Previous Page Next Page 
దావాగ్ని పేజి 13


    అతని గొంతులో ఏ భావమూ లేదు. నిర్వికారంగా ఉన్నాడతను.

 

    చకితురాలయి చూస్తోంది వినీల. ఆమెకు వెన్ను జలదరించినట్లయింది. అతనిపట్ల భయంతో బాటు ఫాసినేషన్ తో కూడిన ఫీలింగ్ తో ఆమె మనసు నిండిపోయింది. ఇతనెవరో సామాన్యమైన వ్యక్తయి ఉండడన్న భావం కలిగింది.

 

    తను అలా నిశ్చలంగా, నిర్మానుషంగా, నిశ్శబ్దంగా నాలుగు నిమిషాలపాటు నిలబడిపోయిందని తెలియదు వినీలకి.

 

    తర్వాత అతను అన్నాడు.

 

    "ఆల్ రైట్: నేను చెప్పిన పని చేసే స్థితిలో లేవు నువ్వు. నిన్ను మెయిన్ రోడ్డు దగ్గర దింపుతాను. అక్కడనుంచి ఆటోలో వెళ్ళిపోవచ్చు ఇంటికి. నీ కారు మా యింట్లోనే ఉండిపోయింది కదా: దాన్ని కూడా నామరూపాలు లేకుండా చేసేస్తారులే:"

 

    తనకు తెలియకుండానే వచ్చేస్తున్నట్లు వెలువడ్డాయి మాటలు ఆమె నోటినుంచి.

 

    "నా ప్రాణాన్ని మీరు కాపాడారు. పునర్జన్మ ఇచ్చారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ ప్రాణాలు మీవి. మీరు చెప్పిన పని అదేమిటో నాకు తెలియదు. తప్పకుండా చేస్తాను, అయితే ఒక్క షరతుమీద."

 

    "చెప్పు:"

 

    "నేను చేయబోయే పనివలన ఎవరికీ ఏ విధమైన హానీ జరగకూడదు...

 

    "హానీ తప్పకుండా జరుగుతుంది" అన్నాడు ప్రతాప్. "కొంతమందికి - కానీ మేలుకూడా జరుగుతుంది, కొన్ని కోట్లమందికి.

 

    తను చాలా పెద్ద విషయంలో దేన్లోలో జోక్యం చేసుకోబోతున్నట్లు అర్థం అయింది వినీలకి.

 

    తెగించినట్లు "చెప్పండి" అంది

 

    "ఇది నీకు చివరి అవకాశం నేను పనేమిటో చెప్పేశాక నువ్వు చేయలేనంటే ఐయామ్ సారీ, ఐ హావ్ టూ కిల్ యూ:"

 

    "సరే:" అంది వినీల ముక్తసరిగా.

 

    చెప్పడం మొదలెట్టాడు ప్రతాప్

 

                                *    *    *    *    

 

    విసురుగా టర్న్ అయి ఆ అపార్ట్ మెంట్స్ తాలూకూ పార్కింగ్ లాట్ లో ఆగింది తెల్లటి బెంజ్ కారు.

 

    అందులో నుంచి దిగాడు సత్యజిత్, అతని చేతిలో పెద్ద ప్యాకెట్ ఒకటి వుంది.

 

    చకచక నడిచి లిఫ్టు కోసం బజర్ నొక్కాడు.

 

    లిఫ్టు వచ్చాక ఎక్కి నాలుగో అంతస్థులో దిగాడు. పెద్ద పెద్ద అంగలేస్తూ కారిడార్ లో నడిచి వినీల అపార్ట్ ముందు దిగాడు.

 

    అపార్ట్ మెంటు తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. డ్రాయింగ్ రూంలో టీవీ ఆన్ చేసి వుంది. లేట్ నైట్ ప్రోగ్రాం ఏదో వస్తోంది.

 

    లోపలికి నడిచాడు సత్యజిత్.

 

    లోపలికి వెళ్ళగానే కిచెన్ లోంచి ఏదో వాసన.

 

    వెళ్ళి చూశాడు.

 

    స్టౌ మీద గిన్నెలో మజ్జిగ పులుసు పూర్తిగా ఇరిగిపోయి ఉంది. ఇంకో బర్నర్ మీద వంకాయలు మాడి మసి బొగ్గులా మారి వున్నాయి.

 

    "వినీలా:" అని గట్టిగా పిలిచాడు సత్యజిత్.

 

    సమాధానం లేదు.

 

    బాత్ రూం దగ్గరికి వెళ్ళి చూశాడు. బాత్ రూం తలుపు దగ్గరగా వేసి వుంది. లోపల ఎవరూ లేరు.

 

    ఆ డ్లూపెక్స్ అపార్ట్ మెంట్ మెట్లు త్వరత్వరగా ఎక్కి పై అంతస్థులో చూశాడు సత్యజిత్.

 

    వినీల లేదు.

 

    క్రిందకి వచ్చాడు. పక్క ఫ్లాట్స్ లోకి వెళ్ళి ఉంటుందేమోనని వాకబు చేశాడు. కానీ అతనికి తెలుసు. వినీల అంత అజాగ్రత్తగా, తలుపులన్నీ వేయకుండా వెళ్ళే మనిషి కాదు ఏదో అవాంఛనీయమైన సంఘటన జరిగి వుంటుందని అతనికి అనుమానం కలిగింది.

 

    అంతలో -

 

    కెవ్వుమని కేక వినబడింది.

 

    స్త్రీ కంఠం:

 

    గిరుక్కున తిరిగి చూశాడు.

 

    అక్కడెవరూ లేరు. ఆ కేక టీవీలో నుంచి వినబడింది. ఇంగ్లీషు సినిమా, హీరోయిన్ మీదకి ఒక హంతకుడు కత్తితో వస్తున్నాడు... భయంతో కేకపెట్టింది హీరోయిన్.

 

    అంతే:

 

    అతని ప్యాంటుని ఎవరో పట్టుకుని బలంగా గుంజారు.

 

    చటుక్కున క్రిందకి చూశాడు సత్యజిత్.

 

    అది వినీల పెంపుడు కుక్క - స్క్వీకీ:

 

    చిన్నగా మొరుగుతూ సత్యజిత్ ఫాంటుని పళ్ళతో పట్టుకుని తనలో రమ్మన్నట్లు గుంజుతోంది అది.

 Previous Page Next Page