Previous Page Next Page 
దావాగ్ని పేజి 12


    స్పృహలేని స్వీపరుని  భుజాల మీదికి ఎత్తుకొని, బయటకు తీసుకెళ్ళి, ఆ తోపుడు బండిలో పడుకోబెట్టాడు ప్రతాప్. తర్వాత వినీల వైపుకి "నువ్వు కూడా అందులోనే ఇరుక్కుని కూర్చోవాలి. కాస్త అసౌకర్యంగానే ఉంటుంది. కానీ తప్పదు" అన్నాడు.

 

    జాగ్రత్తగా బండిలోకి ఎక్కి, ఒదిగి కూర్చుంది వినీల లోపలి కెళ్ళి ఒక దుప్పటి తెచ్చాడు ప్రతాప్. అది వినీల మీద కప్పాడు.

 

    తర్వాత, అక్కడ గుట్టగా పోసి వున్న ఎండుటాకులను పారాతో తీసుకువచ్చి, బండిలో పోశాడు.

 

    ఇప్పుడా బండి నిండా ఎండుటాకులే ఉన్నట్లు కనబడుతోంది దానిలో ఇద్దరు మనుషులు ఉన్నట్లు ఎవరికీ తెలియడంలేదు.

 

    స్వీపరు యూనిఫారంలో ఉన్న ప్రతాప్ బండిని తోసుకుంటూ గేటుని సమీపించాడు.

 

    "అర్ధరాత్రిపూట అంకమ్మ శివాలన్నట్లు ఇప్పుడు మొదలెట్టావేమిటి  ఈ పని?" అని విసుక్కుని, తర్వాత యధాలాపంగా బండివైపు చూసి, గేటు తెరిచాడు ఒక గార్డు.

 

    గేటు దగ్గర బండి ఆగిన ఆ కొద్ది సెకండ్లపాటూ ప్రాణం కడబట్టినట్లయిపోయింది వినీలకి.

 

    గేటు తెరుచుకుని బండి బయటకు వచ్చి, మళ్ళీ గేటు మూసుకుపోయిన శబ్దం వినబడ్డ తర్వాత గట్టిగా శ్వాస తీసుకుంది వినీల.

 

    తోపుడు బండిని అలా ఒక ఫర్లాంగు దూరం తీసుకువెళ్ళి ఆపాడు ప్రతాప్ అక్కడ కొండంత సైజులో ఒక పెద్ద బండ వుంది. దానివెనుక పార్క్ చేసి వుంది కారు.

 

    "ఇంక నువ్వు బయటికి రావచ్చు" అన్నాడు ప్రతాప్.

 

    దుప్పటి పక్కకి తోసేసి, బండిలో నుంచి కిందికి దిగి, తలమీద వున్న ఎండుటాకులని దులుపుకుంది వినీల.

 

    జేబులో నుంచి చిన్న విస్కీ బాటిల్ తీశాడు ప్రతాప్. విస్కీని స్వీపరు ఒంటి మీదంతా పోశాడు.

 

    గుప్పుమని లిక్కర్ వాసన అక్కడంతా అలుముకుంది.

 

    "ఇంకాసేపటి తర్వాత లేస్తాడు ఇతను. ఒంటిమీద సరిగా బట్టలుండవు. ఒళ్ళంతా సారాకంపు కొడుతూ వుంటుంది. తను తప్పతాగి ఉంటాననీ, ఆ సంగతి తనకు గుర్తులేదనీ అనుకుంటాడు అతను. పైగా ఒంటి మీద బట్టలు లేకపోవడం వల్ల తను మైకంలో ఏ అమ్మాయి మీదనన్నా అత్యాచారం చేసి, వళ్ళు తెలియకుండా వచ్చి బండిలో పడి ఉంటానని అనుకుంటాడు. అందుకని తనమీదికేమొస్తుందోనని భయపడి ఈ విషయం ఇంకెవరికీ చెప్పడు." అని నవ్వాడు ప్రతాప్. సో: ఈ విషయం ఇంతటితో క్లోజ్. దీనితో, నువ్వు చనిపోయావనే మా నాన్నతో సహా ఇక్కడ ఉన్న అందరూ భ్రమ పడతారు."

 

    కృతజ్ఞతతో కళ్ళు చెమ్మగిల్లాయి వినీలకి.

 

    "నా ప్రాణాలు కాపాడారు మీరు" అంది కృతజ్ఞతగా.

 

    "అవును. నీకు ఇది పునర్జన్మే:" అన్నాడు ప్రతాప్ చాలా మామూలుగా. అతనిలో అతి వినయం లేదు అలాగని అనవసరమైన గర్వమూ లేదు.

 

    "నన్ను రక్షించడం కోసం, ఇంటి యజమాని కొడుకు అయిన మీరు చివరికి ఈ నౌఖరు యూనిఫారం వేసుకోవలసి వచ్చింది." అంది వినీల నొచ్చుకుంటూ.

 

    తేలిగ్గా చప్పరించేశాడు ప్రతాప్. "నాకు యజమానీ, నౌఖరూ అన్న తేడాలు లేవు నావన్నీ సోషలిస్టు భావాలు. అదీకాక మారువేషాలు వేసుకోవడం కొత్తకాదు నాకు. నేను చంద్రశేఖరంగారి దగ్గర నేర్చుకున్నాను ఈ టెక్నిక్. చంద్రశేఖరం గారు తెలుసా నీకు?  మేకప్ లో ఎక్స్ పర్ట్ ఆయన. అతి కొద్ది మేకప్ పరికరాలతోనే తన మొహాన్ని వందరకాలుగా మార్చేయగలడు. కావాలంటే నెహ్రూలా కనబడగలడు కొద్దినిమిషాల తరువాత అబ్రహామ్ లింకన్ లా తన మొహాన్ని మార్చుకోగలడు. ఆయన గాంధీ గారి గెటప్ లో ఒక సమావేశానికి వెళితే, నిజంగానే గాంధీగారు వచ్చారేమో అని భ్రమపడ్డారట జనం ఆయనకి ఏకలవ్య శిష్యుడిని నేను"  

 

    "అయన పేరు విన్నాను" అంది వినీల. తర్వాత కొద్ది క్షణాలు ఆగి, మళ్ళీ అంది. "మీకు నా కృతజ్ఞత ఎలా తెలుపుకోను?"

 

    "సింపుల్: నేను చెప్పినట్లు చేయటమే:" అన్నాడు ప్రతాప్ సిగరెట్ తీసి వెలిగిస్తూ.

 

    అనుమానంగా చూసింది వినీల.

 

    "అంటే? ఏం చెయ్యాలి?"

 

    నవ్వాడు ప్రతాప్. "చెయ్యకూడని పనేమీ కాదులే. కానీ అదినువ్వు చెయ్యలేనిది కావచ్చు."

 

    "ఏమిటది?"

 

    సూటిగా ఆమెవైపు చూస్తూ అన్నాడు ప్రతాప్.

 

    "ప్రాణాపాయంలో ఉన్న చాలామందిని రక్షించాను నేను. అందుకు బదులుగా వాళ్ళేదో చేస్తారనీ, చేయాలనీ నేను ఎప్పుడూ ఆశించలేదు. బట్, యూ ఆర్ డిఫరెంట్: నువ్వు చాలా ధైర్యస్తురాలిగా ఉన్నావ్. లేకపోతే ఒక హంతకుడిని తరుముకుంటూ ఇలా వచ్చి ఉండవు.అందుకనే నీకు ఆ పని అప్పగించాలని అనిపించింది"

 

    "అది ఏమి పనో మీరు చెప్పడంలేదు."

 

    కాస్త ఆలోచించి అన్నాడు ప్రతాప్. "ఇది ఒక చిత్రమైనపరిస్థితి. నీకు ఏ పని అప్పగించబడుతుందో ఒకసారి చెప్పాక ఇంక విధిగా ఆ పనిని నువ్వు చేయవలసిందే. ఒకవేళ నువ్వు చేయలేనని చేయనని అన్నావనుకో, కానీ అప్పటికే ఆ రహస్యం నీకు చెప్పేసి ఉంటాను గనుక, నిన్ను ప్రాణాలతో ఉంచడానికి వీల్లేదు. నీ ప్రాణాలను రక్షించిన ఈ చేతులతోనే నీ ప్రాణాలను తీయవలసి వస్తుంది. మనుషులని కాపాడడమే కాదు, చంపడం కూడా నాకు చేతనవును."

 Previous Page Next Page