Read more!
Next Page 
సాహసి పేజి 1

                                 


                                                     సాహసి

                                                        __ సూర్యదేవర రామ్ మోహనరావు

 




    క్రీస్తు పూర్వం 1300

    ఈజిప్టు దేశం...

    కైరోకి దక్షిణాన ఉన్న-

    ఎల్ గిజా... ఎడారి భూముల్ని, బిడారు ప్రాంతాలను సస్యశ్యామలం చేసే నైలునది ప్రపంచదేశాలకు అత్యున్నతమైన నాగరికతను అందించేందు కన్నట్లు ఉరవళ్ళు- పరవళ్ళతో ఇసుక ఎడారుల మధ్య నుంచి ప్రవహిస్తోంది.

    అప్పటికే ఈజిప్టు నాగరికత ఆ ప్రాంతంలో పాదుకొని 1900 సంవత్సరాలు అవుతోంది.

    అప్పుడు సమయం ఉదయం ఎనిమిది గంటలు. ఎల్ గిజా పిరమిడ్స్ ముందు విచిత్రమైన వేషధారణలో ఒకరాజు నుంచుని క్రీస్తుపూర్వం 2580లో నిర్మించిన ఒక పిరమిడ్ కేసే దీర్ఘంగా చూస్తున్నాడు. తన పూర్వీకుల వైభవాన్ని తలచుకొని పరవశించిపోతున్నాడు. అది ఈజిప్టు ప్రధాన రాజవంశానికి చెందిన చెయోప్స్ పిరమిడ్.

    480 అడుగుల ఎత్తులో చతురస్రాకారంలో వుంది దాని పీఠం- ఒక్కొక్క భుజం 230 మీటర్లుంది నాలుగు భుజాలు క్రమంగా తగ్గుతూ పైకి వెళ్ళి, చివరిలో ఒకటిగా కలిసిపోయి వుంది.

    ఆ పిరమిడ్ మూడువేల మూడువందల సంవత్సరాల తరువాత ఒక అత్యద్భుత కట్టడంగా గుర్తించబడుతుందని అతనికప్పుడు తెలీదు. నిశ్శబ్దంగా వున్న గిజా మైదానంలో ఆయన ఒకింత ముందుకు నడిచాడు.

    ఆయన్ని అనుసరించే కొన్ని వందలమంది సేవకులు... పరిచారకులు.... ఆ రాజు కనురెప్పల వెనుక ఏ కల రూపుదిద్దుకుంటుందో- ఏం శాసిస్తారోనని వాళ్ళంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

    చెయోప్స్ పిరమిడ్ కి ఒకింత దూరంగా ఉన్న మరో పిరమిడ్ కేసి చూస్తున్నాడు రాజు.

    "అది జోసర్ రాజు కోసం నిర్మించిన దైవమందిరం మహారాజా" ఆ రాజుని అనుసరించి వస్తున్న మంత్రి వినయంగా అన్నాడు.

    "సక్కారాలో జోసర్ రాజు పిరమిడ్... దీన్నెవరు నిర్మించారు మంత్రివర్యా...?" దాన్ని చూస్తూ మంత్రముగ్ధుడౌతున్న రాజు ప్రశ్నించాడు.

    "వాస్తుస్థపతి ఇంహోతెప్ మహారాజా..." మంత్రి సమాధానం ఇచ్చాడు.

    "వేటికవే మహా గొప్ప కట్టడాలు మంత్రివర్యా... ఈజిప్ట్ నాల్గవ రాజవంశానికి చెందిన చెఫ్రెన్ మహారాజు తన స్పింక్స్ సమాధి పైనుంచి మనకేసే చూస్తున్నట్లు లేదూ?" దూరంగా ఆకాశాన్ని తాకుతున్న భ్రమను కలిగిస్తూ, చనిపోయి దేవుళ్ళయ్యే ఈజిప్టు రాజుల సమాధుల్ని కాపాడుతున్నట్లుగా ఉన్న స్పింక్స్ ని చూసి తన్మయంగా అన్నాడు రాజు.

    "చిత్తం మహారాజా... మహాగొప్ప రాజవంశాలు మనదేశాన్ని పరిపాలిస్తూ చరిత్రపుటల్లో ఎక్కువ భాగాన్ని మనదేశ నాగరికతకే కేటాయింపు చేసుకొంటున్నారు. 1700 సంవత్సరాల క్రితమే ఈజిప్టు మొదటి రాజవంశపు మొదటి ఫారో (రాజు) మెసెస్ రాజు నైలునది నుంది పంట నీటిని పారించటంలో ఏడువందల సంవత్సరాల క్రితమే బేసిన్ పద్ధతి ప్రవేశపెట్టారు. నైలునది జలాల్ని 20 కిలోమీటర్లు ప్రవహింపచేసి నిల్వ ఉంచేందుకు మోరిస్ జలాశయం నిర్మించారు. వరదల సమయాల్లో వచ్చే అదనపు నీటిని అక్కడ నిలవ చేయటం అన్న ప్రక్రియ ఎంత గొప్పది మహారాజా... అదే కదా నేటి భూముల సస్యశ్యామలానికి కారణం.

    ప్రపంచంలో వున్నవి మూడే మూడు గొప్ప నాగరికతలు- ఈజిప్టు, సుమేరియా, ఇండస్ వేలీ- ఈ మూడింటిలోనూ గొప్పది మనదే.

    టైగ్రిస్ నదీతారాన నివశించే బాబిలోనియా పౌరుడికన్నా, యాంగోసీ నదీతీరాన నివసించే చీనా పౌరుడికన్నా, సింధూ, కావేరీ నదీ తీరాల్లో నివసించే భారతీయుడికన్నా నైలునదీ తీరాన నివసించే ఈజిప్టు పౌరుడే చాలా గొప్పవాడు మహారాజా... మీరూ అలాంటి గొప్ప పనేదో సాధిస్తారని నా ఆకాంక్ష..." అన్నాడు మంత్రి తన సహజ ధోరణిలో.

    "అవునవును... మా కుమారుడైన టుటాంఖమెన్ కోసం ఒక గొప్ప కట్టడాన్ని నిర్మించాలి. బంగారం, వజ్రాలు, వైఢూర్యాలతో మా కుమారుడి పిరమిడ్ అతి గొప్ప కట్టడంగా చరిత్రలో మిగిలిపోవాలి. రేపటి నుంచే పని ప్రారంభించండి. భవిష్యత్ తరాలు నిధుల కోసం మా కుమారుడి పిరమిడ్ ని ధ్వంసం చెయ్యకుండా ఉండేందుకు అద్భుతమైన వాస్తుపనితనం కనిపించాలి. మేధావి అయిన వాస్తుస్థపతికి కబురుచేయండి" అన్నాడు రాజు గంభీరంగా.

    రాజశాసనం జరిగిపోయింది.

    రాజు తన పరివారంతో వెనుదిరిగాడు.

    అప్పటికప్పుడే వాస్తుస్థపతి ఇంహోతెప్ వంశానికి చెందిన పన్నెండవ వాస్తుస్థపతికి కబురు వెళ్ళింది.


                *    *    *    *


    మరో వారానికే టుటాంఖమెన్ సమాధి నిర్మాణ కార్యక్రమాలు మొదలైపోయాయి.

    లక్షమంది శ్రామికులు రాత్రింబవళ్ళు గిజా ఇసక మైదానాల్లో పిరమిడ్ నిర్మాణంలో మునిగిపోయారు.

    దాన్ని పర్యవేక్షిస్తున్న వాస్తుస్థపతి పర్యవేక్షణలో అద్భుతమైన పనితనంతో అది రోజురోజుకి ఎత్తు పెరగసాగింది. అదే సమయంలో వాస్తుస్థవతి ఇంహో తెప్-12 దిగులు చెందసాగాడు.

    ఆ నిర్మాణం పూర్తికాగానే దాని వాస్తు రహస్యం సమాధి అయిపోయేందుకు రాజు తనను హత్య చేయిస్తాడని అతనికి తెలుసు. అందుకే తనకు దక్కిన కుటుంబ వారసత్వపు వాస్తు కళని ఎలా బ్రతికించుకోవాలా అని అతను మార్గాల్ని అన్వేషిస్తున్నాడు.


                *    *    *    *


    క్రీస్తు పూర్వం 1285.

    టుటాంఖమెన్ సమాధి పూర్తయిపో వస్తోంది.

    ఇంహోతెప్- 12కి దిగులు ఎక్కువైపోయింది. సమాధి నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ తన మృత్యువు తనకి దగ్గరవుతుందని కృంగిపో సాగాడు.

    ఓరోజు, గిజా మైదానాల్లో తాత్కాలికంగా నిర్మించిన ఒక డేరాలో ఇంహెతెప్ తన కుటుంబాన్ని ప్రక్కనే కూర్చుండబెట్టుకుని పిరమిడ్ నిర్మాణపు రహస్యాన్ని విడమర్చి చెప్పాడు.

    ఆపైన ఒకింతసేపు మౌనంగా వున్నాడు.

    "ఎందుకింత దిగులుగా వుండిపోయారు నాన్నగారూ?" ఇంహోతెప్-12 కుమారుడు ప్రశ్నించాడు.

    "ప్రపంచానికే నాగరికతను నేర్పిన నైలునది నాగరికత అత్యున్నత మైంది. అందులో మన వంశం ఇమిడిపోయి వుంది. అందుకు మనకు సహకరించినది మన పూర్వీకులకు అబ్బిన వాస్తుకళ. దాని మూలంగానే స్పింక్స్, పిరమిడ్ల నిర్మాణం జరిగింది- జరుగుతోంది. తరతరాలుగా మనకు మిగిలిన నిధి అది మనలాగా సమాధి నిర్మాణం ప్రపంచంలో మరెవరూ చేయలేరు. అందుకే మన వంశం, చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకుంది. మన వంశంలో మగవారి మరణాలు సహజమైనవి కావు.

    రాజుల చేతుల్లో సంభవించినవే...

    మనకు అబ్బిన అద్భుతమైన వాస్తుకళ ఒక వరం- ఒక శాపం కూడా. పిరమిడ్ నిర్మించాక నిర్మించిన వాస్తుశిల్పిని రాజులు బ్రతకనివ్వరు. బ్రతికి వుంటే ఆ పిరమిడ్ నిర్మాణ రహస్యం బయటకు పొక్కిపోతుందని ఈజిప్టు రాజుల భయం. అలాగే నా చావు కూడా సహజమైంది కాబోదు..." గుండె చిక్కబట్టినట్లయి ఆగిపోయాడు ఇంహోతెప్-12.

    ఆ పసివాడి వయస్సు కేవలం పదే- అందుకే అతనికవన్నీ చిత్రంగా వున్నాయి.

    "పిరమిడ్ నిర్మాణ రహస్యం తెలిస్తే ఏమిటి నాన్నగారూ?" ఆ పసివాడు అమాయకంగా అడిగాడు.

    ఇంహోతెప్-12 ఉలిక్కిపడ్డాడు కొడుకు సందేహానికి. 

    భయపడుతూ ఒక్కక్షణం డేరా బయటకొచ్చి పరిసరాల్ని గమనించి ఊపిరి తీసుకున్నాడు. దూరంగా టుటాంగ్ మెన్ పిరమిడ్ నిర్మాణం ఆ అపరాత్రివేళ సైతం కాగడాల వెలుగులో జరిగిపోతోంది.

    నైలునది మీంచి వీస్తున్న చల్లటిగాలి ఆ గిజా మైదానాల్ని చల్లబరుస్తోంది. నిశి నిశ్శబ్దం ఆ ప్రాంతంలో గంభీరంగా నర్తిస్తోంది. ఇంహోతెప్-12 ఒకసారి నిట్టూర్చి తిరిగి డేరాలో కొచ్చాడు.

    "మన దేశంలో ఉన్నంతమంది మేధావులు, సాంకేతిక నిపుణులు మరే దేశంలోనూ లేరు. అలాగే మూఢవిశ్వాసాలు కూడా- ఎర్రసముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలిపి కాలువ నిర్మించి నౌకాయానాన్ని సాగించిన అద్భుతమయిన పనివారున్నారు మనదేశంలో... 365 రోజుల సంవత్సర కాలపు పట్టికని తయారు చేసింది మనవాళ్ళే. అతి ప్రాచీన లిపి మనదేశ చిత్రలిపి- హయర్ గ్లిఫిక్స్... అయినా ఏంలాభం...? పిరమిడ్ నిర్మాణపు రహస్యం తెలిస్తే ఏమిటీ అన్నావు... చాలా ప్రమాదం.

    మన ఈజిప్షియన్స్ కి ఒక నమ్మకం ఉంది-

    మనిషి రెండుసార్లు బ్రతుకుతాడని.

    మనిషి రెండుసార్లు బ్రతుకుతాడని.

    ఒకటి బ్రతికి వుండగా దేహంతో- అప్పుడు మనం కేవలం మానవులమే. రెండు చనిపోయాక ఆత్మతో. అప్పుడు సూర్యదేవుడి బిడ్డలుగా. అందుకే రాజు దేశాన్ని పరిపాలిస్తుండగానే మన కుటుంబీకుల్ని పిలిపిస్తారు. తన సమాధిని అద్భుతంగా మలచమని తనే చెబుతాడు రాజు. ఎందుకంటే సమాధి కొద్దికాలంలో పూర్తవ్వదు. సంవత్సరాలు పడుతుంది. ఈజిప్టుని ఏలిన అతి గొప్ప రాజవంశం చెయోప్స్ పిరమిడ్ ని నిర్మించడానికి మా ముత్తాతకి ముప్పై సంవత్సరాలు పట్టిందట.

    ఆ పిరమిడ్ కి వాడిన రాళ్ళతో ఫ్రాన్స్ దేశం చుట్టూ పదడుగుల ఎత్తు, ఒక అడుగు వెడల్పు గోడని నిర్మించవచ్చు.

    పిరమిడ్స్ నిర్మాణంలో పనిచేసే కూలీలకు, కమ్మరి వాళ్ళకు, కుమ్మరి వాళ్ళకు, వడ్రంగులకు గొప్ప రాజభక్తి ఉంటుంది. గొప్ప పనిలో పాలు పంచుకుంటున్నామన్న ఆనందంతో పనిచేస్తారు.

    ఈజిప్టు దేశానికి రాజు కావడం దేవుడి వరంగా భావిస్తారు. చనిపోయాక రాజులు దేవదూతలుగా మారతారని- చనిపోయిన రాజుల్ని దేవదూతల్ని చేసే ఒక మహత్కార్యంలో తాము భాగస్వాములనే గర్వంతో పనిచేస్తారు పనివాళ్ళు... మన సంభాషణ వాళ్ళు విన్నా ప్రమాదమే. ఇలా ఒకసారి డేరా బయటకు వచ్చి చూడు- కాగడాల వెలుగులో సయితం లక్షమంది టుటాంఖ మెన్ పిరమిడ్ కోసం నే చెప్పిన రీతిలో పని చేస్తున్నారు.

    పిరమిడ్ నిర్మాణంలో వాడే బండరాళ్ళ మధ్యదారంగాని, సూది కాని, చివరకు తల వెంట్రుక కాని దూరదు. అంత పనితనం మన వంశానిది..." చెప్పటం ఒక్క క్షణం ఆపి దీర్ఘంగా నిట్టూర్చాడు ఆ అపరబ్రహ్మ.

    అతనికిప్పుడు ఎలాగైనా తన కొడుకుని కాపాడుకోవాలని ఉంది. పిరమిడ్ల రహస్యం కాపాడేందుకు బలిచేయటం ఇష్టం లేదు.

    "ఆత్మ చనిపోదు- అందుకే మృత శరీరాన్ని మమ్మీ రూపంలో భద్రంచేసి పిరమిడ్ లో ఉంచుతారు. ఆ మమ్మీ చుట్టూ బంగారంతో తొడుగు చేస్తారు. మణుగుల కొద్ది బంగారంతో సూర్యభగవానుడి విగ్రహాన్ని చేసి మమ్మీకి రక్షణగా పెడతారు. అలాగే ఆ రాజు బతికుండగా వాడిన వస్తు, వాహనాల్ని, ఆయుధాల్ని, పుస్తకాల్ని, శిల్పాల్ని, చిత్రాల్ని- సమస్తం అతని ఆత్మకి సేవ చేసేందుకు ఆ సమాధిలోనే ఉంచుతారు.

    వజ్ర వైఢూర్యాలతో ధన కనక వస్తు వాహనాలతో సమాధే గొప్పదిగా మలచబడుతుంది. ఆ తరువాత కాలంలో ఆ సమాధిలోని నిధి కోసం ఎవరయినా పిరమిడ్ ని ఛేదిస్తే విశ్రాంతి తీసుకుంటున్న రాజు ఆత్మ క్షోభిస్తుందని- రాజుకి మాత్రమే స్వంతం కావల్సిన వస్తు సంపద అన్యులపరమౌతుందని పిరమిడ్ ని అత్యంత క్లిష్టతరమైన పద్ధతిలో నిర్మించటం జరుగుతుంది.

    అందుకే పిరమిడ్ ని నిర్మించిన వాస్తుస్థపతిని చంపించి వేస్తారు.

    నువ్వలా చనిపోవడం నాకిష్టం లేదు.

    నీ ద్వారా మన వాస్తుకళ - దాని రహస్య నిర్మాణం ఇతర రాజ్యాలకు పాకాలి. అదే నా వాంఛ.

    అందుకే ఈ వయస్సులోనే మీకు పిరమిడ్ నిర్మాణ రహస్యం చెప్పాను.

    ప్రస్తుతపు రాజు టుటాంఖమెన్ తన తొమ్మిదవయేటే మన దేశానికి రాజయ్యాడు. ఇప్పుడితనికి పద్దెనిమిది సంవత్సరాలు. ప్రస్తుతం ఆయన అంతు తెలీని అనారోగ్యంతో తీసుకుంటున్నాడు.

Next Page