Previous Page Next Page 
దావాగ్ని పేజి 11


    "యూ బాస్టర్డ్:" వినీల.

 

    నవ్వి, గబగబ కిందకి దిగి వెళ్ళిపోయాడు బాబూజీ.

 

    ఒళ్ళంతా ఒక్కసారి కుదిపేసినట్లయింది వినీలకి.

 

    కడుపులో తిప్పినట్లయింది. ఆ వాచ్ టవర్ పై అంతస్థు లిఫ్టులా కిందకి దిగిపోవడం మొదలెట్టింది.

 

    అదే సమయంలో...

 

    టవర్ టాబ్ కప్పు మెల్లగా కిందకి వచ్చేస్తోంది. అది సరిగ్గా వినీల తలకి ఒకడుగుపైకి వచ్చేసింది. ఇంకాసేపట్లో అడుగుని తాకేస్తుంది ఆ కప్పు.

 

    ఆ ప్రెజర్ కి మధ్యలో వున్న వినీల చపాతీ ఒత్తినట్లు అయిపోతుంది.

 

    కప్పు ఇంకా కొంచెం కిందకి దిగి ఆమె తలని తాకింది.

 

    ఒళ్ళంతా చెమటలు పట్టాయి వినీలకి.

 

    కప్పు ఇప్పుడు ఆమెని బలంగా కిందికి వొక్కెయ్యడం మొదలెట్టింది.

 

    మెడలు విరిచినట్లు తల వంచింది వినీల.

 

    మళ్ళీ ఒక జెర్కు:

 

    ఇంకా కిందకి దిగింది రూఫ్.

 

    మోకాళ్ళు స్వాధీనం తప్పి కింద కూలబడిపోయింది వినీల.

 

    ఈ లెక్కన ఇంకా కొద్ది సెకండ్లలో తను...

 

    అప్పుడు...

 

    హఠాత్తుగా చలనం ఆగిపోయినట్లనిపించింది.

 

    కప్పు మళ్ళీ మెల్లగా పైకి లేవడం మొదలెట్టింది.

 

    అప్పటిదాకా విరిగిపోయిన బొమ్మలాగా కూర్చుని వున్న వినీల అపనమ్మకంగా తలఎత్తి చూసింది:

 

    ఎదురుగా ఆ పిచ్చి యువకుడు నిలబడి ఉన్నాడు. ఇప్పుడతనిలో పిచ్చివాలకం కనబడటం లేదు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని లేడతను. అవి జేబులో వున్నాయి. అతని కళ్ళలో తెలివితేటలు గోచరిస్తున్నాయి.

 

    "భయపడిపోయావా?" అన్నాడతను.

 

    గట్టిగా శ్వాస తీసుకొని. అవునన్నట్లు తల పంకించింది వినీల ఆమెకి ఇదంతా కేవలం కలలాగా వుంది. "మీరు... మీరు..." అంది అసందిగ్ధంగా.

 

    నవ్వి అన్నాడతను. "నేను పిచ్చివాడిని కాను..."

 

    "మరి...?"

 

    "అదంతా నాటకం:"

 

    "ఎందుకు?"

 

    "అదంతా పెద్ద కథ: నాతో రా:" అన్నాడు అతను చుట్టూ చూసింది వినీల. టవర్ తాలూకు మూడో అంతస్థు భూగర్భంలోకి దిగినట్లు వుంది. అది ఒక అండర్ గ్రౌండ్ రూంలాగా కనబడుతోంది.

 

    ఆమె బయటికి వచ్చాక, అతను తన చేతిలో వున్న రెండు పెద్ద ప్లాస్టిక్ బాక్స్ లోని మేక మాంసాన్ని ఆ వాచ్ టవర్ లో పడేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేశాడు.

 

    టవర్ తాలూకు కప్పు అడుగుని తాకింది.

 

    మేక మాంసం చితికి, వెదజల్లినట్లు ఆ చుట్టుపక్కల అంతాపడింది:

 

    దాన్ని సంతృప్తిగా చూశాడు అతను:

 

    "ఫర్వాలేదు. ఇప్పుడు మా నాన్న వచ్చి చూసినా ఆ మాంసం నీదేననుకుంటాడు" అన్నాడు.

 

    నోటంబడి మాటలు రానట్లు చూస్తోంది వినీల.

 

    "త్వరగా నడు: ఇంకాసేపట్లో మా నాన్న వచ్చి నువ్వు చనిపోయావో లేదో చెక్ చేస్తాడు" అని ఆమె చెయ్యి పట్టుకుని పరిగెత్తడం మొదలెట్టాడు ప్రతాప్.

 

    కొద్ధిసేపటి తర్వాత ప్రతాప్ గదిలో వున్నారు వాళ్ళు.

 

    ప్రతాప్ మంచంమీద నలిగిపోయిన ఖాకీ బట్టలేసుకున్న స్వీపరు పడుకుని ఒళ్ళెరగకుండా నిద్రపోతున్నాడు.

 

    "అతడ్ని నేనే అక్కడ పడుకోబెట్టాను. క్లోరోఫారం మత్తులో వున్నాడు అతను. ఇంకో గంటదాకా స్పృహలోకి రాడు" అన్నాడు ప్రతాప్

 

    జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తుంటే, తనకి మతి చలిస్తుందేమోనన్న భయం కలిగింది వినీలకి.

 

    "నువ్వొక్కసారి అటుతిరిగి నిలబడు" అన్నాడు ప్రతాప్.

 

    సందేహంగా వెనక్కి తిరిగి నిలబడింది వినీల.

 

    సరిగ్గా అయిదు నిముషాల తర్వాత "ఊఁ: పని అయిపోయింది. నువ్వు ఇంక అటు తిరగొచ్చు" అన్నాడు ప్రతాప్.

 

    బొమ్మలా తిరిగింది వినీల.

 

    మంచంమీద పడివున్న స్వీపరు వంటిమీద ఇప్పుడు ఖాకీ యూనిఫారం లేదు. ఉత్త డ్రాయరూ - బనీనూ మాత్రమే వున్నాయి.

 

    అతని యూనిఫారం ప్రతాప్ వేసుకుని వున్నాడు.

 

    ఆ గదిలోనుంచి తోటలోకి వెళ్ళే తలుపు వుంది.

 

    అది తెరిచాడు ప్రతాప్. అక్కడ గుమ్మానికి దగ్గరగా నిలబెట్టి వుంది, చెత్తని బయటకు తీసుకెళ్ళే తోపుడు బండీ.                               

 Previous Page Next Page