Previous Page Next Page 
నిశీథి నియంత పేజి 3

   
    118 సెల్ లోని ఖైదీ భయంతో వణికిపోతూ మెల్లగా అన్నాడు- "బాగా చలిగా వుంది.... నిద్రపట్టంలేదు" అని.

    "ఇది నీ అత్తారిల్లు కాదు. ఉలెన్ బ్లాంకెట్ యివ్వటానికి. మారుమాట్లాడకుండా కళ్ళు మూసుకొని పడుకో. లేదంటే తాట వలిచేయాల్సి వస్తుంది" పెద్దగా రంకెలేస్తూ ముందుకు సాగిపోయాడు సెంట్రీ.

    ఇతనికేం చేయాలో పాలుపోలేదు.

    దుఃఖం గుండెలోతుల్లోంచి పొర్లుకొస్తోంది.

    దుర్వాసన వేస్తున్న గొంగళి.... దానికి రెండు మూడు చిరుగులు.

    పైగా అది ఐదడుగుల పొడవుకిమించి లేదు. గుండె మూలల్ని చురకత్తిలా కోస్తున్న బాధ....

    కడుపులో ఆకలి....

    కళ్ళలో నీళ్ళు.... జ్ఞాపకాల్లో చేజారిపోయిన సుందరస్వప్నం లాంటి జీవితం- ఆపై శరీరాన్ని కోసే చలి. ఏదో శబ్దం కావడంతో చటుక్కున తలెత్తి ఎదురుగా వున్న సెల్ కేసి చూశాడు.

    ఆరడుగుల ఎత్తులో- ఒక చెయ్యి లేకపోయినా- అరవై యేళ్ళ వయస్సులో సైతం ఒకింత బలిష్ఠంగా కనిపిస్తున్న ఆ ఖైదీ, ఆ తెల్లవారుఝామున సీరియస్ గా బస్కీలు తీస్తున్నాడు.

    ఇతనికోక్షణం ఏం జరుగుతోందో, అతనలా ఎందుకు చేస్తున్నాడో అర్ధంకాలేదు.

    ఒకవేళ పగలు అతనేదన్నా తప్పు చేశాడా? అందుకు ప్రతిగా బస్కీలు తీయమని జైలర్ శిక్ష వేశాడా? ఒకవేళ నిజంగా వేసినా, ఈ తెల్లవారుఝామున, అదీ ఎముకల్ని కొరికేసే చలిలోనా?

    ఆశ్చర్యంగా ఇతను చూస్తూనే వున్నాడు.

    రామదాసు బస్కీలు తీస్తూనే వున్నాడు. ఖైదీ యూనిఫామ్ తోసహా అతని ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయిపోయింది. నెరసిన అతని జుత్తులోంచి చెమట ధారాపాతంగా కారుతోంది. ఇంత చలిలో అంత చెమటెలా పట్టింది?!

    అంతలో యధాలాపంగా 127 సెల్ లో బస్కీలు తీస్తున్న రామదాసు 118 సెల్ లో వున్న ఇతనికేసి చూశాడు.

    ఆ తరువాత మెల్లిగా నవ్వాడు రామదాసు.

    "చలిగా వుందా? నిద్రపట్టడంలేదా?" రామదాసు కటకటాల దగ్గరకు వచ్చి అడిగాడు.

    ఇతనోక్షణం ఆలోచించి అవునన్నట్లు తలూపాడు.

    "జైలుకి కొత్తా?"

    అవునన్నట్లు తిరిగి తలూపాడితను.

    "నేరానికి పాతా?"

    కాదన్నట్లు తలని అడ్డంగా వూపాడు.

    "పేరు....?"

    "వివేక...."

    "ఆ....?"

    "వివేక్.... వీరమాచనేని వివేక్" భయంగా అన్నాడితను.

    రామదాసు నవ్వాడు- రెట్టించి అడిగేసరికి భయపడి ఇంటిపేరుతో సహా చెప్పినందుకు తమాషాగా నవ్వాడు.

    "ఏం తప్పు చేశావ్....? హత్య చేశావా? ఒకటా పదా? ఒకదానికయినా, వందకైనా ఒకే ఒక ఉరిశిక్ష - వంద హత్యలు చేశామని వంద ఉరిశిక్షలు వేయలేదు న్యాయస్థానం" రామదాసు నుదుటి చెమటను చూపుడు వేలితో తుడుచుకుంటూ అదే నవ్వుతో అన్నాడు.

    వంద హత్యలు చేసినా ఒకే ఉరిశిక్ష!?"

    నిజమే.... ఎందుకలా....?!

    అదే అడుగుదామనుకున్నాడు వివేక్.

    కానీ భయమేసి వూరుకున్నాడు.

    భయం.... భయం.... ప్రతిదానికీ భయమే.... ఎందుకు?

    భయమెందుకని ఆలోచించడానికి కూడా భయమే.

    నోరు తెరిచి ఏదో అడుగుదామని వివేక్ ప్రయత్నిస్తున్నంతలో సెంట్రీ బూట్లనాడాల శబ్దం స్పష్టంగా, క్రమంగా దగ్గరవుతూ వినిపించింది.

    తెరిచిన నోరు భయంతో అలాగే వుండిపోయింది.

    ఓకల్ కార్డ్స్ మూగవోయాయి. సెంట్రీ ఎక్కడ చూస్తాడోనని భయంతో చటుక్కున నేలపై పరుండి కళ్ళు మూసుకున్నాడు.

    సెంట్రీ నాడాల శబ్దం దగ్గరయి, తిరిగి దూరమైపోయింది.

    "సెంట్రీ వెళ్ళిపోయాడు" అని రామదాసు మాటలు స్పష్టంగా వినిపించడంతో వివేక్ లేచి కూర్చున్నాడు.     

    "నీ రగ్గు చలిని ఆపలేకపోతోందా?" రామదాసు ప్రశ్నించాడు.

    అవునని నోటితోనే చెబుదామనుకున్నాడు.

    కానక్కడ పేరుకున్న నిశ్శబ్దాన్ని ఛేదించటానికి భయమేసి మాటల్ని గొంతులోనే దిగమింగుకొని, ఎప్పటిలాగే తలూపాడు.

    "అసలా మాత్రం రగ్గు కూడా లేకుండానే చలిని తట్టుకోవచ్చు."

    రామదాసు మాటలకు వివేక్ విస్తుపోయాడు.

    "ఆలోచించు నీకే తడుతుంది...." అన్నాడు రామదాసు, తిరిగి బస్కీలు తీయడం ప్రారంభిస్తూ.

    ఆ మాటలు సరదాకన్నాడా లేక సీరియస్ గానే చెప్పాడా అని వివేక్ రామదాసు ముఖంలోకి చూశాడు ఒకింత పరిశీలనగా.

    సీరియస్ గానే ఉందతని ముఖం.

    "సిగరెట్స్ తాగితే తగ్గవచ్చని విన్నాను. నాకా అలవాటు లేదు. ఉన్నా ఖైదీలకు సిగరెట్స్ ఎలా ఇస్తారు?" మొత్తానికి చిన్నగానైనా పైకే అన్నాడు వివేక్.

    "నువ్వు మూగవాడివి కాదన్నమాట. సరే....అవి లేకుండానే చలిని తట్టుకోవచ్చు."

    "బ్రాందీ, విస్కీ లాంటివి తాగితే తగ్గవచ్చని కూడా విన్నాను. అవీ నా కలవాటు లేవు. అవి కూడా ప్రిజనర్స్ కి ఇవ్వరుగా?" అని అమాయకముగా అంటున్న వివేక్ వైపు చూసి రామదాసు జాలితో కూడిన నవ్వొకటి నవ్వాడు.

    "కావాలనుకుంటే అవన్నీ ఇండియన్ జైల్స్ లో నిక్షేపంగా దొరుకుతాయి. అదెలాగన్న మీమాంసని ప్రస్తుతానికి వదిలేద్దాం. బ్రాందీ, విస్కీ లాంటి లిక్కర్స్ తాక్కుండానే చలిని తట్టుకోవచ్చు."

    ఈసారి వివేక్ పిచ్చెక్కిపోయి చూశాడు రామదాసు వైపు.

    రామదాసు మాటల్లో ఓ కొత్త నిజాన్ని కనుక్కోమన్నట్లుగా సవాల్ కనిపిస్తోందే తప్ప తనను ఫూల్ ని చేసే ప్రయత్నం లేదనిపించింది వివేక్ కి.

    ఇంకెలా?

    కొద్ది క్షణాలు సీరియస్ గానే ఆలోచించాడు వివేక్. అయినా తట్టలేదు. కానీ ఏదో స్ఫురణకొచ్చింది.

    "స్త్రీ సాంగత్యంతో....అవునా? నా విషయంలో అదీ నిషిద్ధమే. ఒకవేళ ఆ అవకాశం జైల్లో లభ్యమయినా....." వివేక్ వాయిస్ పిచ్ రెట్టింపయిందిప్పుడు. ఇప్పుడతనికి సెంట్రీగానీ, అతని బూట్ల నాడాల శబ్దం గురించిగానీ స్పృహ లేదు.

    రామదాసు పెద్దగా నవ్వాడు.

    వయస్సు ఉడిగిన వేమూరి గగ్గయ్య కంఠంలా ఉందనిపించింది వివేక్ కి- రామదాసు నవ్వుని వినగానే.

    "ఇవేవీ కాదు- ఇవి లేకుండానే చలిని తట్టుకోవచ్చు. ఆలోచనలకి పరిశీలన పదును పెడుతోంది. మరోసారి ప్రయత్నించు" అన్నాడు రామదాసు రిలాక్స్ అవుతూ.

    రామదాసు సలహాలోని అంతరార్ధాన్ని గ్రహించే బదులు వివేక్ తిరిగి కేవలం ఆలోచనల్లోకే వెళ్ళిపోయాడు.

    మామూలు ఆలోచన కాదిది- తీవ్రమైన సాంద్రతని ప్రోది చేసుకున్న ఆలోచన. అతడ్ని అనుక్షణం వేధిస్తున్న జైలుశిక్షకానీ, ఆపైన పడబోయే ఉరిశిక్షకానీ, చిన్నాభిన్నమైన అతని అందమైన, ఒద్దికైన పొదరిల్లుగానీ గుర్తుకురానంత బలమైన ఆలోచన అతడ్ని పూర్తిగా ఆక్రమించుకుంది.

    క్షణాలు....నిమిషాలు.... కాలం ఒరవడిలో పడి కొట్టుకుపోతున్నాయి.

    మునిలా, తపస్సులో నిమగ్నమై యోగిలా కనిపిస్తున్న వివేక్ ని చూసి సెంట్రీ సైతం విస్తుపోయాడు. రామదాసు ఆజ్ఞ వుంది గనుకే సెంట్రీకి పిచ్చి కోపం వచ్చినా రియాక్ట్ అవకుండా ముందుకు సాగిపోయాడు.

    పద్మాసనం వేసుక్కూర్చున్నట్లుగా వున్న వివేక్ వైపు రామదాసు సరదాగా, తమాషాగా చూశాడు ముందు.

    ఆలోచనలకు పరిశీలన పదును పెడుతుందని తను అన్న మాటల్ని శ్రద్ధగా ఆలకించి వుంటే అతనికింతగా ఆలోచించే అవసరం వుండేదికాదు గదా....చలిని తట్టుకోగలిగేవాడు గదా....అని రామదాసు లోలోనే భావిస్తూ సడన్ గా ఉలిక్కిపడ్డాడు.

    వివేక్ ఇప్పుడు చలికి గజగజా వణకటం లేదు. ఇంతక్రితంలా. ఏమయింది? ఎందుకని? అంత చలి ఏమైపోయింది? ఒకవేళ వాతావరణంలోనే చలి సాంద్రత తగ్గిందా?

    ఆ ఆలోచన వస్తూనే రామదాసు తనని తాను చలికి పరీక్షగా పెట్టుకున్నాడు. అప్పుడు తెలిసిందతనికి- చలి మరింతగా పెరిగిందని- పెరుగుతూ పోతోందని.

    మరి?!

    రామదాసు ముఖంలో సరదాకి బదులు ఆశ్చర్యం చోటు చేసుకుంది.

    తమాషాకి బదులు సీరియస్ నెస్ చోటు చేసుకుంది.

    నిర్మానుష్యంగా వున్న జైలుగోడల మధ్య తీతువు ఒక్కసారి ఒళ్ళు జలదరించేలా అరిచింది.

    రామదాసు ఉలిక్కిపడ్డాడు ఆ అరుపుకి.

    ఆ వెంటనే వివేక్ వైపు పరిశీలనగా చూశాడు.

    అతనిలో తీతువు అరుపు వినిపించిన ఆనవాళ్ళు కనిపించలేదు.

    వివేక్ సీరియస్ గా ఆలోచిస్తూనే వున్నాడు.

 Previous Page Next Page