తనూ ఒకప్పుడు అందంగానే ఉండేది. తన కళ్ళు చాలా అందంగా వుంటాయనేవారు. కాని ఈనాడు? ఆ అందమైన కళ్ళు చెట్టు బెరడులా వున్న చర్మం మధ్య కుంచించుకు పోయి... వయసు... కాలం ఎవరినీ విడిచిపెట్టదు.
'సుందరమ్మా! ఇలా రా! వచ్చి కూర్చో' వార్డెన్ పిలుపుకు సుందరమ్మ ఆలోచనల దారం పుటుక్కున తెగింది. తృళ్ళిపడింది. తను ఎక్కడుందో తెలుసుకోవడానికి కొద్ది క్షణాలు పట్టింది. ముందుకెళ్ళి వార్డెన్ టేబుల్ ముందు నిల్చుంది.
'కూర్చో!' తనకు ఎదురుగా వున్న కుర్చీ చూపించింది వార్డెన్. సుందరమ్మ కుర్చీలో కూర్చోవడానికి తటపటాయించింది.
'పర్వాలేదు కూర్చో'
'ఏం కావాలమ్మా!'
ఏమిటీ ప్రశ్న? ఈ వయసులో ఎవరైనా ఇక్కడకు ఎందుకు వస్తారో ఆమెకు తెలియదా? ఆమాటే అడగాలనుకుంది. కాని అడగలేకపోయింది.
'అడ్మిషన్ కావాలా?'
'అవును' అని నోటితో అనలేదు. తల వూపింది.
'వయసెంత? మా రూల్సు ప్రకారం అరవై ఏళ్ళు దాటిన వాళ్ళనే చేర్చుకుంటాం'.
'నాకిప్పుడు అరవై నాలుగేళ్ళమ్మా!'
వార్డెన్ కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది.
'నిజం! అరవై నాలుగు నిండి అరవై ఐదు నడుస్తోంది' మళ్ళీ సుందరమ్మ అన్నది.
'నిజంగా!'
'అవునమ్మా! నేను అబద్ధం ఎందుకు చెబుతానమ్మా?'
'అవును. నిన్ను చూస్తుంటే అబద్ధం చెప్పే మనిషిలా లేవు. గౌరవంగా బతికిన మనిషిలా వున్నావు. నిన్ను చూడగానే ఏభయ్ దాటిన దానివిలా కనిపిస్తావు.
సుందరమ్మ మౌనంగా వుండిపోయింది.
'నీకెవరూ లేరా?'
'ఎందుకు లేరూ?' అనబోయి ఆగిపోయింది. 'ఉంటే ఇక్కడికెందుకొస్తానూ?' అన్నది.
'చదువుకున్నావా?'
'తొమ్మిది దాకా చదువుకున్నాను'
'నిన్ను చూస్తుంటే...'
'బాగా బతికినదాన్నే....' మధ్యలోనే అందుకొని అన్నది సుందరమ్మ.
'పిల్లలు లేరా?'
'ఎందుకు లేరూ! ఉన్నారు. ఒక్కరు కాదు. ఇద్దరు కాదు. ఆరుగుర్ని కన్నాను. మనవలూ, మనవరాళ్ళూ... అందరూ వున్నారు' ఆ మాటలు ఆమె గొంతుదాటి బయట పడలేదు.
'ఏమ్మా! మాట్లాడవేం? పిల్లలున్నారా?'
'ఉన్నా.... లే....లేరు. నాకు పిల్లలు... అమ్మా! నేను పిల్లలకు.... కాదు నాకు పిల్లలు లేరు. లేరు. నేను గొడ్రాలిని' అంటూ భోరుమంది నిండు కుండ బద్దలైనట్టుగా.
'ఊరుకో! పిల్లలున్నవాళ్ళు మాత్రం సుఖంగా వున్నారనుకున్నావా? పిల్లలున్న వాళ్ళు కూడా ఇక్కడ వున్నారు. లేనివాళ్ళకు ఒకటే బాధ. కాని వుండీ లేని వాళ్ళు పడే బాధ ఇంతంతకాదు. ఊర్కో సుందరమ్మా!' వార్డెన్ ఓదార్చింది.
'పిల్లలున్నా చూడకపోతే లేనట్లే కదా! ఏడవకు.' మళ్ళీ అన్నది వార్డెన్.
సుందరమ్మ కళ్ళు తుడుచుకుంది. కట్టలు తెంచుకున్న వెల్లువ వెనక్కు తీసింది.
'ఇక్కడ పిల్లలు వున్నవాళ్ళు కూడా ఉన్నారా?'
'ఉన్నారు. ఎక్కువమంది వాళ్ళే. అంతా పిల్లల తప్పే అనడానికి లేదు. పిల్లలు గౌరవించడం లేదని కొందరు వస్తారు. తరాల మధ్య వున్న అంతరాలతో అడ్జెస్టు కాలేక కొందరు వస్తారు. కొంతమంది పిల్లలు నిజంగానే తల్లిదండ్రులను బరువుగా భావిస్తారు'
'తల్లిదండ్రుల తప్పుకూడా వుంటుందంటారా?'
'వుంటుంది. ఇంతకు ముందే చూశావుగా! జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని గత్యంతరం లేని స్థితిలో ఇక్కడకు వస్తారు. ఇక్కడ కూడా పక్క మనిషితో అడ్జెస్టు కాలేరు'.
'అందరూ అలా వుండరు.'
'అవుననుకో! మరో విషయం చెప్పనా? మాపై ఆఫీసర్లు వచ్చినప్పుడు, మేమెంత బాగా చూసినా, మామీద ఎన్నెన్నో పితూరీలు చెబుతుంటారు.'
సుందరమ్మ ఆశ్చర్యంగా వార్డెన్ ముఖంలోకి చూసింది.
'నేను అలాంటి దానిని కాదమ్మా'.
'నేను అది కంప్లైంటుగా చెప్పడం లేదు. మనస్తత్వాల గురించి చెబుతున్నాను. అందరూ అలా వుంటారని కాదు'
'నువ్వు ఆరోగ్యంగా వున్నావు'
'అవునమ్మా నాకు ఏ రోగమూ లేదు'
'పని చెయ్యగలవు'
'చెయ్యగలను. చేస్తాను. మీరు ఏ పని చెప్పినా చేస్తాను.'
'ఇక్కడ తమ పని తాము చేసుకోలేని వృద్దులు ఉన్నారు. నీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ మంచీ చెడూ చూడాలి.'
'సంతోషంగా చూస్తానమ్మా'.
'అది చెప్పినంత తేలిక కాదు. వాళ్ళు చాలా విసిగిస్తారు. వాళ్ళ బట్టలు మార్చాలి. చాలా మంది కొన్ని పనులు చెయ్యలేరు. అసహ్యించుకుంటారు'.
'నేను చేస్తాను. పెద్దవాళ్ళకు సేవ చెయ్యడం నాకు సంతోషమే'.
'వాళ్ళకు ఆదరణ కావాలి. సానుభూతితో వాళ్ళను అర్ధం చేసుకోవాలి. జీవితపు తుది ఘడియల్లో వున్నవాళ్ళు. వారికి ఒక చల్లని మాట కావాలి. ఆదరణ కావాలి అంతే!'
'వాళ్ళను నేను చూసుకుంటానమ్మా'
'నువ్వెంత బాగా చూసినా ఏదో ఒక కంప్లైంటు చేస్తారు. నువ్వు చిరాకు పడకూడదు. బాధ పడకూడదు'
'అలాగేనమ్మా'
* * *
'పాలన్నీ పక్కనిండా పోసుకున్నావు దరిద్రపుదానా!'
మంచం మధ్యలో పండి, ఎండి, ఒరుగులా వున్న ముసలమ్మ కూర్చుని వుంది. వణుకుతున్న చేత్తో పాలగ్లాసు పట్టుకుని నోటి దగ్గర పెట్టుకోబోతున్నది. చెయ్యి వణికింది. పాలు వలికాయి. అన్నమ్మ ఆమె చేతిలో వున్న గ్లాసు లాగేసుకుంది.
'అయ్యో నాపాలు!'
'తాగింది చాల్లే. నోరు మూసుకో'.
'నేను అసలు తాగలేదు. కడుపులో మంట. పాపిష్టిదానా! నానోటికాడ పాలు లాక్కుంటావా?' ముసలమ్మ ఏడుస్తూ అన్నది.
'నోరు మూసుకు పడుకో. నీ పొట్ట పగల ఎప్పుడూ ఆకలే. నువ్వు చావవు నేను చచ్చేదాకా'. అన్నమ్మ కసురుకుంది.
'నాపాలు... నాపాలు నాకివ్వు'.
'నోరు మూస్తావా లేదా? అన్నమ్మ చెయ్యి ఎత్తింది. గడపలోనే సుందరమ్మ ఆ దృశ్యం చూస్తూ స్థాణువులా నిలబడిపోయింది.
'ఏయ్! అన్నమ్మా! ఏమిటది?' రాములు అరుస్తూ మంచం దగ్గరకు వచ్చాడు.