అన్నమ్మ తడబడింది సర్దుకుంటూ 'చూడు రాములూ! పాలన్నీ వంటి మీదా, పక్కమీదా ఎలా పోసుకుందో? నేను తాగిస్తానంటే ఒప్పుకోదు. తను గ్లాసు పట్టుకోలేదు. నన్ను కాల్చుకు తింటుందనుకో' సంజాయిషీ ఇచ్చినట్టుగా చెప్పింది.
అన్నమ్మ పక్క మంచం మీద ఉన్న అయేషా బీబీకి ఆ పాలగ్లాసు అందించింది.
'ఆ పాల గ్లాసు శాంతమ్మది. బీబీకి ఇచ్ఛావెందుకు?'
అన్నమ్మ వినిపించుకోనట్టే వుండిపోయింది.
'అయేషా! అని ఎంగిలి పాలు. అవి తాగుతున్నావేం? నీకిచ్చిన గ్లాసు పాలు తాగేశావు. మళ్ళీ ఎందుకు తీసుకున్నావ్?' దగ్గరకొచ్చి రాములు అన్నాడు.
'ఏందయ్యా! నన్ను గదమాస్తున్నావ్! అన్నమ్మ పాలు ఇచ్చింది తాగుతున్నాను.'
'ఎన్నిసార్లు తాగుతావు?'
'ఇప్పుడేగా ఇచ్చింది?'
'మరి నీ గ్లాసు ఏమైంది?'
'నాకేం తెలుసు? అన్నమ్మనే అడుగు.'
'ఒసే ఒసే ఏందే అంటున్నావ్? నీపాలు ముందే తాగేశావుగదే!'
'నాకెప్పుడు ఇచ్చినావు? ఇప్పుడేగా ఇస్తివి?'
'అన్నమ్మా నువ్వు చేస్తున్నది ఇదా? నీకు సిగ్గు లేదూ? గూటంలాగున్నావు. కంచం అన్నం ఎగరేస్తావ్. ఈ ముసలాళ్ళ పాలు కూడా తాగేస్తున్నావా?'
"ఏంటయ్యో! సిగ్గూ గిగ్గూ అంటున్నావ్?'
'నువ్వు చేస్తున్న పని అమ్మగారితో చెప్తానుండు'.
'చెప్పు నాకేం భయమా? నేను ఎవరి సొమ్ము తింటల్లా. గవర్నమెంటోళ్ళ సొమ్మే తింటున్నా'.
'ఓహో! గవర్నమెంటోళ్ళు అందరి తిండీ నిన్నే తినమని పంపించారా? అదేదో తేలుస్తాను.'
అన్నమ్మ మౌనంగా నిల్చుంది.
'ఇక నువ్వెళ్ళు. ఇవ్వాళ్టి నుంచి నీకిక్కడ పని లేదు. పక్కగదిలోకి వెళ్ళు. అక్కడే వుండు. ఈ గదిలోకి రాకు'.
'ఏందయ్యో! ఆఫీసర్లా ఆర్డరేస్తున్నావ్?' రుసరుస లాడుతూ బయటికెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ సుందరమ్మకేసి కొరకొర చూసింది.
శాంతమ్మ 'పాలో!' అంటూ అరుస్తున్నది.
'అరవకు. పాలు తెస్తాను'. అని బయటికెళ్ళి పోయాడు.
సుందరమ్మ తన పెట్టె చివరగా వున్న మంచం పక్కన పెట్టుకుంది. ఆ మంచం మీద పక్క లేదు. అందువల్ల అక్కడ ఎవరూ లేరని తెలుసుకుంది.
అంతలో రాములు పాలగ్లాసు తీసుకువచ్చి సుందరమ్మకు అందించాడు. 'శాంతమ్మకు తాగించమ్మా!' అన్నాడు.
సుందరమ్మ పాలగ్లాసు తీసుకుని శాంతమ్మ మంచం దగ్గిరకు వచ్చింది. మంచం పట్టెమీద కూర్చుంది. శాంతమ్మను పదిలంగా లేపి కూర్చోబెట్టింది. పాలగ్లాసు నోటికి అందించింది. ఆత్రంగా పాలు తాగుతున్న శాంతమ్మను చూస్తుంటే గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టుగా అన్పించింది.
శాంతమ్మకు పొలమారింది. 'చిన్నగా తాగు'. అంటూ గ్లాసు మంచం పక్కగా కింద పెట్టింది. ఉక్కిరి బిక్కిరి అవుతున్న శాంతమ్మ గుండెలు సవరించింది. కొంచెం స్థిమిత పడ్డాక పాలన్నీ తాగించింది. శాంతమ్మ కడుపులో మంట చల్లారింది. ముఖంలో ప్రశాంతత కన్పించింది. గ్లాసు పక్కనపెట్టి శాంతమ్మ మూతి తుడిచి పడుకోబెట్టింది. దుప్పటి కప్పింది. శాంతమ్మ వెదురుబద్దలా వున్న చేతిని చాచింది. నరాలు నులక తాళ్ళలా కన్పిస్తున్నాయి. సుందరమ్మ చెయ్యి పట్టుకుంది.
'ఇక పడుకో'. అంది సుందరమ్మ.
'ఎవరు బిడ్డా నువ్వు?' అంది శాంతమ్మ గొంతు నూతిలో నుంచి వచ్చినట్టుగా వుంది.
'నీ బిడ్డనే అనుకో'
'నా బిడ్డవా? నాకంత అదృష్టం కూడానా?' కాంతి మందగించి కుంచించుకు పోయిన కళ్ళు చెమ్మగిల్లాయి.
'అవును! నీ బిడ్డనే!'
'నాకంత అదృష్టమా? బిడ్డలు లేని గొడ్రాలిని. అందుకే నాకు ఈ నరకం... నాకు బిడ్డలుంటే ఇక్కడి కెందుకొస్తాను?'
'బిడ్డలున్న వాళ్ళు కూడా వస్తారు'.
'ఎందుకొస్తారు? బిడ్డలుంటే ఎందుకొస్తారు?' తనకు తనే చెప్పుకొంటున్నట్టు గొణిగింది శాంతమ్మ.
సుందరమ్మ మౌనంగా దుప్పటి సర్దింది. 'ఇక పడుకో' అంది.
'బిడ్డా! ఒక్కమాట'
'ఏమిటి?'
'నీకు పిల్లలు లేరా?'
'ఉన్నారు!'
'ఉన్నారా? వుంటే ఎందుకొచ్చావు?'
'వచ్చాను'
'ఇక్కడే వుంటావా?'
'వుంటాను. నీ దగ్గరే వుంటాను'
'వీళ్ళందరూ నేను ఇంకా చావలేదని తిడుతున్నారు.
'నువ్వు కూడా తిడతావా?'
'తిట్టను'.
'నాకు ఇంకా బతకాలని వుంది. చచ్చిపోవాలని లేదు. అందరూ ఇంకా బతికి ఏం చేస్తావు అంటున్నారు?' శాంతమ్మ ఏడవసాగింది.
'ఏడవకు. నువ్వు ఇంకా చాలా రోజులు బతికే వుంటావు. ఇక నిన్నెవరూ చావమని తిట్టరు'. జాలిగా అంది సుందరమ్మ.
'నేను చచ్చిపోయేప్పుడు నా పక్కనే వుంటావు గదూ?'
'ఉంటాను'
'ఉండు! నా పక్కనే ఉండి నన్ను రెండు చేతుల్తో పట్టుకో. అప్పుడు నేను భయం లేకుండా చచ్చిపోతా!'
సుందరమ్మకు వెన్నెముకలోంచి చలికుదుపు వచ్చినట్టుగా అన్పించింది.
'నేను చచ్చిపోతే ఏడుస్తావా?'
సుందరమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి.
'నాకు తెలుసు నువ్వేడుస్తావు. ఇప్పుడు నాకు చచ్చిపోతానని భయంగా లేదు తెలుసా?'
సుందరమ్మ శాంతమ్మ ముఖంలోకి జాలిగా చూసింది.
'నేను చచ్చిపోతున్నప్పుడు నువ్వు నా పక్కనే వుంటావు. నన్ను రెండు చేతులతో పట్టుకుంటావు. నాకోసం ఏడుస్తావు. అందుకే ఇప్పుడు నాకు చావంటే భయం లేదు.' బోసిగా నవ్వింది శాంతమ్మ.
సుందరమ్మ శాంతమ్మ ముఖంలోకి జాలిగా చూసింది. మనిషికి ఆఖరు నిమిషంలో కావల్సిందేంటి?
ఐశ్వర్యం మాత్రం కాదు. ఆత్మీయత కావాలి. ఆప్యాయంగా పట్టుకునే రెండు చేతులు కావాలి. జాలితో కూడిన రెండు కన్నీటి బొట్లు కావాలి. అంతే! అంతేనా?
మరి మనిషి డబ్బు కోసం ఎందుకిన్ని దారుణాలు చేస్తాడు? అంతస్థుల కోసం పాకులాడుతాడు?
'నిద్రొస్తోంది. పండుకుంటా' అంది వాలిపోతున్న కనురెప్పల్ని కష్టంగా పైకెత్తుతూ.
'పడుకో.'