Read more!
Next Page 
నిశీథి నియంత పేజి 1

                                 


                            నిశీథి నియంత

                                                                           __ సూర్యదేవర రామ్ మోహన్ రావు

 




    నిశీథి- నిశ్శబ్దతతో, నిస్తబ్దతతో పెనవేసుకున్న వేళ...

    మౌనంగా నాట్యం చేసే మృత్యువు నిద్రలేచే వేళ...

    ఆ జైలు గంట- అందులో వున్న వేలాది ఖైదీల ఆశల అనంత దిగంతాలు భ్రాంతిల్లుతున్న వేళ. పదిసార్లు మృత్యునాదంలా ప్రతిధ్వనించి విశ్రాంతిలోకి జారుకుంది.

    దాదాపు పదిహేను ఎకరాల పరిధిలో విస్తరించుకొని వున్న ఆ కోట వయస్సు దాదాపు నూట పాతిక సంవత్సరాలు.

    ఆ కోట చుట్టూ ఇరవై ఐదు అడుగుల ఎత్తుతో ఉండే గోడ, ఆ కోటను అనుక్షణం పహరా కాస్తున్నట్లుగా వుంటుంది. ఎండకు ఎండి, వానకు తడిసిన గోడ కళాహీనంగా తయారయినా, ఇంకా పటిష్టంగానే వుంది.

    ఆ గోడపై మరో మూడడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ వైర్లు గోడ పైభాగంలో దిగవేసిన ఐరన్ పోల్స్ కి మెలికలు వేసుకొని, ఏ క్షణాన్నయిన కాటేసే మిన్నాగుల్లా ఆ పల్చటి వెన్నెల్లో అస్పష్టంగా కనిపిస్తున్నాయి.

    ఆ కోటగోడకు తూరుపు దిక్కున ఉంది పెద్ద సింహద్వారం. ఐదారుగురు మనుసులు ఒకేసారి తమ శక్తినంతా వుపయోగించి నెడితే తప్ప అవి పూర్తిగా తెరచుకోవు.

    నల్ల మద్ది, ఎబోనీతో కలిపి తయారు చేసిన కొన్ని దశాబ్దాలనాటి రెండడుగుల మందం తలుపులు కూడా ఒకింత రంగు వెలిశాయే తప్ప పటిష్టత విషయంలో చెక్కు చెదరలేదు.

    పదడుగుల వెడల్పుతో, ఇరవై అడుగుల ఎత్తులో వున్న ఆ రెండు తలుపుల్లో కుడివేపు దానికి మూడడుగుల వెడల్పు, ఐదడుగుల ఎత్తులో మరో చిన్న (తలుపులో) తలుపు ఏర్పాటు చేయబడింది.

    ఆ పదిహేను ఎకరాల కోటకు అదొక్కటే ద్వారం. వాహనాలు వచ్చిపోయేటప్పుడు తప్ప మామూలు సమయాల్లో పెద్ద తలుపుల్ని తెరవరు. మనుషుల రాకపోకలు ఆ చిన్న ద్వారం గుండానే సాగుతుంటాయి.

    ఆ కోటలోనే ఉంది సెంట్రల్ జైలు....

    ఆ జైలు లోపల ఏం జరిగినా, ఎవరు అరిచినా, ఏ ఖైదీ ఏ హింసకు గురయినా, అతనెంతగా గొంతెత్తి ఘోషించినా బయట ప్రపంచానికి ఏమాత్రం వినరావు - కనరావు.

    మృత్యుదేవత గర్భగుడి అది....

    ఆర్తనాదాల నైవేద్యం సర్వసాధారణం అక్కడ. కొత్త ఖైదీలు ఆ జైలుకి వస్తే-వస్తూనే ఆ కోటను, ఆ కోటకున్న భద్రతా ఏర్పాట్లను చూసి వణికిపోతారు. తప్పించుకోవాలనే ఆలోచనలకు స్వస్తి పలుకుతారు.

    ఆ కోట ప్రహరీ గోడపై నాలుగు మూలలా నవాబు టైంలోనే భద్రత కోసం కట్టించిన బురుజుల గదులు, ఇప్పుడా జైలుకి సెక్యూరిటీ చెక్ పోస్ట్ ల్లా వుపయోగపడుతున్నాయి. వాటిల్లో ప్రతిదానిలో వుండే నలుగురు సెంట్రీలు సాయంత్రం అయిదవుతూనే కళ్ళల్లో వత్తులు వేసుకుంటారు.   

    ఆ చెక్ పోస్టుల్ని చేరుకోటానికి ఇనుప నిచ్చెనలే మార్గం. సాయంత్రం అయిదవుతూనే నలుగురు సెంట్రీలు గన్స్ పవర్ ఫుల్ టార్చ్ లైట్స్ చేతబూని, రెండు ప్లాస్కులనిండా టీ నింపుకొని ఆ ఎత్తైన నిచ్చెనగుండా చెక్ పోస్టుల్ని చేరుకుంటారు.

    అలా జైలుకి నాలుగు మూలలా ఉన్న చెక్ పోస్టుల్లోకి సెంట్రీలు చేరుకోగానే నాలుగు నిచ్చెనల్ని పటిష్టమైన భద్రత వున్న ప్రాంతానికి తరలిస్తారు.

    సాయంత్రం ఐదింటికి ప్రారంభమయ్యే చెక్ పోస్టుల పహరా తెల్లవారి- ఆరున్నర గంటలయ్యేదాకా కొనసాగుతుంది. ఆ చెక్ పోస్టుల్లో శక్తివంతమైన సెర్చ్ లైట్స్ వృత్తాకారంలో విర్విరామంగా తిరుగుతూ ఆ ప్రాంతంపై నైట్ సెంట్రీలకు పట్టును కలిగిస్తాయి.

    ఆ పోస్టుల్లో రాత్రిళ్ళు నలుగురేసి చొప్పున డ్యూటీలో వుంటే- పగలు ఇద్దరేసి చొప్పున వుంటారు.

    టోటల్ గా ఇరవైనాలుగు గంటలూ 25 అడుగుల ఎత్తు నుంచి సెంట్రీల పహరా జైలు ఆవరణపై వుంటుంది.

    ఆ కోట చుట్టూ ఔరంగాబాద్ లోని దౌలతాబాద్ పోర్ట్ కి ఉన్నట్లు పెద్ద కందకం వుంది. దాని లోతు దాదాపు పాతికడుగులుంటుంది. దానిలో ఎప్పుడూ నీళ్ళుంటాయి. ఆ నీళ్ళలో భయంకరమైన విషసర్పాలు, మొసళ్లు కేరింతలు కొడుతుంటాయి. ఆయుధాలు పూని వుండే సెంట్రీల్ని తప్పించుకుని సెర్చ్ నుంచి బయటపడ్డా, పాతికడుగుల ఎత్తులో దర్శనమిచ్చే పటిష్టమైన ప్రహరీ గోడ వారిని అడ్డుకుంటుంది.

    ఒకవేళ దానిని ఎక్కగలిగినా, గోడపై అమర్చిన ఎలక్ట్రిక్ వైర్ లలో ప్రవహించే హై వోల్టేజీ ఎలక్ట్రిసిటీ వారిని మసి చేసేస్తుంది. ఆపైన లైట్ పోస్టుల పహరా- ఇవేమీ అడ్డు కాదనుకున్నా, ప్రహరీగోడని ఆనుకుని బయటవైపు వున్న నీళ్ళతో నిండివుండే కందకంలో పడటం ఖాయం.

    ప్రహరీగోడను చుట్టివచ్చే నీళ్ళ కందకం. తూరుపు వైపు వున్న జైలు సింహద్వారం ముందు కూడా వుంటుంది. దీర్ఘ చతురస్రాకారంలో వుండే ఆ కందకంపై సింహద్వారం ముందు చెక్కలవంతెన నిర్మించబడింది. అనవసరమనుకుంటే ఆ చెక్కలవంతెనని నిమిషాల్లో జైలు సిబ్బంది తొలగించి వేయగలదు - (అవసరమనుకున్నప్పుడు కందకంపై వాల్చగలదు) అక్కడితో జైలు ఒక ద్వీపంలా తయారవుతుంది.

    ఆ జైలుకి వెనుకవైపున అర కిలోమీటరు దూరంలో ఒక గ్రామం వుంది. ఆ గ్రామంలో వాళ్ళు అప్పుడప్పుడు రోజు కూలీకి జైలుకి పంపించబడుతుంటారు.

    ఎందరో నరహంతకుల్ని, కొన్ని పావురాళ్ళని తన గర్భంలో దాచుకున్న జైలు నివురుగప్పిన నిప్పులా ఇప్పుడు నిశీథిలో కలిసిపోయి వుంది.

    ఆ ప్రాంతంలో దుప్పటిలా పర్చుకున్న చీకటిని చీల్చుతూ లేసర్ బీమ్స్ లాంటి కాంతికిరణాలు లైట్ పోస్టుల నుంచి వెలువడుతున్నాయి.

    జైలు లోపలకు వెళితే__

    విశాలమైన దర్బారులా ఉన్న పెద్ద వరండాకు ఇరువైపులా వరుసగా గదులు....వాటికి స్టీల్ బార్స్ తో తయారుచేసిన బలిష్టమైన తలుపులు, వాటికి పెద్ద పెద్ద తాళంకప్పలు వేలాడుతున్నాయి.

    ఆ వరండాలో ఇప్పుడు నలుగురు సెంట్రీలు చేతుల్లో తుపాకుల్తో నిశ్శబ్దంగా పహరా కాస్తున్నారు.

    అది డిసెంబర్ నెల....

    శరీరాన్ని గడ్డకట్టించే చలి....

    ఆపైన దట్టమైన పొగమంచు....

    క్రమంగా తమ సాంద్రతని పెంచుకుంటూ నడిజాముకు సంసిద్ధమవుతున్నాయి.

    జైలు గదుల్లో ఉన్న ఖైదీలు చింకిపాతల్లాంటి గొంగళ్ళతో చలిని ఎదుర్కొనే ప్రయత్నంలో కడుపులోకి కాళ్ళు దూర్చుకుని మూటల్లా ముడుచుకుపోయున్నారు.

    ఇంకా నిద్రపట్టని ఖైదీలు ఆ పాత గొంగళ్ళ మురికివాసన భరించలేక తలను మాత్రం బయటకు పెట్టి కునికిపాట్లు పడుతున్నారు.


                                 *    *    *    *


    జూబ్లీ వ్యాలీ ఎన్ క్లేవ్.... జూబ్లీహిల్స్ ఎక్స్ టెన్షన్ లో వెలిసిన అందమైన కాలనీ.... అపోలో మెడికల్ కాలేజీ దారిలో వారగా ఉన్న చిన్న ఇల్లు.... ఆ అర్దరాత్రివేళ పాలపుంత నుంచి విడిపోయిన ఒంటరి నక్షత్రములా వుంది- బిక్కుబిక్కుమంటూ.

    కాలీ అంతా నిశీథి నిశ్శబ్దంలో మునిగి వుంది.

    అక్కడ కూడా వీధిలైట్లు మినుకు మినుకుమంటూ వెలుగుతున్నాయి.

    ఆ ఇంటికి దగ్గరలో ఉన్న స్టెల్లా మేరీస్ ఉమెన్స్ కాలేజీ బిల్దిగ్ పైన వెలిగే లైట్ కేసి ఆమె చూస్తోంది. ఆమె వయస్సు సుమారు అరవై అయిదు వుంటుంది. జుట్టంతా నెరసిపోయి- బుగ్గలు, కళ్ళు లోతుకుపోయి పుట్టెడు దుఃఖాన్ని, మరో పుట్టెడు బాధల్ని మోస్తున్నదానిలా- సర్వస్వాన్నీ కోల్పోయినదానిలా- పిచ్చిదానిలా- విరాగినిలా వుంది.

    ఒకింత దూరంలో శిలలపై వెలిసిన శిల్పాల్లాంటి జూబ్లీజిల్స్ కాలనీ ఇళ్ళు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటికేసి ఆమె చూపులు చలిస్తున్నాయి.

    మూడు వైపులా కొండలు....కొండలపై లైట్ల తోరణం.... కొండల దిగువున తను ఒంటరిగా.... తన ఇల్లు అంతకంటే ఒంటరిగా.... చల్లని ఈదురు గాలులు వుండుండి వీస్తున్నాయి.

    అయినా ఆమె శరీరం స్పర్శని కోల్పోయినట్లుగా వుంది. మనసు, ఆశలు, ఆశయాలు అన్నీ స్పర్శని కోల్పోయాయి ఆమె విషయంలో.

    "ఎంతసేపిలా పిచ్చిదానిలా చూస్తూ వుండిపోతావాక్కా...." ఆమె వెనగ్గా వచ్చిన వ్యక్తి నోటినుంచి వచ్చాయా మాటలు.

    ఆమెకవి వినిపించినట్లు లేవు.  

    ఆరుబయట, అంత చలిలో పల్చటి చీరతో ఎలా నిలబడగలుగుతోంది తన అక్క....?! స్వెట్టర్ వేసుకొని, తలకు మఫ్లర్ చుట్టుకున్న అతను ఆశ్చర్యపోయాడు. అతనికి బాధేసింది- భయమేసింది- జాలి కలిగింది.

    "అక్కా...." అంటూ ఆమెని భుజం పట్టుకొని కదిలించాడు.

    అప్పుడు ఈ లోకంలోకొచ్చిందామె. జీవంలేని గాజుకళ్ళతో ఆమె తన తమ్ముడ్ని చూసింది.

    "ఇంకెన్నిరోజులుంది మరణముహూర్తం?" గంభీరంగా వుందామె కంఠం.

    ఉలిక్కిపడ్డాడతను.

    సమాధానం తెలిసినా చెప్పడానికి భయపడ్డాడు.

    "చాలా దగ్గరకొచ్చినట్లుందికదూ?" తిరిగి ఆమే గొణుక్కుంటున్నట్లుగా వుంది. ఆమె కంఠంలో జీర స్పష్టంగా తొంగిచూసింది.

    ఆమె పేరు వేదవతి!

    అతనామె తమ్ముడు- సత్యమూర్తి!

    అతని వయస్సు సుమారు అరవైదాకా వుంటుంది.

    అవునన్నట్లుగా అతను తలదించుకున్నాడు.

    "ఆ ముహూర్తాన్ని పొడిగించలేమా?" సత్యమూర్తిని అనుసరించి ఇంట్లోకొస్తూ అడిగిందామె.

    సత్యమూర్తి తన అక్కకేసి నిస్సహాయంగా చూశాడు. అతని కనుకొలకుల్లో అప్రయత్నంగా తడి....

    "కొన్ని ముహూర్తాల్ని ఎవరూ మార్చలేరక్కా....! విధి చేతిలో యిరుక్కుపోయిన ముహూర్తాన్ని అసలే మార్చలేరు...." అతను నెమ్మదిగా అన్నాడు తలుపేసి లోపల గడియపెడుతూ.

    ఆ మరుక్షణం అతడి దవడ పేలిపోయింది.

    ముందు ఏం జరిగిందో అర్ధంకాలేదు.

    తన మాటలు ఎప్పుడు పూర్తయ్యాయో- తనకి నాలుగయిదు అడుగుల దూరంలో వున్న తన అక్క - ఎప్పుడు తన దరిచేరిందో, ఎప్పుడు కొట్టిందో కూడా అర్ధంకాలేదతనికి.

Next Page