మరో దయ్యం కథ
_ వాసిరెడ్డి సీతాదేవి
ప్యాసెంజరులో ప్రయాణం ఎంత దారుణంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. దాదాపు రైల్లో ఎక్కి నాలుగు గంటలు దాటింది. ప్రతి చిన్న స్టేషన్ లోనూ ఆగుతూపోతోంది.
"ఇది ఏ స్టేషనూ?" వెనక్కువాలి అంతవరకూ కునికిపాటు పడ్తున్నాను. బండి ఆగగానే కళ్ళు తెరిచి టైం చూసుకున్నాను. ఇంకా ఆరు కాలేదు. ఎండాకాలం కావడంవల్ల బండి ఆగినప్పుడల్లా ఉక్కపోస్తూంది. ఇంకా నాలుగుగంటల ప్రయాణం చెయ్యాలి ఈ బండిలో.
"ఇదే స్టేషన్?" అని విసుగ్గా అడిగాను నాపక్కన ఉన్న వయసు మళ్ళినాయనను.
"నక్కలపాలెం!" అన్నాడు ఆ పెద్దమనిషి.
"గాజులపాలెం ఎన్ని గంటలుకు వెళ్తుంది?" మళ్ళీ అడిగాను.
అతను నా ముఖంలోకి చూశాడు.
"నువ్వు గాజులపాలెం వెళ్ళాలా బాబూ? ఎవరింటికీ?"
ఈ పెద్దమనిషి ఊరు గాజులపాలెం కాబోలు. ఇతని ద్వారా కొన్ని వివరాలు తెలుసుకోవచ్చు. రాత్రి పదిగంటలకు ప్రయాణం చెయ్యటం-అదీ నడిచి ఆరు కిలోమీటర్లు వెళ్ళాలంటే-ఎంతకాదన్నా భయంగానే ఉంది. అవసరం అయితే ఈ రాత్రికి ఈ పెద్దమనిషి ఇంట్లోనే తల దాచుకుంటే సరి. కాని అతడు రాత్రికే రమ్మన్నాడు. ఎందుకో?
"మీది గాజులపాలెమా?" ఆశగా అడిగాను.
"కాదు."
"ఎక్కడ్దాకా వెళ్ళాలి!"
"తుమ్మలపాలెం. వచ్చే స్టేషన్ లో దిగి ఒక మైలు నడవాలి" ఆ పెద్ద మనిషి చెప్పాడు.
"మరి గాజులపాలెంలో మీ బంధువులెవరైనా ఉన్నారా!" మిణుకు మిణుకు మనే ఆశతో అడిగాను.
"మా వేలువిడిచిన మేనమామది ఆ ఊరే. అయితే ఇప్పుడు ఆ కుటుంబం వాళ్ళెవరూ అక్కడ లేరు."
నాకు వళ్ళు మండిపోయింది. ఇంతమాత్రానికే ఎవరింటికెళ్ళాలని ఎందుకడగాలో? చాలామందికి ఇదే జబ్బు. అనవసరమైన ప్రశ్నలు వేస్తారు. ముఖ్యంగా ఇలాంటి ప్రయాణాల్లో.
పక్క స్టేషన్ లో ఆ పెద్దమనిషి దిగిపోయాడు. ఒక్కసారిగా జనం వచ్చిపడ్డారు. వాళ్ళతోపాటు తట్టలూ, బుట్టలూ, వలలూ, పారలూ మొదలైన సామాన్లు. ఒకడు నిక్కరు మాత్రమే వేసుకున్నవాడు దాదాపు నా వళ్లోనే కూర్చున్నాడు. నల్లటి శరీరం. బలమైన శరీరం నుండి ఓడుతున్న ఖర్మజలం. వాసన. అనేక శరీరాలనుంచి వస్తున్న వాసనలు మిళితమైన చిత్రమైన వాసన. ఏదో వాసన. నాకు తలతిరిగినట్లయింది. మధ్యలో అడుక్కునే వాళ్ళ గోల ఒకటి.
ఛా! ఎందుకొచ్చిన కర్మ! ఈ ప్రయాణం ఎందుకు చేస్తున్నట్టు? నామీద నాకే కోపం వస్తోంది.
జేబులో ఉన్న టెలిగ్రాం బయటికి తీశాను. అప్పటికే ఓ పాతికసార్లు చదివిన టెలిగ్రాం మళ్ళీ చదవసాగాను.
"మీరు మంచి రచయిత. మీరు పూర్వజన్మలనూ, ఆత్మలనూ, దయ్యాలనూ, భూతాలనూ నమ్మరని నాకు తెలుసు మీకు తెలియనివి లేవనుకోవడం కూడా ఒక రకమైన మూర్ఖత్వమే. అజ్ఞానమే. మీరు హేతువాది అని నాకు తెలుసు. అయినా రచయితగా కొత్త విషయాలనూ, అనుభవాలనూ, ఇతరులనుంచి తెలుసుకోవడం మీ బాధ్యతగా నేను భావిస్తున్నాను. నా పేరు భైరవమూర్తి. ఈ దుమ్మలగూడెంలో ఒకప్పుడు తిరుగులేని ఆసామిగా చలామణీ అయ్యాను. ఇప్పుడు నా వయసు తొంభయ్ రెండుఏళ్ళు. నా పొలాల్లోనే ఒక ముసలమ్మ హత్య హరిగింది. ఆ హత్యకు సంబంధం ఉందనుకున్న మరో ముగ్గురి శవాలు కూడా మా పొలాల్లోనే దొరికాయి. ఇది జరిగి నలభై ఏళ్ళు గడిచాయి. పోలీసువాళ్ళకు ఈ కేసు అంతు పట్టలేదు. చివరకు ఇటీవలే ఆ కేసును క్లోజ్ చేసుకొన్నారు. ఆ హత్యా రహస్యం నాకు తెలుసు. ఇంకా మీరు నమ్మని, ఊహించని ఎన్నో విషయాలను మీ అనుభవంలోకి తేగలను. నేను కొద్దిరోజుల్లోనే వెళ్ళిపోతున్నాను. అందుకే మీరు ఈ ఉత్తరం చూడగానే బయలుదేరి రండి. బండి గాజులపాలెం వచ్చేసరికి 10 గంటలు అవుతుంది. ఆరు కిలోమీటర్లు మాత్రమే నడవాల్సి ఉంటుంది. ఎంత చిన్నగా నడిచినా రెండున్నరగంటల్లో రాగలరు. ఎలాగయినా తెల్లవారు ఝాము నాలుగు గంటలకు ముందే ఇక్కడకు మీరు చేరాలి. మీరు నమ్మని ఎన్నో విషయాలను మీకు చూపిస్తాను. మీ దృక్పథమే మారుతుంది. నవలకు మంచి ఇతివృత్తం! వెంటనే బయలుదేరండి. ఇట్లు__భైరవమూర్తి."
చదివి ముగించి మడతపెట్టి జేబులో పెట్టుకొన్నాను. ఏడు గంటలైంది. వేడి తగ్గింది బండి వెళ్తున్నప్పుడు చల్లటిగాలి శరీరానికి సోకుతోంది. కొంత హాయిగా అన్పించింది. బండి చాలావరకు ఖాళీ అయింది. కళ్ళు మూసుకొని వెనక్కు వాలాను. కునుకు పట్టింది.
అదిరిపడి, ఇంతెత్తున ఎగిరి మళ్లీ ఎలా కూర్చుని ఉన్నానో అదే పోజులో సీటులో కూర్చోబడ్డాను.
బ్రహ్మాండం బద్దలై పోతున్నట్టు ధ్వని. గూబల్ని అదరకొడుతోంది ఆ శబ్దం. కొండలమీదనుంచి రైలు దొర్లిపోతున్నట్టు అన్పించింది. భయపడటానికి బుర్ర పనిచేస్తేగా!
కొద్ది నిముషాల తర్వాత గుండె కుదుటపడింది.
ఇది యాక్సిడెంట్ కాదు. రైలు దొర్లడంలేదు. అలాంటిది జరిగితే ఇంతసేపు ఇలా కూర్చోగలనా!
అప్పటికి దాదాపు అందరూ పక్కఊళ్ళల్లో దిగిపోయారు.
నా పెట్టెలో ఉన్నవాళ్ళు నలుగురే. వాళ్ళను చూశాను. వాళ్ళంతా ఆ శబ్దాన్నిగానీ, బండి ఊపునుగానీ పట్టించుకున్నట్టుగా కన్పించలేదు. ఇది వాళ్ళకు మామూలేలా అన్పించింది.
చిన్నగా కిటికీ చెక్కలు ఎత్తాను.
అంతా చీకటి. కటిక చీకటి. ఏమీ కన్పించడం లేదు. బండి ఒక టనల్ గుండా పోతోందని అర్థం చేసుకున్నాను. అపాయం తప్పినందుకు గుండెలనిండా గాలి పీల్చుకొని వదిలాను.
ప్యాసెంజరు బండి టనల్ నుంచి బయటపడి, పల్లం నుంచి ఎత్తుకు ఎక్కుతోంది.