Read more!
 Previous Page Next Page 
సాహసి పేజి 2


    ఏ ఘడియలోనైనా చనిపోవచ్చు. రాజు చనిపోగానే ఆయన మృత శరీరాన్ని 40 దినాల్లో మమ్మీగా మార్చి, పిరమిడ్ లోకి ప్రవేశపెట్టి నాతో పిరమిడ్ ని మూయించి వేస్తారు. అలా మూసివేసిన రాత్రే నన్ను చంపించి వేస్తారు.

    ఆ తరువాత నుంచి రాజ కుటుంబం కన్ను నీ మీద ఉంటుంది. ఇకప్పుడు నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే భవిష్యత్ వాస్తుస్థపతివి నీవే కనుక.

    ఈలోపే నువ్వు తప్పించుకుపోవాలి.

    అన్ని యేర్పాట్లు చేశాను.

    ఎర్రసముద్రం గుండా అరేబియా సముద్రంలోకి నిన్ను ప్రవేశపెట్టే గొప్ప నావికుడు ఇప్పుడు నైలునది తీరాన ఉన్నాడు.

    నువ్వు సింధూనదీ, కావేరీ నదీ తీరాలకు చేరాలి. అక్కడ నివసించే ఆర్యులు, ద్రావిడులు గొప్ప మానవతావాదులు వాళ్ళకు పటిష్టమయిన కోటల్ని నిర్మించి పెడుతూ, మన గొప్ప వంశం అంతరించకుండా చూడు.

    ఇదే నా ఆఖరి కోరిక. తీరుస్తావు కదూ!" కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లుతుండగా కొడుకుని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని నిశ్శబ్దంగా వున్న ఆ నిశీధిని భగ్నపరుస్తూ చప్పట్లు చరిచాడు ఇంహోతెప్-12.

    మరో ఘడియలో ఒక అశ్వికుడు గుర్రంతో కళ్ళెదుట నిలిచాడు.   

    ఆ చిన్నారికి తన తండ్రిని వదిలి వెళ్ళాలని లేదు. అయినా తండ్రి కోరికను తీర్చేందుకు తప్పేట్లు లేదు.

    బయలుదేరుతున్న కొడుకు చేతికి ఒక తోలు సంచిని అందించాడు ఇంహోతెప్-12.

    అందులో వున్న జంతు చర్మాలమీదే అద్భుతమైన వాస్తుకళ రహస్యాలు లిఖించబడి ఉన్నాయి.

    సరిగ్గా అర్ధరాత్రి దాటగానే ఆ గుర్రం పదేండ్ల పసివాడ్ని, అద్భుతమైన వాస్తుకళను తీసుకొని నైలునది కేసి దూసుకుపోయింది.


                  *    *    *    * 


    మరో రెండొందల దినాలకి ఇంహోతెప్-12 ఉరి తీయబడ్డాడు. ఉరి తీసాక గానీ ఈజిప్టు రాజవంశానికి ఇంహోతెప్-13 దేశం వదిలి వెళ్ళిపోయాడని తెలీలేదు.

    రాజవంశం దిగులు పడింది.

    పిరమిడ్ నిర్మించే వాస్తుకళ శాశ్వతంగా అంతమైపోయింది.

    రాజుల్ని సూర్యభగవానుడి బిడ్డలుగా మార్చే పిరమిడ్ నిర్మాణానికి తెరపడిపోయింది.


                 *    *    *    *


    క్రీస్తు పూర్వం 1260.

    ఈజిప్టు రాజవంశపు 19వ తరం... చేజారిన అధికారం తిరిగి దక్కింది.

    క్రీస్తు పూర్వం... 1200 : ఉత్తర మధ్యధరా సముద్రానికి చెందిన లిస్టిన్స్ పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు.

    క్రీ.పూ. 1027 : చౌ. రాజవంశం చైనాని ఆక్రమించుకుంది.

    క్రీ.పూ. 1000 : ఇండియాలో నాగరికత.

    క్రీ.పూ. 850....

    కాలం క్రీస్తు శకానికి రాసాగింది.

    క్రీ.పూ. 483 : బుద్ధుడి నిర్యాణం.

    క్రీ.పూ. 336 : అలెగ్జాండర్ రాజు కావడం.

    క్రీ.పూ. 274 : అశోక చక్రవర్తి ఇండియాకి చక్రవర్తి కావడం.

    క్రీ.పూ. 214 : గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్యాణం.

    క్రీ.పూ. 60 : జూలియస్ సీజర్ శకం...

    క్రీస్తు జననం - క్రీస్తు శకం ఆరంభం-

    రోమన్ సామ్రాజ్య పతనం క్రీ.శ. 378.

    రైజ్ ఆఫ్ ఇస్లామ్ క్రీ.శ. 570

    మాగ్నా కొర్టొ రివోల్టు 1381

    మొఘల్ ఎంఫైర్ 1526

    ఇంహోతెప్-13 వంశానికి చెందిన వాస్తుశిల్పి దక్షిణ భారతదేశంలోని హిందూ రాజుల కోటల నిర్మాణానికి వాస్తుభిక్ష పెట్టినవాడు- కావచ్చేమో. 


                   *    *    *    *


    కొన్ని వందల సంవత్సరాలనాటి పిరమిడ్ వాస్తుకళ ఇండియాలో రాజుల గుప్త నిధుల్ని రహస్యంగా భద్రపరిచేందుకు ఉపయోగపడింది.


                   *    *    *    *


    క్రీస్తుశకం 1800

    ఇంహోతెప్-13 వంశానికి చెందిన అరవై ఐదవ ఆరపు వాస్తస్థపతి విశ్వకర్మ హిందూ రాజుల గుప్తనిధుల్ని దాచే రహస్య ప్రక్రియకు ఊపిరి పోశాడు.


                                          *    *    *    *


    క్రీస్తుశకం 1850లో విశ్వకర్మ ఓ దక్షిణ భారతదేశపు రాజు విజ్ఞప్తి మేరకు వందకోట్ల విలువైన నిధిని ఒక రహస్య పద్ధతిలో- రహస్య ప్రదేశంలో పాతిపెట్టాడు.

    ఆ నిధి వెలుగులోకి రావల్సిన కాలం ఆసన్నమైయినట్లుంది. అందుకే ఒక్కచోట దానికి సంబంధించిన సంచలనం క్రమంగా ఊపిరి పోసుకోసాగింది.


                   *    *    *    *


    నాగరికత ఒక ప్రవాహం లాంటిది.

    నిరంతరం చైతన్యం దాని లక్షణం.

    సంస్కృతి, సాంప్రదాయాలు నాగరికతలో ముఖ్యమైన భాగాలు. ఎన్నెన్నో నాగరికతల అద్భుతమైన సంగమమే చరిత్ర. భూగోళాన్ని శోధించే సాహసికి చరిత్ర మాటున దాగిన దిగ్భ్రమ చెందించే గొప్ప రహస్యాలు, మిస్టరీలు తెలుస్తాయి. సాహసనేత్రంతో చూస్తేనే చరిత్రకు ఆవలవేపునున్న అంతుబట్టని మర్మాలు అవగతమవుతాయి.

    చరిత్ర అంటే ఆదిమకాలం నాటి వేట.

    చరిత్ర అంటే మధ్యయుగాలనాటి నదీ తీరాల మానవ సంచారం.

    చరిత్ర అంటే కరకు, కరవాలాలు ఎగపీల్చుకున్న ఈర్ష్యా అసూయ జ్వాలల యుద్ధం... చరిత్ర అంటే మొగలాయి చరవర్తుల అధికార దాహం... చరిత్ర అంటే ఔరంగజేబు హిందూమత ద్వేషం... గుడులు, గోపురాల విధ్వంసం...

    చరిత్ర అంటే అందమైన రాణుల విరహాసల జ్వాలల్లో మాడిపోయిన యౌవ్వనం... చరిత్ర అంటే పిండారులు... థగ్గులు.... ముస్లిం రాజులు.... ఫ్రెంచ్ రాజులు.... బ్రిటీష్ ప్రతినిధులు కొల్లగొట్టిన నిధి నిక్షేపాలు...

    మన ఆంధ్రదేశం మొదట్నించీ రాజరిక వ్యవస్థకు కాణాచి... కోటలు... పేటలు... నిధులు... నిక్షేపాలు.... శిల్పాలు... శిలా శాసనాలు... చీకటి సొరంగాలు... నల్లరాతి చలువ మందిరాలు... వెయ్యిస్తంభాల గుడి... ఒంటిరాతి దర్బారులు... మన సంస్కృతిలో భాగాలు.

    ఒకప్పుడు మన తెలుగుసీమ తరగని, విలువెరుగని, విలువ కట్టలేని అమూల్య నిధి నిక్షేపాలకు రత్న భాండాగారం.

    1947 ఆగస్ట్ 15- దేశ స్వాతంత్ర్యం వచ్చింది- రాజులు, రాజ్యాలు, ప్రజాస్వామ్యపు ప్రభంజనంలో మసిబారిపోయాయి.

    తరువాత కేంద్ర ప్రభుత్వం రాజభరణాలను రద్దు చేసింది. విలువైన నిధి నిక్షేపాలు, కోటలు, గోడలు పురావస్తు శాఖ అధీనంలోకి పోయాయి.

    పాతకాలపు పాలకరాజులు నామమాత్రంగా మిగిలిపోయారు. కాని ఈనాటి మాజీ రాజుల వంశీకుల వెనుక వున్న అద్భుతమయిన, కోట్ల రూపాయల నిధి నిక్షేపాలు అలాగే మరుగున పడిపోయాయి.

    ఈనాటి తరం రాజకుటుంబాలకు కూడా తెలీని ఆ నిధి నిక్షేపాలు ఏ రూపంలో, ఎక్కడ నిక్షిప్తమై వున్నాయి...?

    ఎవరయినా వాటికోసం ప్రయత్నం చేశారా? చేస్తున్నారా? ముప్పై ఏళ్ల క్రితం ఒక రాజకుటుంబానికి చెందిన ఒక సాహసి, తన వంశస్థులు దాచిన అపురూపమైన నిధి కోసం ఐదుగురు వ్యక్తులతో కలిసి అన్వేషణ జరిపిన సాహసం ఇప్పటికీ ఒక రహస్యం.

    ఆ సాహసి ఒక యువతి కావడం మరీ ఆశ్చర్యం. ఒకప్పుడు మనదేశంలో కొన్ని వందల రాజ్యాలు, సంస్థానాలు సుభిక్షంగా ఉండేవి ధనాగారాలు వజ్రవైఢూర్యాలతో, వెండిబంగారాలతో నిండిపోయి వుండేవి.

    మనదేశ రాజుల అనైక్యతని ఆసరాగా తీసుకుని ముష్కరులైన మొగలాయి చక్రవర్తులు, మూకలు దండయాత్ర పేరిట రాజ్యాన్ని వశం చేసుకోవడమే గాక, హిందూ రాజుల అపార ధనరాశుల్ని తరలించుకు పోయారు.

    ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి హిందూరాజులు తమ కోశాగారాల్లోని అమూల్యాభరణాల్ని రహస్య స్థలాల్లో పాతి పెట్టించారు.

    నిధులు అలా నిక్షిప్తం చేసే ముందు ఒకింత తెలివిగా వ్యవహరించి, తమ వారసులకు మాత్రమే నిధి నిక్షేపాలు దక్కాలని కొన్ని రహస్య పద్ధతుల్లో వ్యవహరించారు.

    జంతు చర్మాలపై రాతి స్తంభాలపై, చెక్క వస్తువులపై ఆ నిధులకు సంబంధించిన రహస్య మార్గాన్ని చూచాయగా చిత్రించారు.

    వాటి ఆధారంగానే చరిత్రలో ఎన్నో ఎన్నెన్నో రక్తసిక్తమైన నిధుల వేటలు చోటు చేసుకున్నాయి.

    నిధుల్ని, వాటిని నిక్షిప్తం చేసిన వ్యక్తుల ఆత్మలే కాపాడుతుంటాయని, విష సర్పాలు కాపలా కాస్తుంటాయని, తెలీని అతీంద్రియ శక్తుల మూలంగా రక్తం కక్కుక్కు చస్తారని, నిధివరకు వెళ్ళగలిగినా దాన్ని తీసుకొని వచ్చేప్పుడు సర్వం కోల్పోతారని కొన్ని నమ్మకాలు ప్రచారంలో వున్నాయి.

    హనుమకొండలోని వెయ్యిస్తంభాల గుడి ముందున్న పెద్ద నంది విగ్రహం కడుపులో కాకతీయ రాజులు నిధిని భద్రపరిచారని, ప్రచారం రావడంతో గోల్కొండరాజు దండయాత్ర మిషతో వచ్చి ఆ విగ్రహాన్ని మధ్యలో విరగ్గొట్టించారని వరంగల్ ప్రాంతంలో ఇప్పటికీ చెప్పుకుంటారు.

    ఏది ఏమైనా ట్రెజర్ హంటింగ్ అన్నది ఎంతో సాహసంతో కూడుకున్నది.

    ట్రెజర్ హంటర్స్ అపార ధనరాసుల కోసం సాహిసిస్తే... పురావస్తుశాఖ వారు ఆ నిధిని కనుగొనడం ద్వారా అప్పటి నాగరికత విశేషాల్ని తెలుసుకోవచ్చని ప్రయత్నిస్తుంటారు.

    ఆ నేపథ్యంలో సాగిన నవలే ఇది.

    (ఇలాంటి బ్యాగ్రౌండ్ తో నేనొక నవల రాయాలని- రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు. రచయిత తనకు నచ్చే నవలలే కాదు- పత్రికలకు, సంపాదకులకు నచ్చే అంశాల నేపథ్యంలో కూడా నవలలు రాయవలసి ఉంటుంది. అలా వారి కోరిక మేరకు రాస్తున్న నవలే ఇది- రచయిత)


                    *    *    *    *

 Previous Page Next Page