధం. కళ్లల్లో ఎలాంటి నలుసు పడ్డా, చివరకు ఏనుగు పడ్డా వూదమని అడుగకూడదు. ఒళ్ళు నొప్పులని, కాళ్లు పీకుతున్నాయని, చేతుల్తో ఒత్తమని ప్రాధేయ పడకూడదు. మెట్లు ఎక్కేప్పుడు గానీ, దిగేటప్పుడు గానీ చేయి అందివ్వకూడదు. మాట్లాడేటప్పుడు ఇద్దరి మధ్యా కనీసం మూడడుగుల దూరం వుండాలి. ద్వంద్వార్థాల మాటలు మాట్లాడకూడదు.
ఈ షరతులకన్నిటికీ నేను తలవూపితే - తప్ప బయల్దేరలేదు. యూనివర్సిటీ హాస్టల్ ఖాళీచేసి ఊరెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అయితే కీర్తి ఫ్రెండ్స్ సరదాగా మహాబలిపురం టూర్ పెట్టుకున్నారు. ఆ టూర్ కు తాను వెడుతున్నానని, వారం తరువాత వస్తానని కీర్తి ఇంటికి ఉత్తరం రాసిపడేసింది. అయితే చివరి నిమిషంలో మహాబలిపురం టూర్ కాన్సిలైంది. తను ఊరెళ్ళిపోతానని అంది. కాణీ తనను వదిలిపెట్టడం నాకు ఇష్టం లేకపోయింది. కీర్తి ఇప్పుడు వెడితే మళ్ళీ పెళ్ళిపీటల మీదే చూడడం. ఎలానూ ఇంటికి లెటర్ రాసింది కనక ఆ వారం రోజులూ తిరుమలలో గడుపుదామని అన్నాను. షరతుల్ని చెప్పి ఒప్పుకుంది.
తిరుమలలో సాయంకాలం దిగాం. కాటేజ్ బుక్ చేసుకునేటప్పుడే మా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
కాటేజ్ లోని ఒక పోర్షన్ ని తీసుకుంటూ వుంటే అలా కాదని రెండు పోర్షన్ లనూ తీసుకోమంది. రాత్రయితే ఎవరి పోర్షన్ లో వాళ్ళు పడుకోవాలట. పగలు కూడా విడివిడిగానే వుండాలట. తన లగేజి సైతం తన పోర్షన్ లోనే పెట్టుకుంటుందట.
దీంతో నా తల తిరిగింది. అంతక్రితం బస్సులో తన స్పర్శతో వెచ్చనైన నా శరీరం ఆ మాటలకు పూర్తిగా చల్లబడిపోయింది.
ఒక జంటకు రెండు పోర్షన్ లు ఇవ్వరని అబద్దమాడినా కీర్తి ఒప్పుకోలేదు. తనే క్లర్క్ తో మాట్లాడి ఒకే కాటేజ్ కున్న రెండు పోర్షన్లను తీసుకుంది.
మౌనంగా తల ఆడించడం తప్ప అక్కడ నేను చేయగలిగిందేమీ లేదు.