Read more!
 Previous Page Next Page 
నిశీథి నియంత పేజి 2

   
    ఉన్నవాడు ఉన్నట్లుగానే నిర్ఘాంతపోయాడు.

    "విధి....హు....ఏదిరా విధి? పచ్చి స్వార్ధపరులు ఆడిన నాటకానికి నువ్వు 'విధి' అని పేరు పెడతావా? యాంత్రికలోకం ఏదీ లేకపోయినా, విమానం కూలిపోయినా విధి అను....ఒప్పుకుంటాను. ప్రకృతి వైపరీత్యానికి గురై వున్నట్లుండి కొండచరియ విరిగి మనుషులు చచ్చిపోతే- 'విధి' అను....ఒప్పుకుంటాను. పది నిమిషాలు ముందు బయలుదేరిన ట్రైన్ క్షేమంగా గమ్యాన్ని చేరుకున్నా- దాని వెనగ్గా బయలుదేరిన ట్రైన్ పట్టాలు తప్పితే విధి అనుకుంటాను. మనం, మన కుటుంబం నాశనమయింది. అలాంటి 'విధి' చేతిలో కాదురా తమ్ముడూ...." ఆమె ఆవేశాన్ని తగ్గించుకుంటూ అంది.

    అంత బలహీనంగా వుండి, ఆ వయస్సులో వుండి కూడా అంత గట్టిగా ఎలా కొట్టగలిగిందనే అతనాలోచిస్తున్నాడు.

    "విధిని నా చేతిలోకి తీసుకుంటాను. ఆ విధినే వంచిస్తాను. మరణ ముహూర్తాన్ని పొడిగిస్తాను...." ధృడంగా, గంభీరంగా అంది వేదవతి.

    ఎలా అనేది సత్యమూర్తికి అంతుబట్టలేదు. "ఇంట్లో వున్న పూచిక పుల్లలతో సహా బేరం పెట్టాలి...." వేదవతి ఒక నిశ్చయానికి వస్తూ అంది.

    "ఇంటిమీద తీసుకున్న అప్పు తీర్చకుండా ఇంటినెలా అమ్మగలం? కొనేవాళ్ళయినా ఎలా కొంటారక్కా? ఇది కాస్తా పోతే నీకాధారం....?" ఎలాగోలా ధైర్యంచేసి అన్నాడు సత్యమూర్తి.

    వేదవతి నవ్వింది.

    పొర్లి పొర్లి నవ్వింది. నవ్వుతూ నవ్వుతూ చటుక్కున ఆపింది.

    "ఇంట్లో ఉన్న పూచికపుల్లలతో సహా అని అన్నానేగానీ....ఇంటి గురించి మాట్లాడలేదుగా?"

    సత్యమూర్తి నాలిక్కరుచుకున్నాడు.

    "ఆధారం అని అంటే నీ దృష్టిలో కూడు, గుడ్డ, నీడా అనేగా?  నేనిప్పుడు బ్రతికున్నది వాటి ఆధారంగా కాదు! పగ, ప్రతీకారం, కసినీ ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాను. బ్రతకాలనుకుంటే, బ్రతుకుమీద తీపి వుంటే నీవు చెప్పే ఆధారం కావాలి. నాకా రెండూ లేవిప్పుడు. అరవై ఐదేళ్ళు ఆనందంగా, ఆరోగ్యంగా బ్రతికిన నాకు కొత్తగా ఆశలెక్కడి నుంచి పుట్టుకొస్తాయి? సగటు భారతీయుల జీవన ప్రమాణాన్ని ఎప్పుడో పూర్తిచేసుకున్నాను. ఇహ మిగిలిన జీవితం వరంగా వచ్చిందేగదా?

    "రేపు బేరం జరిగిపోవాలి. ఎంత వీలైతే అంతెక్కువ రాబట్టు. డబ్బిప్పుడు నాకు చాలా అవసరం. దాంతో 'విధి'నే కాదు, దేన్నయినా యీ దేశంలో కొనేయవచ్చు. చట్టాన్నీ, న్యాయాన్నీ, ప్రభుత్వాధికారుల్నీ- దేన్నయినా, ఎవరినైనా కొనేయవచ్చు.

    "రేపే బేరం జరిగిపోవాలి. రేపు రాత్రికి నా చేతికి డబ్బందాలి.... ఎల్లుండి నేను జైలుకెళ్ళాలి. అంతె.... వాదప్రతివాదనలొద్దు. పని జరిగితీరాలంతే...." అంటూనే వేదవతి తన గదిలోకి వెళ్ళిపోయింది విసురుగా, వేగంగా.

    సత్యమూర్తి నిరుత్తరుడైపోయాడు కొద్దిక్షణాలు.


                                   *    *    *    *


    చలికి ఈదురుగాలి తోడయింది. టెంపరేచర్ మరింత పడిపోయింది. అప్పుడు సమయం అర్దరాత్రి దాటి సరిగ్గా ఒంటిగంటయింది.

    ఒక సెంట్రీ గ్రూప్- మరో గ్రూప్ కి అప్రమత్తత సందేశాల్ని ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమంలో భాగంగా సెంట్రీ కోడ్ వర్డ్స్ నిశీథి నిశ్శబ్దంలో మునిగివున్న జైలు ఆవరణలో ప్రతిధ్వనిస్తున్నాయి.

    ఆ జైలు ఆవరణలో పన్నెండు దర్బారు హాళ్ళున్నాయి. ఆ హాల్స్ అన్నిటికీ కుడి ఎడమల గదులు, ఆ గదుల్లో ఖైదీలు....

    సింహద్వారం దగ్గర వుండే బ్లాక్ కీ, జైలుకి వెనుకవైపు చివరగా వుండే పన్నెండవ బ్లాక్ కీ మధ్య దూరం దాదాపు రెండు ఫర్లాంగులు పైనే వుంటుంది.

    సెంట్రీల హెచ్చరికలు, జైలు క్లాక్ టవర్ నుంచి వచ్చే గంటల శబ్దం, లైట్ పోస్టుల్లోంచి దూసుకొచ్చే లేసర్ బీప్స్ లాంటి కాంతిపుంజాలు యధావిథిగా పనిచేసుకుపోతున్నంతకాలం జైలు ప్రశాంతంగా వున్నట్లు లెక్క! వీటిల్లో ఏది విధి తప్పక పనిచేయకపోయినా, ప్రమాదపు హెచ్చరికలు అసంకల్పితంగానే పాస్ అయిపోతాయి. వెంటనే రొటీన్ చకప్ మొదలవుతుంది. జైలు స్టాఫ్ గుండెలు గుబగుబలాడిపోతాయి.

    పన్నెండవ బ్లాక్ దగ్గరికి వస్తే -

    ఆ బ్లాక్ లో పహరా కాస్తున్న ఇద్దరు సెంట్రీలు హాలు చివరకు చేరుకొని తమ తరువాత డ్యూటీలో చేరబోయే సెంట్రీలకోసం ఎదురుచూస్తూ, జేబుల్లోంచి బీడీలు తీసి చెరొకటి వెలిగించుకున్నారు.

    శరీరాన్ని గడ్డకట్టించేలా ఉన్న చలిని తరిమే ప్రయత్నంలో భాగముగా పొగని గుండెలనిండుగా పీల్చి వదులుతూ కబుర్లలో పడ్డాడు.

    "ఇంతకీ రామదాసెక్కడ దాచుంటాడా డబ్బుని....?" ఓ సెంట్రీ మరో సెంట్రీని అడిగాడు.

    అతనో క్షణం ఆగి-

    "అది తెలిస్తే ఈ దిక్కుమాలిన ఉద్యోగంలో ఎందుకుండేవాడ్ని?" అని అన్నాడు ఒకింత అసహనంగా.

    "రామదాసు గుండెలు తీసిన బంటు. ఆవలించకుండానే పేగులు లెక్కెట్టేయగల మాజీ గజదొంగ! గట్టిచోటే దాచుంటాడు...." మొదటి సెంట్రీ అన్నాడు తిరిగి.

    "అసలా డబ్బంతా రామదాసుకే దక్కిందా....? చివరలో పోగొట్టుకున్నాడా?"

    "పోగొట్టుకోవటమా? - వెర్రివాడిలా వున్నావేరా చిదంబరం?"

    "యాభై లక్షల హార్డ్ కేష్....కట్టల కట్టలు డబ్బు....పొలం పుట్రా, నగా నట్రా రూపంలో లేని హార్ట్ కేష్.... ఒక్కరోజులో.... పోలీసులకు దొరికేలోపు అడ్రసు లేకుండా చేశాడు. ఏం చేసుకుంటాడా డబ్బుని? పైగా ఒక చేయి లేదు. ఒక కాలు ఒకింత అవుడు.... పెళ్ళాం బిడ్డలు లేరు.... వారసులు కూడా వున్నట్లు లేదు. పోలీసులు వాడితో ఆ డబ్బెక్కడ దాచిందీ చెప్పించడానికి ముప్పై చెరువుల నీళ్ళు తాగారట....! అయినా ఫలితం లేకపోయిందట. ఏమైందంటే ఎవరో దొంగలు దెబ్బతీసి చేజిక్కించుకున్నారని అబద్దమాడాడట...." అన్నాడు చిదంబరం అనే ఆ సెంట్రీ. 

    "నిజంగానే పోగొట్టుకున్నాడేమో చిదంబరం...."

    "లేదురా నిరంజనం! మన సబ్ జైలర్ నాయుడు మహా కంత్రీగాడు. ఆడే ఈ విషయాన్ని ధృవపర్చాడు. ఆ డబ్బుని రామదాస్ ఎక్కడో సురక్షితమైన స్థలంలో.... సారీ.... స్థలాల్లో దాచిపెట్టాడట. కోర్టు రామదాసుకి శిక్ష విధించాక, మన జైలుకి వచ్చే ముందు రామదాసుకి జ్వరం వచ్చిందట. అప్పుడు వాడ్ని హాస్పిటల్ లో జాయిన్ చేసి, హాస్పిటల్ చుట్టూ కాపలా పెట్టారట. కాపలా పోలీసుల నోళ్ళలో కరెన్సీ కట్టలుకొట్టి, ఒక రాత్రంతా హాస్పిటల్ బయటే గడిపాడట. ఆ టైమ్ లో ఆ యాభై లక్షల్ని సర్దేశాడట.

    ఒకచోట అంతా పెడితే ఎవరికంటన్నాపడితే అంతా పోతుందని దాన్ని ఏడెనిమిది బ్యాగుల్లో సర్ది ఏడెనిమిది రహస్య స్థలాల్లో దాచిపెట్టేశాడట. ఇది సబ్ జైలర్ నాయుడు పసిగట్టిన దేవరహస్యం. అప్పుడెప్పుడో మందు ఎక్కువయి కక్కేశాడు...." చిదంబరం దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు.

    వాళ్ళిద్దరి మధ్య కొద్ది నిమిషాలు నిశ్శబ్దం....

    ఆ వరండాలో మరో రౌండ్ వేసి మరలా ఒకచోటకి చేరుకున్నారు.

    "వాడికి ఇంకా జైలుశిక్ష రెండేళ్ళే వుంది. ఆల్ రడీ అరవైయేళ్ళు వచ్చేశాయి. ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే వుంది. వాడు చచ్చినా, మనం చంపబోయినా ఆ డబ్బు ఎక్కడ దాచిందీ చెప్పడు.... ఆ ప్రయత్నము ఈ జైల్లో చాలామంది చేసి, విసుగుపుట్టి వదిలేశారు. కనుక ఇప్పటి నుంచే వాడితో స్నేహంగా వుంటూ, మంచి చేసుకుంటే ఆ కృతజ్ఞతతోనన్నా...."

    "ఏం లాభంలేదు. పైసా విదల్చడు."

    "మరేం చేసుకుంటాడు అంత డబ్బుని?"

    "అదే అర్ధంకావటంలేదు. కానీ ఒక విషయం నాకనుమానంగా వుంది. ఏదో ధ్యేయంతోటే ఆ డబ్బుని వాడు దాచి వుంచుకున్నాడు. ఆ ధ్యేయం ఏమిటో తెలిస్తే- దాన్ని మనం నెరవేరిస్తే ఆ నిధి మనకు దక్కుతుంది."

    "అదేమిటో.... వాడి చివరికోరికేమిటో అడిగేసి- తీరిస్తే పోలే?"

    "మనకు చెబుతాడా? అందునా మనల్ని నమ్మి?? వాడు ఒకప్పుడు ఈ నగరాన్నేకాదు, జిల్లానే గడగడలాడించిన గజదొంగ. అప్పట్లో వాడి పేరు వింటేనే పిల్లలు మంచినీళ్ళు తాగేవాళ్ళు కాదని చెప్పుకుంటారు" అన్నాడతను ఒకింత నిస్పృహగా.

    జైలుగోడల మధ్య పేరుకున్న నీరవాన్ని బ్రద్దలు చేస్తూ జైలుగంట రెండుసార్లు మోగింది.

    ఇద్దరు సెంట్రీలు ఆ శబ్దానికి ఉలిక్కిపడి ఆలోచనల్నుంచి తేరుకున్నారు.

    సరిగ్గా అప్పుడే వీళ్ళిద్దర్నీ డ్యూటీ నుంచి రిలీవ్ చేసే సెంట్రీలిద్దరూ వచ్చారు.


                                   *    *    *    *


    సమయం తెల్లవారుఝాము మూడు గంటలు- సెల్ నెంబర్ 118 దగ్గర ఆగాడు ఒక సెంట్రీ.

    "ఏంబే ఇంకా నిద్రపోలేదా? యోగా చేసుకోవటానికి ఎర్లీగా లేచావా?" 188లో కునికిపాట్లు పడుతున్న ఖైదీని చూసి ఒకింత నిర్లక్ష్యంగా ప్రశ్నించాడు.

    అతను ఉలిక్కిపడి తలెత్తి సెంట్రీకేసి చూసి ఓ క్షణం వణికిపోయాడు.

    ఖైదీలు నిద్రపోకుండా కూర్చుంటే సెంట్రీలు వూరుకోరు.

    "ఏంటిబే గుడ్లప్పగించి చూస్తావ్- మాట్లాడదేం?"
   
    సెంట్రీ తిరిగి అన్నాడు పొగరుగా.

    అలాంటి ఉద్యోగాలు చేయవలసి వచ్చినందుకు వాళ్ళలో ఓ రకమైన రాక్షసత్వం, కసి పెరుగుతూ పోతాయేమో!

 Previous Page Next Page