Previous Page Next Page 
మరో దయ్యం కథ పేజి 2


    నల్లమల అడవుల్లో. కొండల అంచుల్ని చుట్టుకొంటూ కొండ శిలువలా పోతోంది రైలు. కిటికీ నుంచి బయటకు చూస్తుంటే మనసు బిక్కుబిక్కుమనసాగింది.

 

    ఒక చిన్న స్టేషన్ లో బండి ఆగింది. స్టేషన్ ఆ చీకట్లో కన్పించడంలేదు. చిన్న దీపం ఎక్కడో మినుకు మినుకుమంటూ కన్పిస్తోంది.

 

    నా పెట్టెలో ఉన్న వాళ్ళంతా దిగిపోతున్నారు.

 

    "ఇదే స్టేషన్! గాజులపాలెమా!" చివరగా దిగుతున్న ఆడమనిషిని అడిగాను.

 

    "కాదు. తోకపల్లి. గాజులపాలెం వచ్చేస్టేషనే!" అని దిగేసింది ఆ ఆడకూతురు.

 

    బండి పొగవదుల్తూ బయలుదేరింది. బిక్కు బిక్కుమంటూ ఒక్కడ్నే కూర్చున్నాను. బయటికి చూడాలంటే భయంగా ఉంది. చిమ్మచీకట్లో కన్పించే రకరకాల చెట్లూ చేమలూ, అనేక రూపాల్లో కన్పిస్తున్నాయి.

 

    ఈ కొండలలో, అరణ్యాలమధ్య, ఈ మార్గం ప్లాను ఏ ఇంజనీరు వేశాడో? ఎంతమంది కూలీలు రాత్రింబవళ్ళు పనిచేశారో? అనాదినుండీ మానవుడు ప్రకృతిమీద విజయాన్ని సాధించడానికి పోరాడుతూనే ఉన్నాడు. ఆ పోరాటంనుంచి ఉద్భవించిందే ఈ నాగరికత, విజ్ఞానం.

 

    ఆలోచనల్లో ఉన్న నేను రైలు ఆగడాన్ని గమనించలేదు.

 

    "గాజులపాలెం! గాజులపాలెం!" అని పోర్టరు హెచ్చరించాడు.

 

    నేను చివ్వున లేచి సూట్ కేసు చేత్తో పట్టుకుని బండి దిగాను. ప్లాట్ ఫారం అంత కిందకు ఉందని ఊహించని నేను బొక్కబోర్లాపడ్డాను. పెట్టె అల్లంతదూరంలో పడింది. పెద్దగా దెబ్బలు తగల్లేదు. చివుక్కున లేచి నిల్చున్నాను. ఎవరూ చూడలేదుగదా అని చుట్టూ కలియజూచాను. అప్పటికే బండి బయలుదేరింది.

 

    గార్డు పెట్టె ముందునుంచి పోతున్నప్పుడు అతను చెయ్యిఊపాడు. పలకరింపుగా నవ్వాడేమో! కన్పించలేదు.

 

    ప్లాట్ ఫారం మీద ఎవరూ లేరు. నాతోపాటు వేరే పెట్టెల్లోనుంచి దిగిన వాళ్ళు స్టేషన్ బయటికి వెళ్ళిపోయారు. టికెట్లు తీసుకొని స్టేషన్ మాస్టర్ వెళ్ళిపోయాడు.

 

    నాకు ఏం చేయాలో తోచక నిలబడి ఆలోచిస్తున్నాను. దుమ్ములగూడెం దారి ఎటో తెలియదు! ప్లాట్ ఫారం చివర్లో వెలుగుతున్న ఆ చిన్న దీపాన్ని కూడా ఆర్పేశాడు పోర్టరు.

 

    "ఎందుకోయ్ అదికూడా ఆర్పుతావ్?" అరిచాను.

 

    కాని వాడు వినిపించుకోలేదు. పట్టాలకు అడ్డంగా దాటి వెళ్ళిపోయాడు. వాడి ఇల్లు - ఇల్లేమిటి? ఇల్లులాంటిదేదో ఆ పట్టాలకు అవతల ఉండి ఉండాలి.

 

    రోగ్ వెళ్ళేవాడు వెళ్ళక ఆ కాస్త దీపం ఆర్పడం ఎందుకూ? అడిగేవాడెవడు? చూడబోతే ప్రతి సంవత్సరం రైలు టికెట్ రెట్లు పెరుగుతూనే ఉన్నాయి.

 

    అంతకుముందే స్టేషన్ మాస్టర్ తనగది మూసేసి వెళ్ళిపోయాడు. అంతా నిర్మానుష్యంగా ఉంది. స్టేషన్ మాస్టర్ గదికి ఆనుకొని చిన్న షెడ్ లో మినుకు మినుకు మంటూ దీపం ఉంది. అక్కడ ఎవరయినా లేకపోతారా అనే ఆశతో అటు నడిచాను. రెండు విరిగిపోయిన బల్లలు బోసిగా నా ముఖంలోకి చూశాయి. అక్కడ కూర్చోవాలనిపించలేదు.

 

    ఎటువెళ్ళాలి? ఎలా వెళ్ళాలి?

 

    మరోసారి ప్లాట్ ఫారంమీద అటూఇటూ తిరిగాను.

 

    చూపు ఆనినంతదూరం చూడటానికి ప్రయత్నించాను. వాతావరణం నల్లముసుగువేసుకున్న ముస్లిం స్త్రీలా ఉంది. ఒకే నలుపు. అల్లంత దూరంలో జువ్వి చెట్లు జుట్టు విరబోసుకొన్న దయ్యాల్లా ఉన్నాయి.

 

    అనేక కీచురాళ్ళు ధ్వనులు. చీకట్లో జుట్లు విరబోసుకొని ఉన్న దయ్యాలే భీభత్సంగా ఏడున్నట్లున్న భయంకరమైన ధ్వనులు. విసుగూ, విరామం లేని ధ్వనులు.

 

    నేను కాళ్ళు గట్టిగా నేలకు తన్నిపట్టి నిల్చున్నాను. ఏదో భయం గుండెల్లో - కాళ్ళల్లో వణుకు.

 

    నాకు బుద్ధిలేదు. ఎవడో ఇచ్చిన టెలిగ్రాం చూసి బయలుదేరడం ఏమిటి?   

 

    పైగా వాడెవడో రాత్రికిరాత్రి తెల్లవారకుండానే రమ్మనడం, నేను అందుకు సిద్ధం అయి బయలుదేరడం నా బుద్ధి హీనతకు నిదర్శనం. ఛ! ఇదేమిటి నేనింత పిరిగ్గా ఆలోచిస్తున్నాను! బి.ఏ చదివే రోజుల్లోనే తోటి విద్యార్థులతో పందెంవేసి వంటరిగా అర్థరాత్రిపూట శ్మశానానికి వెళ్ళి అక్కడున్న తుమ్మచెట్టుకు కర్చీపు కట్టివచ్చాను నాకు భయమేమిటి? నా మనసుకు నేనే ధైర్యం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కాని దారి తెలియదే? దయ్యాల భయం, భూతాల భయం లేదు. ఇకపోతే ఏ దొంగలైనా దారికాస్తూ ఉంటారనే నా భయం కనీసం ఆ భైరవమూర్తికి స్టేషన్ కు ఎవర్నయినా పంపించమని టెలిగ్రాం ఇచ్చి బయలుదేరితే బాగుండేది. ఏదో శబ్దం అయినట్టుగా అన్పించింది.

 

    తలెత్తి తిన్నగా చూశాను. తల విరబోసుకున్న దయ్యాలలా కన్పిస్తున్న ఒక చెట్టు నీడలో ఒక ఆకారం కదలడం చూశాను. నాకు వెన్నెముకలోకి ఏదో జర జర పాకినట్టుగా అన్పించింది.

 

    అక్కడేం లేదు. అంతా నా భ్రమ. అంతేగాని దయ్యాలూ భూతాలూ లేవు. అవన్నీ మానవ కల్పితాలే. హేతువాదాన్ని జీర్ణించుకున్న నా బుద్ధి నా మనసును జోకొట్టడానికి ప్రయత్నిస్తోంది. జారిపోతున్న గుండెను ఎగదోసుకొంటున్నాను.

 

    కాళ్ళు నిలదొక్కుకొని అటుకేసి చూశాను.

 

    ఆ ఆకారం నా వైపే వస్తోంది. మనసు బుద్ధిని నోరు మూయించింది. స్పష్టంగా కన్పిస్తోంది. ఇది భ్రమకాదు. ఆరు అడుగుల ఎత్తు ఆకారం చీకట్లో తనకేసి నడవడం తన భ్రమ కాదు. అదుగో మరీ దగ్గరౌతూంది. ఎవరది? ఎవరో మనిషి అయుండాలి.

 

    అవును! ఎవడో తనకేసే వస్తున్నాడు. మనిషే. దయ్యం కాదు.

 

    కుడికాలును బాగా పైకెత్తి, నేలమీద ఉన్న ఏ విషపు పురుగునో తొక్కుతున్నట్టుగా బలంగా పాదాన్ని నేలమీద మోపుతూ నడుస్తున్నాడు.

 

    అతడు దగ్గరగా వచ్చాడు.

 

    తలగుడ్డను తీసి విప్పి భుజంమీద వేసుకుంటూ నాకేసి చూశాడు.

 Previous Page Next Page