Read more!
 Previous Page Next Page 
సాహసి పేజి 3


    మైసూరు మహారాజా ప్యాలెస్... ది ఆర్నేట్ ఫోకల్ పాయింట్ ఆఫ్ సిటీ...

    సూర్యాస్తమయంలో మనోహరంగా కనిపిస్తోంది కృష్ణరాజ వడయార్ మెడికల్ కాలేజీ. స్టూడెంట్స్ కొందరు ఆ అందమైన సాయంత్రంవేళ ప్యాలెస్ ముందున్న రోజ్ గార్డెన్ లో కూర్చున్నారు.

    డిసెంబర్ నెల కావడంతో పొగమంచు క్రమంగా తన సాంద్రతని పెంచుకుంటూ చాముండి బెట్టమీంచి నగర ప్రవేశం చేస్తోంది.

    మాస్కో నగరపు రాజ ప్రసాదాల గోపురాల్లా కనిపిస్తున్న ప్యాలెస్ హైట్స్ బుజువుల కేసి చూస్తోంది ఓ యువతి.

    అక్కడున్న ఐదుగురిలో ఆ యువతి మాత్రమే నిశ్శబ్దంలో మునిగిపోయి ఉంది.

    మిగతా నలుగురూ కావేరి గలగలల్ని మరిపిస్తూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు.

    ఆడపిల్లల హాస్టల్ గదుల ఎదుట తచ్చాడటాలు... లైబ్రరీ దగ్గర నిఘా వేయటాలు... కేంటీన్స్ దగ్గర కాఫీ తాగుతూ దొంగచూపులు...

    లాబరేటరీల దగ్గర గుండెల వేగం పెరగడం... స్పోర్ట్స్ గ్రౌండ్ కార్నర్స్ లో కలం, కాగితాలతో కుస్తీపట్లు...

    పరిచయాలు... స్నేహాలు... ప్రేమలు... పెళ్ళిళ్ళు... వీటిమీద చర్చలు... దక్షిణభారతదేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్ధినీ విద్యార్ధులు అక్కడ... ఆ ప్యాలెస్ ముందు తరచూ సేదతీరటం సర్వసాధారణం.

    ఇండియన్ సోషల్ - కల్చరల్ కరెంట్స్ కి వాళ్ళే ప్రతినిదులేమో అన్నట్లుంటారు. హిపోక్రసీ క్రీనీడల్లో విలువల్ని వదిలేసి అవతలవారని ఇంప్రెస్ చేయాలనే ప్రయత్నంలో సోఫిస్టికేషన్ ముసుగు కప్పుకొని ఏమిటేమిటో మాట్లాడుకునే ప్రయత్నం...

    ఆ ప్రయత్నం పక్కనే జరుగుతున్నా ఆమె మాత్రం అప్పుడే విద్యుత్ వెలుగుల్ని జిలుగు వెలుగుల ఆభరణాల్లా ధరించిన ఆ రాజప్రాసాదం కేసే చూస్తోంది.

    ఆమె ఇందుమతి...

    నిజమైన ఆకర్షణ ఆమె స్వంతం... 

    ఆ ఐదుగురిలోనే కాదు- ఆ కాలేజీలోనే ఎందరో కలలకి కేంద్ర బిందువామె. మరెందరో ఊహా ప్రపంచానికి అందాల సామ్రాజ్ఞి ఆమె. మధుర మనోహరి, సంగీత ప్రపంచపు సరసాల సుందరి మడొన్నాలా ఉంటుందని అందరూ తమలో తామే ఊహించుకొని మురిసిపోతుంటారు. మోనికా సెలెస్ ఆత్మవిశ్వాసం, పట్టుదల, కసి ఆమె కళ్ళల్లో కనిపిస్తుంటుందని కొందరు- స్టెఫీగ్రాప్ పొగరుబోతుతనం, సింగిల్ మైండెడ్ నెస్ ఆమె స్వంతమని ఇంకొందరు- డయానా గ్రేస్ గంభీరత్వం ఆమె ఆభరణాలని మరికొందరు అనుకోవటం మామూలే. తనకై తను ఎవర్ని పలకరించకపోయినా- ఎవరు పలకరించినా, తన అందమైన పలువరుస తళుక్కుమని మెరిసేలా నవ్వుతూ పలకరిస్తుంది.

    అక్కడున్న ఆ నలుగురికే కాదు- కాలేజీ మొత్తానికి ఆమె ఓ ఎనిగ్మా...

    ఆమె ఓ మాజీ మహారాజు మనుమరాలు. రాజ్యంలేని ఓ మాజీ మహారాజు కూతురు.

    అయినా ఆమెలో గర్వం మచ్చుకయినా కనిపించదు... అదెలా సాధ్యం...?!

    ఆమె ఫలానా అని అందరికీ తెలుసు. కాని ఆ అందరికీ ఆమె ఓ మిస్టరీలాగే మిగిలిపోయింది. మాజీ మహారాజు కూతురైనా అంత సింపుల్ గా ఉండటం సాధ్యమా...? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకసారి తమకై తాము వేసుకున్నదే.

    ఆమె గురించి కలలు కనని విద్యార్ధి బహుశా ఆ కాలేజీలోనే కాదు- ఆ అందాల మైసూర్ లోనే ఉండకపోవచ్చన్నది అతిశయోక్తి కాదు.

    ఆమె చూపుకోసం- పరిచయం కోసం- గుర్తింపు కోసం- ప్రేమ కోసం- పెళ్ళికోసం ఎందరో నియోరిచ్ స్టూడెంట్స్ తాపత్రయపడటం మామూలై పోయిందక్కడ. ఎవరేమన్నా మౌనంగా, మంద్రంగా నవ్వుతుందే తప్ప సమాధానం ఇవ్వదు. వ్యక్తిత్వం- టాలెంట్- తెలివితేటలు- ఏకాగ్రత, అందం, లేత తమలపాకులాంటి మృదువైన శరీరం, ఎగ్సోటిక్ వైటల్ స్టాటిస్టిక్స్... ఎవర్నయినా మత్తులోకి లాగే సెక్సీ ఫిగర్... స్మార్ట్ డ్రెస్ సెన్స్... రేర్ బ్యూటిఫుల్ క్రియేచర్ ఆన్ ది ఎర్త్ అని అనిపించేలా ఉంటుంది. ఇన్ని కాంబినేషన్స్ ఉండే యువతి బహు అరుదేమో 'యూలుక్ వండర్ ఫుల్' అని ఎవరైనా మనస్సులో రేగే ఉద్వేగాన్ని ఆపుకోలేక అంటే నిండుగా నవ్వుతుంది- పండువెన్నెల నుంచి ముత్యాల్ని వెదజల్లినట్లుగా నవ్వుతుంది... అంతే... మరలాంటప్పుడు ఎవరికైనా ఆమె ఓ ఎనిగ్మా కాక ఏమవుతుంది.

    అలాంటి పండు వెన్నెల పరువాల ఇందుమతి ఈ మధ్య తరచూ దీర్ఘాలోచనకు గురవుతోంది.

    అందుకు కారణం ఆమెకీ మధ్య వచ్చిన ఒక ఉత్తరం... ఆ ఉత్తరంలోని సారాంశాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది.

    మంచుపొగ ముసుగులో చలి క్రమంగా హెచ్చుతూ పోతోంది.

    అదేమీ ఇందుమతి ఏకాగ్రతపై ప్రభావం చూపలేకపోయినా- మిగతా నలుగురు లేచి నించున్నారు.

    ఒకరు ఆమె చెంతకు చేరి ఈ లోకంలోకి వచ్చేలా చేసి, ముందుకు సాగారు.

    ప్యాలెస్ చుట్టూ ఉన్న భువనేశ్వరీ, గాయత్రీ, గోపాలకృష్ణస్వామి, నవగ్రహాలు, త్రినయనేశ్వర, వరాహస్వామి గుళ్ళని సందర్శించుకోందే వెళ్ళటానికి ఒప్పుకోని ఆ ఐదుగురిలో ఒకరి మూలంగా మిగతా నలుగురు ఆ గుళ్ళని తరచూ సందర్శిస్తూనే ఉంటారు.

    దెయ్యాల్ని ట్రాష్ కింద కొట్టేసే ఇందుమతి దేవతల్ని నమ్ముతుంది. అందుకే ఆ ఒక్కరి కోసమే కాక- తన నమ్మకం కోసం కూడా గుళ్ళని సందర్శిస్తుంటుంది.

    రాత్రి ఏడవుతుండగా ఐదుగురు కాలినడకన కె.ఆర్.సర్కిల్ లోకి వచ్చి సయ్యాజీరావు రోడ్ లో ఉన్న ఒక రెస్టారెంట్ లోకి వెళ్ళి డిన్నర్ ఆర్డర్ చేసి తిరిగి కబుర్లలో పడ్డారు.

    ఒకరి సంభాషణ అనుకోకుండా మహారాజులు పూర్వకాలంలో గుప్తంగా దాచిపెట్టిన నిధులకేసి మరలింది.

    మిగతా ముగ్గురితోపాటు ఈసారి ఇందుమతి కూడా అతని సంభాషణ మీద దృష్టిని కేంద్రీకరించింది.

    ఆమె వరకయితే అది కేవలం డైవర్షనే... "మైసూర్ మహారాజు శ్రీకృష్ణరాజు వడయార్ పెంపుడు ఏనుగుకి ఒకసారి జబ్బు చేసిందట- ఎవరితో వైద్యం చేయించినా ఆ జబ్బు తగ్గలేదట అప్పటికే శ్రీకృష్ణరాజ వడయార్ తాతగారు సంజన్ గడ్ లో నంజుండేశ్వరుడికి గుడి కట్టించారట. 

    తన ఏనుగుకి స్వస్థత చేకూరితే ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన పచ్చ తెచ్చి శివలింగం కింద ప్రతిష్టిస్తానని మొక్కుకున్నాడట. దాంతో ఆ ఏనుగు జబ్బు తగ్గిపోయిందట.

    మొక్కుకున్నట్లుగానే ప్రపంచమంతా గాలించి అతి పెద్దదయిన గరుడపచ్చ రాయిని తెచ్చి సంజన్ గడ్ లోని నంజుండేశ్వరుడి గుడిలో ప్రతిష్టింప జేసారట.

    అదిప్పుడు ఆ గుడిలోనే ఉందట. దాని విలువ ఇప్పుడెంతుంటుందో తెలుసా...? కనీసం పదికోట్లు..." అతను చెప్పటం పూర్తవుతుండగానే అక్కడున్న అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.

    "నిజమేనా...?" ఒకరడిగారు... దిగ్భ్రాంతి నుంచి తేరుకుంటూ.

    "ఇక్కడికి ఇరవై నాలుగు కిలోమీటర్లేగదా కావాలంటే వెళ్ళొద్దాం. మీకో విషయం తెలుసా! క్రీస్తు ఆత్మత్యాగం చేసుకోవటానికి ముందు చివరిసారి భోజనం చేసినప్పుడు మంచినీళ్ళు త్రాగేందుకు వాడిన కప్ (హోలీ గ్రెయిల్) పచ్చతో తయారుచేసిందేనట. దానికి విలువ కట్టడం అసాధ్యం- దాని కోసం కొన్నివేలమంది ప్రయత్నించి విఫలమయ్యారట. దాని విలువిప్పుడు కొన్ని వందల కోట్లు ఉండవచ్చు.

    పురాతన కాలంలో ఎమరాల్డ్ ఈజిప్టు పర్వతశ్రేణుల్లో దొరికేదట. ఇప్పటికీ పచ్చ అక్కడ దొరుకుతోంది గాని- అంత విలువైనది కాదు- పైగా పరిమాణం కూడా చాలా తక్కువ.

    పచ్చకి మెడికల్ పవర్ ఉందని చాలామంది విశ్వాసం.

    పచ్చ ఎపిలెప్సీ నుంచి పేషెంట్ ని రక్షిస్తుందట. పచ్చ తన యజమానికి భవిష్యత్ కాలాన్ని తెలియజేసేదని కూడా చెబుతుంటారు" అతను చెప్పడం ఆపాడు.

    "అయితే పచ్చ మనవృత్తికి పోటీ అన్నమాట" ఇందుమతి నవ్వుతూ అంది- ఆమె మాటల్లో స్పోర్టివ్ నెస్ ఉందే తప్ప వ్యంగ్యం లేదు.

    ఆమె మాటలకి అందరూ నవ్వారు.

    ఒకింతసేపటికి డిన్నర్ ముగించుకొని ఐదుగురు సయ్యాజీరావ్ రోడ్ లోంచి- చాలువాంబ హాస్పటల్ రోడ్ లోకి మలుపు తిరిగారు.

    "కొన్ని లక్షల కోట్లు ఖరీదుచేసే గుప్తనిధులు ఇప్పటికీ సమాధుల్లో, సముద్రపు లోతుల్లో, అడవుల్లో, కోటల్లో, కొండగుహల్లో నిక్షిప్తమై ఉన్నాయట-  ఒక్కటంటే ఒక్క నిధి దొరికితే చాలు... మెర్సిడస్... బి.ఎమ్.డబ్ల్యూ... ఒబెరాయ్... సెయింట్ లారెంట్... ఓహో... శెలవు దినాల్లో సముద్రతీరాల్లో... రోలెక్స్- రాడోవాచీలు- సెయింట్ లారెంట్ టైలు- హికీఫ్రీమాన్ క్లోత్స్- గస్సీ బ్రీఫ్ కేసులు... ఒకటేమిటి... సాటర్ డే నైట్ షటౌట్స్... అందమైన హాలీవుడ్ స్టార్ లెట్స్ తో రొమాన్స్... ఇంటర్నేషనల్ గాసిప్ కాలమ్స్ ఎక్కి... ఓహో... ఎందుకులే..."

    అతను మైమరిచిపోయి అంటుంటే... ఇందుమతికి అసహనంగా లేదు- అతని ఎడోలో సెంట్ డ్రీమ్ వరల్డ్ ని తలుచుకుని జాలిపడింది- చిన్నగా, నిశ్శబ్దంగా నవ్వుకుంది.

    మిగతా వాళ్ళు మాత్రం అతనితోపాటు కలల ప్రపంచంలో విహరించారు కొద్దిసేపు.

    "నిధుల చుట్టూ ఆ నిధుల్ని దాచుకున్న రాజుల ఆత్మలు పరిభ్రమిస్తుంటాయట. అవి ట్రెజర్ హంటర్స్ ని హతమారుస్తుంటాయట. అది తెలుసా...? ఇలాంటి పిచ్చి కలలు ఎప్పుడూ కనకండి. అది ఈజీ మనీ- అకాల లక్ష్మీకటాక్షం... అలాంటి ట్రెజర్ హంటింగ్ కి బయలుదేరేరు- అనవసరంగా చచ్చిపోతారు...." నవ్వుతూనే అంది ఇందుమతి.

    వాళ్ళకా సలహా ఇచ్చిన ఇందుమతే అలాంటి ప్రమాదంలో ఇరుక్కోబోతున్నట్లు ఆమె కప్పుడే ఎలా తెలుస్తుంది...?

    మరికొద్ది క్షణాలకి వాళ్ళు కాలేజీకి చేరుకొని ఎవరి హాస్టల్స్ వేపు వాళ్ళు విడిపోయారు.

    అప్పుడే సెయింట్ ఫిలోమినా కెథిడ్రిల్ చర్చ గంట ఆ నగరంపై పర్చుకున్న నిశీధిని ఛేదిస్తూ పదిసార్లు మోగింది.


                                       *    *    *    *


    ఉమెన్స్ హాస్టల్లో ఒక గదిలో వెలుగుతున్న లైట్ ఆ తెల్లవారుజామున కూడా విశ్రాంతి తీసుకోలేదు.

    ఆ లైట్ కాంతిలో ఇందుమతి తనకొచ్చిన ఉత్తరాన్ని వందోసారి చదువుకుంది- దాంతో కలువల్లాంటి ఆమె కళ్ళు ఎరుపెక్కి తడిదేరాయి. తానో మాజీ మహారాజు కూతుర్నని తనకేది తక్కువ కాదని- కోరుకున్నది క్షణాల్లో తన ముందుంటుందని తనతోటివారు అనుకోవటం ఆమెకెందుకో ఆ క్షణాన నవ్వు తెప్పించింది.

 Previous Page Next Page